ఆపరేషన్‌ బుడమేరు: ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉంటుంది?

ఆపరేషన్ బుడమేరు
ఫొటో క్యాప్షన్, బుడమేరు కట్టపై నిర్మాణాలు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

సెప్టెంబర్ మొదటివారంలో విజయవాడ సగం నగరాన్ని అనూహ్యంగా ముంచెత్తిన బుడమేరు వరద నేపథ్యంలో త్వరలోనే ‘ఆపరేషన్‌ బుడమేరు’ చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది.

మైలవరం కొండల్లో పుట్టి విజయవాడ మీదుగా కొల్లేరులో కలిసే బుడమేరు, వరదల సమయంలో తప్పించి మిగతా రోజుల్లో చాలాచోట్ల చిన్నపాటి మురుగు కాలువలాగానే కనిపిస్తుంది. కానీ, భారీ వర్షాలు వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉగ్రరూపం చూపిస్తుంది.

60 ఏళ్ల కిందట ఓసారి, 2005లో మరోసారి, మళ్లీ ఇటీవల అంతకు మించిన స్థాయిలో బెజవాడపై విరుచుకు పడిన బుడమేరు నగర ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. దాదాపు 4లక్షలమందిపై ప్రభావం చూపించింది.

దీంతో ఒక్కసారిగా బుడమేటి ఉపద్రవంపై అందరి దృష్టి పడింది. భవిష్యత్‌లో బుడమేరు ముంపు నుంచి బెజవాడను తప్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు బుడమేరు ఆక్రమణల మీద దృష్టిసారించనున్నట్టు పాలకులు ప్రకటిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆపరేషన్‌ బుడమేరును త్వరలోనే చేపట్టనున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన వేర్వేరు సందర్భాల్లో చెప్పారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బుడమేరు

‘270 ఎకరాలు ఆక్రమణ’

వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి గొల్లపూడి మీదుగా విద్యాధరపురం, గుణదల, రామవరప్పాడు, ప్రసాదంపాడు ఎనికేపాడు వరకు బుడమేరు ప్రవహిస్తోంది.

విజయవాడ నగర పరిధిలోనే దాదాపు తొమ్మిది కిలోమీటర్ల మేర బుడమేరు ప్రవాహం ఉంది. విజయవాడ రూరల్‌లో 10.2 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది.

‘‘ఎ.కొండూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో సుమారు 2700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తుండగా దాదాపు 270 ఎకరాల మేర ఆక్రమణలకు లోనైనట్లు గుర్తించాం’’ అని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన తెలిపారు. ఇందులో 3వేల ఇళ్లు, 80 నిర్మాణాలను గుర్తించామని ఆమె వెల్లడించారు.

ఆపరేషన్‌ బుడమేరులో భాగంగా సర్వే ల్యాండ్‌ రికార్డ్స్, ఇరిగేషన్, వీఎంసీ, సిటీ ప్లానింగ్‌ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి సర్వే నంబర్ల వారీగా ఆక్రమణల వివరాలు నమోదు చేస్తారని సృజన తెలిపారు.

ఆక్రమణలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆపరేషన్‌ బుడమేరు చేపట్టనున్నట్లు ఆమె వివరించారు.

బుడమేరు

అక్కడ ఇళ్ల మధ్యనే బుడమేరు

బుడమేరు చానల్‌ అంతా విజయవాడలో ఇళ్ల మధ్య నుంచే ప్రవహిస్తోంది. నగరంలోని ఏలూరు కాలువ, బుడమేరుకు ఒక గట్టు ఉమ్మడిగా ఉంటుంది. ఆ ఉమ్మడి గట్టుపైన రెండు వేల కట్టడాలకు పైగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

ఇక అయోధ్యానగర్, నందమూరి నగర్‌ మొదలు బుడమేరులోనే ఎన్నో వందల ఇళ్లు, పదుల సంఖ్యలో కాలనీలు వెలిశాయి.

నిరుపేదలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయలేక బుడమేటి గట్ల వెంబటి ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకోవడం 60 ఏళ్ల కిందటే మొదలైంది. ఆ తర్వాత బుడమేరును మరింత చిన్నదిగా చేస్తూ చిన్న మధ్య తరగతి ఇళ్ల నిర్మాణాలు, కాలనీలు వెలిశాయి.

విజయవాడలో బల్లపరుపు ప్రాంతాల కంటే కాల్వ గట్ల మీద కొండ ప్రాంతాల మీద ఉండే జనాభా ఎక్కువ అని గతంలో ఓ లెక్క ఉండేది. దాదాపు మూడు లక్షల మంది ఇలా గట్ల వెంబటే ఉంటారు.

బుడమేరు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బుడమేరు వరదకు విజయవాడ వీధుల్లో నీరు

బుడమేటి హద్దులు ఎక్కడ?

సహజంగానే సరైన తీరు తెన్నూ లేకుండా ప్రవహించే బుడమేరుకు ఇష్టారాజ్య ఆక్రమణల ఫలితంగా హద్దులు పూర్తిగా మారిపోయాయి.

బుడమేరు సరిహద్దులపై అధికారుల వద్దనే పక్కా సమాచారం లేకపోవడంపై ఇటీవల జరిగిన అధికారిక సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు అసహనం వ్యక్తం చేశారు.

అయితే, రెవెన్యూ లాండ్‌ సర్వే అధికారుల వద్ద డిజిటల్‌ మ్యాపులు ఉంటాయని, వాటిలో బుడమేటి సరిహద్దులు స్పష్టంగా తెలుస్తాయని జలవనరుల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తెలిపారు. వాటి ఆధారంగా ఆక్రమణలు గుర్తించవచ్చని ఆయన చెప్పారు.

బుడమేరు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కాలనీల్లో వరద నీరు

బుడమేరు నీరు నగరంలోకి రాకుండా...

బుడమేరు పాత చానల్‌ మొత్తం విజయవాడలోని ఇళ్ల మధ్య నుంచే ప్రవహిస్తోంది.

దీనికి సమాంతరంగా వెలగలేరు రెగ్యులేటర్‌ నుంచి పాముల కాలవ ఉంది. ఆ కాలువ అవసరాన్ని బట్టి విస్తరించి ఆ నీటిని ముస్తాబాద్‌ కాలువలోకి తీసుకువెళ్లేందుకు ఉన్న అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

ముస్తాబాద్‌ కాలువని వెడల్పు చేసి ఆ నీరంతా ఎనికేపాడు మీదుగా తిరిగి బుడమేరులో కలిసేందుకు ఉన్న మార్గాలను ఆలోచిస్తున్నారు.

దీంతో నగరంలో బుడమేరు ప్రవాహాన్ని తగ్గించే వెసులుబాటు ఉంటుందని భావిస్తూ అధికారులు ఆ మేరకు ఆపరేషన్‌ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

బుడమేరు
ఫొటో క్యాప్షన్, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన

ఇంకా ప్రాథమిక దశలోనే: కలెక్టర్‌ సృజన

‘‘ ‘ఆపరేషన్‌ బుడమేరు’ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తి స్థాయి సమీక్ష తర్వాతే స్పష్టత వస్తుంది’’ అని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన బీబీసీకి తెలిపారు.

జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ఇప్పటికే వివరాలు తెప్పించుకున్నారని ఆమె వెల్లడించారు.

మరోవైపు వెలగలేరు రెగ్యురేటర్‌ వద్దనున్న బుడమేరు డైవర్షన్‌ చానల్‌(బీడీసీ) నుంచి ప్రస్తుతం 15వేల క్యూసెక్కుల నీరు వెళ్తోంది.

‘‘దాని నుంచి 37,500వేల క్యూసెక్కులు వెళ్లేలా సిద్ధం చేయాలని, అలాగే వెలగలేరు రెగ్యులేటర్‌ కింద ఉన్న 1964 నాటి సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలనేది ఆపరేషన్‌ బుడమేరులో ప్రాథమికంగా చర్చకు వచ్చిన అంశం. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది’’ అని ఇరిగేషన్‌ ఎస్‌ఈ గంగయ్య బీబీసీకి తెలిపారు.

బుడమేరు
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు

పేదలకు ఇబ్బంది లేకుండా చూడాలి: సీపీఎం

‘‘బుడమేరు ఆపరేషన్‌పై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేదు. బుడమేటి ముంపు నివారణకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలి. వెలగలేరు రెగ్యులేటరీ ముందే బుడమేరు నీరు నిల్వ చేసేందుకు రిజర్వాయర్‌ కట్టాలి’’ అని ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు బీబీసీతో అన్నారు.

కృష్ణలంక వద్ద కృష్ణానది ఒడ్డున కట్టిన రిటైనింగ్‌ వాల్‌ తరహాలో బుడమేటికి కూడా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించేలా చూడాలని, విజయవాడలోకి బుడమేరు ప్రవేశించకుండా కొత్త చానల్‌ నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

ఈ మూడు ప్రతిపాదనల్లో ఏ ప్రతిపాదనతో వచ్చినా తక్కువ నష్టంతో ఎక్కువమంది ఇళ్లు పోకుండా చూడాలి. తప్పని సరి పరిస్థితుల్లో ఇళ్లు తొలగించాల్సి వస్తే ముందు ప్రత్యామ్నాయం చూపించాలి. గట్ల వెంబడి ఇళ్లు వేసుకుని నివసిస్తున్న పేదలపై ఆక్రమణదారులనే ముద్ర వేయకుండా పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టిన పెద్దలపై దృష్టిసారించాలి.’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)