నిన్న రాత్రి ప్రాణాలు ఎలా కాపాడుకున్నామంటే.. ఇరాన్ మిసైల్ దాడులను స్వయంగా చూసిన తెలుగు వ్యక్తి ప్రత్యక్ష అనుభవం

ఇజ్రాయెల్‌లో ఉంటున్న నిజామాబాద్ వాసి కుకునూరు కిశోర్

ఫొటో సోర్స్, kukunuru kishore

ఫొటో క్యాప్షన్, కుకునూరు కిశోర్
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

ఇరాన్ క్షిపణిదాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని తెలుగువాళ్లు ఆందోళనకు గురవుతున్నారు.

తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన కుకునూరు కిశోర్ పదేళ్లగా టెల్ అవీవ్‌లో కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్నారు.

ఇరాన్ క్షిపణులు టెల్ అవీవ్ పైకి రావడాన్ని ప్రత్యక్షంగా చూశానని ఆయన బీబీసీతో చెప్పారు.

‘ఇరాన్ మిసైల్ దాడుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. హిజ్బుల్లా రాకెట్ దాడులను మేం చాలా చూశాం. కానీ వాటిని పెద్దగా పట్టించుకునే వాళ్లం కాదు. నిన్న(మంగళవారం) రాత్రి ఇరాన్ చేసిన దాడులతో మాకు మొదటిసారి భయం కలిగింది’ అన్నారు కిశోర్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్ మిసైల్ దాడులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, టెల్ అవీవ్‌ పైకి దూసుకొస్తున్న ఇరాన్ క్షిపణి

‘‘నిన్న రాత్రి 7 :30 గంటల సమయంలో దక్షిణ వైపు నుంచి మిసైల్ దాడులు జరుగుతాయని.. సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని 'హౌజ్ ఫ్రంట్ కమాండ్' నుంచి నా ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. సరిగ్గా 7:40 నిమిషాలకు ఆకాశంలో మిసైల్స్ వేగంగా రావడం చూశాం’ అని కిశోర్ చెప్పారు.

‘చాలా క్షిపణులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయిందని తెలుస్తోంది. టెల్ అవీవ్‌లో నేను ఉండే ప్రాంతంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్‌పై ఐరన్ డోమ్ అడ్డుకున్న మిసైల్ పడిపోయింది’ అని ఆయన తెలిపారు.

అక్టోబర్ 5 వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఇజ్రాయిల్ రక్షణ వర్గాల నుంచి సూచనలు అందాయి.

ఇండియన్ ఎంబసీ నుంచి కూడా భారతీయులకు సూచనలు వస్తున్నాయి.

జనసంచారం లేక ఖాళీగా ఉన్న టెల్ అవీవ్ వీధులు(బుధవారం నాటి చిత్రం)

ఫొటో సోర్స్, kukunuru kishore

ఫొటో క్యాప్షన్, జనసంచారం లేక ఖాళీగా ఉన్న టెల్ అవీవ్ వీధులు

ఫస్ట్‌టైమ్ నా లైఫ్‌లో భయపడ్డాను

‘‘ఉత్తరం వైపు నుంచి రాకెట్లు వస్తే హిజ్బుల్లా అని, దక్షిణం వైపు నుంచి వస్తే ఇరాన్ అని అర్థం చేసుకుంటున్నాం. ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో భయపడ్డాను. రాకెట్స్, మిసైల్స్ వచ్చే ముందు ఫోన్‌కు హెచ్చరికలు వస్తాయి. షెల్టర్‌లోకి వెళ్లేందుకు కొంత టైమ్ ఉంటుంది. నిన్న మాత్రం రెండు నిమిషాల ముందే హెచ్చరికలు వచ్చాయి. సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాం’ అని కిశోర్ అక్కడి పరిస్థితిని వివరించారు.

‘సాధారణంగా ఎంత సేపు దాడులు జరుగుతాయన్న విషయం మెసేజ్‌లో వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు బయటకు రావచ్చు, అంతా సేఫ్ అనేది కూడా అప్ డేట్ చేస్తారు. నిన్న నా అపార్ట్‌మెంట్ పైనుంచి ఇరాన్ క్షిపణులు వరుసగా వెళ్తోంటే దీపావళి పండగ రాకెట్లలా అనిపించింది’’ అని ఆందోళనగా చెప్పారు కిశోర్.

ఇరాన్ మిసైల్ దాడులు

ఫొటో సోర్స్, Shutterstock

ఫొటో క్యాప్షన్, ఇరాన్ దాడిలో ధ్వంసమైన సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని భవనం

ఇజ్రాయెలీల పవిత్ర మాసంలో ఇరాన్ దాడులు

‘ఇవాళ్టి నుంచి(బుధవారం నుంచి) ఇక్కడ రోష్‌ హషానా(Rosh Hashanah) అనే పండగ మొదలవుతుంది. ఇది ఇజ్రాయిల్ హీబ్రూ సంప్రదాయంలో కొత్త ఏడాది ప్రారంభమయ్యే రోజు. అక్టోబరు నెలంతా వేడుకలుంటాయి. ఇజ్రాయెలీలు దీన్ని పవిత్ర మాసంగా పాటిస్తారు. ప్రతి వారం కార్యక్రమాలుంటాయి. ఈ పండగను దృష్టిలో పెట్టుకునే ఇరాన్ దాడులు జరుగుతున్నాయని అనుకుంటున్నాం. నిన్న మాకు దగ్గరలో ఉన్న లీఫా టెలవీలో ఒక లోకల్ ట్రైన్‌లో కొందరు చొరబడి కాల్పులు జరిపారు’ అని కిశోర్ తెలిపారు.

ఇరాన్ మిసైల్ దాడులు

ఫొటో సోర్స్, kukunuru kishore

ఫొటో క్యాప్షన్, ఇరాన్ వైపు నుంచి దూసుకొస్తున్న మిసైళ్లు

ఇజ్రాయెల్‌లో పెద్ద సంఖ్యలో తెలుగువారు

ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అందిస్తున్న వివరాల ప్రకారం... ఇజ్రాయెల్‌లో సుమారు 18 వేల మంది భారత పౌరులు కేర్ టేకర్స్, డైమండ్ ట్రేడర్స్, ఐటీ ప్రొఫెషనల్స్‌గా పని చేస్తున్నారు. కొందరు చదువుకుంటున్నారు.

85 వేల మంది భారతసంతతి యూదులు అక్కడ నివసిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. చదువు, ఉపాధి కోసం వారంతా ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు.

2023 అక్టోబరులో ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడి తరువాత పరిస్థితులు మారాయి.

ఇజ్రాయెల్‌ నిర్మాణ రంగంలో పని చేయడానికి గతంలో పాలస్తీనా నుంచి రోజూ సుమారు 18 వేల మంది కార్మికులు వచ్చివెళ్తుండేవారని... హమాస్ దాడి తరువాత వారిని తీసుకోవడం ఇజ్రాయెల్ నిలిపివేసిందని కిశోర్ చెప్పారు.

‘నిర్మాణరంగంలో కార్మికుల కొరత ఏర్పడడడంతో.. భారత్, శ్రీలంకల నుంచి ఎక్కువ మంది కార్మికులకు అవకాశం ఇచ్చింది ఇజ్రాయెల్.. టెల్ అవీవ్ ప్రాంతంలో దాదాపు 10వేల మంది భారతీయులు నిర్మాణరంగంలో పని చేస్తున్నారు’ అని కిశోర్ తెలిపారు.

గత ఏడాది నుంచి ఇజ్రాయెల్‌లో పని చేయడానికి వస్తున్న భారతీయుల సంఖ్య బాగా పెరిగిందని నివేదికలు చెప్తున్నాయి.

తొలినాళ్లలో భారతీయులు ఎక్కువగా నర్సింగ్, వృద్ధులకు కేర్ టేకర్స్‌, కంప్యూటర్ రంగ నిపుణులుగా వెళ్లేవారు.

ఇప్పుడు నిర్మాణరంగం, వ్యాపారం వంటి వాటిలో వారి సంఖ్య పెరుగుతోందని కిశోర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)