ముంబయిలో పెట్రోల్ బంకుపై కూలిన భారీ హోర్డింగ్, 14 మంది మృతి, 43 మందికి గాయాలు

ఫొటో సోర్స్, ANI
బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంబయి నగరాన్ని అతలాకుతలం చేసింది. అనేక చోట్ల హోర్డింగ్‌లు కూలిపోయాయి.
ఘట్‌కోపర్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ కూలడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
ఈ ఘటనలో గాయపడిన 43 మంది ముంబయిలోని వివిధ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు.
ఘట్‌కోపర్ ప్రాంతంలోని రద్దీగా ఉండే ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఒక్కసారిగా కారు చీకటి కమ్ముకుంది
గాలి దుమ్ము, భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో సోమవారం మధ్యాహ్నం నుంచే ముంబయిలోని చాలా ప్రాంతాల్లో చీకటి కమ్ముకుంది.
ముంబయితో పాటు థానే, దివా, ముంబ్రా వంటి ప్రాంతాల్లో గాలిదుమ్ముతో పాటు వర్షం పడింది. అదే సమయంలో, రాయ్‌గఢ్, పాల్ఘర్ వంటి ప్రాంతాల్లో గాలి దుమ్ము బీభత్సం సృష్టించింది.
అయితే, ఈ వర్షంతో ముంబయి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి.
గాలి దుమ్ము తర్వాత, వర్షం పడటానికి ముందు, హఠాత్తుగా నల్లటి మేఘాలు ముంబయి నగరాన్ని ఆవరించాయి. దాంతో, నగరమంతా చీకటిని అలుముకుంది.
హోర్డింగ్ కింద చిక్కుకున్న ప్రజలు
కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచాయి.
ఈ బలమైన గాలులతో ఘట్‌కోపర్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ విరిగిపడింది. పక్కనే ఉన్న పెట్రోల్ పంపుపై విరుచుకుపడటంతో, ఇది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
‘‘మొత్తం 88 మందిని బయటికి తీశాం. వారిలో 14 మంది చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. 31 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇనుప రాడ్లను కత్తిరించేందుకు గ్యాస్ కట్టర్లను వాడలేకపోతున్నాం. ఎందుకంటే, ఇక్కడ పెట్రోల్ బంకు ఉంది. ఇక్కడ రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి’’ అని ఎన్డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నిఖిల్ ముధోల్కర్ చెప్పారు.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సందర్శించారు. ఆ తర్వాత రాజ్‌వాడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హోర్డింగ్ అనధికారికంగా ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆ హోర్డింగ్‌ను ఏర్పాటు చేసిన కంపెనీతో పాటు రైల్వే అథారిటీపై, ఈ అనధికారిక హోర్డింగ్‌ను పట్టించుకోకుండా వదిలివేయడంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ఫొటో సోర్స్, FACEBOOK
‘ముంబయిలోని అన్ని హోర్డింగ్స్‌ను ఆడిట్ చేస్తాం’
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం రాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తామన్నారు.
ముంబయిలో చాలా హోర్డింగ్స్ ఉన్నాయని, వాటిపై ప్రత్యేకంగా ఆడిట్ చేస్తామని తెలిపారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు.
మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. అలాగే, గాయపడినవారి చికిత్సకు అవసరమయ్యే అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశం: ఫడ్నవిస్
ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదం చాలా తీవ్రమైందని, దురదృష్టకరమని చెప్పారు.
హోర్డింగ్ నిర్వహణలో చాలా లోపాలున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత, దీనిపై అత్యున్నత స్థాయి విచారణకు కూడా ఆదేశించినట్లు తెలిపారు.
‘‘ఈ హోర్డింగ్ కోసం అనుమతులు తీసుకున్నారా? ఎవరు అనుమతి ఇచ్చారు? అనుమతులు సరైనవేనా? వంటి విషయాలపై లోతుగా విచారణ చేపడతాం. ఇలాంటి గాలి దుమారాలు భారీ హోర్డింగ్స్‌ను కూల్చుతాయా? అనే దానిపై అధ్యయనం చేపడతాం’’ అని చెప్పారు.

విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
భారీ గాలులకు రోడ్ల పక్కన ఉన్న చెట్లు పడిపోయాయి. అప్పుడు చాలా మంది ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తున్నారు.
థానే స్టేషన్ సమీపంలో ఒక స్తంభం ఓవర్ హెడ్ వైర్లపై పడటంతో రైల్వే సేవలకు అంతరాయం కలిగింది.
విమానాల రాకపోకల మీదా ప్రభావం చూపించింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత కొంత సేపటి వరకూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లను అనుమతించలేదు.
మహారాష్ట్రలోని పుణె, రాయఘడ్, పాల్ఘర్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితులే కనిపించాయి.
ఇవి కూడా చదవండి:
- ‘మా నాన్న సీఎం’
- Northern Lights: ఆకాశంలో ఈ రంగుల తుపాను మీకెప్పుడైనా కనిపించిందా?
- ఎన్నికల కోడ్ అంటే ఏంటి? ఇది అమల్లోకి వచ్చాక ఏం జరుగుతుంది?
- ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకసారి గెలిచిన వారికి మరో చాన్స్ ఇవ్వని నియోజకవర్గం, ఇక్కడే ఎందుకిలా జరుగుతోంది?
- గాజువాక ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















