‘ముందు మెసేజ్‌లు వచ్చాయి, తర్వాత మిసైళ్లు దూసుకొచ్చాయి’- బంకర్లలో దాక్కున్న ఇజ్రాయెలీల అనుభవాలు ఏంటంటే...

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, టెల్ అవీవ్, హిజ్బుల్లా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, షెల్టర్‌లో దాక్కున్న ఇజ్రాయెల్ ప్రజలు
    • రచయిత, అలైస్ కడ్డీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అప్పుడు రాత్రి 7.30 అవుతోంది. అందరి ఫోన్లకూ ఒకేసారి మెసేజ్ వచ్చింది. ‘‘మీరు ఎక్కడున్నా సరే... అర్జెంటుగా నేలమాళిగ (బంకర్)లోకి వెళ్లి దాక్కోండి. మేం మళ్లీ చెప్పే వరకు ఎవరూ బయటకు రావద్దు’’- ఇదీ మెసేజ్ సారాంశం.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) నుంచి వచ్చిన ఈ మెసేజ్ చివరన -‘లైఫ్ సేవింగ్ ఇన్‌స్ట్రక్షన్’ అని రాసి ఉంది.

ఈ సందేశం చూసినవారంతా షెల్టర్లలోకి పరుగెత్తారు.

దేశవ్యాప్తంగా మోగిన సైరన్లను లక్షల మంది ప్రజలు విన్నారు.

అలారం సౌండ్ వినగానే మేమంతా మా బీబీసీ జెరూసలేం బ్యూరోకు సంబంధించిన షెల్టర్‌లోకి వెళ్లాం. ఆ షెల్టర్ చాలా సురక్షితంగా ఉంటుంది. దానికి కిటికీలు కూడా ఉండవు.

తలపైకెత్తి చూస్తే, ఆకాశంలో దూసుకొస్తున్న క్షిపణులు, వాటిని అడ్డుకుంటున్న ఇంటర్‌సెప్టర్‌ల మెరుపులు కనిపిస్తున్నాయి.

టెల్ అవీవ్ నగరంలో గాల్లో దూసుకువస్తున్న క్షిపణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి.

క్షిపణులు గాలిలోనే ధ్వంసం కావడం, లేదంటే భూమి మీద పేలడం వల్ల వచ్చిన పొగతో ఆకాశం నల్లగా మారి కనిపించింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, టెల్ అవీవ్, హిజ్బుల్లా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, షెల్టర్లలోకి పరుగులు పెడుతున్న ఇజ్రాయెలీలు

రాత్రి 8 గంటల సమయంలో ఐడీఎఫ్ నుంచి మరో మెసేజ్ వచ్చింది. ‘‘దేశం మీదకు దూసుకువస్తున్న క్షిపణులను ఇంటర్‌సెప్టర్‌లతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాం. మళ్లీ మేం చెప్పే వరకు ఎవరూ బయటకు రావద్దు’’ అన్నది ఆ మెసేజ్ సారాంశం.

‘‘ఇప్పుడు మీరు వింటున్నవి ఇంటర్‌సెప్టర్‌లు క్షిపణులను గాల్లోనే పేల్చేయడం వల్ల, అవి కిందపడిపోవడం వల్ల వస్తున్న శబ్దాలు’’ అని ఆ మెసేజ్‌లో రాసి ఉంది.

అప్పటికే, ఇరాన్ ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చని ఇజ్రాయెల్‌లో ఊహాగానాలు సాగుతున్నాయి.

హిజ్బుల్లాకు చెందిన ‘‘కొన్ని ప్రత్యేక టార్గెట్లపై, లోకల్‌గా చేస్తున్న పరిమిత దాడులు’’ అంటూ లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టిన కొద్ది గంటలకే ఇరాన్ నుంచి మిసైళ్లు ఇజ్రాయెల్‌ వైపు దూసుకొచ్చాయి.

ఇరాన్ దాడులు మొదలుకాగానే ఇజ్రాయెల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మాకు అనేక మెసేజ్‌లు వచ్చాయి.

‘‘ఎటు చూసినా అలారం సైరన్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మేం సేఫ్ రూమ్‌కు చేరుకోగలిగాం’’ అని దక్షిణ ఇజ్రాయెల్‌కు చెందిన ఒక మహిళ తన వాయిస్ మెసేజ్‌లో చెప్పారు.

‘‘మేం చాలా భయపడిపోయాం. ఇంకా బతికే ఉన్నామంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. మృత్యువు మాకు చాలా దగ్గరగా వచ్చింది’’ అని టెల్ అవీవ్ నుంచి ఓ జర్నలిస్టు చెప్పారు.

‘‘మామూలుగా మేం మా ఇంట్లో ఉన్న షెల్టర్‌లోకి ఎప్పుడూ వెళ్లలేదు. కానీ, ఈసారి వెళ్లాల్సి వచ్చింది’’ అని ఆయన అన్నారు.

‘‘చాలా పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇది ఇంతటితో ఆగిపోయేలా లేదు. ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి. ఐడీఎఫ్ మమ్మల్ని కాపాడుతుందని భావిస్తున్నాం. ఇరాన్ పెద్ద తప్పు చేస్తోంది’’ అంటూ లాయర్ ఎఫ్రాత్ ఎల్డన్ తన వాట్సాప్ మెసేజ్‌లో పేర్కొన్నారు.

టెల్ అవీవ్ శివారులో గుంత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ ప్రయోగించిన క్షిపణి పడటంతో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగర శివారులో భారీ గుంత ఏర్పడింది

మొదటి మెసేజ్ వచ్చిన దాదాపు గంట తర్వాత మరోసారి అందరి ఫోన్లకూ అలర్ట్ మెసేజ్‌లు వచ్చాయి.

‘‘మీరు మీ సురక్షిత ప్రదేశాలు, షెల్టర్ల నుంచి బయటకు రావచ్చు’’ అని ఈసారి హోమ్ ఫ్రంట్ కమాండ్ నుంచి మెసేజ్ వచ్చింది.

సెంట్రల్ ఇజ్రాయెల్ ప్రాంతంలో కొన్నిచోట్ల క్షిపణులు దాడి చేయగలిగాయని ఐడీఎఫ్ పేర్కొంది.

ఆ తర్వాత విడుదలైన అనేక సోషల్ మీడియా వీడియోలలో, వివిధ ప్రాంతాలలో ఇరాన్ క్షిపణి దాడుల వల్ల కలిగిన నష్టాలకు సంబంధించిన దృశ్యాలు కనిపించాయి.

టెల్‌ అవీవ్‌లోని ఒక క్రీడా మైదానంలో పెద్ద గొయ్యి ఏర్పడి ఉంది.

వెస్ట్ బ్యాంక్‌లోని జరికో ప్రాంతంలో ఇరాన్ మిసైల్ దాడి కారణంగా ఒక వ్యక్తి చనిపోయారని ది పాలస్తీనియన్ సివిల్ డిఫెన్స్ అథారిటీ తెలిపింది. గాలిలో ఇంటర్‌సెప్టర్ దాడుల కారణంగా కూలిన క్షిపణి శకలం తగిలి ఆ వ్యక్తి చనిపోయారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

అయితే, ఈ ఎయిర్ అటాక్‌ల కారణంగా ఎవరూ గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు ఇంత వరకు వెల్లడించలేదు.

‘‘ఇరాన్ దాడులు మరెన్ని జరుగుతాయో ఇప్పుడే చెప్పలేం. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ భద్రత కోసం మా ఆదేశాలను పాటించండి’’ అని ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారీ టెలివిజన్ సందేశంలో తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)