మీరు వాడే మందులు నాణ్యమైనవేనా? గుర్తించడం ఎలా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వి. శారద
- హోదా, బీబీసీ ప్రతినిధి
పారాసెటమాల్, పాన్-డి, గ్లైసిమెట్ సహా కొన్ని కంపెనీలు తయారుచేసిన 48 ఔషధాలు నాణ్యత ప్రమాణాలకు తగినట్లు లేవని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ) తన నెలవారీ జాబితాలో పేర్కొంది.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రతి నెలా నాసిరకం మందుల జాబితాను ప్రచురిస్తుంది.
ఆగస్ట్‌లో ప్రచురించిన జాబితాలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పారాసెటమాల్, పాన్ -డి సహా 48 ఔషధాలు ఉన్నాయి.
కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ తయారుచేసిన పారాసెటమాల్ ఐపీ 500 ఎంజీ ట్యాబ్లెట్లు, ఆల్‌కెమ్ హెల్త్ సైన్సెస్ తయారు చేసిన పాన్- డి, ప్యూర్ అండ్ క్యూర్ తయారు చేసిన మాంటైర్ ఎల్‌సీ కిట్, స్కాట్-ఎడిల్ ఫార్మాసియా తయారు చేసిన గ్లైసిమెట్ సహా 48 మందులు ఈ జాబితాలో ఉన్నాయి. నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ(ఎన్ఎస్‌క్యూ) కేటగిరీలో వీటిని పేర్కొన్నారు.
సన్ ఫార్మా, టొరెంట్ సహా పలు పేరున్న ఫార్మా కంపెనీలు ఈ జాబితాలో తమ సంస్థల పేరిట ఉన్న మందులు తాము తయారుచేసినవి కానీ, అవన్నీ తమ సంస్థల పేరుతో మార్కెట్లో ఉన్న నకిలీ మందులు అని తెలిపాయి.


ఫొటో సోర్స్, Getty Images
ప్రమాణాలు లేకపోవడం అంటే ఏంటి?
వివిధ కారణాల వల్ల ఔషధాలను ‘నాన్ స్టాండర్డ్ క్వాలిటీ’గా ప్రకటించొచ్చు.
ప్రకటించిన బరువు కంటే తక్కువ ఉండటం.. భౌతిక రూపం, ట్యాబ్లెట్లలో కలిపిన పదార్థాలు వంటివి పరిగణనలోకి తీసుకుని వాటి ప్రమాణాలను నిర్ధరిస్తారు.
రూపం, తయారీలో వాడిన పదార్థాలు, మాత్రలు వేసుకున్న తరువాత శరీరంలోకి ఎలా కలిసిపోతుంది లాంటి అంశాల ఆధారంగా వాటిని ప్రమాణాలు లేనివిగా గుర్తించారు.
‘నాన్ స్టాండర్డ్ క్వాలిటీ’గా ప్రకటించిన ఔషధాల తయారీదారులను డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం- 2008 ప్రకారం ప్రాసిక్యూట్ చేయవచ్చు.
ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు విధించవచ్చు.
ఈ శిక్షలకు అదనంగా కనీసం రూ. 10 లక్షలు లేదా నాన్ స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్స్ విలువకు మూడు రెట్ల మొత్తం జరిమానా విధించొచ్చు. ఇందులో ఏది ఎక్కువ మొత్తం అయితే అంత జరిమానా విధిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
‘డాక్టర్ రాసే మాత్రలే సురక్షితమైనవి కాకపోతే ఏం చేయాలి’
ప్రస్తుతం వెల్లడించిన జాబితాలో ఎమాక్సిలిన్, పొటాషియం క్లావులనేట్ మాత్రలు IP (క్లావమ్ 625), ఎమాక్సిలిన్, పొటాషియం క్లావులనేట్ మాత్రలు (మెక్స్‌క్లావ్ 625).. అజీర్తి సమస్యలకు వాడే పాంటప్రజోల్-డోంపెరిడోన్ క్యాప్సూల్ ఐపీ (పెన్- టి)కి సంబంధించిన మందులు ఉన్నాయి.
మార్కెట్‌లో ఒక ప్రత్యేక బ్యాచ్‌కు సంబంధిచిన ఈ ఔషధాల శాంపిళ్లు ప్రమాణాల నిర్ధరణ పరీక్షలలో విఫలమయ్యాయి.
జ్వరం, అజీర్తి వంటి సమస్యల నివారణకు సాధారణంగా వాడే మందులు ప్రమాణాలకు అనుగుణంగా లేవనే వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి.
‘నేను పదేళ్లుగా మధుమేహానికి మందులు వాడుతున్నాను. అవి నాణ్యమైనవి కాకపోతే ఎలా’ అని చెన్నైలోని కొలత్తూరులో నివసించే శంకరన్ ప్రశ్నించారు.
‘డాక్టర్ రాసే మాత్రలే సురక్షితమైనవి కాకపోతే ఏం చేయాలి” అని అని చెన్నైలోని అరుంబాక్కంకు చెందిన ఉషారాణి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నాణ్యమైన మందులను గుర్తించడం ఎలా?
నాణ్యత ప్రమాణాలు లేని ఔషధాలు వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
నాణ్యత ఉన్న మందుల ప్రభావం ఎలా ఉంటుంది? ప్రమాణాలు లేని ఔషధాలను ఎలా గుర్తించాలి? అనే అంశాలపై డాక్టర్ చంద్రశేఖర్ కొన్ని వివరాలు అందించారు.
- నిర్ణీత పదార్థాలు లేని, ఉండాల్సినంత స్థాయిలో లేని ఔషధాలు ఫలితాలను ఇవ్వవు. ఇలాంటివి ఎక్కువకాలం వాడితే అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
- మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలకు నిత్యం మందులు తీసుకునే రోగులు తాము వాడే మందులను ఎప్పటికప్పుడు డాక్టర్‌కు చూపించడం అవసరం.
- మందుల షాపు నుంచి ఔషధాలు కొనేటప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్ఓ) కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుడ్ హెల్త్ ప్రాక్టీసెస్ (డబ్ల్యూహెచ్ఓ జీహెచ్‌పీ) సర్టిఫికేషన్ ప్రకారం ప్యాకింగ్ చేశారా అనేది చూడాలి. ఇవి నాణ్యతకు చిహ్నాలు.
- గడువు తీరిపోవడానికి దగ్గరగా ఉన్న ఔషధాలను కొనకపోవడమే మంచిది.
- కొన్ని ఔషధాలు సరైన పద్ధతిలో స్టోర్ చెయ్యకపోతే వాటి ప్రభావాన్ని కోల్పోతాయి.
- కొన్ని ఇంజక్షన్లతో పాటు ఇన్సులిన్ లాంటి ఉత్పత్తుల్ని కొనే ముందు వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచారో లేదో చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఆందోళన కాదు, అప్రమత్తత అవసరం
ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ అధికారులు చెబుతున్నారు.
ఇలాంటి పరీక్షలు సాధారణమేనని.. నాణ్యత లేనివి అయినంత మాత్రాన ప్రాణాలకు ప్రమాదం ఉండదని వారు పేర్కొంటున్నారు.
ఔషధాల తయారీలో చిన్న చిన్న పొరపాట్లు వాటిని నాసిరకంగా వర్గీకరించడానికి దారితీస్తాయని, ఇటువంటి కఠినమైన నియంత్రణలు భారతదేశంలో మందుల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
"ఐదు సెకన్లలో నోటిలో కరిగిపోవాల్సిన మందు ఆరు సెకన్ల సమయం తీసుకుంటే అది నాసిరకంగా పరిగణిస్తారు" అని తమిళనాడు కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రమేష్ చెప్పారు.
చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జనరల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అశ్విన్ ఔషధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
“కొన్ని మందుల దుకాణాల్లో 80 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తుంటారు. 100 రూపాయల విలువ చేసే వస్తువును ఎవరైనా 20 రూపాయలకు ఎలా అమ్మగలరు? చాలా చోట్ల గడువు ముగిసి మూడు నెలలు దాటిన ఔషధాలను కూడా పెద్ద మొత్తంలో కొని తక్కువ ధరలకు అమ్ముతున్నారు. మందుల ప్యాకింగ్ సరిగ్గా లేకపోయినా.. సక్రమ పద్ధతుల్లో నిల్వ చేయకపోయినా, గడువు తీరే సమయం దగ్గర పడే కొద్దీ వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. సెలైన్ బాటిళ్ల వంటి వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. రవాణా చేసేటప్పుడు ఇన్స్‌లిన్‌ను 6 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచాలి. కానీ చాలా మంది దీనిని పాటించరు.ఆన్‌లైన్‌లో ఇన్సులిన్ కొనవద్దని నేను నా రోగులకు సలహా ఇస్తుంటాను. అది నీళ్లతో సమానం” అని డాక్టర్ అశ్విన్ చెప్పారు.
నాణ్యమైన మందులు, నకిలీ మందుల మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి చాప్టర్ ఆఫ్ ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఛైర్మన్ జయశీలన్.
“సాధారణంగా పరీక్షించిన నమూనాల్లో 3 నుంచి 5 శాతం నాన్ స్టాండర్డ్ క్వాలిటీవి ఉంటాయి, కేవలం 0.01 శాతం నమూనాలు మాత్రమే నకిలీవి ఉంటాయి. ఎన్ఎస్‌క్యూగా తేలితే ఆ బ్యాచ్ మందులను వెంటనే రీకాల్ చేస్తారు. ఇది అమెరికా లాంటి దేశాల్లో కూడా జరుగుతుంది. ఇలాంటి ఔషధాల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలేమీ రావు” అని జయశీలన్ అన్నారు.
ఉత్పత్తుల సరఫరా గొలుసును నిశితంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు. ‘తయారీదారు ఉత్పత్తి చేసే మందులను ఫార్మసీల్లో నిర్ణీత ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవచ్చు. ఉత్పత్తి అయిన 12 నెలల తరువాత ఉత్పత్తులను పరీక్షించినప్పుడు, అవి నాణ్యత పరీక్షలో విఫలం కావచ్చు’ అన్నారు.
“భారత దేశాన్ని ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’ గా పిలుస్తారు. అమెరికాలో ఉపయోగించే మందుల్లో 40 శాతం, యూరప్ దేశాల్లో వినియోగించే మందుల్లో 25 శాతం భారత్‌లోనే తయారవుతాయి. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు తమకు అవసరమైన ఔషధాల కోసం భారత్‌పై ఆధారపడ్డాయి. భారత్ దేశానికి అత్యధిక ఆదాయం తీసుకు వస్తున్న రంగాల్లో ఫార్మా నాలుగో స్థానంలో ఉంది” అని జయశీలన్ అన్నారు.
ప్రజలు ఫార్మసిస్ట్ ఉన్న మెడికల్ షాపుల్లో మాత్రమే ఔషధాలు కొనుగోలు చేయాలి. అర్హత ఉన్న ఫార్మసిస్టులు ఔషధాల గురించి రోగులకు అవగాహన కల్పించాలి.
ఆ మందు ఎప్పుడు వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి, డోస్ ఎంత, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది వివరించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఫార్మా సంస్థలు ఏం చెబుతున్నాయి?
సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రకటించిన జాబితాలో ప్రమాణాలు లేనివిగా ప్రకటించిన ఔషధాలు నకిలీవని, వాటిని తాము ఉత్పత్తి చేయలేదని ఫార్మా సంస్థలు సన్ ఫార్మా, టొరెంట్ ఫార్మా ప్రకటించాయి.
“మా సంస్థ ఈ ఆరోపణల మీద దర్యాప్తు జరిపింది. పల్మోసిల్ (సిల్డెనాఫిల్ ఇంజెక్షన్) బ్యాచ్ నంబర్ KFA0300, పాంటాసిడ్ (పాంటప్రజోల్ టాబ్లెట్స్ ఐపి), బ్యాచ్ నంబర్ SID2041A, ఉర్సోకాల్ 300 (ఉర్సోడాక్సికోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఐపి), బ్యాచ్ నంబర్ GTE1350A ఔషధాలు నకిలీవి” అని సన్ ఫార్మా ప్రతినిధి పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.
రోగుల భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు సన్ ఫార్మా తెలిపింది. కొన్ని ప్రముఖ ఔషధ బ్రాండ్లపై క్యూఆర్ కోడ్ లేబుల్స్ ముద్రించారు. ఈ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా రోగులు ఔషధాల ప్రామాణికతను సులభంగా తెలుసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రకటించిన జాబితాలో ఉన్న షెల్కాల్ - 500 నకిలీవని గుర్తించినట్లు టొరెంట్ ఫార్మా చెప్పిందని ఆంగ్ల దినపత్రిక ది హిందూ రాసింది.
తమ సంస్థ తయారు చేసిన అసలైన షెల్కాల్ 500 ఔషధాన్ని గుర్తించేందుకు వీలుగా క్యూ ఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు టొరెంట్ ఫార్మా తెలిపింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ స్వాధీనం చేసుకున్న నమూనాల్లో ఈ కోడ్‌లు లేవని తెలిపింది.
తాము పరీక్షించిన అంశాలతో కూడిన నివేదిక, అధికారిక స్పందనను సమర్పించినట్లు టొరెంట్ ఫార్మా పేర్కొంది.
ఔషధాలు, వాటి నాణ్యత ప్రమాణాలు లాంటివి చాలా తీవ్రమైన అంశాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జయలాల్ అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గట్టి చర్యలు చేపట్టాలన్నారు.
“అనేక పశ్చిమ దేశాల్లో అనుసరిస్తున్నట్లుగా ఔషధాల తయారీ నుంచి అవి పేషంట్‌కు చేరే వరకు నిరంతర పర్యవేక్షణ అవసరం. ఇష్టం వచ్చినట్లు మందులు అమ్మకుండా ప్రిస్క్రిప్షన్ ఆడిట్ జరగాలి. ప్రభుత్వ సంస్థలు ఎల్ వన్( తక్కువ ధరకు అందిస్తామని టెండర్ వేసిన సంస్థల నుంచి ఔషధాలు సేకరించే పద్ధతి) ఆధారంగా మందులు కొంటాయి. అందువల్ల ప్రభుత్వ రంగంలోని సరఫరా వ్యవస్థల్లోకి నకిలీ మందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
ఏదైనా ఒక ఔషధం నకిలీదని గుర్తించినప్పుడు వెంటనే దానిపై దర్యాప్తు చేపట్టాలి. అది ఎక్కడ నుంచి వచ్చింది. దాన్ని హోల్‌సేల్‌లో ఎవరు అమ్మారు. ఎవరు తయారు చేశారు లాంటి అంశాలన్నీ తేల్చాలి” అని తమిళనాడు డ్రగ్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెప్పారు.
“దర్యాప్తుకు ముందు, షాపుల నుంచి అలాంటి ఔషధాల్ని తొలగించాలి. వాటిని ఎవరు తయారు చేశారో గుర్తిస్తే, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవచ్చు. అ తర్వాత ఆ తయారీ సంస్థకు నోటీసు ఇవ్వాలి. వారి నుంచి వివరణ తీసుకోవాలి. ఏదైనా సంస్థ పదే పదే ఇలాంటి తప్పులు చేస్తే వారిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ సెక్షన్ 18 ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టవచ్చు” అని శ్రీధర్ తెలిపారు.
ఆన్‌లైన్ ఔషధాల అమ్మకాలు పెరగడం వల్లనే నకిలీ ఔషధాల సంఖ్య పెరుగుతోందని తమిళనాడు ఔషధ అమ్మకాల సంఘం అధ్యక్షుడు నటరాజ్ అన్నారు.
“ఆన్‌లైన్‌లో అమ్మేటప్పుడు, కశ్మీర్‌లోని ఓ వ్యక్తి తమిళనాడులో మందులు అమ్మగలరు. వీటిని సరైన ఫార్మా సంస్థ నుంచే తీసుకున్నారా లేదా అనే దాన్ని పరిశీలించే పరిస్థితి లేదు” అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














