తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి బంధువుల కంపెనీలకు కాంట్రాక్టులు దక్కాయా? కేటీఆర్ చేసిన ఆరోపణలేంటి? అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Facebook
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమృత్ పథకం టెండర్లలో అవకతవకలు జరిగాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువు సూదిని సృజన్ రెడ్డికి కాంట్రాక్టును కట్టబెట్టారంటూ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు (కేటీఆర్) ఆరోపణలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ 'అమృత్' పథకం నిధులతో రాష్ట్ర పురపాలక శాఖ ద్వారా చేపట్టే పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో ఈ వివాదం నడుస్తోంది.
ఈ విషయంపై రాజీనామాలకు సిద్ధమంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు నడిచాయి.

వివాదం మొదలైందిలా..
సెప్టెంబరు 21న కేటీఆర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
‘‘అమృత్ 2.0 పథకంలో 8,888 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్ల కేటాయింపులో అవినీతి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే.. అంటే ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో కుంభకోణం జరిగింది. ముఖ్యమంత్రి బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి, బెదిరించి దాని పేరుతో టెండర్లను కట్టబెట్టారు. రూ.1,137 కోట్ల కాంట్రాక్టు గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20 శాతం పని చేస్తుంది. ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ మాత్రం 80 శాతం పనిచేస్తుందట. ఇండియన్ హ్యూమ్ కంపెనీ స్వయంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈకి రాసిన లేఖతో వ్యవహారం బయటపడింది’’ అని కేటీఆర్ ఆరోపించారు.
ఈ విషయంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖ రాసినట్లు ఆయన చెప్పారు.
కాగా, అమృత్ పథకం టెండర్ల పనులు, కాంట్రాక్టుల మొత్తం విలువే రూ.5,385.05 కోట్లుగా ఉందని, అలాంటిది రూ.8,888 కోట్ల కుంభకోణం ఎక్కడిదని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు.
‘‘మాజీ మంత్రి కేటీఆర్ చెప్పినట్లు రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచి ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. అలా కాకపోతే మీరు, మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా?’’ అని పొంగులేటి సవాల్ విసిరారు.
మంత్రి పొంగులేటి సవాల్‌పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
‘‘మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేస్తానని అంటున్నారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో విచారణ చేయించాలి. తప్పు జరగలేదని విచారణలో తేలితే రాజీనామా కాదు, రాజకీయ సన్యాసం చేస్తా’’ అని బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Facebook/KTR
అసలేం జరిగింది?
అమృత్ 2.0 పథకంలో భాగంగా 2023 సెప్టెంబరులో రూ.3,516 కోట్ల విలువైన పనులకు మూడు ప్యాకేజీలుగా టెండర్లను పిలిచింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.
తెలంగాణలోని 98 ప్రాంతాల్లో తాగునీరు, మురుగు నీటి నిర్వహణకు సంబంధించిన పనులివి.
2023 నవంబరు 29న టెండర్లను అధికారులు తెరిచారు. అప్పట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని టెండర్లను అప్పగించారు.
పీఎల్ఆర్ జాయింట్ వెంచర్, మేఘా కన్‌స్ట్రక్షన్, గజ కన్‌స్ట్రక్షన్ జాయింట్ వెంచర్‌కు వేర్వేరుగా మూడు ప్యాకేజీల పనులు దక్కాయి.
ఇందులో పీఎల్‌ఆర్ కంపెనీ ఏపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులది.

ఫొటో సోర్స్, facebook/Ponguleti Srinivas Reddy
పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా..
2023 డిసెంబరులో తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. తర్వాత అమృత్ పథకం పనుల టెండర్లను రీకాల్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
‘‘అమృత్ పథకంలో టెండర్లపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 3.99 శాతం అధికంగా మూడు కంపెనీలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (ఎల్వోఏ) ఇచ్చారు. అగ్రిమెంట్ జరగకపోవడంతో వాటిని రీకాల్ చేసి తిరిగి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అంచనా వ్యయాలు పెంచకుండా 2022-23 రేట్లకే టెండర్లు పిలిచాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు చెప్పారు .
ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లను కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్, ఏఎంఆర్ జాయింట్ వెంచర్, మేఘా కన్‌స్ట్రక్షన్స్‌కు ప్రభుత్వం అప్పగించింది.
ఏఎంఆర్ జాయింట్ వెంచర్‌లో ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్, శోధ కన్‌స్ట్రక్షన్స్, ది ఇండియన్ హ్యుమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ భాగస్వాములుగా ఉన్నాయి.
టెండర్‌లో చెప్పిన వివరాల ప్రకారం.. ఏఎంఆర్ జాయింట్ వెంచర్‌లో ఏఎంఆర్ సంస్థకు 51 శాతం, శోధ కంపెనీకి 29 శాతం, ది ఇండియా హ్యుమ్ పైప్ కంపెనీకి 20 శాతం చొప్పున వాటా ఉంది.
ది ఇండియన్ హ్యుమ్ పైప్ కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE)లకు రాసిన లేఖ(ఎక్స్చేంజ్ ఫైలింగ్)లోనూ ఆ జాయింట్ వెంచర్‌లో తమకు 20 శాతం వాటా ఉన్నట్లుగా పేర్కొంది.
మొత్తం రూ.1,137 కోట్ల (జీఎస్టీ మినహా) పనులు జాయింట్ వెంచర్‌లో దక్కాయని, అందులో తమ వాటా రూ.227.55 కోట్లు అని ఇండియన్ హ్యుమ్ పైప్ కంపెనీ పేర్కొంది.
మిగిలిన పనులు ఏ కంపెనీ ఎంత మేర చేస్తుందనేది ఆ లేఖలో ప్రస్తావించలేదు.

ఫొటో సోర్స్, BRSParty
శోధ కంపెనీ ఎవరిది?
శోధ కంపెనీకి టెండరు దక్కడంపై వివాదం మొదలైంది. ఈ కంపెనీకి డైరెక్టర్లుగా సూదిని దీప్తి రెడ్డి, సూదిని వసుంధర ఉన్నారు. ఈ కంపెనీ సూదిని సృజన్ రెడ్డి కుటుంబీకులది. ఈయన సీఎం రేవంత్ రెడ్డికి వరుసకు బావమరిది( రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డికి చిన్నాన్న కొడుకు) అవుతారు.
శోధ కంపెనీని 2010లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, హైదరాబాద్‌లో రిజిస్టర్ చేశారు. కంపెనీ షేర్ క్యాపిటల్ రూ.2.5 కోట్లు కాగా, పెయిడ్ అప్ క్యాపిటల్ రూ.2.48 కోట్లుగా ఉంది.
ఈ శోధ కంపెనీ రేవంత్ రెడ్డి కి దగ్గరి బంధువుకు చెందినది కాబట్టి పక్షపాతంతో ప్రభుత్వం టెండర్లను కట్టబెట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
రూ.2.5 కోట్ల విలువున్న కంపెనీకి వెయ్యి కోట్ల రూపాయలకుపైగా విలువైన టెండర్ ఎలా ఇస్తారన్నది ఆయన ప్రశ్న.
ఈ ఆరోపణలపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
‘‘సీఎం రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి సొంత బావమరిది కాదు, వరుసకు బావమరిది. అంతకంటే ఎక్కువగా సృజన్‌కు బీఆర్ఎస్ పార్టీతోనే సంబంధాలున్నాయి. పాలేరు నియోజకవర్గంలో నాపై బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఉపేందర్ రెడ్డికి సృజన్ రెడ్డి అల్లుడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ కంపెనీ పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ నం.7లో పనులు చేసింది’’ అని పొంగులేటి చెప్పారు.
‘‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమృత్ పథకం టెండర్లు రూ.3,516 కోట్లు కాగా.. 3.99 శాతం అధిక మొత్తానికి ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక 2.44 శాతం తక్కువకు టెండర్లు ఇచ్చాం. దానివల్ల ప్రభుత్వంపై రూ. 54 కోట్ల భారం తగ్గుతుంది’’ అని మంత్రి చెప్పారు.
ఏమిటీ అమృత్ పథకం?
అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్).
దీన్ని 2015 జూన్ 25న ఐదేళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలో 500 నగరాల్లో (సుమారు 60 శాతం) జనాభా పరిధికి తగ్గట్టుగా ఈ పథకాన్ని తీసుకువచ్చారు.
ఈ పథకానికి ఎంపికైన నగరాలు లేదా పట్టణాల్లో కనీస సదుపాయాలైన తాగునీటి వసతి, మురుగునీటి వ్యవస్థ ఆధునికీకరణ, పచ్చదనం పెంచడం వంటి పనులు చేస్తారు.
ఈ పథకం రెండో దశను రూ.2.99 లక్షల కోట్లతో 2021 అక్టోబరు 1న కేంద్రం ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా తాగునీరు, మురుగు నీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోంది.
ఈ పథకం కింద చేపట్టే పనులకు పిలిచిన టెండర్లపైనే తెలంగాణలో వివాదం మొదలైంది. ఫిబ్రవరిలో జరిగిన టెండర్ల వ్యవహారం తాజాగా బయటకు రావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య 'మాటల యుద్ధం' నడుస్తోంది.
కేటీఆర్‌కు లీగల్ నోటీసు
ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్‌కు సూదిని సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు.
తమ కంపెనీపై, తనపై చేసిన ఆరోపణలను సోషల్ మీడియా, వెబ్‌సైట్ నుంచి తొలగించి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు.
తన పరువుకు భంగం కలిగించేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని సృజన్ రెడ్డి పేర్కొన్నారు.
గతంలోనూ వివాదం
రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు లేదా బంధువులపై ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు. గత నెలలో అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలో స్వచ్ఛ బయో కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు అప్పట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు.
స్వచ్ఛ బయో కంపెనీలో రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నందున, ఆ కంపెనీతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకోవడం ద్వారా తమ కుటుంబీకులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం సీఎం చేశారని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అప్పట్లో ఆరోపించారు.
పొంగులేటి కుటుంబానికి చెందిన కంపెనీకి..
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీకి కాంట్రాక్టులు దక్కడం చర్చనీయాంశంగా మారింది.
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ప్యాకేజీ-1 పనులను రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకున్నట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఈ రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష రెడ్డి, సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు.
తన కుటుంబానికి చెందిన కంపెనీకి కాంట్రాక్టులు దక్కాయనే ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా స్పందించాల్సి ఉంది.
ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ టెండర్లు, కాంట్రాక్టులు దక్కించుకోవడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘ఇది నైతికంగా చాలా తప్పు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ కాంట్రాక్టులు చేయకూడదు. ఇది నిబంధన కూడా. కానీ, ఈ కాంట్రాక్టులు లేదా టెండర్లు నేరుగా సదరు ప్రజాప్రతినిధుల పేర్ల మీద రావు. వారి కుటుంబీలకులు లేదా బంధువుల పేరుతో నడిపిస్తున్న కంపెనీలకు వచ్చేలా చేస్తారు. వాళ్లకు అనుగుణంగా టెండర్ల నిబంధనలు ఉండేలా చూసుకుంటారు. బంధువులు లేదా కుటుంబీల కంపెనీలకు రావడంతో చట్టపరంగా ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేని పరిస్థితి’’ అని పద్మనాభ రెడ్డి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














