లెబనాన్‌లో గ్రౌండ్ యాక్షన్‌ మొదలుపెట్టామన్న ఇజ్రాయెల్, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన హిజ్బుల్లా

యుద్ధ ట్యాంకులు

లెబనాన్‌పై గ్రౌండ్ యాక్షన్ (భూతల దాడి)కి అవకాశాల గురించి ఇజ్రాయెల్ సైన్యం గత కొన్ని రోజులుగా సంకేతాలు ఇస్తూనే వస్తోంది. ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ సెప్టెంబర్ 30న లెబనాన్ సరిహద్దుల్లోని సైనికులతో సమావేశం నిర్వహించారు.

‘‘మన సామర్ధ్యాన్నంతా ఉపయోగిస్తాం. మనం ఏదైనా సాధించగలమన్న నమ్మకం నాకుంది’’ అని అన్నారు.

‘‘మనం ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. గాలి, నీరు, భూమి... ఇలా ఎక్కడైనా మన శక్తిని ఉపయోగిస్తాం’’ అన్నారాయన.

భూతల దాడి జరుగుతుందన్న సందేశం హిజ్బుల్లాకు ఇవ్వాలని ఇజ్రాయెల్ అనుకుందని, ఇందుకోసం ముందుగానే సంకేతాలు పంపుతూ వస్తోందని బీబీసీ డిప్లొమాటిక్ కరస్పాండెంట్ పాల్ ఆడమ్స్ అభిప్రాయపడ్డారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లెబనాన్

ఫొటో సోర్స్, EPA

ఈ సంకేతాలను నిజం చేస్తూ, గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించామంటూ ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన చేసింది. దక్షిణ లెబనాన్‌లో గ్రౌండ్ యాక్షన్‌ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది.

"మేం దక్షిణ లెబనాన్‌లో భూతల దాడి మొదలుపెట్టాం. హిజ్బుల్లా రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటాం. ఈ సైనిక చర్య పరిమిత పరిధిలో జరుగుతుంది. మా లక్ష్యాలు సరిహద్దుల్లోని గ్రామాలలో ఉన్నాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లోని పౌరులపై హిజ్బుల్లా దాడి చేసింది’’ అని ఐడీఎఫ్ తెలిపింది.

అయితే.. ‘‘ఇజ్రాయెల్ చేసే భూతల దాడిని ఎదుర్కోవడానికి హిజ్బుల్లా సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ మీద మా పోరాటం ఆగదు’’ అని హిజ్బుల్లా డిప్యూటీ లీడర్ షేక్ నయీమ్ ఖాసిం అంతకు ముందే ప్రకటించారు.

ఇజ్రాయెల్ హిజ్బుల్లా హమాస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లెబనాన్‌తో సరిహద్దు దగ్గర పహారా కాస్తున్న ఇజ్రాయెల్ సైనికులు

భూతల దాడులు ఎందుకు?

సెప్టెంబర్ 17, 18 తేదీల్లో లెబనాన్‌లో భారీ సంఖ్యలో పేజర్లు, వాకీ-టాకీలు పేలాయి. ఈ ఘటనల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో హిజ్బుల్లా సభ్యులతోపాటు, సామాన్య పౌరులు కూడా ఉన్నారు. ఈ దాడుల వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందని లెబనాన్ ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలపై ఇజ్రాయెల్ స్పందించలేదు.

ఆ తర్వాత హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ పెరిగింది. లెబనాన్‌లో తన చర్యలను ముమ్మరం చేసింది ఇజ్రాయెల్.

హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హత్య తర్వాత కూడా లెబనాన్‌పై దాడులను కొనసాగిస్తోంది ఇజ్రాయెల్.

అమెరికా సహా పాశ్చాత్య దేశాలు కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇజ్రాయెల్ తన చర్యలను ఆపలేదు.

ఇదే సమయంలో గ్రౌండ్ యాక్షన్‌పై ఇచ్చిన సంకేతాలను ఇజ్రాయెల్ నిజం చేసింది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, EPA

బీబీసీ డిప్లొమాటిక్ కరస్పాండెంట్ పాల్ ఆడమ్స్ తెలిపిన వివరాల ప్రకారం, లెబనాన్ సరిహద్దులకు సమీపంలో ఇజ్రాయెల్ భారీ సంఖ్యలో సైనికులను, ట్యాంకులను మోహరించింది. హిజ్బుల్లాకు గట్టి పట్టున్న ప్రాంతంలో ఆపరేషన్‌కు సిద్ధంగా ఉండాలని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ తన సైనికులకు ఇంతకు ముందే సూచించారు.

గత రెండు వారాల్లో ఇజ్రాయెల్ దాడుల కారణంగా వెయ్యి మందికి పైగా మరణించారని, 10 లక్షల మందికి పైగా ప్రజలు ఇళ్లు విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందని లెబనాన్‌లోని అధికారులు వెల్లడించారు.

ఇజ్రాయెల్ దాడుల కారణంగా సుమారు లక్ష మంది లెబనాన్‌ను వదిలి సిరియాకు వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

హిజ్బుల్లా ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హిజ్బుల్లా నేత నయీం ఖాసిం

నస్రల్లా మరణం తర్వాత హిజ్బుల్లా నుంచి మొదటి కీలక ప్రకటన

హసన్ నస్రల్లా హత్య తర్వాత హిజ్బుల్లా సీనియర్ నాయకుడు చేసిన మొదటి ప్రకటన సెప్టెంబర్ 30న వెలువడింది.

‘హసన్ స్థానంలో ఎవరు?’ అన్నదానిపై త్వరలో కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హిజ్బుల్లా ఉపనేత నయీమ్ ఖాసిం తెలిపారు.

‘‘యుద్ధం చాలాకాలం కొనసాగవచ్చు. మాకు ఆప్షన్లు చాలా ఉన్నాయి. ఇజ్రాయెల్ భూతల దాడులు మొదలు పెడితే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. విజయం మాదే. లెబనాన్ ప్రభుత్వానికి, ప్రజలకు ధన్యవాదాలు" అని ఆయన అన్నారు.

పెద్ద ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ హిజ్బుల్లా ఇంకా నిలబడే ఉందని, ఈ యుద్ధంలో ఎవరు మరణించినా ప్రతిఘటన ఇంకా బలంగా కొనసాగుతుందని తన మద్దతుదారులకు సందేశమివ్వాలని నయీమ్ ఖాసిం భావిస్తున్నారని బేరూత్‌లోని బీబీసీ కరస్పాండెంట్ నఫీసా కోహ్నావార్డ్ అభిప్రాయపడ్డారు.

అయితే, హిజ్బుల్లా మద్దతుదారులు కొందరిలో మాత్రం కాస్త నిరాశ నెలకొంది. బేరూత్‌లో నస్రల్లా ఫోటోను చూపిస్తూ ఓ వ్యక్తి, ‘‘ఇంకా చెప్పడానికి ఏం మిగిలి ఉంది? మా నాయకుడు లేరు. మేం అనాథలమయ్యాం’’ అన్నారు.

అయితే, హసన్ నస్రల్లా ఇంకా బతికే ఉన్నారని కొందరు నమ్ముతున్నారు. ‘‘ఇవి యుద్ధ వ్యూహాలు, హసన్ సజీవంగానే ఉన్నారు’’ అని 55 ఏళ్ల మహిళ జిహాన్ అన్నారు.

ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

నెతన్యాహు ఏమన్నారు?

లెబనాన్‌పై బాంబు దాడులు చేస్తూ ‘ఇది హిజ్బుల్లాపై చర్య’ అని చెబుతోంది ఇజ్రాయెల్. లెబనాన్‌లో రాజకీయంగా, సైనికంగా హిజ్బుల్లా ఒక బలమైన శక్తిగా ఉంది.

హమాస్, హిజ్బుల్లాలు రెండింటినీ 'ఉగ్రవాద సంస్థలు'గానే అభివర్ణిస్తోంది ఇజ్రాయెల్. ఈ రెండింటికీ ఇరాన్ నుంచి మద్దతు ఉంది.

హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే తెహ్రాన్‌లో హత్యకు గురయ్యారు. ఆ ఘటన తర్వాత ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం కనిపించింది.

ఇప్పుడు లెబనాన్‌లోని హిజ్బుల్లాపై దాడులు పెరగడంతో అందరి కళ్లూ ఇరాన్‌ వైపు మళ్లుతున్నాయి.

సెప్టెంబర్ 29 నుంచి యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది.

‘‘ఇజ్రాయెల్ చేసిన ఏ నేరపూరిత చర్యనూ వదిలిపెట్టేది లేదు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోదు, అలా అని యుద్ధానికి భయపడదు’’ అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసిర్ కనానీ అన్నారు.

పరిస్థితులను చూస్తుంటే ఇజ్రాయెల్ తన శత్రువులందరిపై యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

‘‘మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ చేరుకోలేని ప్రదేశం లేదు. మా దేశాన్ని, పౌరులను రక్షించడానికి మేం వెళ్ళలేని ప్రదేశం లేదు’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సెప్టెంబర్ 30 సాయంత్రం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు.

దీని గురించి మోదీ సోషల్ మీడియాలో వెల్లడించారు.

"పశ్చిమాసియాలో తాజా పరిస్థితుల గురించి ప్రధాని నెతన్యాహుతో మాట్లాడాను. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. ప్రాంతీయ ఉద్రిక్తతలను నివారించడం, బందీలందరినీ సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ కోసం తీసుకునే చర్యలకు భారత్ మద్ధతిస్తుంది’’ అని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్, హిజ్బుల్లా, హమాస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హిజ్బుల్లా, ఇజ్రాయెల్ పరస్పర దాడుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.

హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేస్తోంది?

గాజాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత హమాస్‌కు మద్దతుగా నిలిచింది హిజ్బుల్లా.

లెబనాన్ సరిహద్దు సమీపంలో ఉత్తర ఇజ్రాయెల్‌ ప్రాంతంపై హిజ్బుల్లా నిరంతరం రాకెట్ దాడులు చేస్తోంది. ఈ దాడుల కారణంగా, లెబనాన్ సరిహద్దుకు సమీపంలో నివసిస్తున్న వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది.

తమ పౌరుల భద్రత కోసం హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

మరోవైపు గాజా మీద ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు తమ దాడులు కొనసాగుతాయని హిజ్బుల్లా ప్రకటించింది.

అయితే, ప్రస్తుతం హమాస్ మీద దాడులు ఆగి, కేవలం హిజ్బుల్లా మీదే జరుగుతున్నాయి.

నిన్నమొన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న లెబనాన్ ఆకాశం ఇప్పుడు బాంబు పేలుళ్లతో నల్లని మేఘాలతో నిండి కనిపిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)