వ్లాదిమిర్ పుతిన్: ‘మేం అణ్వాయుధాలు ఎప్పుడెప్పుడు వాడతామంటే...’

పుతిన్, రష్యా, యుక్రెయిన్, అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఫ్రాన్సిస్ మావో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అణ్వాయుధాలు కలిగిన దేశం మద్దతుతో ఏదైనా అణ్వాయుధరహిత దేశం తమపై దాడికి దిగితే దానిని వారి ‘ఉమ్మడి దాడి’గా పరిగణిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.

‘అవసరమైతే యుక్రెయిన్‌‌తో యుద్ధంలో అణుదాడి చేయడానికి కూడా వెనకాడబోం’ అని పుతిన్ హెచ్చరిస్తున్నట్లుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.

అణ్వాయుధాలను వినియోగించే విషయంలో ప్రస్తుతం ఉన్న నియమాలు, ముందస్తు షరతులు మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు, బీబీసీ న్యూస్, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రష్యా సైనిక స్థావరాలపై దాడికి యుక్రెయిన్ దూకుడు

యుక్రెయిన్ ఓ అణ్వాయుధ రహిత దేశం. కానీ, అణ్వాయుధాలు కలిగిన అమెరికా, ఇతర దేశాల నుంచి దానికి సైనిక సహకారం అందుతోంది.

రష్యాలోని సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు లాంగ్ రేంజ్ వెస్ట్రన్ మిసైల్స్ ఉపయోగించేందుకు అమెరికా అనుమతిని యుక్రెయిన్ కోరుతోంది. ఈ క్రమంలోనే వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాల వాడకంపై వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బెడైన్‌ను కలిసేందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ యూఎస్‌ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో భాగంగా రష్యాపై మిసైల్స్ ఉపయోగించేందుకు అనుమతి అంశమే కీలకం.

రష్యా అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిలో దెబ్బతిన్న ఒక అపార్ట్‌మెంట్

పుతిన్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరించారా?

ఈ సంవత్సరం యుక్రెయిన్ రష్యా భూభాగంలోకి ప్రవేశించింది. తమ దేశంపైకి క్షిపణులు పంపుతున్నట్లుగా అనుమానిస్తున్న రష్యా సైనిక స్థావరాలను టార్గెట్‌గా పెట్టుకుంది యుక్రెయిన్‌.

ఈ క్రమంలో పుతిన్ వ్యాఖ్యలపై జెలియెన్‌‌స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ స్పందించారు. అణ్వాయుధాల పేరుతో ప్రపంచాన్ని బ్లాక్ మెయిల్ చేయడం తప్ప రష్యా ఏం చేయలేదని ఆయన అన్నారు.

గతంలో కూడా పుతిన్ అణు బెదిరింపులకు దిగారనీ, తమకు మద్దతిస్తున్న దేశాలను బెదిరించే పనిలో భాగంగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని యుక్రెయిన్ విమర్శించింది.

“పుతిన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి” అని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ‘ఎమ్‌ఎస్‌ఎన్‌బీసీ’ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.

మరోవైపు రష్యా మిత్రదేశమైన చైనా కూడా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చింది. అణ్వాయుధాల వినియోగంపై పుతిన్‌ను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.

క్షిపణులతో దాడి చేసినా అణు బాంబులతో కౌంటర్ ఇస్తామంటున్న రష్యా

తమ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న తర్వాత మాట్లాడిన పుతిన్...మనమిక మరింత వేగంగా దూసుకుపోవాలని అన్నారు.

ఏయే పరిస్థితుల్లో రష్యా అణ్వాయుధాలు ఉపయోగించవచ్చు అన్నదానిని పుతిన్ ప్రతిపాదిత నూతన అణు సిద్ధాంతం నిర్దేశిస్తుంది. సంప్రదాయ క్షిపణులతో మాస్కోపై దాడికి దిగితే కూడా అణ్వాయుధాలు ఉపయోగించేలా నిబంధనల్లో మార్పులు ఉంటాయని పుతిన్ హెచ్చరించారు.

“ఒకవేళ తమ దేశంపైకి భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్ క్రాఫ్ట్‌లతో దాడికి పాల్పడితే, దానిని దేశ సౌర్వభౌమత్వానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తాం. ఆ సమయంలో అణ్వాయుధాలు ఉపయోగించడానికి వెనుకాడబోం” అని పుతిన్ చెప్పారు.

ఒక అణురహిత దేశం...అణ్వాయుధాలు కలిగిన దేశం మద్దతుతో రష్యాపై దాడికి పాల్పడితే దానిని వారి ఉమ్మడి దాడిగా పరిగణించాలని ప్రతిపాదించినట్లు పుతిన్ తెలిపారు.

తమ దేశ పౌరుల భద్రతకు ఢోకా లేదన్న గ్యారెంటీని అణ్వాయుధాలు ఇస్తున్నాయని పుతిన్ అన్నారు.

యుక్రెయిన్, రష్యా, పుతిన్

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

ఫొటో క్యాప్షన్, జెలియెన్‌స్కీ, జో బైడెన్

పశ్చిమ దేశాలకు పుతిన్ హెచ్చరిక

రెండో ప్రపంచ యుద్ధం తరువాత, అణ్వాయుధాలు కలిగిన దేశాలు వాటిని వాడకుండా నిరోధించే ఒప్పందాలకు కట్టుబడి ఉన్నాయి. యుద్ధంలో ఉన్న దేశాలు పెద్ద ఎత్తున అణు దాడులకు దిగితే, అది పరస్పర విధ్వంసానికి దారితీస్తుందనే భయాల కారణంగా ఈ ఒప్పందాలు చేసుకున్నాయి.

కానీ, భారీ స్థాయిలో రేడియేషన్ విస్తరింపజేయకుండా చిన్న యుద్ధక్షేత్రాలు లేదా నిర్దిష్టమైన లక్ష్యాలను నాశనం చేసేలా వ్యుహాత్మక అణు బాంబులను వాడుకునే అవకాశం ఉంది.

యుక్రెయిన్‌కు మద్దతిస్తున్న ఐరోపా దేశాలకు ఈ జూన్‌లో పుతిన్ హెచ్చరికలు చేశారు. ఐరోపా ఖండంలో ఉన్న వాటికంటే ఎక్కువగా తమ దగ్గర ఈ వ్యూహాత్మక అణుబాంబులు ఉన్నాయని హెచ్చరించారు. ఒకవేళ అమెరికా దగ్గరున్న వాటితో కలిపినా, తమ దగ్గరున్న వాటితో సరితుగవని ఆయన అన్నారు.

ఈ తరహా దాడులను ముందస్తుగా గుర్తించే రక్షణ వ్యవస్థ యూరప్‌ దగ్గర లేదని పుతిన్ అన్నారు. తమను తాము రక్షించుకునే స్థితిలో యూరప్ లేదని ఆయన అన్నారు.

అణ్వాయుధాల వినియోగంపై పుతిన్ సూచించిన మార్పులను పశ్చిమ దేశాలు ఓ హెచ్చరికగా పరిగణించాలని క్రెమ్లిన్ గురువారం తెలిపింది.

“కచ్చితంగా అణు దాడులే కాదు, ఏ రకమైన ఆయుధాలతోనైనా రష్యాపై దాడికి పాల్పడితే జరిగే పరిణామాల గురించి సంబంధిత దేశాలకు ఇదో హెచ్చరిక. దీనిని నిర్దిష్ట సంకేతంగా భావించాలి” అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ విలేఖరులతో అన్నారు.

నూతన అణు సిద్ధాంతానికి సంబంధించిన డాక్యుమెంట్స్ బయట పెట్టాలా లేదా అన్న అంశంపై రష్యా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)