మీ పిల్లలు మొబైల్‌ను దగ్గరగా పెట్టుకుని చూస్తున్నారా?

హ్రస్వదృష్టి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫిలిప్పా రాక్స్‌బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పిల్లల కంటి చూపు క్రమంగా క్షీణిస్తోంది. ఇప్పుడు ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరికి హ్రస్వదృష్టి ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమస్య ఉన్నవారు దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు, దూరంగా ఉన్నవాటిని స్పష్టంగా చూడలేరు.

కోవిడ్ లాక్‌డౌన్‌ చాలామంది కంటి చూపుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని పరిశోధకులు అంటున్నారు. పిల్లలు ఆ సమయంలో ఆటలాడటం తగ్గిపోయి, ఎక్కువ సమయం స్క్రీన్‌లను చూస్తూ గడిపారని వాళ్లు తెలిపారు.

హ్రస్వదృష్టి లేదా మయోపియా అనే సమస్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. 2050 నాటికి ఇది కోట్ల మంది పిల్లలపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది.

హ్రస్వదృష్టి సమస్య ఎదుర్కొంటున్నవారిలో అత్యధికులు ఆసియాలో ఉన్నారు. జపాన్‌లో 85 శాతం, దక్షిణ కొరియాలో 73 శాతం మంది పిల్లలు హ్రస్వదృష్టితో బాధ పడుతుండగా; చైనా, రష్యాలలో ఇది 40 శాతం కంటే ఎక్కువ ఉంది.

పరాగ్వే, యుగాండాలలో అతి తక్కువగా కేవలం 1 శాతం మంది పిల్లలే దీని బారిన పడగా; యూకే, ఐర్లాండ్, అమెరికాలలో దాదాపు 15 శాతం మందికి మయోపియా ఉన్నట్లు అంచనా.

బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో ఈ అధ్యయన రిపోర్టు ప్రచురితమైంది. మొత్తం ఆరు ఖండాల్లోని 50 దేశాలకు చెందిన 50 లక్షల మందికి పైగా పిల్లలు, టీనేజర్లపై పరిశోధన నిర్వహించారు.

1990 -2023 మధ్య కాలంలో, పిల్లల్లో హ్రస్వదృష్టి మూడు రెట్లు పెరిగి, 36 శాతానికి చేరినట్లు గుర్తించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ పెరుగుదల ఎక్కువగా ఉందని పరిశోధకులు అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కళ్లద్దాలు ధరించిన చిన్నారి

ఫొటో సోర్స్, Getty Images

2050 నాటికి సగం మంది టీనేజర్లపై ప్రభావం

హ్రస్వదృష్టి సాధారణంగా ప్రాథమిక పాఠశాలలో చదివేటప్పుడు మొదలై, దాదాపు 20 సంవత్సరాల వయసులో కంటి పెరుగుదల ఆగిపోయే నాటికి తీవ్రంగా మారుతుంది.

దీనికి చాలా కారణాలు ఉన్నా, తూర్పు ఆసియా వాసులకు ఇది ఎక్కువగా వస్తోందని గుర్తించారు.

దీనికి జన్యుశాస్త్రంతోనూ సంబంధం ఉంది. అలాగే సింగపూర్, హాంకాంగ్ వంటి ప్రదేశాలలో పిల్లలు తమ విద్యను చిన్న వయసులోనే (రెండు సంవత్సరాలు) ప్రారంభించడం లాంటి ఇతర అంశాలూ ఉన్నాయి. దీనర్థం, వాళ్లు చిన్న వయసులోనే పుస్తకాలు, స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది కంటి కండరాలను దెబ్బతీసి, మయోపియాకు దారి తీస్తుందని ఈ పరిశోధన చెబుతోంది.

ఆఫ్రికాలో పాఠశాల విద్య ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది, అందువల్ల ఆసియాలో కంటే అక్కడ మయోపియా కేసులు చాలా తక్కువ.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువ కాలం ఇంట్లోనే గడపాల్సి వచ్చినప్పుడు పిల్లలు, టీనేజర్ల కంటి చూపు దెబ్బతిన్నదని పరిశోధకులు చెప్పారు.

2050 నాటికి, ప్రపంచవ్యాప్తంగా మయోపియా సగానికి పైగా మంది టీనేజర్లను ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధన అంచనా వేసింది.

హ్రస్వదృష్టి

ఫొటో సోర్స్, Getty Images

బాలురతో పోలిస్తే, బాలికలలో మయోపియా ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని అధ్యయనం సూచించింది. దీనికి కారణం వాళ్లు పెరిగేకొద్దీ ఇంట్లో, పాఠశాలలో బయట తిరగడం, ఆడుకోవడం తగ్గడం.

బాలురతో పోలిస్తే బాలికల ఎదుగుదల, అభివృద్ధి ముందుగానే మొదలవుతుంది, అందువల్ల వారికి చిన్న వయసులోనే హ్రస్వదృష్టి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

2050 నాటికి మిగతా ఖండాలతో పోలిస్తే ఆసియాలో అత్యధిక స్థాయిలో (దాదాపు 69 శాతం) మయోపియా ఉంటుందని అంచనా వేసినా, అభివృద్ధి చెందుతున్న దేశాలలోనూ ఇది 40 శాతానికి చేరుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

హ్రస్వదృష్టి సంకేతాలు ఏమిటి?

  • పాఠశాలలో వైట్‌బోర్డ్‌పై ఉన్న అక్షరాలను చదవలేకపోవడం, పదాలను దూరం నుంచి చదవలేకపోవడం
  • టీవీ లేదా కంప్యూటర్‌కు దగ్గరగా కూర్చోవడం లేదా మొబైల్ ఫోన్/టాబ్లెట్‌ను ముఖానికి దగ్గరగా పెట్టుకోవడం
  • తరచుగా తలనొప్పి రావడం
  • కళ్ళను బాగా రుద్దుకోవడం
హ్రస్వదృష్టి

ఫొటో సోర్స్, iStock

పిల్లల కంటి చూపును ఎలా కాపాడుకోవాలి?

హ్రస్వదృష్టి వచ్చే అవకాశాన్ని తగ్గించడానికి పిల్లలు, ముఖ్యంగా 7-9 ఏళ్ల మధ్య వయసు పిల్లలు, రోజూ కనీసం రెండు గంటలు బయట గడపాలని బ్రిటన్ కంటి నిపుణులు అంటున్నారు.

సహజమైన సూర్యకాంతి, ఆరుబయట చేసే వ్యాయామం, లేదా పిల్లలు దూరంగా ఉన్న వస్తువులపై దృష్టి కేంద్రీకరించడం అన్నవి మయోపియాపై ప్రభావం చూపుతాయా లేదా అన్నది స్పష్టంగా తెలియదు.

"బయట ఆడుకోవడం వల్ల పిల్లలకు చాలా ప్రయోజనం ఉంటుంది’’ యూకే కాలేజ్ ఆఫ్ ఆప్టోమెట్రిస్ట్స్‌కు చెందిన క్లినికల్ అడ్వైజర్ డేనియల్ హార్డిమాన్-మెక్‌కార్ట్నీ అన్నారు.

దానికి తోడు, తల్లిదండ్రులు చిన్న వయసులో పిల్లలకు కంటిపరీక్షలు చేయించినా, వాళ్లకు ఏడు నుంచి 10 ఏళ్ల వయసులో మళ్లీ కంటి పరీక్షలు చేయించడం మేలని ఆయన చెబుతున్నారు.

తల్లిదండ్రులు తమ కుటుంబంలో ఎవరికైనా హ్రస్వదృష్టి ఉందేమో అని కూడా గమనించాలి. తల్లిదండ్రులకు హ్రస్వదృష్టి ఉంటే, మిగతావారితో పోలిస్తే వారి పిల్లలకు హ్రస్వదృష్టి వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ.

హ్రస్వదృష్టిని పూర్తిగా నయం చేయలేం కానీ, అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో సరిచేయవచ్చు.

ప్రత్యేక లెన్సులు చిన్న పిల్లలలో కన్ను భిన్నంగా పెరగడాన్ని ప్రోత్సహించి, మయోపియా పెరగడాన్ని తగ్గిస్తాయి, కానీ అవి ఖరీదైనవి. ఈ ప్రత్యేక లెన్స్‌లు ఆసియాలో బాగా ప్రాచుర్యం పొందాయి.

హ్రస్వదృష్టి రేటు అధికంగా ఉంటే, వృద్ధాప్యంలో అసాధారణ కంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)