సోమనాథ్ కూల్చివేతలు: ‘బుల్డోజర్ వచ్చి అంతా నాశనం చేసింది, మాకు కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు’

ఫొటో సోర్స్, PAVAN JAISHWAL
- రచయిత, రాక్సీ గగ్డేకర్ చారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
శనివారం తెల్లవారుజామున గుజరాత్‌లో సోమనాథ్ ఆలయం సమీపంలోని ‘ఆక్రమణ’లను తొలగించే మెగా డ్రైవ్‌ను ప్రారంభించినప్పుడు, 40 ఏళ్ల ఇస్మాయిల్ మన్సూరి సర్వం కోల్పోయినట్లు కనిపించారు.
కూల్చివేతలు ప్రారంభం కాగానే తమ కుటుంబం హడావుడిగా వెళ్లిపోవాల్సి వచ్చిందని, ఇంట్లోని వస్తువులను కూడా తీసుకెళ్లలేకపోయామని మన్సూరి చెప్పారు.
కూల్చివేత తర్వాత ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడుతూ.. “ప్రస్తుతం మేం కట్టుబట్టలతో మిగిలాము. మిగతావన్నీ కూల్చేశారు లేదా తీసుకెళ్లిపోయారు’’ అని మన్సూరి చెప్పారు.
కూల్చివేత జరిగిన గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రభాస్ పటాన్ ప్రాంతంలో ఉన్న 'బాబా హాజీ మంగ్రోలీ షా' దర్గా మన్సూరి కుటుంబం పర్యవేక్షణలో ఉండేది. ఈ దర్గా శతాబ్దాల నాటిదని, భారత పురావస్తు శాఖ దీనిని రిజిస్టర్ చేసిందని వాళ్లు పేర్కొన్నారు.
ఈ వాదనను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించుకోలేకపోయింది.

గత శనివారం (సెప్టెంబర్ 28) ప్రారంభమైన ఈ డ్రైవ్, గుజరాత్ సహా దేశం అంతటా చర్చనీయాంశమైంది.
ఈ డ్రైవ్‌లో భాగంగా రెండు కిలోమీటర్ల పరిధిలో ‘ఆక్రమణలను’ తొలగించామని అధికారులు చెప్పారు. వీటిలో మసీదులతో సహా తొమ్మిది పెద్ద మతపరమైన ప్రదేశాలు, మూడు చిన్న మతపరమైన స్థలాలు, 45 పక్కా ఇళ్లు ఉన్నాయి.
జిల్లా కలెక్టర్ దిగ్విజయ్‌సింగ్ జడేజా వెల్లడించిన వివరాల ప్రకారం, సోమనాథ్ ఆలయ పరిసరాల్లోని 102 ఎకరాల స్థలంలో ‘అక్రమ’ నిర్మాణాలను తొలగించారు.
ఏఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం, మతపరమైన పురాతన ప్రదేశాలు, ఈద్గాలు, హాజీ మంగ్రోలీ షా దర్గాను అక్రమంగా కూల్చివేశారని ఆరోపిస్తూ సమస్త్ పట్నా ముస్లిం జమాత్ సుప్రీంకోర్టులో కేసు వేసింది.
ఒక వైపు, అధికారులు ఈ డ్రైవ్‌ను 'చట్టపరమైన చర్య' అని సమర్థించుకుంటుండగా, మరోవైపు మైనారిటీ వర్గాల ఆస్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అయితే, వారికి నోటీసులు జారీ చేశామని, అయితే ఆ నిర్మాణాల తొలగింపుకు నివాసితులు సుముఖంగా లేరని, అందువల్ల కూల్చివేత మినహా వేరే మార్గం లేకపోయిందని జిల్లా కలెక్టర్ దిగ్విజయ్‌సింగ్ జడేజా చెప్పారు.

ఫొటో సోర్స్, PAVAN JAISHWAL
ఈ డ్రైవ్‌లో హాజీ మంగ్రోలీ షా సహా కొన్ని దర్గాలు, మసీదులు, పక్కా ఇళ్లు కూల్చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
‘‘చట్టపరమైన ప్రక్రియను అనుసరించి రూ. 320 కోట్ల విలువైన భూమిని క్లియర్ చేశాం’’ అని కలెక్టర్ దిగ్విజయ్‌సింగ్ జడేజా తెలిపారు.
పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, కూల్చివేత ప్రక్రియను అడ్డుకున్నారంటూ 80 మందిని, సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్‌లు వ్యాప్తి చేశారంటూ మరో 8 నుంచి10 మందిని అరెస్టు చేశారు.
హాజీ మంగ్రోలి షా దర్గా హిందూ, ముస్లింలు ఇద్దరికీ పవిత్రమైనదని స్థానికులు తెలిపారు. శతాబ్దాల నాటి ఈ దర్గాను కూల్చివేయడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్గా ధ్వంసం కావడంతో స్థానికులు మూడు రోజుల పాటు దుకాణాలను మూసివేశారు.
ఈ ఆపరేషన్‌లో షా సిలార్ దర్గా, గరీబ్ షా దర్గా, జాఫర్ ముజఫర్ దర్గాలతో సహా తొమ్మిది దర్గాలను కూల్చివేశారు.
“మేం జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి”
తమ జీవితాన్ని తిరిగి కొత్తగా ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇస్మాయిల్ మన్సూరి అన్నారు. తమలాగే ఇంకా చాలామంది పరిస్థితి కూడా ఇలాగే అయ్యిందని చెప్పారు.
కూల్చివేసిన దర్గాలను సుమారు 25 కుటుంబాలు పర్యవేక్షిస్తుండేవి. దర్గాలకు వచ్చే భక్తుల కోసం దాదాపు 40 గదులు నిర్మించారు.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని బాధితుడు ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, “ప్రస్తుతం, మేము మా బంధువుల ఇంట్లో ఉంటున్నాం. మేం ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థలం లేదు’’ అన్నారు.
గిర్ సోమనాథ్ జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రజలలో కూడా ఈ కూల్చివేతలపై 'అసంతృప్తి' పెల్లుబుకుతోంది.
కూల్చివేత జరిగిన ప్రదేశానికి సమీపంలో నివసించే వాలి మహ్మద్ నఖ్వా, కూల్చివేత తర్వాత పరిస్థితిని వివరిస్తూ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
‘‘హాజీ మంగ్రోలీ షా సమాధి ఐదు శతాబ్దాల నాటిది. ఏటా దాని పెయింటింగ్ కోసం మాకు ఏఎస్ఐ నుంచి రూ.1,200 వచ్చేవి’’ అని ఆయన చెప్పారు.
ఏఎస్ఐ ఈ సమాధికి నిధులను అందించేదో లేదో అన్న విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించుకోలేకపోయింది.
“మా వారసత్వం, మా వర్తమానం, మా చరిత్రనంతా తుడిచేశారు. అదీ మేం ఎలాంటి తప్పు చేయకుండానే’’ అని వాలి మహ్మద్ అన్నారు.

ఫొటో సోర్స్, DILIP MORI
భారీగా పోలీసుల మోహరింపు, సోషల్ మీడియాపై డేగ కన్ను

కూల్చివేతల డ్రైవ్ కోసం అదనపు పోలీసు బలగాల ఆవశ్యకత గురించి బీబీసీ ప్రశ్నించగా, గిర్ సోమనాథ్ పోలీసు చీఫ్ మనోహర్‌సింగ్ జడేజా మాట్లాడుతూ, “ఇది ఒక రొటీన్ ఎక్సర్‌సైజ్. గత కొన్ని నెలల్లో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టడం ఇది మూడోసారి. రెవెన్యూ శాఖ ఈ డ్రైవ్ కోసం అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుని, పోలీసుల సహాయం కావాలని కోరింది’’ అని తెలిపారు.
ఈ కూల్చివేతల సందర్భంగా, శుక్రవారం నుంచి సోమవారం వరకు జిల్లాలో 1,400 మందికి పైగా పోలీసులను, పారామిలటరీ సిబ్బందిని మోహరించారు. జిల్లా మొత్తం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 189 (సీఆర్‌పీసీ 144) విధించారు.
పోలీసులు స్థానికుల మెసేజ్‌లను, సోషల్ మీడియా పోస్టులనూ, వాట్సాప్ గ్రూపులనూ నిశితంగా పరిశీలిస్తున్నారు.
సోమనాథ్ ఆలయ సమీపంలోని పురాతన ఆస్తులపై వివాదం
తొలగించిన నిర్మాణాలు ప్రసిద్ధ సోమనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఉన్న భూమి ఆలయ ట్రస్టుకు చెందినదని అంటున్నారు.
“ఇది రెండు ట్రస్ట్‌ల మధ్య ఉన్న విషయం అని, దానిని క్రమబద్ధీకరించడానికి మాకు అనుమతి ఉందని అధికారులకు చెప్పాం. అయినా, వాళ్లు మా ఆస్తులను కూల్చివేయడానికే నిర్ణయించుకున్నారు’’ అని స్థానిక నాయకుడు అబ్బాస్ భాయ్ చెప్పారు.
శనివారం ఉదయం కూల్చివేత డ్రైవ్ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్న ముస్లిం నాయకులలో అబ్బాస్ భాయ్ కూడా ఉన్నారు.
“అధికారులు మమ్మల్ని కలిసి, ఈ సమస్యపై చర్చించాలనుకుంటున్నట్లు చెప్పారు. కానీ వాళ్లు నా ఫోన్ లాక్కొని, నన్ను అదుపులోకి తీసుకుని వెంటనే బుల్డోజర్లతో కూల్చివేత ప్రారంభించారు’’ అని ఆయన ఆరోపించారు.
అయితే, కూల్చివేతకు ముందు స్థానిక నేతలతో చర్చలు జరిపామని, వాళ్లను ఒప్పించాకే ఈ డ్రైవ్ ప్రారంభించామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ చర్యలను అడ్దుకోవడం సరైంది కాదనే ఆలోచనతోనే స్థానిక నాయకులు డ్రైవ్‌ను నిలువరించలేదని, ఫలితంగా హాజీ మంగ్రోలీ షా సమాధి, ఇతర దర్గాలు నేలమట్టం అయ్యాయని అబ్బాస్ భాయ్ అన్నారు.
‘‘రెవెన్యూ రికార్డుల ప్రకారం హాజీ మంగ్రోలీ షా సమాధి ఉన్న స్థలాన్ని జునాగఢ్ రాష్ట్రం 1924 ఫిబ్రవరి 18న కేటాయించింది’’ అని మైనారిటీ సమన్వయ కమిటీ కన్వీనర్ ముజాహీద్ నఫీస్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
గుజరాత్ హైకోర్టుతో పాటు వక్ఫ్ బోర్డ్‌లో పలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, తీర్పు వెలువడకముందే కూల్చివేత కార్యక్రమం చేపట్టారని ఆయన ఆరోపించారు.
అయితే, బీబీసీ గుజరాతీ ఈ వాదనను స్వతంత్రంగా ధృవీకరించుకోలేకపోయింది.

తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
ఈ నిర్మాణాల తొలగింపునకు సంబంధించిన కేసుపై గుజరాత్ హైకోర్టులో మంగళవారం (అక్టోబర్ 1న) అత్యవసర విచారణ జరిగింది.
ఈ స్థలంపై యథాతథ స్థితిని కొనసాగించాలని పిటిషన్ వేసిన ఔలియా-ఇ-దీన్ కమిటీ కోరింది.
కమిటీ తరఫు న్యాయవాది సాకిబ్ అన్సారి, ఆయన తరఫు న్యాయవాది మిరల్ ఠాకోర్ మాట్లాడుతూ, ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఏదైనా ప్రభుత్వ స్థలంలో ఉంటే కానీ, తగిన అధికారం ఉన్న న్యాయస్థానం ఆదేశిస్తే తప్ప ఏ నిర్మాణాన్ని కూల్చివేయకూడదు’’ అని కోర్టుకు తెలిపారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ, 1951లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ భూమి ప్రభుత్వ స్థలం అని, ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఆ ఆక్రమణలను తొలగించిందని అన్నారు.
దర్గా చుట్టూ ఉన్న చిన్న గదులు లేదా ముసాఫిర్ ఖానాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారని, న్యాయవాది ఠాకూర్ వాదించారు. అంతే తప్ప హాజీ మంగ్రోలి దర్గా, శ్మశాన వాటిక కూల్చివేతకు సంబంధించి ఒక్క నోటీసూ జారీ చేయలేదన్నారు.
అధికారులు ఇప్పటికే నిర్మాణాన్ని కూల్చివేశారని, ఇప్పుడు సమస్యను పరిష్కరించే వరకు కూల్చివేసిన నిర్మాణం చుట్టూ గోడను నిర్మించడానికి అనుమతించవద్దని అన్సారీ కోరారు.
అయితే, ఫెన్సింగ్ పూర్తయిందని, ఆ భూమిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.
ఈ కేసులో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














