లెప్టోస్పైరోసిస్: పశువులు, ఎలుకల మలమూత్రాల నుంచి సోకే ఈ వ్యాధి ఏమిటి? వ్యాధి సోకిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ ఆరోగ్యం ఎలా ఉంది

లెప్టోస్పైరోసిస్‌తో బాధపడుతున్న పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లెప్టోస్పైరోసిస్‌ బారినపడ్డారు.

మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం భగవంత్‌ మాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఫోర్టిస్ ఆసుపత్రి ఈ మేరకు ఆయన ఆరోగ్యానికి సంబంధించి బులెటిన్ విడుదల చేసింది.

ఇంతకీ.. జంతువులు, మట్టి, కలుషిత నీటి వల్ల సోకే లెప్టోస్పైరోసిస్ వ్యాధి ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది ఎంత ప్రమాదం?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

లెప్టోస్పైరోసిస్ వ్యాధి బారిన పడ్డ ఎలుకలు, కుక్కలు, పందులు వంటి జంతువుల మూత్రంలో ఈ బ్యాక్టీరియా కనిపిస్తుంది.

వ్యాధి బారిన పడ్డ జంతువుల మూత్రం నుంచి బ్యాక్టీరియా మట్టి, నీళ్లలో చేరితే... ఆ మట్టి, నీళ్ల నుంచి గాయాలు, కళ్ల ద్వారా మనుషుల శరీరంలో చేరుతుంది.

లెప్టోస్పైరోసిస్ బారిన పడ్డ జంతువుల రక్తం, మాంసం నుంచి కూడా బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది.

అయితే పెంపుడు జంతువుల నుంచి మనుషులకు లెప్టోస్పైరోసిస్ సోకడం అరుదు.

భగవంత్ మాన్ వేగంగా కోలుకుంటున్నారని ఫోర్టిస్ ఆస్పత్రి కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఆర్‌కే జస్వాల్ చెప్పారు.

భగవంత్ మాన్‌ మొదట ఆస్పత్రిలో చేరినప్పడు సాధారణ జ్వరంగా భావించామని, అయితే రక్తపరీక్షల్లో లెప్టోస్పైరోసిస్‌గా నిర్ధరణైందని జస్వాల్ చెప్పారు.

జంతువులు, వరద పరిస్థితులు, కలుషిత నీరు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరదల సమయంలో చనిపోయిన ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే లెప్టోస్పైరోసిస్

ఎలుకల నుంచి ఎలా వ్యాపిస్తుంది?

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం లెప్టోస్పైరా అనే బ్యాక్టీరియా వల్ల లెప్టోస్పైరోసిస్ వస్తుంది. మనుషుల్లో, జంతువుల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది.

లెప్టోస్పైరోసిస్‌కు సకాలంలో చికిత్స తీసుకోకపోతే మూత్రపిండాలు పాడవుతాయి.

కొందరు రోగులలో వెన్నెముక, మెదడు చుట్టూ ఉండే మెంబ్రేన్ వాపు వస్తుంది. మెంబ్రేన్ వాపును మెనింజైటిస్ అంటారు. మెదడు వాపు వ్యాధి అని కూడా అంటారు.

లెప్టోస్పైరోసిస్‌ వల్ల కాలేయం పనిచేయకపోవడం, శ్వాససంబధిత సమస్యలూ తలెత్తుతాయి. సకాలంలో చికిత్స అందకపోతే మెనింజైటిస్ వల్ల మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది.

ఏటా సుమారు 10 లక్షల లెప్టోస్పైరోసిస్‌ కేసులు నమోదవుతుంటాయి. వారిలో సగటున 60 వేల మంది చనిపోతుంటారు.

మనుషుల్లానే జంతువులు కూడా మురికి నీళ్లు, మూత్రం, కలుషిత మట్టి వంటి వాటివల్ల ఈ వ్యాధి బారినపడతాయి.

అయితే వ్యాధి బారిన పడ్డ జంతువుల్లో లక్షణాలు తేడాగా ఉంటాయి. కొన్నింటిలో అసలు లక్షణాలే కనిపించవు.

లెప్టోస్పైరా అనేది ప్రధానంగా ఎలుకల్లో కనిపించే బ్యాక్టీరియా అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్‌లో వైరాలజీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ రవి బీబీసీతో చెప్పారు.

వరదల సమయంలో చనిపోయిన ఎలుకల నుంచి అది మనుషులకు వ్యాపిస్తుందని అన్నారు.

ఆవులు, మేకల వల్ల కూడా లెప్టోస్పైరోసిస్‌ మనుషులకు వ్యాపిస్తుందని గుజరాత్ ఆరోగ్య విభాగం తెలిపింది.

ముఖ్యంగా ఆవులు, మేకల దగ్గర పేడ తీసి శుభ్రం చేసేటప్పుడు కళ్లు, ముక్కు, నోరు ద్వారా మనిషి శరీరంలోకి లెప్టోస్పైరోసిస్‌ ప్రవేశిస్తుందని పేర్కొంది.

లెప్టోస్పైరోసిస్‌ బాధితులకు చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లెప్టోస్పైరోసిస్‌ బాధితులకు చికిత్స

లెప్టోస్పైరోసిస్‌ లక్షణాలు

లెప్టోస్పైరోసిస్‌ బారిన పడ్డవారిలో చాలా మందిలో లక్షణాలు కనిపించవని, లేదా కొద్ది మందికి కాస్త జ్వరం వస్తుందని యూకే పబ్లిక్ హెల్త్ సర్వీస్ ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. అయితే కొద్దిమంది మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురవుతారు.

  • తీవ్రజ్వరం
  • తలనొప్పి
  • ఒళ్లునొప్పులు
  • కడుపులో నొప్పి,
  • డయేరియా
  • కళ్లు ఎర్రబడడం
  • కామెర్లు
  • ఆకలి లేకపోవడం
  • మూత్రవిసర్జనలో ఇబ్బంది
  • కీళ్ల వాపు
  • భుజాలు, ఛాతీలో నొప్పి
  • ఊపిరి ఆడకపోవడం

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.

జంతువులు, వరద పరిస్థితులు, కలుషిత నీరు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లెప్టోస్పైరా బ్యాక్టీరియా

లెప్టోస్పైరోసిస్‌కు చికిత్స ఏంటి?

లెప్టోస్పైరోసిస్‌ లక్షణాల్లో చాలా వరకు కొన్ని ఇతర వ్యాధుల్లో కూడా ఉంటాయని సీడీసీ తెలిపింది.

బ్యాక్టీరియా సోకిన తర్వాత సాధారణంగా లెప్టోస్పైరోసిస్‌ వ్యాధిగా మారడానికి రెండు నుంచి 30 రోజుల సమయం పడుతుంది.

ఇందులో రెండు దశలుంటాయి.

తొలి దశలో జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ లక్షణాలన్నీ కాసేపు తగ్గినట్టు అనిపించినా రోగి మళ్లీ అస్వస్థతకు గురవుతారు.

రెండో దశ ప్రాణాంతకమైనది. ఈ దశలో కిడ్నీ, కాలేయం విఫలమవుతాయి.

మెనింజైటిస్‌గా పిలిచే వెన్నెముక, మెదడు వాపు వ్యాధి రావొచ్చు.

ఈ సమయంలో తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాలి. యాంటీబయోటిక్స్ వాడాలి. చాలామంది చికిత్స మొదలైన కొన్నిరోజులకు కోలుకున్నా కొందరికి మాత్రం కోలుకోవడానికి వారాలు పడుతుంది.

జంతువులు, వరద పరిస్థితులు, కలుషిత నీరు

ఫొటో సోర్స్, Getty Images

లెప్టోస్పైరోసిస్‌ నియంత్రణ ఎలా

మాంసం వ్యాపారంలో ఉన్నవారికి లెప్టోస్పైరోసిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

లెప్టోస్పైరోసిస్ బారిన పడకుండా ఉండడానికి ఎన్‌హెచ్‌ఎస్ కొన్ని జాగ్రత్తలు సూచిస్తోంది.

జంతువుల దగ్గరికి వెళ్లినప్పుడు, జంతువుల ఉత్పత్తులను పట్టుకున్నప్పుడు చేతులను నీళ్లు, సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

గాయాలు ఉంటే వెంటనే శుభ్రం చేసుకోవాలి.

కలుషితమైన నీళ్లలోకి వెళ్తే వీలైనంత తొందరగా స్నానం చేయాలి.

లెప్టోస్పైరోసిస్‌ రాకుండా ఉండాలంటే పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలి. ఈ వ్యాధి రాకుండా మనుషులకు వ్యాక్సిన్ లేదు.

వ్యాధిబారిన పడ్డ జంతువులకు దూరంగా ఉండాలి.

చనిపోయిన జంతువులను గ్లోవ్స్ వేసుకోకుండా తాకకూడదు.

నదులు, కాలువలు, చెరువులలోని నీరు తాగకూడదు. కాచిచల్లార్చిన నీరు మాత్రమే తాగాలి.

జంతువులకు సంబంధమైన పనులు చేయాల్సివస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)