వియత్నాంలో యాగి తుపాను విధ్వంసం, 80 మందికిపైగా మృతి

ఫొటో సోర్స్, Getty Images
వియత్నాంలో యాగి తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ఇప్పటి వరకు 82 మంది ప్రాణాలు కోల్పోయారు.
శనివారం (సెప్టెంబర్ 7) మొదలైన ఈ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు ముంచెత్తాయి. ఉత్తరాది ప్రావిన్సులలోని కొన్ని ప్రాంతాల్లో వేల మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరికొంత మంది తమ పరిస్థితి గురించి సోషల్ మీడియాలో చెబుతూ సాయం కోసం అర్థిస్తున్నారు.

గత 30 ఏళ్లలో వియత్నాంలో వచ్చిన అత్యంత విధ్వంసకర తుపాను ఇదేనని అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను ఉత్తర వియత్నాంపై తీవ్ర ప్రభావం చూపింది.
విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు 15 లక్షల మంది అంధకారంలో చిక్కుకున్నారు.
భారీ వరద కారణంగా ఫు తో ప్రావిన్సులోని ఫోంగ్ ఛౌ వంతెన కుప్పకూలిపోయింది. ఈ బ్రిడ్జిపై ఉన్న వాహనాలు అన్నీ వరదలో పడిపోయాయి. ఈ వంతెన కూలిన దృశ్యాలు ఓ కారు డాష్ క్యామ్‌లో రికార్డ్ అయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తరాది ప్రావిన్సులలో ప్రస్తుతం యాగి తుపాను బలహీనపడినప్పటికీ, పశ్చిమ దిశగా వేగంగా కదులుతోంది. అక్కడ పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తన జీవితంలో ఈ స్థాయి వరదలను ఎన్నడూ చూడలేదని 50 ఏళ్ల మహిళ ఫాన్ తి టుయేట్ వార్తా సంస్థ ఏఎఫ్‌ఫీతో చెప్పారు. ఈ తుపాను కారణంగా తాను సర్వం కోల్పోయానంటూ ఆమె విలపించారు. వారి ఇల్లు ఓ నదికి సమీపంలో ఉంటుంది. ప్రాణాలు కాపాడుకునేందుకు తన రెండు పెంపుడు కుక్కలతో ఎత్తైన ప్రదేశానికి వచ్చానని ఆమె చెప్పారు. ఇంట్లో ఫర్నిచర్, డాక్యుమెంట్స్ ఇలా అన్నీ నీటిలో మునిగిపోయాయని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ తుపాను కారణంగా సుమారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఫ్యాక్టరీలు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇళ్లు మునిగిపోయాయి.
మొత్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా మృతి చెందినవారు, గల్లంతైనవారు, గాయపడిన వారి సంఖ్య సుమారు 750కి పైగా ఉంటుందని అధికారులు మంగళవారం చెప్పారు.
యాగి తుపాను వియత్నాంలోకి ప్రవేశించక ముందు దక్షిణ చైనా, ఫిలిప్పీన్స్‌లలో 24 మంది ప్రాణాలు తీసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














