మోదీ ప్రారంభించిన అర్కా, అరుణిక ‘హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్’ ఏమిటి?

ఫొటో సోర్స్, dst.gov.in
- రచయిత, బీ. నవీన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మూడు పరమ్ రుద్ర కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 26న (గురువారం) ప్రారంభించారు. 130 కోట్ల రూపాయల ఖర్చుతో దిల్లీ, కోల్‌కతా, పుణెలలో వీటిని ఏర్పాటు చేశారు.
అలాగే, వాతావరణ పరిశోధనల కోసం 850 కోట్ల రూపాయలతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పీసీ) సిస్టమ్స్ అర్కా, అరుణికలను కూడా ప్రధాని ఆవిష్కరించారు.
“ప్రస్తుతం టెక్నాలజీ, కంప్యూటింగ్ సామర్థ్యాలపై ఆధారపడని రంగమంటూ ఏదీ లేదు. ఈ సాంకేతిక విప్లవంలో మన వాటా బిట్స్, బైట్స్‌లో కాదు.. టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలి” అని ప్రధాని మోదీ అన్నారు.
ఇంతకీ ఈ పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లు ఏంటి? అర్కా, అరుణికల లక్ష్యాలేంటి?


ఫొటో సోర్స్, Getty Images
పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్ల వల్ల ఉపయోగాలేంటి?
పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లు ‘రుద్ర’ సర్వర్లతో అనుసంధానమై పని చేస్తాయి. వీటిని దిల్లీ, పుణె, కోల్‌కతా నగరాల్లో ఇన్‌స్టాల్ చేశారు. వీటి డిజైన్ దగ్గరి నుంచి తయారీ వరకు అంతా భారత్‌లోనే జరిగింది.
నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్‌ఎమ్)లో భాగంగా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC) సంస్థ ఈ సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేసింది.
ఎర్త్ సైన్స్, ఫిజిక్స్, కాస్మాలజీ, తదితర అంశాల్లో లోతైన పరిశోధనలు చేసేందుకు ఈ సూపర్ కంప్యూటర్లు ఉపయోగపడతాయని ప్రభుత్వం చెబుతోంది.
ఈ సూపర్ కంప్యూటర్ల సేవలను దేశవ్యాప్తంగా ఉన్న 350కి పైగా విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్లలోని పరిశోధకులు వినియోగించుకునే వీలుంటుందని చెబుతున్నారు.
అర్కా, అరుణిక ఏం చేస్తాయి?
వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించేందుకు, వాతావరణ శాస్త్రంలో పరిశోధనల కోసం హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పీసీ) వ్యవస్థలను రూపొందించారు. వాటికి ఆర్కా, అరుణిక అని పేరు పెట్టారు.
డేటాను అత్యంత వేగంగా ప్రాసెస్ చేసి, అత్యంత క్లిష్టమైన లెక్కలను కూడా వేగంగా పూర్తి చేసే వ్యవస్థనే హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పీసీ) సిస్టమ్ అంటారు.
ఈ వ్యవస్థలను పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రొఫికల్ మెటలర్జీ (IITM), నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌క్యాస్టింగ్ (NCMRWF)లలో ఏర్పాటు చేశారు.
ఈ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల వల్ల భారీ తుపాన్లు, అధిక వర్షపాతం, వరదలు, ఉరుములు, పిడుగులు, వడగళ్లతో పాటు క్లిష్టమైన వాతావరణ మార్పులను మరింత కచ్చితత్వంతో అంచనా వేయచ్చని ప్రభుత్వం తెలిపింది.
వాతావరణ మార్పులను అత్యంత వేగంగా, కచ్చితత్వంతో అంచనా వేయగలిగితే, ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకునే వీలుంటుందని, అందుకు ఈ అధునాతన వ్యవస్థలు ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

ఫొటో సోర్స్, nsmindia.in
వ్యవసాయ రంగానికి ఎలా ఉపయోగపడతాయి?
సూపర్ కంప్యూటింగ్ సాయంతో చేసే లోతైన పరిశోధనలు, డేటా విశ్లేషణ ఆధారంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.
ఈ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ఉపయోగించి చేసే పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు మెరుగైన విత్తనాలను, నాణ్యమైన ఎరువులను అభివృద్ధి చేయవచ్చని, నేల సారాన్ని పెంచవచ్చని ఆ వీడియోలో వివరించారు. అలాగే, వాతావరణ మార్పులను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయడం వల్ల రైతులు ఎప్పుడు విత్తనాలు వేయాలి? పంట ఎప్పుడు కోయాలి? వంటివి కూడా సులభంగా తెలుసుకోవచ్చని చెప్పారు.
"సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్ వల్ల ఎన్నో కొత్త ఆవిష్కరణలు వస్తాయి. పరిశోధనల్లో నాణ్యత పెరగడంతో కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి అపరిమితమైన అవకాశాలు వస్తాయి" అని ప్రధాని మోదీ చెప్పారు.
ఈ మిషన్ ప్రధాన లక్ష్యాలేంటి?
ఈ మిషన్ ప్రధాన లక్ష్యాలు ఏంటంటే.. (నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ వెబ్‌సైట్ లోని వివరాల ప్రకారం)
- సూపర్ కంప్యూటింగ్‌లో అగ్రగామిగా ఉన్న ప్రపంచ దేశాల వరుసలో ఇండియాను నిలబెట్టాలి. దేశంతో పాటు యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో భారత్ సామర్థ్యాన్ని మెరుగుపరచాలి.
- అత్యాధునిక సూపర్ కంప్యూటింగ్ సదుపాయాల కల్పనతో దేశంలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఉన్నతమైన, అత్యాధునిక పరిశోధనలు చేసేలా ప్రోత్సహించాలి.
- అనవసరమైన పనులపై వెచ్చించే సమయాన్ని, శ్రమను తగ్గించడం, డూప్లికేషన్ లేకుండా చేయడం.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకుని సూపర్ కంప్యూటింగ్ టెక్నాలజీలో భారత్ స్వయం సమృద్ధి సాధించడం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














