ఉత్తర కొరియా: ‘జీన్స్ వేసుకున్న వారిని చూస్తే పోలీసులు కత్తెర పట్టుకుని వచ్చేవారు....’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కిమ్ హ్యు జియున్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తయిన చివాంజి పర్వత శ్రేణిలో ఎర్రని సూర్య కిరణాలతో ఆకాశం ఆహ్లాదంగా కనిపిస్తోంది. కనువిందు చేసే ఈ దృశ్యాన్ని చూసేందుకు కొందరు పర్యాటకులు అక్కడికి వచ్చారు.
టార్న్ జీన్స్ (చిరిగినట్లు కనిపించే జీన్స్) ధరించిన పశ్చిమ దేశాల పర్యాటకులను చూసి అక్కడే ఉన్న ఓ 15 ఏళ్ల అమ్మాయి ఆశ్చర్యపోయింది. మునుపెన్నడూ అలాంటి జీన్స్‌ను ఆ అమ్మాయి చూడలేదు.
ఉత్తర కొరియాలో జీన్స్‌ను అమెరికా సామ్రాజ్యవాదానికి సంకేతంగా భావిస్తారు. మోకాళ్లు కనిపించేలా టార్న్ జీన్స్ ధరించడం అక్కడ నిషేధం.
ఆ ప్రాంతం ఆ అమ్మాయికి కాస్త ఆశ్చర్యకరంగా, వింతగా అనిపించింది.
ఉత్తర కొరియాలో చిరిగినట్లున్న దుస్తులను ధరించిన వారిని పేదవర్గం వారిగా భావిస్తారు.
‘‘విదేశీ బెగ్గర్(అడుక్కునే వ్యక్తి) ఇక్కడకు ఒంటరిగా ఎందుకు వచ్చారు?’’ అని ఆ అమ్మాయి అడిగింది.
‘‘ విదేశీయులు అడుక్కునేందుకు ఇక్కడకు రావడం కుదరదు. ఇది ఫ్యాషన్ కావొచ్చు’’ అని ఆమె తండ్రి అన్నారు.
‘‘నేను షాకయ్యాను. ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది’’ అని ఆ అమ్మాయి తెలిపారు.

‘ఫ్యాషన్’ అనే పదం ఉత్తర కొరియాలో అసలు వాడుకలోనే లేదు. 2009లో తనకు 20 ఏళ్లు ఉన్నప్పుడు, ఆ బాలిక ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని వెళ్లారు.
ఉత్తర కొరియా నుంచి పారిపోయేందుకు ఒకే ఒక్క కారణం ఉందని, తాను స్వేచ్ఛ, ఆనందాన్ని కోరుకున్నానని ఆమె అన్నారు.
ఉత్తర కొరియాలో ఫ్యాషనబుల్ వస్త్రాలను అనుమతించరు. తన తల్లి దగ్గరున్న ఎన్నో రకాల వస్త్రాలను చూస్తూ పెరిగారు జీ హ్యున్ కాంగ్.
ఆమె తల్లి టీచర్. అలాగే వ్యాపారం కూడా చేసేవారు. సరిహద్దులో ఉన్న చైనా, జపాన్ నుంచి వస్త్రాలను కొని, వాటిని మార్కెట్లో అమ్మేవారు.

కత్తెర పట్టుకుని పోలీసు అధికారులు వీధుల్లో ఉండేవారు?
ఫ్యాన్సీ లేస్ బ్లౌస్‌లు, ఫ్లోరల్ హుడీలు వేసుకుని బయటికి వెళ్లడాన్ని కాంగ్ తల్లి ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. కానీ, కంట్రోల్ అంతా బయట ఉండేది.
‘‘ఎలాంటి దుస్తులు ధరించి బయటికి వెళ్లాలనే విషయంపై మొదట్లో అంత కంట్రోల్ ఉండేది కాదు. కానీ, 2000 చివరిలో స్కూలింగ్ అయిపోయిన తర్వాత, ‘ఎల్లో ఎయిర్’ అనే పదం ఎక్కువగా వినిపించేది. ఆ సమయంలో చాలా కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి’’ అని కాంగ్ తెలిపారు.
‘ఎల్లో ఎయిర్’ అనే పదాన్ని ఉత్తర కొరియాలో దిగజారుతున్న ధోరణిని వర్ణించేందుకు వాడతారు.
కొరియా డిక్షనరీల్లో ‘ఎల్లో’ అనే పదానికి అశీల్లత, అవకాశవాదం అనే అర్ధాలున్నాయి.
ఉత్తర కొరియాలో జీన్స్ వేసుకోకుండా ఉండేందుకు పోలీసులు వీధుల్లో కత్తెర పట్టుకుని కనిపించేవారు. ఎవరైనా జీన్స్ వేసుకుని కనిపిస్తే, కత్తెరతో కింద భాగాన్ని కత్తిరించే వారు. ఆ తర్వాత వేరే దుస్తులు వేసుకుని, ఆ జీన్స్‌ను తెచ్చి పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది.
స్కూల్ అయిపోయిన తర్వాత, అకౌంట్స్‌లోకి కొన్నాళ్లు పనిచేశారు కాంగ్. ఆ తర్వాత లైబ్రేరియన్ అయ్యారు.
వస్త్రాలను డిజైన్ చేయాలన్నది ఆమె కోరిక. కానీ, ఉత్తర కొరియాలో డిజైనర్లకు ఎలాంటి ఉద్యోగాలు లేవు. ఏడాది పాటు ఆమె చాలా ప్రయత్నించినా, ఏదీ ఫలించలేదు. తర్వాత చైనా కూడా వెళ్లాలనుకున్నారు. అప్పటికి దక్షిణ కొరియా వెళ్లాలన్న ఆలోచన ఆమెలో లేదు.
కొత్తగా ఏదైనా చేయాలని కాంగ్ కోరుకునేవారు. చివరకు దక్షిణ కొరియా వెళ్తే తన కల నెరవేరుతుందని ఆమె భావించారు.
దక్షిణ కొరియాలో డిజైనింగ్ కోర్సు చేసిన తర్వాత, ఆమె సొంతంగా క్లోతింగ్ బ్రాండ్‌ను తయారు చేసి, ఫ్యాషన్ డిజైనర్‌గా మారారు.

ఫొటో సోర్స్, Kang Ji-hyun
‘ఉత్తర కొరియాలో నా హృదయం ముక్కలైంది’
జనరేషన్ జెడ్, మిల్లినీయల్ ఫ్యాషన్ డిజైనర్ కో విన్ బూమ్ కూడా ఉత్తర కొరియా నుంచే వచ్చారు. తన ప్రత్యేకత ఏంటో ఆమెకు తెలుసు.
1995 నుంచి 2000ల్లో చివరి వరకు అంటే 2010 లోపల పుట్టిన వారు జనరేషన్ జెడ్ కేటగిరీలోకి వస్తారు.
మిల్లీనియల్స్ అంటే జనరేషన్ జెడ్‌కు ముందు పుట్టిన తరం. అంటే 1980ల ప్రారంభం నుంచి 1995 మధ్య పుట్టినవారు.
కో విన్ తాత దక్షిణ కొరియాలో యుద్ద ఖైదీ. కో విన్ తండ్రికి ఉత్తర కొరియాలో సరైన ఉద్యోగం లేదు. ఆమె తల్లి వ్యాపారంలో దిట్ట. చైనాలో ఉన్న తమ బంధువుల సాయంతో ఆమె బాగానే ఆర్జించగలిగేవారు.
కొరియన్ డ్రామాలు కో విన్‌ను ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగేలా చేశాయి. బయట వారికి తెలియకుండా ‘వింటర్ సొనాటా’, ‘స్వీట్ 18’ వంటి ఫేమస్ డ్రామాలను ఆమె చూశారు.
ఈ డ్రామాలను చూసేటప్పుడు ఆమె ఎన్నో కలలు కనేవారు.
‘‘ఆ డ్రామాలో హీరోయిన్ వేసుకున్న వస్త్రాలు నేను కూడా వేసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ నిద్రపోయేదాన్ని. అలాంటి హెయిర్ స్టయిల్‌నే మెయింటెన్ చేస్తే చాలా అందంగా కనిపిస్తాను కదా అనుకునేదాన్ని. నా బాడీ మాత్రమే ఉత్తర కొరియాలో ఉండేది. ఆలోచనలు, హృదయం అంతా ఉత్తర కొరియా వెలుపల తిరిగేవి’’ అని కో విన్ చెప్పారు.
ఫ్యాషన్ ద్వారా తన స్వతంత్ర భావాలను తెలియజేయాలనుకున్నారు. స్కూల్‌లో ఇచ్చిన యూనిఫామ్ సరిపోనప్పుడు, ఆమె సొంతంగా ఫిట్ అయ్యేలా దాన్ని మార్చుకున్నారు. మ్యాజిక్ హెయిర్ క్లిప్స్‌ను కొనుక్కుని, వాటిని జుట్టుకు పెట్టుకునే వారు.

ఒకరోజు జీన్స్ వేసుకుని ఆమె బయటికి వెళ్లారు. పోలీసుల బృందం కో విన్‌ను చుట్టుముట్టి, ‘కామ్రెడ్, నువ్వెందుకు ఈ దుస్తులు వేసుకున్నావు?’ అని అడిగింది.
కో విన్‌ను ఒక కన్‌స్ట్రక్షన్ సైట్‌కి తీసుకెళ్లి, అక్కడ ఆమెతో పనిచేయించారు.
కనీసం కో విన్‌ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదు. మూడు రోజుల పాటు ఆమె తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడ్డారు.
ఆ ఘటనతో కో విన్‌లో ఉన్న తిరుగుబాటుతనం మరింత పెరిగింది. స్కూలింగ్ పూర్తయిన తర్వాత ఆమె మూవీలు, డ్రామాలు చూడగలిగే స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్లాలనుకున్నారు. తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని వేసుకోవాలనుకున్నారు.
‘‘ఇలాంటి వివక్షా ప్రపంచంలో నేను బతకలేను. ఉత్తర కొరియాలో ఫ్యాషన్‌ను ఎప్పుడూ విమర్శిస్తుంటారు. నా భావాలను సరిగ్గా వ్యక్తం చేయలేని ప్రాంతం అది’’ అని కో విన్ అన్నారు.
‘‘2011లో తుమెన్ నది దాటుకుని ఉత్తర కొరియా నుంచి పారిపోయాను. ఆ సమయంలో నా వయసు 17 ఏళ్లు. చాలారోజులు వేచిచూసి, అనేక కష్టాలు ఎదుర్కొన్న తర్వాత, చివరకు 2012లో ఆగ్నేయాసియా గుండా దక్షిణ కొరియా చేరుకున్నా’’ అని కో విన్ చెప్పారు.
దక్షిణ కొరియా చేరుకున్న తర్వాత, అక్కడ ప్రజలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు. కానీ, అక్కడి డ్రెస్సింగ్ ట్రెండ్ చూశాక నిరాశ కలిగింది. చాలామంది మిలటరీ గ్రీన్ కలర్ దుస్తులు వేసుకున్నారు.
‘‘ఆ సమయంలో మిలటరీ గ్రీన్ జాకెట్లు చాలా ఫేమస్ అని నేను విన్నాను. ఉత్తర కొరియన్ల యూనిఫామ్ అదే. ఈ రంగంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ, అందరూ అదే రంగు దుస్తులు వేసుకుని కనిపించారు. వాళ్లు కూడా ఉత్తర కొరియా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారా? అని ఆశ్చర్యపోయాను. ఇప్పుడేం చేయాలి? అనుకున్నా’’ అని కో విన్ చెప్పారు.
కో విన్ ప్రస్తుతం ఒక క్లోతింగ్ బ్రాండ్‌కు డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాక, ఆమె సొంతంగా ‘జీబీ’ పేరుతో బ్రాండ్‌ను లాంచ్ చేశారు.

ఫొటో సోర్స్, Ko Win Boom
ఉత్తర కొరియాలో ప్రస్తుతం ఉన్న నియంత్రణ ఏంటి?
ఇద్దరు యంగ్ డిజైనర్లు జీ హ్యున్ కాంగ్, కో విన్ బూమ్‌లు ఇద్దరూ ఉత్తర కొరియాను వదలివచ్చి తమ కలలను సాకారం చేసుకున్నారు.
2020లో ఉత్తర కొరియా ‘ఐడియాలజీ అండ్ కల్చర్’ పేరుతో ఒక కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టింది. విదేశీ సంస్కృతి వ్యాప్తి చేసే వారిపై ఈ చట్టం కింద శిక్షలు కూడా విధించింది.
ఈ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ఎక్కువగా అక్కడి పౌరులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారు అనేవాటిపై నియంత్రణ మొదలైంది.
ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర కొరియాలో దక్షిణ కొరియా డ్రామాను చూసిన ఒక యువకుడికి 12 ఏళ్ల కఠిన శిక్ష పడింది.
మార్చిలో కొరియన్ సెంట్రల్ టీవీలో గార్డెనింగ్ గురించి ప్రసారమైన బీబీసీ ప్రోగ్రామ్‌లో గెస్ట్ వేసుకున్న జీన్స్‌ను బ్లర్ చేశారు.
ఇలా ప్రజల వస్త్రాలు, ఫ్యాషన్‌పై నియంత్రణ విధిస్తున్నారని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పారు.
‘‘దక్షిణ, ఉత్తర కొరియాలలో వస్త్రాలు ధరించడంలో ఉన్న తేడా ఏంటంటే...దక్షిణ కొరియాలో ఎప్పుడూ ఒకేరకమైన దుస్తులు ధరించడాన్ని ఇష్టపడరు. ఉత్తర కొరియాలో రంగురంగుల బట్టలు వేసుకోవడం నిషేధం’’ అని కింకోక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జ్యూన్ యాంగ్ స్యూన్ అన్నారు.

‘‘నేను తయారు చేసిన దుస్తులను ఉత్తర కొరియాలో మా అమ్మ వేసుకోవాలన్నది నా కల’
కోరుకున్న వస్త్రాలు ధరించేందుకు ఇద్దరు మహిళలు ఉత్తర కొరియా నుంచి పారిపోయారు. ఫ్యాషన్ డిజైనర్లుగా మారిన తర్వాత, వారు ఇప్పుడేం కలలు కంటున్నారు?
ప్రజల్లోని వివిధ రకాల నేపథ్యాలను అర్థం చేసుకుని వస్త్రాలు డిజైన్ చేయాలన్నది తన డ్రీమ్ అని కో విన్ బూమ్ అన్నారు. కొరియన్ సంప్రదాయాల ఆధారంగా డిజైనర్ కావాలన్నది తన లక్ష్యమని చెప్పారు.
‘‘నేను ఉత్తర కొరియా నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. కానీ, చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు, ఎన్నో పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని చాలా దేశాలు సాధించాయన్న వాస్తవాన్ని గ్రహించాను’’ అని కో విన్ చెప్పారు.
‘‘ఉత్తర కొరియాలో ప్రజల్ని చాలా నిశితంగా పరిశీలిస్తారు. ఒకవేళ నేను ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారితే, నా గొంతును ఎవరైనా వింటారా?’’ అని కో విన్ ప్రశ్నించుకున్నారు.
జి కాంగ్ ప్రస్తుతం గ్రాడ్యుయేట్ స్కూల్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విద్యను అభ్యసిస్తున్నారు. పలు ఎగ్జిబిషన్లను ఆమె నిర్వహించారు.
‘‘డ్రామాలు, వస్త్రాధారణ ద్వారా స్వేచ్ఛను చూశాను. అందుకే, తిరిగి ఉత్తర కొరియాకు వచ్చాను. బ్రాండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రజల్లో ప్రవేశపెట్టాలనుకున్నా. దీంతో, వారు తమ స్వేచ్ఛను అనుభవిస్తారు’’ అని తెలిపారు.
‘‘ ఏదో ఒకరోజు నేను డిజైన్ చేసిన వస్త్రాలను మా అమ్మ ధరించాలన్నది నా కల’’ అని కాంగ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














