కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విషయంలో కాంగ్రెస్‌లో డైలమా ఎందుకు?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యకు భూకేటాయింపుల వ్యవహారంలో హైకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సిద్ధరామయ్య కంటే ఆ పార్టీ నేతలనే ఎక్కువగా ఇరకాటంలో పడేశాయి.
ఇది సిద్ధరామయ్య ఇమేజ్‌ను దెబ్బ తీసిందనడంలో సందేహం లేదు. కానీ, ఓబీసీ నాయకుడిగా ఆయనకున్న ప్రాబల్యం దృష్ట్యా, పార్టీపై వాటి ప్రభావాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉన్నందున పార్టీ అగ్రనాయకత్వం ఈ అంశంపై ఇప్పట్లో ఎలాంటి చర్యలూ చేపట్టబోదని తెలుస్తోంది.
జస్టిస్ ఎం.నాగప్రసన్న నిర్ణయంతో, కర్ణాటకలో ఈ అంశంపై న్యాయపోరాటం ప్రారంభం కాగా, దీని నుంచి క్లీన్‌చిట్ పొందడానికి సిద్ధరామయ్య సుదీర్ఘ న్యాయ ప్రక్రియను ఎదుర్కోవలసి రావచ్చు.
అయితే సిద్ధరామయ్య ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ హైకమాండ్ ఎంతకాలం తిప్పి కొడుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న.
"ఇది నాయకుడిగా సిద్ధరామయ్య ఇమేజ్‌ను చాలా దెబ్బతీసింది" అని రాజకీయ విశ్లేషకులు, ఎన్ఐటీటీఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అకడమిక్ డైరెక్టర్ సందీప్ శాస్త్రి బీబీసీతో అన్నారు.
‘‘సుప్రీంకోర్టు వైఖరి కూడా హైకోర్టు తరహాలోనే ఉంటే అది ఆయనకు మరిన్ని సమస్యలు సృష్టించవచ్చు. దీనితో రాజకీయంగా కూడా ఆయన బలహీనపడే అవకాశం ఉంది’’ అని సందీప్ శాస్త్రి అన్నారు.

అసలేంటి ఈ వివాదం...
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) 14 చోట్ల ప్లాట్లు కేటాయించింది.
అయితే, ఈ 3.16 ఎకరాల భూమిని ఆమె అధికార యంత్రాంగం నుంచి అక్రమంగా తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ భూమిని తన సోదరుడు బీఎం మల్లికార్జునస్వామి 20 ఏళ్ల క్రితం తనకు కానుకగా ఇచ్చారని ఆమె అంటున్నారు.
ఈ విషయంపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్ఎస్) సెక్షన్ 218 కింద దర్యాప్తుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ఆమోదం తెలిపారు.
దీనిపై సిద్ధరామయ్య హైకోర్టులో అప్పీల్ చేశారు. అయితే, హైకోర్టు ఆయనపై విచారణకు మాత్రమే అనుమతించింది, ప్రాసిక్యూట్ చేయడానికి కాదు.
ఈ నిర్ణయంపై న్యాయ నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మొదటగా, తన భార్యకు భూమిని కేటాయించడంలో ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యారని నిర్ధరించే సాక్ష్యం సమర్పించడంలో అధికారులు విఫలమయ్యారని వారు గుర్తు చేస్తున్నారు.
“దీనిలో ముఖ్యమంత్రికి ప్రత్యక్ష పాత్ర ఉందని చెప్పడానికి ఎక్కడా ఆధారాలు లేవు’’ అని న్యాయవాది, 'విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ' సహ వ్యవస్థాపకులు అలోక్ ప్రసన్న కుమార్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, ANI
విషయంలో తీవ్రత ఎంత?
ఈ కేసులో విచారణ అవసరం ఉందనిపిస్తోందని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న వ్యాఖ్యానించారు.
‘‘పిటిషనర్ భార్యకు అనుకూలంగా 14 సేల్ డీడ్‌లు నమోదు అయిన వెంటనే, మార్గదర్శకాలు రూపొందించే వరకు పరిహారంగా ఇవ్వాల్సిన ప్లాట్ కేటాయింపులను ఆపాలని ముడా కమిషనర్ ఆదేశించారు’’ అని జస్టిస్ నాగప్రసన్న అన్నారు.
అయితే ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, “నేరం జరిగినట్లు పరిగణించి, దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ఈ కేసులో మల్లికార్జునస్వామి తన సోదరి పార్వతికి భూమిని కానుకగా ఇచ్చేందుకు తన బావమరిది సిద్ధరామయ్య పేరును ఉపయోగించుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు’’ అన్నారు.
"ఇది 2జీ స్కామ్ లాంటిది. అందరూ స్కామ్, స్కామ్ అని అన్నారు. ఏడేళ్ల తర్వాత రాష్ట్ర ఖజానాకు నష్టం లేదని నిరూపితమైంది’’ అని అన్నారాయన.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం మంత్రి మండలి సలహా తీసుకోవడం గవర్నర్ విధి అని జస్టిస్ నాగప్రసన్న అన్నారు. కానీ, అసాధారణ పరిస్థితుల్లో వాళ్లు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకోవడంలో తప్పు లేదని కూడా ఆమె అన్నారు.
"గవర్నర్ కేబినెట్ సలహాను, ముఖ్యమంత్రిని కాదని రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారా లేదా అనేది చూడాలి’’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, ANI
మొత్తం చట్టపరమైన ప్రక్రియకు ఎంత సమయం పడుతుందో న్యాయ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. అయితే ఒకవైపు కాంగ్రెస్, సిద్ధరామయ్యల మధ్య దూరం, మరోవైపు విపక్షాలతో ఈ వివాదం రానున్న వారాల్లో మరింత పెద్దది అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సిద్ధరామయ్యపై దాడి చేసేందుకు బీజేపీ-జేడీఎస్ కూటమి దీనిని సువర్ణావకాశంగా ఉపయోగించుకుంటోంది.
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే సిద్ధరామయ్య స్వయంగా మాట్లాడుతూ, ‘‘వీళ్లు ఎప్పుడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. బీజేపీ ఎప్పుడూ ధనబలాన్ని, ఆపరేషన్ లోటస్‌నే ఉపయోగించుకుంటుంది’’ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ రాజకీయ సందిగ్ధత
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎ. నారాయణ్ బీబీసీతో మాట్లాడుతూ, "ఇప్పుడు బీజేపీ దీనిపై అలుపు లేకుండా ప్రచారం చేస్తుందనడంలో సందేహం లేదు. హైకోర్టు నిర్ణయం తర్వాత, ఈ కేసు దర్యాప్తు కోసం దిగువ కోర్టు నుంచి ఏ సంస్థ అనుమతి అడుగుతుందో చూడాలి." అన్నారు.
‘‘ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ లేదా లోకాయుక్త ఈ అనుమతిని కోరితే, బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రజల సెంటిమెంట్ కూడా దానికి వ్యతిరేకంగా ఉండవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది" అని అన్నారు.
సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. కర్ణాటకలో ఇదే అతిపెద్ద ఓబీసీ వర్గం.
‘‘సిద్ధరామయ్యను తొలగిస్తే పార్టీ ఐక్యంగా ఉండగలదా అన్నదే ప్రశ్న. అయితే కోర్టు సీబీఐ దర్యాప్తు చేయమని కోరితే, సిద్ధరామయ్యకు పార్టీ మద్దతు ఇస్తుంది’’ అని ప్రొఫెసర్ నారాయణ్ అన్నారు.
"పార్టీ ఎప్పుడూ ఆయనకు అండగా నిలుస్తోంది. కానీ ఆయన్ను తొలగిస్తే కురుబ వంటి వర్గాల మద్దతును కాంగ్రెస్ నిలబెట్టుకోవడం కష్టం" అన్నారాయన.
కర్ణాటక రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ హరీష్ రామస్వామి కూడా ప్రొఫెసర్ నారాయణ్‌తో ఏకీభవించారు.
“సిద్ధరామయ్యను తొలగిస్తే, పార్టీని ఐక్యంగా ఉంచడం కష్టమవుతుంది. నిజానికి ఈసారి లింగాయత్ సామాజికవర్గం నుంచి లభించిన మద్దతు, 1990లో వీరేంద్ర పాటిల్ శకం తర్వాత ఎన్నడూ లభించలేదు.’’ అన్నారు.
అయితే సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి తప్పించినా ఓబీసీ వర్గాల్లో ఆయనకు మద్దతు తగ్గదని ప్రొఫెసర్ శాస్త్రి చెబుతున్నారు.
"పదవిని వీడినా ఆయనకు మద్దతు తగ్గదు. దేవరాజ్ అర్స్ తర్వాత ఆయనే ఓబీసీల అతి పెద్ద నాయకుడు కావడానికి కారణం ఇదే" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














