బేరూత్‌లో ఇజ్రాయెల్ వరుస దాడులు, దేశవ్యాప్తంగా ఒకే రోజు 105 మంది చనిపోయారన్న లెబనాన్ ప్రభుత్వం

లెబనాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెంట్రల్ బేరూత్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనంపై అర్ధరాత్రి వైమానిక దాడి జరిగింది

లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 105 మంది చనిపోయారని, 359 మంది గాయపడ్డారని లెబనాన్ ప్రభుత్వం తెలిపింది.

తాజాగా సెంట్రల్ బేరూత్‌లో దాది జరిగింది. నగరంలోని కోల ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్ భవనం దెబ్బతింది. బేరూత్ నడిబొడ్డున ఇజ్రాయెల్ జరిపిన మొదటి దాడి ఇదేనని అనిపిస్తోంది. ఇంతకుముందు ప్రధానంగా దక్షిణ బేరూత్ ప్రాంతంలోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తూర్పు లెబనాన్‌లోని బెకా ప్రాంతంలో రాత్రి పదుల సంఖ్యలో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. హిజ్బుల్లా ఆయుధాలను నిల్వ చేసిన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ చెప్పింది.

దక్షిణ లెబనాన్‌లోనూ హిజ్బుల్లా ఆయుధాగారాలపై దాడులు చేశామని ఐడీఎఫ్ తెలిపింది.

లెబనాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సెంట్రల్ బేరూత్‌లో ధ్వంసమైన భవనం

రాత్రి జరిగిన వైమానిక దాడిలో తమ నాయకులు ముగ్గురు చనిపోయారని పాలస్తీనియన్ మిలిటెంట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా (పీఎఫ్‌ఎల్పీ) తెలిపింది. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు.

మరోవైపు, దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో తమ నాయకుడు ఫతే షెరిఫ్ అబు ఎల్-అమిన్ చనిపోయారని, ఆయన కుటుంబ సభ్యులు కూడా కొందరు చనిపోయారని హమాస్ తెలిపింది.

ప్రస్తుత ఘర్షణల కారణంగా లెబనాన్ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలివెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నట్టు ఆ దేశ ప్రధాని ఆదివారం తెలిపారు.

యెమెన్‌లోని హూతీలపై కూడా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని, 29 మంది గాయపడ్డారని హూతీల నేతృత్వంలోని ఆరోగ్య శాఖ తెలిపింది.

హమాస్, హిజ్బుల్లా, హూతీలకు ఇరాన్ మద్దతిస్తోంది.

హసన్ నస్రల్లా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సెప్టెంబర్ 27న హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది

ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఈ ఘర్షణ ఎందుకు?

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేసిన తర్వాత, దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడి చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి.

కొన్ని రోజులుగా లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులు చేస్తోంది.

సెప్టెంబర్ 27న తాము జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆయన మరణాన్ని హిజ్బుల్లా కూడా ధ్రువీకరించింది. ఈ పరిణామంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

హసన్ నస్రల్లా

ఫొటో సోర్స్, EPA

హిజ్బుల్లా అంటే ఏమిటి?

హిజ్బుల్లా అనేది షియా ముస్లిం సంస్థ. లెబనాన్‌లో రాజకీయంగా చాలా ప్రభావవంతమైనది. లెబనాన్‌లో అత్యంత శక్తిమంతమైన సాయుధ దళం దీని నియంత్రణలో ఉంది.

1980ల ప్రారంభంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా, ఈ ప్రాంతంలోని ఆధిపత్య షియా శక్తి అయిన ఇరాన్ ‌దీనిని స్థాపించింది.

అప్పుడు లెబనాన్ అంతర్యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌ను ఆక్రమించాయి.

హిజ్బుల్లా 1992 నుంచి లెబనాన్ జాతీయ ఎన్నికలలో పాల్గొంటూ, ప్రధాన రాజకీయ శక్తిగా మారింది.

దాని సాయుధ విభాగం లెబనాన్‌లోని ఇజ్రాయెల్, అమెరికా దళాలపై తీవ్రమైన దాడులు చేసేది.

2000 సంవత్సరంలో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పుడు, తామే వారిని తరిమి కొట్టామని హిజ్బుల్లా చెప్పుకుంది.

అప్పటి నుంచి హిజ్బుల్లా దక్షిణ లెబనాన్‌లో వేలాది మంది ఫైటర్లు, క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలను సమకూర్చుకుంటూ, వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తూ వస్తోంది.

పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలు, అరబ్ లీగ్ లాంటివి హిజ్బుల్లాను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.

2006లో హిజ్బుల్లా సరిహద్దులు దాటి దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్‌తో పూర్తిస్థాయి యుద్ధం జరిగింది.

హిజ్బుల్లాను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌పై దాడి చేసినా, అది నిలదొక్కుకుని అప్పటి నుంచి తన ఫైటర్ల సంఖ్యను పెంచుకుని, మరింత మెరుగైన ఆయుధాలను సమకూర్చుకుంది.

వీడియో క్యాప్షన్, గాయపడిన ప్రజలు, చిన్నారులతో నిండిపోతున్న ఆసుపత్రులు...

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)