డేవిడ్స్ స్లింగ్: హిజ్బుల్లా క్షిపణుల నుంచి మొసాద్ ఆఫీసును రక్షించిన ‘మంత్రదండం’ ఇదేనా?

ఇజ్రాయెల్, డేవిడ్స్ స్లింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డేవిడ్స్ స్లింగ్ క్షిపణి వ్యవస్థ
    • రచయిత, ఉమాయిమా అల్షాజ్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ప్రధాన కార్యాలయంపై గత బుధవారం హిజ్బుల్లా ప్రయోగించిన క్షిపణిని ఇరాన్ తయారు చేసిన ఖాదిర్-వన్ బాలిస్టిక్ క్షిపణిగా భావిస్తున్నారు. అయితే, ఆ దాడిని డేవిడ్స్ స్లింగ్ వ్యవస్థ అడ్డుకుంది.

వాస్తవానికి ఖాదిర్-వన్ క్షిపణి 700 నుంచి 1,000 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఒక్క పేలుడుతో ఒక పెద్ద భవనం మొత్తాన్ని ధ్వంసం చేయగల సామర్ధ్యం దానికి ఉంది.

డేవిడ్స్ స్లింగ్ రక్షణ వ్యవస్థే హిజ్బుల్లా దాడి నుంచి తమను కాపాడిందని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి డేవిడ్ మాన్సర్ అన్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇజ్రాయెల్, డేవిడ్స్ స్లింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ తన డేవిడ్స్ స్లింగ్ వ్యవస్థను తయారు చేసింది.

ఏమిటీ డేవిడ్స్ స్లింగ్?

ఇజ్రాయెల్ మిలిటరీ ఆధ్వర్యంలోని పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఈ డేవిడ్స్ స్లింగ్‌ను డెవలప్ చేశారు.

సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో డేవిడ్స్ స్లింగ్ వ్యవస్థ పని చేయగలుగుతుందని, ఇది పేట్రియాటిక్ క్షిపణి పరిధికంటే ఎక్కువని సెంట్రల్ ఏషియా సైనిక వ్యవహారాలను పర్యవేక్షించిన అమెరికా హోంశాఖ మాజీ సలహాదారు కల్నల్ అబ్బాస్ దోహక్ బీబీసీతో అన్నారు.

ఇజ్రాయెల్‌ టెక్నాలజీని ట్రాక్ చేసే 21సి వెబ్‌సైట్ ప్రకారం, ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ మూడు లేయర్లుగా ఉంటుంది.

డేవిడ్స్‌ స్లింగ్ అనేది మధ్యస్థ శ్రేణి రక్షణ వ్యవస్థ అని, ఐరన్ డోమ్ తర్వాత ఇదే అత్యంత సక్సెస్‌ఫుల్ సిస్టమ్‌ అని ఇజ్రాయెల్ రక్షణ సంస్థ రాఫెల్ తెలిపింది.

డేవిడ్స్ స్లింగ్‌ను 'మీడియం టు లాంగ్‌రేంజ్ ఎయిర్ అండ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌’ అని కూడా అంటుంటారు.

‘‘డేవిడ్ అండ్ గోలియత్ కథలో అతి భారీకాయుడైన యోధుడు గోలియత్‌పై రాళ్ల వర్షం కురిపించేందుకు డేవిడ్ అనే యువకుడు వడిశెలను ఉపయోగించినట్లు బైబిల్‌లో ఉంది. వడిశెలతో రాయి విసరడాన్ని స్లింగ్ షాట్ అంటారు. అందుకే ఈ ఆయుధానికి డేవిడ్స్ స్లింగ్ అనే పేరు పెట్టారు’’ అని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.

ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పినదాని ప్రకారం, బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిస్సైల్‌ను అడ్డుకోవడానికి డేవిడ్స్ స్లింగ్‌ను తయారు చేశారు. మరోవైపు, ఐరన్ డోమ్ వ్యవస్థ స్వల్ప శ్రేణి క్షిపణులు, షెల్‌లను నాశనం చేస్తుంది.

డేవిడ్స్ స్లింగ్‌ను ఇజ్రాయెల్ కంపెనీ రాఫెల్, అమెరికన్ కంపెనీ రేథియోన్‌ కలిసి తయారు చేశాయని, 2017 నుంచి దీనిని ఉపయోగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది.

డేవిడ్స్ స్లింగ్‌ను 'మ్యాజిక్ వాండ్' అని కూడా పిలుస్తారు. అంటే ‘మంత్రదండం’ అని అర్ధం. ఇది 40 నుంచి 300 కిలోమీటర్ల దూరం నుంచి విసిరిన రాకెట్లు, క్షిపణి దాడులను వెంటాడగల సామర్థ్యం ఉంది.

మిస్సైల్ థ్రెట్ అనే వెబ్‌సైట్ ప్రకారం, డేవిడ్స్ స్లింగ్‌లో క్షిపణి లాంచర్, ఈఎల్ఎం 2084 రాడార్, ఆపరేటింగ్ సిస్టమ్, స్టన్నర్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు ఉన్నాయి.

ఒక్కో డేవిడ్స్ స్లింగ్ వ్యవస్థలో 12 క్షిపణులను అమర్చవచ్చు. ఈ వ్యవస్థలోని చాలా భాగాలు అమెరికాలో తయారయ్యాయి.

ఇజ్రాయెల్, డేవిడ్స్ స్లింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ పైచేయి సాధించడంలో డేవిడ్స్ స్లింగ్ కీలక పాత్ర అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.

అద్భుతమైన క్షిపణి

సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వెబ్‌సైట్ ‘మిస్సైల్ థ్రెట్’ ప్రకారం, ఇందులో ఉండే స్టన్నర్ మిస్సైల్ పొడవు 4.6 మీటర్లు. 15 కిలోమీటర్ల ఎత్తులో వెళ్లే ఏ రాకెట్‌ లేదా క్షిపణినైనా నాశనం చేయగల సామర్ధ్యం దీనికి ఉంది.

ఈ క్షిపణి ముందు భాగం డాల్ఫిన్ ఆకారంలో ఉంటుంది. దానిపై రెండు సెన్సార్లు ఉంటాయి. మొదటిది ఎలక్ట్రో ఆప్టికల్ ఇమేజరీ సెన్సార్ కాగా, రెండోది రాడార్ సీకర్.

డేవిడ్స్ స్లింగ్‌లో ఈఎల్ఎం 2084 మల్టీ మిషన్ రాడార్‌ అమర్చి ఉంది. ఇది విమానాలను, బాలిస్టిక్ టార్గెట్‌లను ట్రాక్ చేయగలదు. 474 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 1100 లక్ష్యాలను ఇది గుర్తించగలదు.

ఫైర్ కంట్రోల్ మిషన్ 100 కిలోమీటర్ల పరిధిలో ఒక నిమిషంలో 200 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు.

ఇజ్రాయెల్, హిజ్బుల్లా, డేవిడ్స్ స్లింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

డేవిడ్స్ స్లింగ్‌ను ఎప్పుడు తయారు చేశారు?

2006 లో డేవిడ్స్‌ స్లింగ్ సిస్టమ్‌ మీద పని చేయడం ప్రారంభించింది ఇజ్రాయెల్. ఇందుకోసం 2008 ఆగస్టులో అమెరికాతో ఒప్పందంపై సంతకం చేసింది.

కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ప్రకారం, 2006 మరియు 2020 మధ్య డేవిడ్స్ స్లింగ్‌ను తయారు చేయడానికి అమెరికా 2 బిలియన్ డాలర్ల( సుమారు రూ.16.6 వేల కోట్లు ) నిధులను కేటాయించింది.

అక్టోబర్ 2009లో, ఇజ్రాయెలీ కంపెనీ రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్ అంతర్జాతీయ క్షిపణులు, లాంచర్‌లను తయారు చేసేందుకు అమెరికన్ కంపెనీ రేథియాన్‌కు 10 కోట్ల డాలర్ల( సుమారు రూ. 830 కోట్లు)ను అందించింది.

సైనిక పరికరాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ డిఫెన్స్ న్యూస్ ప్రకారం ఇజ్రాయెల్ కంపెనీ రాఫెల్ మొదటిసారిగా డేవిడ్స్ స్లింగ్‌ను 2013లో పారిస్ ఎయిర్ షోలో ప్రదర్శించింది.

డేవిడ్స్ స్లింగ్‌ను 2012లో ఒక ఎడారిలో విజయవంతంగా పరీక్షించారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.

302 ఎంఎం రాకెట్లను, ఇరాన్ తయారుచేసిన ఫతా110 క్షిపణిని అడ్డుకోగల సమర్థత డేవిడ్స్ స్లింగ్‌కు ఉందని 2015లో డిఫెన్స్ న్యూస్ పత్రిక రిపోర్ట్ చేసింది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Israeli Ministry of Defense

ఇజ్రాయెల్ ఎప్పుడు ఉపయోగించింది?

జులై 2018లో గోలన్ హైట్స్ నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించడానికి డేవిడ్స్ స్లింగ్‌ను మొదటిసారి ఉపయోగించినట్లు ఇజ్రాయెల్ వార్తాపత్రికలు రిపోర్ట్ చేశాయి.

డేవిడ్స్ స్లింగ్‌ని ఉపయోగించి రెండు సిరియా ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ఇజ్రాయెల్ పేల్చేసిందని డిఫెన్స్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది.

డేవిడ్స్ స్లింగ్ ప్రయోగించిన క్షిపణిని స్వాధీనం చేసుకుని వాటిని తనిఖీ చేయడానికి రష్యాకు పంపింది సిరియా సైన్యం.

2023 మేలో కూడా డేవిడ్స్ స్లింగ్‌ను ఉపయోగించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. గాజా నుంచి వస్తున్న క్షిపణులను అడ్డుకోవడంలో ఐరన్ డోమ్ వ్యవస్థ విఫలమైనప్పుడు, దాని స్థానంలో డేవిడ్స్ స్లింగ్ రంగంలోకి దిగి వాటిని అడ్డుకోగలిగింది.

హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ, లెబనాన్ ప్రయోగించిన ప్రయోగించిన క్షిపణిని తమ దళాలు ధ్వంసం చేశాయని గత బుధవారం ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి డేవిడ్ మాన్సర్ చెప్పారు.

"టెల్ అవీవ్‌పై హిజ్బుల్లా ఉగ్రవాదులు క్షిపణిని ప్రయోగించడం ఇదే మొదటిసారి. అయితే ఇజ్రాయెల్ వాయు రక్షణ వ్యవస్థ డేవిడ్స్ స్లింగ్ దానిని విజయవంతంగా అడ్డుకుంది. దక్షిణ లెబనాన్‌లోని లాంచింగ్ ప్యాడ్‌లను కూడా ధ్వంసం చేసింది.’’ అని డేవిడ్ మాన్సర్ వెల్లడించారు.

డేవిడ్స్ స్లింగ్‌ సహా, ఇతర ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు హిజ్బుల్లా క్షిపణి దాడులను అడ్డుకోవడంలో విజయవంతమయ్యాయని కల్నల్ అబ్బాస్ దోహక్ కూడా అన్నారు.

"ఇది అనేక రాకెట్లను, డ్రోన్లను, మిసైళ్లను నాశనం చేసింది’’ అని అబ్బాస్ అన్నారు.

జోర్డాన్‌కు చెందిన సైనిక వ్యవహారాల నిపుణుడు బ్రిగేడియర్ జనరల్ ముసా అల్-కల్బ్ కూడా కల్నల్ అబ్బాస్ దోహక్‌తో ఏకీభవించారు.

డేవిడ్స్ స్లింగ్ సిస్టమ్ కారణంగా, 2006 యుద్ధంతో పోల్చితే ఇజ్రాయెల్ హిజ్బుల్లాపై పైచేయి సాధించిందని జనరల్ ముసా అన్నారు.

ఒకట్రెండు మిసైళ్లు డేవిడ్స్ స్లింగ్‌ను దెబ్బతీసి ఉండొచ్చని, అయితే వాటి ప్రభావం చాలా తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు.

హిజ్బుల్లా దగ్గర అంత ప్రభావవంతమైన ఆయుధాలు ఉన్నాయన్నది తనకు తెలియదని లేదని కల్నల్ అబ్బాస్ దోహక్ అన్నారు.

రష్యా సహాయంతో తయారు చేసిన జర్కున్ క్షిపణి హిజ్బుల్లా దగ్గర ఉందని తాను భావించడం లేదని జనరల్ ముసా చెప్పారు.

బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ట్రాక్ చేసి నాశనం చేయగల సామర్థ్యం ఉన్న డేవిడ్స్ స్లింగ్ ప్రపంచంలోని అత్యంత ఆధునిక ఆయుధాలలో ఒకటని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒకప్పుడు తెలిపింది.

ఇజ్రాయెల్, లెబనాన్, హిజ్బుల్లా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డేవిడ్స్ స్లింగ్

బలహీనతలు

ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో కొన్ని బలహీనతలు ఉన్నాయని.. కొన్ని సందర్భాలలో డేవిడ్స్ స్లింగ్‌ను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించేటప్పుడు శత్రువులు దాన్ని టార్గెట్ చేసి ధ్వంసం చేయొచ్చని జనరల్ ముసా అల్-కల్బ్ చెప్పారు.

సాంకేతిక కారణాల వల్ల ఐరన్ డోమ్‌ను ఉపయోగించినంతగా ఇజ్రాయెల్ తన డేవిడ్స్ స్లింగ్‌ను ఉపయోగించదని ముసా అల్-కల్బ్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)