సత్యం సుందరం రివ్యూ: ఎమోషన్స్‌తో కనెక్ట్ చేసే కథ ఇది...

సత్యం - సుందరం

ఫొటో సోర్స్, Asian Suresh Entertainment/Instagram

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

'96' సినిమాతో ఫీల్ గుడ్ సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్. ఆయన దర్శకత్వంలో అదే రూట్‌లో కార్తీ-అరవింద్ స్వామి కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘సత్యం సుందరం’.

ట్రైలర్ నుంచే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడీ రివ్యూలో చూద్దాం.

సినిమా కథ ఏంటంటే...సత్యం యువకుడిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులతో కలిసి గుంటూరు జిల్లాలో ఉన్న తన సొంత ఊరు, ఇల్లు వదిలేసి వైజాగ్‌కు వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ ఊరితో తనకి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది.

అయితే, ఊరు వదిలివెళ్లిపోవడానికి కారణమైన బంధువులు, ఊరు మీద తను కోపం పెంచుకుంటాడు.

మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత సత్యం సొంతూరు ఎందుకు వెళ్ళాడు? ఆ ప్రయాణంలో తనకు తెలియని బంధువుతో ఎందుకు కలిసి ఉండాల్సి వస్తుంది? ఆ ఊరు, బంధువుల పట్ల అతనికున్న విముఖత విషయంలో ఒక అపరిచిత బంధువు ఎలా మార్పు తెచ్చాడు? చివరికి ఆ అపరిచిత బంధువు ఎవరో సత్యానికి తెలిసిందా? అన్నదే ఈ సినిమా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సత్యం సుందరం మూవీ

ఫొటో సోర్స్, X@Karthi_Offl

నటన ఎలా ఉందంటే...

‘‘ 'సత్యం సుందరం' సినిమా కథకు 'కార్తీ-అరవింద్ స్వామి'ని తప్ప వేరే ఎవరినీ తీసుకుందాం అనుకోలేదు. ఒకవేళ వాళ్లు చేయకపోతే ఈ సినిమా ఇంకెవరితోనూ తీయకూడదని అనుకున్నా’’ అని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

నిజంగానే ఈ సినిమాకు ఈ ఇద్దరూ తప్ప వేరే ఎవరూ న్యాయం చేయలేరు అన్న స్థాయిలో నటించారు.

సత్యం (అరవింద్ స్వామి) కొంత రిజర్వుడుగా ఉండే మనిషి.

కార్తీ (అపరిచిత బంధువు)..ఎవరితోనైనా ‘అక్కా’, ‘తమ్ముడు’, ‘బావా’, ‘మావయ్య’ అంటూ వరసలు కలుపుకుంటూ కలిసిపోయేవాడు.

ఒక మాటకు వంద మాటలు మాట్లాడే అపరిచిత బంధువు పాత్రలో కార్తీ, పది ప్రశ్నలు అడిగితే ఒక్క మాట మాట్లాడే సత్యం పాత్రలో అరవింద్ స్వామి కాంబినేషన్ అద్భుతంగా ఉంది. కార్తీ భార్యగా శ్రీ దివ్య, అరవింద్ స్వామి చెల్లి భువనగా స్వాతి బాగా నటించారు.

మిగిలిన పాత్రల స్క్రీన్ స్పేస్, కథలో ప్రాముఖ్యత తక్కువే అయినా, ప్రేక్షకుల్లో గొప్ప ఎమోషనల్ ఫీలింగ్‌ను కలిగించారు.

సత్యం సుందరం మూవీ

ఫొటో సోర్స్, X@Karthi_Offl

సినిమా ఎలా ఉంది?

ప్రేక్షకులు ఎమోషనల్‌గా స్టోరీతో కనెక్ట్ అయ్యేలా కథ నడుస్తుంది. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్‌తో సినిమా ఓపెన్ అవుతుంది.

సినిమా ఇద్దరి చుట్టే నడుస్తూ, ప్రేక్షకులు వాళ్లిద్దరితో పాటు ఉద్దండరాయుని పాలెంకు వెళ్ళిపోతారు.

పల్లెటూరి జ్ఞాపకాలు ఓ వైపు ప్రేక్షకులలో నొస్టాల్జియాను సృష్టిస్తాయి. ఇంకోపక్క కార్తీలాంటి సోదరుడో, బంధువో, మిత్రుడో ఉంటే బావుండు అనిపిస్తుంది.

కుటుంబానికి దూరంగా ఉన్నవాళ్లను ఒక పెళ్లి ఎలా దగ్గర చేస్తుంది? చిన్నప్పుడు పెట్టుకున్న కోపాలు, పంతాలు బంధువులను ఎలా దూరం చేస్తాయి? ప్రయత్నిస్తే ఆ పంతాలు ఎలా మాయమవుతాయో చెప్పీచెప్పకుండానే చెప్పిన సినిమా ఇది.

ప్రేమ మాత్రమే మనుషులకు కావాల్సింది అని చెప్పే సినిమా. అలాగే కృతజ్ఞత ఎంత గొప్పదో కూడా చెప్పే సినిమా ఇది.

మనుషుల మీద కోపం పెంచుకోవడానికి ఒక కారణం చాలు అని ఒక సత్యం అనుకుంటే, ప్రేమించడానికి ఉండే వెయ్యి కారణాలు చూసే వ్యక్తి సుందరం (అపరిచిత బంధువు).

మొత్తానికి సినిమా చివర్లో కార్తీ ప్రేమే గెలుస్తుంది, సత్యం జీవితాన్ని కొత్తగా చూసేలా చేస్తుంది.

కోపం పెంచుకున్న వాళ్లను క్షమించేలా చేస్తుంది. ప్రేక్షకులను కూడా ప్రేమతో చుట్టేసే సినిమా ఇది.

సత్యం-సుందరం సినిమా

ఫొటో సోర్స్, Asian Suresh Entertainment/Instagram

డబ్బింగ్, పాటలు.. ప్లస్ పాయింట్

తమిళంలో ‘మెయ్యళగన్’గా వచ్చిన ఈ సినిమా తెలుగులో 'సత్యం సుందరం'గా వచ్చింది. అన్ని పాత్రలకు డబ్బింగ్ చక్కగా నప్పింది. అది కూడా సినిమాకు ప్లస్ పాయింట్.

ఈ సినిమాకు పాటలు ప్లస్ పాయింట్. సినిమా మొదట్లో వచ్చే 'పోతూ... పోతూ ' పాట స్టోరీలో సత్యం ఎమోషన్స్‌ను ఎస్టాబ్లిష్ చేస్తుంది.

‘పెళ్లి పాట’ పెళ్ళిలో కలిసే బంధువులు, మిత్రులు అందరినీ చూపిస్తూ స్టోరీకి స్ట్రాంగ్ ఎమోషన్‌గా నిలుస్తుంది.

'పల్లెటూరు' మీద ఉన్న పాట పల్లెటూరి జ్ఞాపకాలను అందరూ గుర్తు తెచ్చుకునేలా చేస్తుంది. క్లైమాక్స్‌లో ‘ఎవరో’ పాట సత్యంలో మార్పును చక్కగా చూపిస్తుంది.

మంచి కథ, బలమైన స్క్రీన్‌ప్లేతో కొన్నిసార్లు ప్రేక్షకులను ఏడిపిస్తూ, ఇంకొన్నిసార్లు నవ్విస్తూ, గుర్తుండిపోయే క్లైమాక్స్‌తో, మొత్తం మీద ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సినిమానే ‘సత్యం సుందరం’.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)