కోల్డ్‌ప్లే: టికెట్ రూ. 9 లక్షలు.. నిమిషాల్లో ‘సోల్డ్ అవుట్’

కోల్డ్‌ప్లే రాక్‌బాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోల్డ్‌ప్లే జనవరిలో ముంబయిలో ప్రదర్శన ఇవ్వనుంది
    • రచయిత, చెరిలాన్ మొలన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తొమ్మిది లక్షల రూపాయలతో మనం సాధారణంగా ఏం చేస్తాం? అంటే ఏం కొనుక్కుంటాం? ఓ కారు కొనుక్కుంటామా...ప్రపంచమంతా చుట్టొస్తామా? వజ్రాభరణాలు కొనుగోలు చేస్తామా? లేక కోల్డ్‌ప్లే కాన్సర్ట్ టికెట్ కొంటామా?

బ్రిటిష్ రాక్ బాండ్ కోల్డ్‌ప్లే ప్రపంచ టూర్‌లో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో మూడు ప్రదర్శనలు ఇవ్వనుంది. అందులో ముంబయి వేదికగా ఓ ప్రదర్శన ఉండనుంది.

ఈ షోలకు సంబంధించి అధికారికంగా టికెట్లు విక్రయించే అవకాశం ‘బుక్ మై షో’కు దక్కింది.

అయితే బుక్ మై షోలో నిమిషాలలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.

ఆ తరువాత కొన్ని రీసెల్లింగ్ ప్లాట్‌ఫాంలలో ఊహించనంత ధరకు ఇవి మళ్లీ అమ్ముడయ్యాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయిదు రెట్లు ఎక్కువ ధరకు రీసేల్

బుక్‌ మై షోలో ఇటీవల ఈ టికెట్ల అమ్మకాలు జరిగాయి. ఒక్కో టికెట్ ధర రూ.2,500 నుంచి రూ. 12,000 ఉండగా మొత్తం 1,80,000 టికెట్ల కోసం కోటి మందికి పైగా పోటీ పడ్డారు.

టికెట్ల కోసం గంటలపాటు నిరీక్షించాల్సిరావడం, సైట్ క్రాష్ అవ్వడం వంటివాటిపై అభిమానులు ఫిర్యాదులు చేశారు.

అయితే టికెట్లను అధికారిక సైట్‌లో విక్రయించడానికి ముందే రీ సెల్లర్‌లు ఒక్కో టికెట్‌ను అయిదు రెట్లు ఎక్కువ ధరకు అమ్మడం ప్రారంభించారని.. దీంతో టికెట్ ధర రూ. 9,00,000ను సైతం తాకిందని అనేకమంది ఆరోపించారు.

ఈ నెల ప్రారంభంలో బ్రిటన్‌లోని ఒయాసిస్ కన్‌సర్ట్ టికెట్ల విషయంలోనూ ఇలాగే జరిగింది.

ఒక్కో టికెట్ ధర 135 పౌండ్లు( సుమారు రూ.15,000) ఉండగా, రీసెల్లర్లు దాన్ని 350 పౌండ్లకు పైగా (సుమారు రూ.39,000 ) ధరకు అమ్మారు.

వాటితో పోలిస్తే కోల్డ్‌ప్లే టికెట్లు ఇంకా ఎక్కువ ధరకు విక్రయమయ్యాయి.

ఈ ఈవెంట్‌తో భారత్‌లో టికెట్ల రీసెల్లింగ్‌పై చర్చ మొదలయింది.

రీసెల్లింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో టికెట్లు మళ్లీ అమ్ముకునేందుకు కొందరు బోట్స్ లేదా ఆటోమేషన్ టూల్స్‌ ఉపయోగించి అనేక టికెట్లు కొంటున్నారు. దీన్ని అడ్డుకునేందుకు అధికారిక సైటు తగిన చర్యలు తీసుకోవాలని, లేదా ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని అభిమానులు కోరుతున్నారు.

కోల్డ్‌ప్లే షో టికెట్లు

ఫొటో సోర్స్, Dwayne Dias

ఫొటో క్యాప్షన్, డ్వేన్ డియాస్(ఎడమ), ఆయన స్నేహితుడు కోల్డ్‌ప్లే ప్రదర్శన చూసేందుకు సింగపూర్ వెళ్లారు.

రీసెల్లింగ్‌తో తమకు సంబంధం లేదన్న బుక్ మై షో

రీసెల్లర్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని బుక్ మై షో తెలిపింది. విశ్వసనీయత లేని ప్లాట్‌ఫాంల నుంచి టికెట్లు కొనడం మానుకోవాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. అవి నకిలీవి అయ్యుండొచ్చని చెప్పింది.

పంజాబీ సింగర్ దిల్జీత్ షో టికెట్ల విషయంలోనూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని అభిమానులు ఫిర్యాదుచేశారు.

ప్రదర్శన ప్రమోటర్ అయిన జొమాటోలో ఈ నెల మొదట్లో టికెట్లు విడుదల చేయగా, అవన్నీ అమ్ముడుపోయాయి. తర్వాత అసలు ధర కన్నా కొన్ని ఎక్కువరెట్లు ధరతో అవి రీసెల్లింగ్ ప్లాట్‌ఫామ్‌లపై అమ్ముడుపోవడం మొదలయింది.

టికెట్లను మళ్లీ మళ్లీ అమ్మడం భారత్‌లో అక్రమమైనప్పటికీ అది జరగుతోందని నిపుణులు చెప్పారు.

అధికారిక సైట్ నుంచి కోల్డ్ ప్లే టికెట్లు దక్కించుకున్నవారిలో గ్రాఫిక్ డిజైనర్ డ్వేన్ డియాస్ ఒకరు. ఒక్కో టికెట్‌కు రూ. 6,450 చెల్లించి ఆయన నాలుగు టికెట్లు కొన్నారు.

టికెట్లు కొన్నప్పటినుంచి ఎంతోమంది డియాస్‌ను సంప్రదించారు. ఒక్కో టికెట్‌కు రూ. 60 వేలు చెల్లించేందుకు వారు సిద్ధమయ్యారు.

కోల్డ్‌ప్లే షో టికెట్లు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారత్‌లో ప్రదర్శనలిచ్చిన షీరన్

ఏడాదిలో రూ. 800 కోట్ల ఆదాయం

ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనల టికెట్లకు భారీ స్థాయిలో డిమాండ్ ఉండడం అసహజమేమీకాదు.

ఇటీవల కాలంలో లైవ్ మ్యూజిక్ వ్యాపారం భారత్‌లో భారీగా పెరుగుతోంది.

ఓ నివేదిక ప్రకారం గత ఏడాది మ్యూజిక్ కన్‌సర్ట్‌లతో రూ. 800 కోట్ల ఆదాయం లభించింది. 2025లో ఈ మొత్తం 25 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.

వ్యక్తులకు, దేశానికి సాంస్కృతిక ఆదాయంలో కన్‌సర్ట్‌లు ఓ భాగంగా మారిపోయాయని మహీంద్ర బ్లూస్ మ్యూజిక్ ఫెస్టివల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బ్రియాన్ టెల్లిస్ చెప్పారు.

ఎడ్ షీరన్, అలన్ వాకర్, డువా లిపా ఇటీవలి కాలంలో భారత్‌లో ప్రదర్శనలు ఇచ్చారు.

‘ఇతర వ్యాపారాల్లానే భారత్‌లో ఇప్పుడు సంగీత వ్యాపారం భారీగా పెరుగుతోంది. భారత్‌లో డబ్బు ఖర్చు చేయగల యువత సంఖ్య భారీగా ఉంది’ అని ఆయన చెప్పారు.

టికెట్ రేట్లు, అమ్మకాలు ఈ డిమాండ్‌కు సాక్ష్యం. దశాబ్దం క్రితం ప్రొడక్షన్ ఖర్చులు 80 శాతం స్పాన్సర్ల ద్వారా వస్తే 20 శాతం టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చేవని, కానీ ఇప్పుడీ నంబర్లు తారుమారయ్యాయని టెల్లిస్ చెప్పారు.

కోల్డ్‌‌ప్లే షో టికెట్లు

ఫొటో సోర్స్, Reuters

పెరుగుతున్న కన్‌సర్ట్‌ల సంస్కృతి

కన్‌సర్ట్‌కు హాజరయ్యామని గొప్పగా చెప్పుకునేవాళ్లు, కన్‌సర్ట్ చూడాలనుకునేవాళ్లు, అందులో భాగం కావాలనుకునేవాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. సంగీతాన్ని బాగా ఇష్టపడేవాళ్లు ఉన్నారు....అయితే...కన్‌సర్ట్‌ల చుట్టూ పెరుగుతున్న హైప్‌ ప్రభావానికి లోనయి, దానికి దూరంగా ఉండలేక వాటికి హాజరవుతున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

కోల్ట్ ప్లే టికెట్ల అమ్మకాలు జరిగిన తర్వాత, జరగకముందు బాండ్‌కు సంబంధించిన హిట్ల రీల్స్‌తో సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది. అడ్వెంచర్ ఆఫ్ లైఫ్ టైమ్, ఫిక్స్ యు ఇన్ ప్యాక్‌డ్ స్టేడియమ్స్ వంటివి సోషల్ మీడియా నిండా కనిపిస్తున్నాయి. బ్యాండ్‌ అంటే తమకు ఎంత ఇష్టమో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పదే పదే చెప్పారు. మీమ్‌లకమయితే ఇక కొదవేలేదు.

ప్రమోటర్ల వెబ్‌సైట్ నిర్వహించే టార్గెటెడ్ మార్కెటింగ్.. టికెట్ల అమ్మకాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు బీబీసీతో చెప్పాయి. ఎంత ఎక్కువ డిమాండ్ సృష్టిస్తే...టికెట్ల రేట్లు అంత పెంచుకోవచ్చు. కన్‌సర్ట్‌ల నిర్వహణ చాలా కష్టమైనది. తరచుగా నష్టాలొస్తుంటాయి. దీంతో వారి లాభాపేక్షకు టికెట్లు కొనేవాళ్లు బలవుతుంటారు.

టికెట్ల రేట్లను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొందరు అభిమానులు డిమాండ్ చేస్తుంటారు. అయితే టెల్లిస్ దీనికి అంగీకరించరు. ‘‘టికెట్ల అమ్మకం వ్యవస్థాగతమైనది. ఇందులో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉండదు. ఆదాయాన్ని నియంత్రించాలనుకుంటే..ఖర్చులను కూడా నియంత్రించాలి’’ అని ఆయన చెప్పారు.

కోల్డ్‌‌ప్లే షో టికెట్లు

ఫొటో సోర్స్, PA Media

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)