'కవలలుగా పుట్టడమే మా తప్పా?’: ఎనిమిదేళ్లుగా ఆధార్ కోసం తిప్పలు

నీలేష్, యోగేష్
    • రచయిత, సర్ఫరాజ్ సనదీ
    • హోదా, బీబీసీ కోసం

ఆధార్ కార్డు అప్‌డేట్ కాకపోవడంతో ఈ కవల సోదరులకు చదువు కష్టంగా మారడంతో పాటు, ఉద్యోగం విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఎనిమిదేళ్లుగా వీరితో పాటు, వీరి తల్లిదండ్రులూ ఆధార్ కార్డు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేటట్లు తిరుగుతున్నారు.

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాల్వా గ్రామంలో నివసిస్తున్న నీలేష్, యోగేష్ ఘల్గే ఇద్దరికీ 18 ఏళ్లు. వీరు ఐదు నిమిషాల తేడాతో జన్మించారు.

"మేం కవలలు కాకుంటే బాగుండేది" అని నీలేష్ నిరాశగా చెప్పారు. నీలేష్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతుండగా, యోగేష్ ఐటీఐ చదువుతున్నారు.

ఆరేళ్ల వయసులో నీలేష్‌, యోగేష్‌లకు ఆధార్‌ కార్డులు వచ్చాయి. కానీ, ఆ తర్వాత ఆ కార్డుల్లోని వివరాలను అప్‌డేట్ చేసేందుకు వెళ్లినప్పుడల్లా సమస్యలు వస్తున్నాయని వీరు చెబుతున్నారు.

ఎన్‌రోల్‌మెంట్, అథెంటిఫికేషన్ తర్వాత యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) భారత పౌరులకు 12 అంకెల ఆధార్ కార్డును జారీ చేస్తుంది.

‘‘నేను ఐదవ తరగతి చదువుతూ, ఆధార్ అప్‌డేట్ చేసేటప్పుడు నాకు సమస్యలు మొదలయ్యాయి. మేం అన్ని పత్రాలనూ సమర్పించాం, కానీ మా దరఖాస్తును తిరస్కరించారు. అప్పటి నుంచి చాలాసార్లు తిరిగి దరఖాస్తు చేశాం’’ అని నీలేష్ చెప్పారు.

మొదటిసారి ఆధార్ కార్డు కోసం వివరాలను నమోదు చేసేటప్పుడు లేదా గతంలో తీసుకున్న కార్డులో వివరాలను అప్‌డేట్ చేసేటప్పుడు పేరు, చిరునామా, లింగం, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ వంటి వివరాలు, మూడు రకాల బయోమెట్రిక్ సమాచారం అవసరం.

ఆధార్ కేంద్రంలో ముఖం, వేలిముద్రలు, ఐరిస్‌ స్కానింగ్ డేటాను నమోదు చేస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'దేవుడు బంగారాన్ని ఇచ్చాడు..'

యోగేష్, నీలేష్‌ల పేర్లు ఆధార్‌లో రిజిస్టర్ కాకపోవడానికి కారణం వీరి కళ్లు, ముఖం ఒకేలా ఉండడమే అని కొన్ని వార్తాపత్రికలలో కథనాలు ప్రచురించారు.

అయితే అసలు సమస్యేమిటో తమకు ఎవరూ చెప్పలేదని వీరి తండ్రి తానాజీ ఘల్గే బీబీసీతో అన్నారు.

అలాగే ప్రభుత్వ సూచనల మేరకు సమీప కేంద్రంలో ఫిర్యాదులు ఇచ్చామన్నారు.

“మాకు ఈ ఇద్దరు పుట్టినప్పుడు దేవుడు మాకు బంగారాన్ని ఇచ్చినట్లు అనిపించింది. పేదవాడినైన నా ఇంట్లో ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టారు. నేను చాలా సంతోషించాను. వీళ్లిద్దరినీ పోలీసు శాఖలో చేర్చాలన్నది నా కల" అని తానాజీ చెప్పారు.

కానీ తన కల కలగానే మిగిలిందని ఆయన అన్నారు.

తానాజీ, ఆయన భార్య సవిత ఇద్దరూ ద్రాక్ష తోటల్లో పనికి వెళతారు.

“కొన్నిసార్లు మేం అన్నం కూడా తినలేం. పిల్లలు ఏడిస్తే, మాకూ ఏడుపొస్తుంది. పాఠశాల, కళాశాల చదువులు ఎలాగో గడిచాయి. కానీ ఆధార్ లేకుంటే ఎలా?’’ అని ఆమె అన్నారు.

బాల్యంలో నీలేష్, యోగేష్
ఫొటో క్యాప్షన్, నీలేష్, యోగేష్

ఉద్యోగం పోయింది

కాలేజీలో అడ్మిషన్, స్కాలర్‌షిప్, రిజర్వేషన్, ప్రభుత్వ పథకాలు.. ఇలా ప్రతి విషయంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని ఈ కుటుంబం అంటోంది. ఆధార్ కార్డు లేకుంటే స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాలు పొందడం దాదాపు అసాధ్యం.

తాను స్కాలర్‌షిప్ ఫారమ్‌ సమర్పించలేకపోవడంతో ఐటీఐ కాలేజీలో పూర్తి ఫీజు చెల్లించాల్సి వచ్చిందని యోగేష్ చెప్పారు.

పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ సిమ్ కార్డ్, బ్యాంక్ ఖాతా తెరవడం... ఇలా అన్ని చోట్లా వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

18 ఏళ్లు నిండిన తర్వాత తనకు ఉద్యోగ అవకాశం వచ్చిందని, అయితే ఆధార్ సంబంధిత సమస్యల వల్ల రూ.15,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని కోల్పోయానని నీలేష్‌ చెప్పారు.

“కొల్హాపూర్ నుంచి ఉద్యోగం కోసం కాల్ వచ్చినప్పుడు, వాళ్లు ఆధార్ కార్డు అడిగారు. నువ్వు 12వ తరగతి పూర్తి చేసి ఉంటే, చిన్నప్పటి ఆధార్ కార్డు ఎందుకు పంపించావు? అంటూ నన్ను రిజెక్ట్ చేశారు. మాకు నైపుణ్యం ఉన్నా చాలాసార్లు ఇలా అవకాశాలు కోల్పోతున్నాం’’ అని నీలేష్ తెలిపారు.

ఘల్గే కుటుంబం
ఫొటో క్యాప్షన్, ఘల్గే కుటుంబం

ముంబయికి వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు

నీలేష్, యోగేష్ పోలీసు శాఖ లేదా సైన్యంలో చేరాలని కోరుకున్నారు. అందుకోసం ప్రాక్టీస్ కూడా చేశారు. కానీ ఇప్పుడు నిరాశతో ప్రాక్టీస్ మానేశారు.

“మేము నలుగురం కలిసినప్పుడల్లా, వేరే విషయం మాట్లాడము. ఆధార్ కార్డు ఎలా పొందాలి? ఎప్పుడు ఉద్యోగం పొందాలి అనేదే ఎప్పుడూ మా టాపిక్. ఆధార్ కార్డు లేనప్పుడు ప్రాక్టీసు ఎందుకు అని పిల్లలు అంటున్నారు. మీరు రిక్రూట్‌మెంట్ ఫారమ్‌ను పూరించలేకపోతే ప్రాక్టీస్ చేయడం ఎందుకని అడుగుతున్నారు?’’ అని సవిత చెప్పారు.

వాల్వాలోని ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ నమోదు చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. దాంతో వారిని ముంబయిలోని ప్రాంతీయ ఆధార్ నమోదు కార్యాలయానికి పంపినట్లు వాల్వా గ్రామ పంచాయతీ ఆధార్ కేంద్రం సిబ్బంది తెలిపారు.

అయితే, అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ కుటుంబం నిరాశతో గ్రామానికి తిరిగి రావాల్సి వచ్చింది.

“బయోమెట్రిక్ సరిపోలడం లేదు కాబట్టి మేము యూఐడీఏఐ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాం. నేనూ చాలా ప్రయత్నించాను. కానీ అసలు సమస్య ఏమిటో నాకూ స్పష్టంగా తెలియదు’’ అని వాల్వా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ నిర్వాహకుడు మహదేవ్ దేశాయ్ చెప్పారు.

‘‘అంతకుముందు నీలేష్ వేలిముద్రలు యోగేష్ పేరు మీద, యోగేష్ వేలిముద్రలు నీలేష్ పేరు మీద నమోదై ఉండే అవకాశం ఉంది. కానీ అసలు కారణం ఏమిటో నాకు తెలియదు. నేను ఫిర్యాదు చేశాను, వాళ్లు ముంబయికి వెళ్లి వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు’’ అని ఆయన అన్నారు.

డాక్టర్ దిలీప్ పట్వర్ధన్‌
ఫొటో క్యాప్షన్, డాక్టర్ దిలీప్ పట్వర్ధన్‌

కంటి రెటీనా సమస్యా?

బయోమెట్రిక్ ఎంట్రీ విషయంలో సమస్యలు తలెత్తడానికి కారణం ఏమై ఉంటుందని సాంగ్లీకి చెందిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ దిలీప్ పట్వర్ధన్‌ను బీబీసీ అడిగింది.

"మోనోజైగోట్ కవలల్లో సారూప్యతలు ఉంటాయి. కానీ కళ్ల విషయంలో అలా కాదు. కంటి రెటీనాను చూస్తే, అక్కడ జన్యుపరంగా రక్తనాళాలు వేరుగా ఉంటాయని గమనించవచ్చు. అధునాతన టెక్నాలజీ సాయంతో ఫొటోలు తీస్తే వాళ్లిద్దరి కళ్ల రెటీనా, ఫండస్ వేర్వేరుగా కనిపిస్తాయి. దీన్ని బయోమెట్రిక్ సాఫ్ట్‌వేర్‌లో చేరిస్తే, ఈ కవలలు ఆధార్ కార్డులు పొందడానికి ఎలాంటి సమస్యా ఉండదు’’ అని ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)