ఈ నది ఎవరెస్ట్‌ ఎత్తు‌ను పెంచుతోంది, ఎలాగంటే...

ఎవరెస్ట్ శిఖరం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగిందని కొత్త అధ్యయనం ఒకటి వెల్లడించింది.

ఎవరెస్ట్ శిఖరం పాదాల వద్ద ప్రవహిస్తున్న అరుణ్ నది కారణంగా రాళ్లు, మట్టి కోసుకుని పోవడంతో ఎవరెస్ట్ ఎత్తు 15 నుంచి 50 మీటర్ల మేర పెరిగిందని ఈ అధ్యయనం చెబుతోంది.

అరుణ్ నది పరివాహక ప్రాంతంలో 75 కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోవడం వల్ల, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏడాదికి 2 మిల్లీమీట్లర్ల వరకు పెరుగుతోందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు తెలిపారు.

‘ఇది ఓడ నుంచి సరకులను విసిరేయడం లాంటిది’ అని ఈ అధ్యయన సహ రచయిత ఆడమ్ స్మిత్ అన్నారు.

‘దీని వల్ల ఓడ తేలికగా మారి, ఓడ కొద్దిగా పైకి తేలుతుంది. అదేవిధంగా, భూఉపరితలం తేలికగా మారినప్పుడు, ఎవరెస్ట్ శిఖరం కొంచెం పైకి లేస్తుంది’

4 నుంచి 5 కోట్ల ఏళ్ల కిందట భారతదేశం, యూరేసియా ఫలకాల(ఇండియన్ అండ్ యూరేసియన్ ప్లేట్స్) తాకిడి నుంచి కలిగిన ఒత్తిడి వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి.

ఖండ చలనం(ప్లేట్ టెక్టానిక్స్) హిమాలయాల ఎత్తు క్రమంగా పెరగడానికి ప్రధాన కారణం అయినప్పటికీ ఎవరెస్ట్ ఎత్తు పెరగడంలో అరుణ్ నది పాత్ర ఉన్నట్లు యూసీఎల్ టీం చెప్పింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అరుణ్ నది హిమాలయాల లోంచి ప్రవహిస్తున్నప్పుడు అది భూమి పటలాన్ని(క్రస్ట్) కోసుకుంటూ వెళ్తుంది.

దీని వల్ల ఇది మాంటిల్‌పై (భూప్రావారం - ఉపరితలం కింద ఉన్న పొర) భారాన్ని తగ్గిస్తుంది, దీని వలన పలుచబడిన ఉపరితల పొర వంగి పైకి తేలుతుంది.

ఈ ప్రభావాన్ని ఐసోస్టాటిక్ రీబౌండ్ అని పిలుస్తారు. నేచర్ జియోసైన్స్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. ఇలా పైకి నెట్టడం వల్ల ఎవరెస్ట్, పొరుగున ఉన్న ఇతర శిఖరాలు పైకి కదులుతున్నాయి.

‘ఎవరెస్ట్ పర్వతం, దాని పొరుగున ఉన్న శిఖరాలు పెరుగుతున్నాయి. అవి క్షీణించడం కంటే వేగంగా ఐసోస్టాటిక్ రీబౌండ్ వాటిని పైకి లేపుతోంది’ అని ఈ అధ్యయన సహ రచయిత డాక్టర్ మాథ్యూ ఫాక్స్ చెప్పారు.

‘జీపీఎస్ పరికరాలను ఉపయోగించి అవి సంవత్సరానికి రెండు మిల్లీమీటర్ల మేర పెరగడం మనం గమనించవచ్చు. ఇప్పుడు దాని వెనకున్న శక్తి ఏమిటో మాకు తెలిసింది’

ఈ అధ్యయనంలో పాలుపంచుకోని కొంతమంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు మాత్రం.. ఇలా జరిగే అవకాశం ఉన్నా, ఈ పరిశోధనలో ఇంకా చాలా అనిశ్చితి ఉందని అన్నారు.

ఎవరెస్ట్ శిఖరం చైనా, నేపాల్ సరిహద్దుల్లో ఉంది. దాని ఉత్తర భాగం చైనా వైపు ఉంది. అరుణ్ నది టిబెట్ నుంచి నేపాల్‌లోకి ప్రవహిస్తుంది. ఆ తరువాత అది రెండు ఇతర నదులతో కలిసి కోసిగా మారి ఉత్తర భారతంలో ప్రవేశించి గంగా నదిలో కలుస్తుంది.

పర్వతాల మధ్య నుంచి ప్రవహించే ఈ నది తన మార్గంలో రాళ్లను, మట్టిని కోసుకుంటూ వెళ్తుంది.

89,000 సంవత్సరాల క్రితం అరుణ్ నది టిబెట్‌లోని మరొక నది లేదా నీటి వనరులతో "కలిసిపోయినప్పుడు" దానికి ఇంత శక్తి వచ్చి ఉంటుందని యూసీఎల్ పరిశోధకులు అంటున్నారు.

అరుణ్ నది టిబెట్ నుంచి నేపాల్‌లోకి ప్రవహిస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరుణ్ నది టిబెట్ నుంచి నేపాల్‌లోకి ప్రవహిస్తుంది

యూసీఎల్‌ అధ్యయనంలో ప్రధాన రచయిత, చైనీస్ విద్యావేత్త, చైనా యూనివర్సిటీ ఆఫ్ జియోసైన్సెస్‌కు చెందిన డాక్టర్ జు హాన్.. ‘‘ఎవరెస్ట్ పర్వతం మారుతున్న ఎత్తు, భూ ఉపరితలానికి ఉన్న క్రియాశీల స్వభావాన్ని వెల్లడిస్తుంది. అరుణ్ నది కోత, భూమి మాంటిల్ ఒత్తిడి – ఈ రెండింటి మధ్య పరస్పర చర్య వల్ల ఎవరెస్ట్ శిఖరం పెరుగుతోంది,’’ అన్నారు.

యూసీఎల్ అధ్యయనం ప్రకారం, అరుణ్ నది టిబెట్‌లోని మరొక నది లేదా నీటి వ్యవస్థతో కలిసిపోయాక, దానికి రాళ్లను, ఇతర పదార్థాలను కోసే సామర్థ్యం పెరుగుతోంది.

ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ జియోసైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ హ్యూ సింక్లైర్ దీనిపై మాట్లాడుతూ.. యూసీఎల్ టీమ్ గుర్తించిన అంతర్లీన ప్రక్రియ సహేతుకమైనదే అని అన్నారు.

అయితే, నది ఎంత మేర కోత కోసింది, పర్యవసానంగా పరిసర శిఖరాలు ఏ మేరకు పెరిగాయన్న దానిపై చాలా అనిశ్చితి ఉందన్నారు.

ఈ అనిశ్చితిని అధ్యయన రచయితలూ అంగీకరించారు.

"అయినప్పటికీ, ఈ సందేహాలను పక్కన పెడితే, ఎవరెస్ట్ అసాధారణంగా పెరగడానికి, నది ప్రవాహానికి సంబంధం ఉందని వెల్లడి కావడం చాలా ఆసక్తిని కలిగించే విషయం’’ అని సింక్లైర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)