హైదరాబాద్: శవయాత్రకు డప్పు కొట్టలేదని దళిత కుటుంబాన్ని బహిష్కరించిన ఊరి పెద్దలు

- రచయిత, అమరేంద్ర
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో శవయాత్రకు డప్పు కొట్టలేదని ఒక కుటుంబాన్ని వెలి వేశారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజీగూడ గ్రామంలో ఒక మాదిగ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తూ ఊరిపెద్దలు తీర్మానం చేశారు.
ఉన్నత చదువులు చదువుకుని తమకు నచ్చిన ఉద్యోగాలు చేసుకుంటున్న ఎస్సీ యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ ‘వెలి’ని అమలు చేశారు.
బీసీ కులస్తులే కాకుండా తోటి ఎస్సీ కులస్తులు కూడా ఈ ఘటనలో భాగస్వాములు కావడం కలకలం రేపింది.
దాదాపు 500 మంది జనాభా కలిగిన చిన్న గ్రామం గౌతోజీగూడ ఈ అనాగరిక చర్యతో వార్తల్లో నిలిచింది. ఈ గ్రామం హైదరాబాద్‌కు కేవలం 46 కిలోమీటర్ల దూరంలో ఉంది.
హైదరాబాద్-నాగ్‌పూర్ హైవే నుంచి దాదాపు ఆరు కిలోమీటర్లు లోపలికి ప్రయాణిస్తే, చుట్టూ పచ్చని చెట్లతో గొడుగు పట్టినట్లుగా ఉండే రోడ్డు మధ్యలోంచి వెళితే, గ్రామం ప్రారంభంలోనే అంబేడ్కర్ విగ్రహం కనిపిస్తుంది.
ఈ విగ్రహానికి వెనుక భాగంలోనే ఉంది సామాజిక బహిష్కరణకు గురైన బాధితుల ఇల్లు. పంచమి నర్సమ్మ, పంచమి అర్జున్, పంచమి చంద్రం కుటుంబం ఒక చిన్న పెంకుటింట్లో ఉంటున్నారు. ఊరిలోకి వెళ్లాలంటే ఈ ఇంటిని దాటుకునే వెళ్లాలి.


అసలేం జరిగిందంటే..
గౌతోజీగూడ గ్రామంలో ముదిరాజ్ కులానికి చెందిన రంగాయిపల్లి మల్లయ్య సెప్టెంబరు 3న చనిపోయారు. మృతుడి కుటుంబీకులు శవయాత్రలో డప్పు కొట్టాలని అదే గ్రామానికి చెందిన పంచమి చంద్రం కుటుంబాన్ని కోరారు.
అయితే చదువుకుని ఉద్యోగాలు చేస్తుండటంతో, కులవృత్తిని కొనసాగించలేక పంచమి చంద్రం డప్పు కొట్టే పనికి దూరంగా ఉంటున్నారు. అదే కారణంతో శవయాత్రకు డప్పు కొట్టనని చెప్పారు.
పంచమి చంద్రం ఉస్మానియా వర్సిటీ పరిధిలోని సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఎమ్‌కామ్ పూర్తి చేశారు. గతంలో పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగం చేశారు. ఆయన తమ్ముడు పంచమి అర్జున్ జేఎన్‌టీయూ-హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేసి, ప్రస్తుతం ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఊరిలో పీజీ పూర్తి చేసిన యువకులు వీరిద్దరేనని గ్రామస్థులు తెలిపారు.

వీరి తండ్రి శంకరయ్య డప్పు కొట్టే వృత్తిని నిర్వహించేవారు. అయితే, 2015లో ఆయన మరణించారు.
‘‘చిన్నప్పుడు నాన్న వెంట వెళ్లి డప్పు కొట్టేవాణ్ని. తర్వాత చదువుకుని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశాను. పెళ్లిళ్లు, శవయాత్రలు, పండుగల సమయంలో డప్పు కొట్టేందుకు సెలవులు పెడుతున్నానని నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు’’ అని 33 ఏళ్ల చంద్రం చెప్పారు.
గత ఐదారేళ్ల నుంచి డప్పు కొట్టడం మానేశానని చంద్రం తెలిపారు.
‘‘మా తరంలో ఎవరూ చదువుకోలేదు. కనీసం నా కొడుకులైనా చదువుకుంటే బాగుపడతారని అనుకున్నా. రోజూ హైదరాబాద్‌కు కూరగాయలు తీసుకెళ్లి అమ్ముకుని, ఆ డబ్బుతో నా పిల్లలను చదివించాను. మా ఆయన ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. ఆయనను చూసుకుంటూనే కుటుంబాన్ని నడిపించుకొచ్చాను’’ అని పంచమి నర్సమ్మ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
సామాజిక బహిష్కరణ, మాట్లాడితే జరిమానా
డప్పు కొట్టకపోవడంపై అసహనంతో ఉన్న ఊరి పెద్దలు సెప్టెంబరు పదో తేదీన గ్రామంలో ఓ సమావేశం నిర్వహించారు.
మాజీ సర్పంచ్ బొడ్డు వెంకటేశ్వర్లు, మాజీ ఉపసర్పంచ్ పంచమి రేణుకుమార్, ఇతర పెద్దలు, గ్రామస్తులు తమను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారని, మా వాదనేంటో కూడా వినలేదని పంచమి చంద్రం బీబీసీకి చెప్పారు.
‘‘సెప్టెంబరు పదో తేదీన పంచాయతీకి పిలిస్తే వెళ్లాం. డప్పు కొడతారా, లేదా అని అడిగితే, మేం కొట్టమని చెప్పాం. మా బదులు ఎవరికైనా ఆసక్తి ఉంటే కొట్టుకోవచ్చని చెప్పాం. అందుకు ఎవరూ ముందుకు రాలేదు’’
‘‘మా నాన్న ప్రస్తావన తీసుకొచ్చి మమ్మల్ని అవమానించారు. ‘మీ నాన్న కడుపులోనే కదా మీరు పుట్టారు, ఆయన డప్పు కొట్టినప్పుడు మీరు ఎందుకు కొట్టరు?’ అంటూ దూషించారు. డప్పు కొట్టకపోతే గ్రామం తరఫున మూడు గుంటల భూమి (మాన్యం కింద ఇచ్చిన పొలం) వెనక్కి ఇచ్చేయమని హుకుం జారీ చేశారు
‘‘మమ్మల్ని ఊరి నుంచి వెలి వేస్తున్నట్లు పంచాయతీలో తీర్మానం రాసుకున్నారు. ఎవరైనా మాతో మాట్లాడితే వాళ్లను వెలివేస్తామని, 5 వేల రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటించారు’’ అని చంద్రం ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘తీర్మానం చేసిన తర్వాత మాతో ఎవరూ మాట్లాడటం లేదు. తల పక్కకు తిప్పుకొని వెళ్లిపోతున్నారు. సరుకులు కూడా వేరే ఊరి నుంచి తెచ్చుకుంటున్నాం’’ అని పంచమి నర్సమ్మ అన్నారు.
‘‘మాతో చిన్నప్పట్నుంచి కలిసి మెలిసి ఉన్నవారే మమ్మల్ని దూరం పెడుతున్నారు. ఒక వ్యక్తి మాట్లాడినందుకు అతన్ని బాగా కొట్టారు. ఊళ్లో మాతో మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని అర్జున్ బీబీసీకి చెప్పారు.
పంచాయతీ తీర్మానం రాసిన పుస్తకం కాపీని బీబీసీ సంపాదించింది. దానిలో, పంచమి శంకరయ్య కుమారులు, అతని కుటుంబంతో గ్రామస్తులెవరూ మాట్లాడకూడదని రాసి ఉంది. దాని కింద 23 మంది సంతకాలున్నాయి. దాన్ని ఉల్లంఘించిన వాళ్లనూ బహిష్కరిస్తామని దానిలో రాశారు.
‘‘మా నాన్న చదువుకోలేదు కాబట్టి డప్పు కొట్టేవారు. ఇప్పుడు తరం మారింది. కులవృత్తులే చేయాలని మమ్మల్ని బలవంతం చేయడం ఎంతవరకు సమంజసం? మేం చదువుకుని పైకి ఎదగడం ఊళ్లో కొందరికి ఇష్టం లేకనే ఇదంతా చేశారు’’ అని పంచమి చంద్రం అన్నారు.

31 మందిపై కేసు నమోదు
ఈ సామాజిక బహిష్కరణపై సెప్టెంబరు పదో తేదీన మెదక్ ఎస్పీకి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా పంచమి అర్జున్ ఫిర్యాదు చేయగా, దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన సమాధానం ఇచ్చారు.
సెప్టెంబరు 11వ తేదీన పోలీసు, రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించారు. బాధితులు సెప్టెంబరు 12న దళిత సంఘాలు, మానవ హక్కుల వేదిక నాయకులతో కలిసి మనోహరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మొదట 19 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, తర్వాత బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు మరో 12 మంది పైనా కేసు నమోదు చేశారు.
మాజీ ఉప సర్పంచ్ రేణుకుమార్‌తో పంచమి చంద్రం కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా విభేదాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. వీరిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. రెండు కుటుంబాల ఇంటి పేరూ ఒక్కటే.
ఈ విభేదాల గురించి పంచమి అర్జున్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘మేం బాగా చదువుకోవడం అతనికి నచ్చలేదు. గ్రామంలో పీజీ చేసింది నేనూ, మా అన్నే. అతను మా కుటుంబాన్ని ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్నాడు. మాకు నాలుగేళ్లుగా నల్లా కనెక్షన్ ఇవ్వకుండా నిలిపివేశారు’’ అని తెలిపారు.
‘‘మేం వేరొక చోట ఇల్లు కట్టుకుంటే అక్కడ పనులు జరగకుండా, అనుమతులు రాకుండా నిలిపేశారు. పంచాయతీ పాలకవర్గం ముగియగానే మాకు అనుమతులు వచ్చాయి. అంతే కాకుండా పొలానికి వెళ్లే చోట ఇనుపకడ్డీలు అడ్డంగా పాతి, ఇబ్బందులు సృష్టించారు’’ అన్నారు అర్జున్.
బీబీసీ ఆ గ్రామాన్ని సందర్శించిన సెప్టెంబరు 28న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా ఆ గ్రామాన్ని సందర్శించింది.
బాధితులు కమిషన్‌తో తమ గోడు వెళ్లబోసుకోగా, అదే సమయంలో అప్పటికే ఈ కేసులో అరెస్టైన వారి కుటుంబసభ్యులు మాత్రం తమకే పాపం తెలియదని అన్నారు. మాజీ ఉప సర్పంచ్ రేణుకుమార్, బాధిత కుటుంబానికి ఉన్న వివాదాల కారణంగా ఈ ఘటన చినికిచినికి గాలివానగా మారిందని వాళ్లు అన్నారు.

మరి, సామాజిక బహిష్కరణ జరుగుతున్నప్పుడు ఎవరూ ఎందుకు అడ్డుకోలేదని బీబీసీ అక్కడున్న కొందరిని ప్రశ్నించింది. దీనికి కొందరు సమాధానం దాట వేయగా, మరికొందరు మాత్రం తప్పు జరిగిందని, సామాజిక బహిష్కరణ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
గ్రామానికి చెందిన సాహెబ్ అనే వ్యక్తి బీబీసీతో మాట్లాడుతూ, ‘‘కరోనా టైంలో చచ్చిపోయినా సరే, డప్పుతోనే శవయాత్ర చేశారు. ఇప్పుడు డప్పు లేకుంటే ఎలా? ఊరికి కూడా ఆచారం ఉంటుంది కదా? చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు వెళ్లి వాళ్ల (పంచమి చంద్రం) కుటుంబాన్ని బతిమిలాడినా వాళ్లు రాలేదు’’ అని అన్నారు.
సామాజిక బహిష్కరణ తప్పు కదా అన్న ప్రశ్నకు ఆయన, ‘‘అలా చేయడం తప్పే. వాళ్లకు అలాంటి శిక్ష వేయడం కరెక్టు కాదు’’ అన్నారు.
‘‘ఊరి పెద్దలు చదువుకోకపోవడం, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులపై అవగాహన లేకపోవడంతో ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. వాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చి ఊరిలో మున్ముందు ఎలాంటి వివాదాలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది’’ అని సాహెబ్ అన్నారు.

గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటున్నామని, ముదిరాజ్, ఎస్సీలు అనే భేదాలు లేవని గ్రామస్థురాలు అనిత చెప్పారు. ఇదే కేసులో పోలీసులు ఆమె భర్త గణేశ్‌ను అరెస్ట్ చేశారు.
‘‘వాళ్ల (పంచమి చంద్రం కుటుంబం) మీద మాకు పగలేదు. అందరం కలసిమెలిసి ఉంటున్నాం. సమస్య ఇంత పెద్దగా అవుతుందని అనుకోలేదు’’ అని అనిత అన్నారు.
మాజీ ఉపసర్పంచ్ రేణుకుమార్ మాటలు విని గ్రామస్థులంతా కేసులో ఇరుక్కున్నారని ఆమె బీబీసీతో అన్నారు.
ఈ విషయంపై వివరణ కోరేందుకు బీబీసీ మాజీ సర్పంచ్ బొడ్డు వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లగా, ఆ ఇంటికి తాళం వేసి ఉంది.
అలాగే బీబీసీ మాజీ ఉప సర్పంచ్ రేణుకుమార్ ఇంటికి వెళ్లగా, ఆయన కుటుంబీకులెవరూ కనిపించలేదు. బంధువులు ఉన్నప్పటికీ, బీబీసీతో మాట్లాడేందుకు నిరాకరించారు.

కుట్ర కోణంలో విచారణ: ఎస్సీ, ఎస్టీ కమిషన్
ఈ ఘటనలో బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బీబీసీకి చెప్పారు. ఇందులో ఎస్సీల పాత్ర కూడా ఉందని తెలిసిందన్నారు.
‘‘ఒక కుటుంబం చదువుకుని ముందుకు వెళుతుంటే, వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి బీసీలు, ముదిరాజ్‌లూ సహకరించారు. దీనిలో కుట్ర కోణం ఉందని మాకు తెలిసింది. పకడ్బందీగా విచారణ చేసి నిందితులను అరెస్టు చేయాలని పోలీసులను కోరాం’’ అని వెంకటయ్య అన్నారు.

ఫొటో సోర్స్, UGC
మరోవైపు, తమకు ప్రాణహాని ఉందంటూ పంచమి చంద్రం సెప్టెంబరు 18న హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు, బాధితులకు రక్షణ కల్పించాలని, సామాజిక బహిష్కరణ అమలు చేయకుండా, దాన్ని ఊరిలో బహిరంగంగా ప్రకటించాలని సెప్టెంబరు 21న ఆదేశించింది.
దీనికి అనుగుణంగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సెప్టెంబరు 23న గ్రామంలో సదస్సు నిర్వహించారు.
మెదక్ కలెక్టర్ బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ఈ ఘటనపై గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించాం. బాధితులకు నల్లా కనెక్షన్ వంటి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ముందుముందు బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తాం’’ అని హామీ ఇచ్చారు.
కలెక్టర్, ఎస్పీ వచ్చి అవగాహన సదస్సు నిర్వహించిన తర్వాత కూడా ఊళ్లో పరిస్థితులు అలాగే ఉన్నాయని బాధితులు అంటున్నారు.
‘‘గతంలో ఉన్నట్లు మాతో కలివిడిగా ఉండటం లేదు. దీనికి బాధ్యులైన వాళ్లకి తప్పకుండా శిక్ష పడితేనే భవిష్యత్తు తరాలకు ఇలా జరగకుండా ఉంటుంది’’ అని పంచమి చంద్రం అన్నారు.

ఈ కేసు విషయంలో 26 మందిని అరెస్టు చేసినట్లు మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ ఎస్.వెంకట్ రెడ్డి బీబీసీకి చెప్పారు.
‘‘బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సర్పంచ్ బొడ్డు వెంకటేశ్వర్లు సహా 26 మందిని అరెస్టు చేశాం. ఐదుగురు పరారీలో ఉన్నారు, వాళ్లనూ త్వరలో అరెస్టు చేస్తాం. పోలీసులు బాధితులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు’’ అని తెలిపారు.
కులంతో సంబంధం లేకుండా తప్పు చేసిన వారందరికీ శిక్ష పడేలా చూస్తామని మనోహరాబాద్ ఎస్ఐ బి.సుభాష్ గౌడ్ అన్నారు.
‘‘బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేశాం. మాజీ ఉప సర్పంచ్ రేణుకుమార్ వ్యక్తిగత కక్షలతో డప్పు వివాదాన్ని ముందుకు తీసుకొచ్చి బహిష్కరణ విధించారు. దానిలో గ్రామస్తులందరినీ భాగస్వాములు చేయడంతో వారంతా నిందితులుగా మారారు’’ అని సుభాష్ గౌడ్ అన్నారు.
కాగా, తరతరాలుగా కొనసాగుతున్న కులవ్యవస్థకు ఈ ఘటన అద్దం పడుతోందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ బీబీసీతో అన్నారు. కేవలం అధిపత్య కులాలే కాకుండా ఎస్సీలు కూడా ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు.
హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఇలాంటి ఘటన జరగడం ఏ అభివృద్ధికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
‘‘ఆ కుటుంబానికి రక్షణ లేదు. హైకోర్టు చెబితే గానీ కలెక్టర్, ఎస్పీ గ్రామానికి వెళ్లి అవగాహన కల్పించలేదు. అరెస్టు అయిన వాళ్ల కుటుంబ సభ్యులు, బాధితులను లక్ష్యంగా చేసుకుని దూషిస్తున్నారు. బాధిత కుటుంబానికి అవసరమైన రక్షణ కల్పించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














