అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం: ఈ ‘డే కేర్ సెంటర్లు’ ఒంటరి వృద్ధులకు మనోధైర్యం ఇవ్వగలుగుతున్నాయా?

వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

ఉపాధి వేటలో యువత నగరాలకు వలస పోతోంది. మెరుగైన జీవితం కోసం మరికొందరు విదేశాలకు వెళ్తున్నారు.

ఫలితంగా వృద్ధులైన తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఒంటరిగా మిగిలిపోతున్నారు. దీని వల్ల వారిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ సమస్యకు పరిష్కారంగా ‘వృద్ధుల డే కేర్ సెంటర్ల’ను 2023లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.

ప్రస్తుతం కరీంనగర్, మంచిర్యాల, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లో ఇలాంటి కేంద్రాలు నడుస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌
ఫొటో క్యాప్షన్, కరీంనగర్ ప్రభుత్వ ఓల్డేజీ హోమ్‌లో వృద్ధులు

ఒంటరితనానికి మందు

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒకరి వయసు 60 ఏళ్లకు పైగా ఉంటుంది.

ఒంటరితనం అనేది వీరు ఎదుర్కోనున్న అతి పెద్ద సమస్య కానుంది.

డే కేర్ సెంటర్లు తన లాంటి వృద్ధులను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మంచి వేదికలని కరీంనగర్‌‌కు చెందిన కేశవరెడ్డి అన్నారు.

‘‘వృద్ధాప్యం ఒక వాస్తవం. ఈ వయసులో ఎవరు మనవారు? ఎవరు కాదు? అనేది తెలిసిపోతుంది. గతంలోలా ముసలివాళ్లపై కుటుంబసభ్యులకు శ్రద్ధ ఉండదు. నాలాంటివారికి ఈ కేంద్రాలు ఒంటరితనాన్ని దూరం చేస్తున్నాయి’’ అని కేశవరెడ్డి బీబీసీతో అన్నారు.

కరీంనగర్ డే కేర్ సెంటర్‌లో ఆయన ప్రధానకార్యదర్శిగా పని చేస్తున్నారు.

డబ్ల్యూహెచ్‌ఓ రిపోర్ట్ ప్రకారం, 2030 నాటికి 60 ఏళ్ల వయసు దాటినవారిలో సుమారు 14శాతం మంది మానసిక సమస్యల బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధాప్యంలో వారికి ఇలాంటి డే కేర్ సెంటర్లు కాస్త సాంత్వన చేకూర్చడంతో పాటు ఉల్లాసాన్ని ఇస్తాయని కేశవరెడ్డి అంటున్నారు.

‘‘నా వరకు ఈ డే కేర్ సెంటర్ అనేది అనుభవాలను పంచుకునేందుకు ఒక వేదిక. నా వయసు వారితో ఉల్లాసంగా గడపొచ్చు. నాలుగు మాటలు కలబోసుకోవచ్చు’’ అని కేశవరెడ్డి చెప్పారు.

నగరాల్లో నివసించలేని వారికి కూడా డే కేర్ సెంటర్లు ఉపయోగపడుతున్నాయి.

చింతల సత్యనారాయణ హెడ్ మాస్టర్‌గా రిటైర్ అయ్యారు. ఆయన కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది. కానీ ఆయన మాత్రం కరీంనగర్‌లో ఉంటున్నారు.

‘‘పట్టణంలోని ఇరుకైన జీవితాలంటే నాకు ఇష్టం లేదు’’ అంటారు సత్యనారాయణ.

కరీంనగర్ డే కేర్ సెంటర్‌లో ఆయన ట్రెజరర్‌గా పని చేస్తున్నారు.

తనకు ఆక్యుప్రెషర్ వచ్చునని, డేకేర్ సెంటర్‌కు వచ్చే వాళ్లకు ఆ సేవలు అందిస్తున్నానని సత్యనారాయణ తెలిపారు.

‘‘నాలాంటి వృద్ధులకు సాయం చేయడం చాలా సంతృప్తిగా ఉంటోంది’’ అని ఆయన అన్నారు.

వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌

డే కేర్ సెంటర్‌లో ఎలాంటి సేవలు లభిస్తాయి?

సంరక్షణ, హెల్త్ కేర్, న్యాయ సంబంధ అంశాల్లో ప్రభుత్వం సేవలందిస్తోంది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక సేవలను ఇవి అందిస్తున్నాయి.

  • జిమ్
  • ఇండోర్ ,అవుట్ డోర్ గేమ్స్
  • ఫిజియోథెరపీ
  • ఆక్యుప్రెషర్
  • యోగ
  • పుస్తకాలు
  • ఆరోగ్య, మానసిక సమస్యల మీద నిపుణులతో కౌన్సెలింగ్
  • అవగాహన కార్యక్రమాలు

వృద్ధాప్యంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలపై ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు చెందిన డాక్టర్ల సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

‘’60 ఏళ్ల మహిళలు, పురుషులు ఈ సెంటర్లో చేరవచ్చు. మేం ఒంటరి కాదు, మాకు మాలాంటి వారు తోడున్నారనే ధైర్యాన్ని కల్పించడానికి ఇదొక వేదిక’’ అన్నారు కేశవరెడ్డి.

“వృద్ధ్యాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఒత్తిడి ఇతర కారణాలతో పక్షవాతం బారిన పడుతున్నారు. ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్ కోసం ఈ డే కేర్ సెంటర్ మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది’’ అని సింగరేణి రిటైర్డ్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజకొమురయ్య అన్నారు.

ఈ సెంటర్ల సమగ్ర పర్యవేక్షణ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

“గతంతో పోలిస్తే ఉమ్మడి కుటుంబాల సంఖ్య తగ్గింది. దీంతో కుటుంబ సభ్యుల నుంచి వృద్ధులకు అవసరమైన అండ దొరకడం లేదు. వివిధ ప్రభుత్వ సేవలు వీరికి అందుతున్నాయా లేదా అనేది పరిశీలిస్తూ ఈ ‘డే కేర్’ సెంటర్లను నిర్వహిస్తున్నాం. ఇక్కడి సభ్యుల సహకారంతో సీనియర్ సిటిజన్స్ సంరక్షణ చట్టంపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ అని సంక్షేమ శాఖ అధికారి సబిత బీబీసీతో చెప్పారు.

వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌

న్యాయ సేవలు

గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా వృద్ధులపై వివిధ రూపాల్లో జరుగుతున్న నేరాల సంఖ్య పెరుగుతోంది.

కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ 2021లో లోక్‌సభలో సమర్పించిన ఒక నివేదిక ప్రకారం 2018-2020 మధ్య భారత్‌లో వృద్ధులపై నేరాలకు సంబంధించి 76,947 కేసులు నమోదయ్యాయి.

ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 5,963, తెలంగాణలో 4,160 కేసులు ఉన్నాయి.

పోషణ, సంరక్షణ విషయంలో భౌతిక దాడులు, ఫోర్జరీతో ఆస్తుల మార్పిడి, దొంగతనాలు, ఆర్థిక మోసాలు ఈ కేసుల్లో ఎక్కువగా ఉన్నాయి.

“బయటి వ్యక్తుల కంటే సొంత కుటుంబ సభ్యుల వల్ల బాధపడుతున్న వృద్ధుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. కొద్దిమంది మాత్రమే ఈ విషయంలో బయటకు వస్తున్నారు. అలాంటి వారికి డే కేర్ సెంటర్ల ద్వారా అవసరమైన న్యాయ సహాయాన్ని అందేలా చూస్తున్నాం. అవసరం అయితే అధికారులు,పోలీసులను స్వయంగా కలిసి న్యాయం జరిగేలా చూస్తున్నాం’’ అని కేశవరెడ్డి అన్నారు.

‘‘కుటుంబం, సమాజం నుంచి మేం కోరుకుంటున్నది కనీస గౌరవం, శ్రద్ధ. వృద్ధుల్లో మానసిక స్థైర్యాన్ని నింపే ఇలాంటి ‘డే కేర్’ కేంద్రాలను గ్రామస్థాయి వరకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌

‘సత్వర న్యాయం జరిగేలా చూడాలి’

న్యాయం కోసం ఆశ్రయిస్తున్న వృద్ధులకు అది సరైన సమయంలో, వేగంగా అందడం లేదన్న వాదనలున్నాయి.

‘ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్-2007 ఒక మంచి చట్టం. పెద్దల పట్ల నిర్లక్ష్యం ఒక సామాజిక రుగ్మత. మానసిక ఒత్తిడికిలోనై అనేక మంది వృద్ధ దంపతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారికి న్యాయం అందించడంలో జాప్యం జరుగుతోంది. రెవెన్యూ పనుల్లో బిజీగా ఉండే ఆర్డీవో, కలెక్టర్ల నుంచి వృద్ధుల సంరక్షణ బాధ్యతలను తప్పించి ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసి సత్వర న్యాయం అందించాలి’’ అని కరీంనగర్ కు చెందిన న్యాయవాది, మానసిక సమస్యల కౌన్సెలర్ కొమురయ్య బీబీసీతో తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

వయసు రీత్యా వచ్చే ఇబ్బందులకన్నా కోర్టు, కార్యాలయాల చుట్టు తిరగాల్సిరావడంతో వారు మరింతగా ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.

“చట్ట సభల్లో వృద్ధుల సమస్యలపై నామమాత్రపు చర్ఛలకే పరిమితమవుతున్నారు’’ అని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వి.మోహన్ రెడ్డి అన్నారు.

వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని, నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌

అధికారులేమంటున్నారు...?

‘గతంతో పోలిస్తే కేసులు పెరుగుతున్న మాట వాస్తవం. ఆస్తిపంపకాల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. వారానికి ఒక రోజు (శనివారం) ఈ కేసులను విచారిస్తున్నాం. కౌన్సెలింగ్‌తో సయోధ్య చేకూర్చి పిల్లలే వారి బాధ్యత తీసుకునేలా చేస్తున్నాం, అలా కుదరని పక్షంలో ప్రతి నెలా మెయింటెనెన్స్ ఇచ్చేలా ఆదేశాలిస్తున్నాం” అని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ బీబీసీతో చెప్పారు.

సీనియర్ సిటిజన్స్ సంరక్షణ చట్టం ప్రకారం ఆర్డర్‌ను అమలు పరచని వారికి మూడు నెలల జైలు శిక్ష పడుతుంది. కొన్ని కేసుల్లో బదలాయించిన ఆస్తుల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉందని ఆర్డీవో మహేశ్వర్ తెలిపారు.

‘చందాలు వేసుకుని నిర్వహిస్తున్నారు’

అయితే, ఈ సెంటర్ల నిర్వహణ ఖర్చులను ఇక్కడి సభ్యులే భరించాల్సి రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంక్షేమ శాఖ ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నప్పటికీ నిర్వహణ ఖర్చులను సభ్యులే చందాల రూపంలో సమీకరించుకుంటున్నారు.

ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరించాలని కోరుతున్నారు.

వయోవృద్ధుల డే కేర్ సెంటర్

ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డ్ పర్సన్స్

ఐక్యరాజ్య సమితి(యూఎన్) అక్టోబర్ 1ని అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది.

‘గౌరవ ప్రధానమైన వృద్ధాప్యం’ అన్న థీమ్‌తో ఈ ఏడాది కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

‘వృద్ధుల సంరక్షణను గౌరవించే సహాయక వ్యవస్థలను బలోపేతం చేయాలి” అని యూఎన్ఓ సెక్రటరీ జనరల్ తన సందేశంలో పిలుపునిచ్చారు.

2030 నాటికి, వృద్ధుల ప్రపంచ జనాభా యువత సంఖ్యను మించిపోతుందని, 2050 నాటికి ప్రపంచ జనాభాలో 65 ఏళ్లు అంతకు మించిన వృద్ధుల సంఖ్య 150 కోట్లకు చేరుతుందని యూఎన్ అంచనా వేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)