ఆగ్నేయ అమెరికాను వణికిస్తున్న హెలీన్ హరికేన్, 43 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, నదీన్ యూసుఫ్, వనెస్సా బుష్లర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆగ్నేయ అమెరికాపై విరుచుకుపడుతున్న హెలీన్ తుపాను (హరికేన్) కారణంగా 43 మంది మరణించారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో లక్షల మంది చీకట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఫ్లోరిడా రాష్ట్రంలోని బిగ్‌బెండ్ ప్రాంతంపై విరుచుకుపడిన అత్యంత శక్తివంతమైన తుపాను ఇది.
గురువారం రాత్రి తీరం దాటిన తుపాను బలహీన పడినప్పటికీ ఈదురు గాలులు, వరద ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఫ్లోరిడా, జార్జియాల్లోని అనేక ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. ఒక కుటుంబం వరద నీటిలో నుంచి ఈదుకుంటూ బయటపడ్డామని బీబీసీకి వివరించింది. ఈ పెను తుపాను వల్ల భారీ స్థాయిలో నష్టం జరిగిందని ఇన్సూరెన్స్, ఆర్థిక సంస్థలు చెప్పాయి.
గురువారం రాత్రి తీరం దాటిన హెలీన్ తుపానును వాతావరణ శాఖ కేటగిరీ 4గా ప్రకటించింది.
తుపాను వల్ల బలమైన గాలులు వీయడంతో ఫ్లోరిడాలోని తీర ప్రాంతంలో అలలు 15 అడుగుల ఎత్తు వరకు ఎగసి పడ్డాయి. తీర ప్రాంతంలో సముద్ర మట్టం పెరిగిందని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది.
వర్షాల ప్రభావం తగ్గినా, కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, తీవ్రమైన గాలులు, వరదల ముప్పు కొనసాగుతుందని ఎన్‌హెచ్‌సీ తెలిపింది.
తుపాను కారణంగా కొన్ని ప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఫొటో సోర్స్, Joe Raedle/Getty Images
శక్తిమంతమైన తుపాను..
అమెరికాలో తుపాను రికార్డుల్ని నమోదు చేయడం ప్రారంభించిన తర్వాత హెలీన్ హరికేన్ 14వ అత్యంత శక్తిమంతమైనదిగా గుర్తించారు.
ఈ తుపాను వల్ల ఫ్లోరిడా, జార్జియా, టెన్నెసీ, కరోలినాస్‌లో బలమైన ఈదురులు గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈదురు గాలులు, భారీ వర్షాలు సృష్టించిన విధ్వంసం వల్ల శుక్రవారం ఫ్లోరిడాలో 8 మంది మరణించారు. పినెల్లాస్ కౌంటీలో ఐదుగురు మరణించినట్లు అధికారులు చెప్పారు.
కారు మీద ట్రాఫిక్ సిగ్నల్ కూలిపోయిన ఘటనలో ఒకరు, కారుపై చెట్టు పడిన ఘటనలో మరొకరు మరణించినట్లు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ చెప్పారు.
జార్జియాలోని వీలర్ కౌంటీలో ఇద్దరు చనిపోయారని అధికారులు తెలిపారు.
జార్జియాలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయారని ఆ రాష్ట్ర గవర్నర్ బ్రియాన్ కెంప్ తెలిపారు. వరద బాధితులకు సహాయం చేయడానికి వందల మంది నేషనల్ గార్డులను పంపించారు. రాష్ట్రంలో 150కి పైగా రహదారుల్ని మూసివేశామని, 1300 ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం లేదని, అనేక భవనాల్లో ప్రజలు చిక్కుకుపోయారని ఆయన తెలిపారు.
దక్షిణ కరోలినాలో 17 మంది మరణించారని అమెరికాలో బీబీసీ భాగస్వామి సీబీఎస్ న్యూస్ తెలిపింది. పక్కనే ఉన్న ఉత్తర కరోలినాలో తుపాను వల్ల ఇద్దరు చనిపోయారు.

ఫొటో సోర్స్, US Coast Guard/Handout via REUTERS
చురుగ్గా సహాయ కార్యక్రమాలు
తుపాను ప్రభావిత రాష్ట్రాలలో హెలికాప్టర్లు, పడవలు, పెద్ద వాహనాలను ఉపయోగించి ఇళ్లలో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఉత్తర కరోలినాలో వంద మందికి పైగా వరద బాధితులను రక్షించారని గవర్నర్ చెప్పారు.
ఉత్తర కరోలినాలో రెండు ప్రాంతాల్లో టోర్నడోలు వచ్చాయి. ఇందులో ఒక దాని వల్ల 11 భవనాలు ధ్వంసం అయ్యాయి. 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
టెన్నెసీ రాష్ట్రంలోని ఇర్విన్ పట్టణంలో ఉన్న ఓ ఆసుపత్రిలో చిక్కుకుపోయిన 58 మంది రోగులు, సిబ్బంది ఆసుపత్రి భవనం పైకి చేరుకున్నారు. నోలిచుకీ నదిలో వరద భారీగా ప్రవహిస్తూ ఉండటంతో నదిలో పడవల ప్రయాణాన్ని ఆపివేశారు. గాలులు బలంగా వీస్తూ ఉండటంతో హెలికాప్టర్లతో చేపట్టిన సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 40 లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయిందని ట్రాకింగ్ సైట్ poweroutage.us తెలిపింది.
ఫ్లోరిడా తీరంలోని మనాటీ కౌంటీలోని రమదా ఇన్ హోటల్‌లోకి వరద నీరు రావడంతో హోటల్‌లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు.
సువన్నే కౌంటీలో ఈదురు గాలులకు చెట్లు కూలి ఇళ్లపై పడటంతో భారీ విధ్వంసం జరిగిందని అధికారులు తెలిపారు.
తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, వారి ఆదేశాల ప్రకారం ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధ్యక్షుడు జో బైడెన్ కోరారు.
ఇంట్లోకి పెద్ద శబ్దంతో నీరు రావడంతో ఇంట్లోని వస్తువుల్ని టేబుల్‌పైన, బెడ్లపైకి చేర్చామని ఫ్లోరిడాలోని హోమ్స్ బీచ్‌లో ఉంటున్న బ్రియానా గాగ్నియర్ బీబీసీకి చెప్పారు.
"నేను, నా కుటుంబ సభ్యులందరం ఒకరినొకరు చూసుకున్నాం. అప్పుడే ఇంట్లోకి నీరు రావడం మొదలైంది” అని ఆమె తెలిపారు.
వరద నీరు భుజాల వరకు చేరుకోవడంతో తన పెంపుడు జంతువులు, డబ్బులు, చార్జర్లు తీసుకుని కుటుంబ సభ్యులతో సహా ఈదుకుంటూ బయటికి వచ్చామని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Tampa Bay Times/ZUMA Press Wire/REX/Shutterstock
తుపానులకు అడ్డాగా ఫ్లోరిడా తీరం
తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా తగ్గలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ దాటితే తుపాన్ల తీవ్రత పెరుగుతుంది.
ఫ్లోరిడా తీరంలో సముద్ర ఉపరితలం మీద ఉష్ణోగ్రత 30-32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తుపాన్ల సమయంలో ఇక్కడ ఏడాది పొడవునా ఉండే సాధారణ ఉష్ణోగ్రతల కంటే తుపాను సమయంలో ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు అధికంగా ఉంటుంది.
ఫ్లోరిడాలోని బిగ్ బెండ్ ప్రాంతంలో ఉన్న 220 మైళ్ల తీరంలో సహజంగా తుపాను తీరం దాటుతూ ఉంటుంది. 2023లో ఇడాలియా తుపాను ఇక్కడే తీరం దాటింది. 2024 ఆగస్టులో డెబ్బీ తుపాను కూడా ఈ ప్రాంతంలోనే తీరం దాటింది.
ఫ్లోరిడా తీరంలో 2024లో 25 తుపాన్లు రావచ్చని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఏడాది ప్రారంభంలో హెచ్చరించింది. అందులో 8 నుంచి 13 వరకు తుపాన్లు భారీ విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ హెలీన్ తుపానుతో పాటు, ఇప్పటికే మరికొన్ని విధ్వంసం సృష్టించాయి.
అమెరికాలో తుపాన్ల సీజన్ నవంబర్ నెలాఖరు వరకు ఉంటుంది. దీంతో మరికొన్ని తుపాన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














