కుళ్లిన మాంసంలాంటి వాసనను వెదజల్లే ఈ పుష్పం దగ్గరకు జనం క్యూ కడుతున్నారు, ఎందుకంటే..

Titanum flower

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోసెలిన్ టింపర్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేను వెచ్చగా ఉన్న గ్లాస్‌హౌస్‌లో, వరుసగా నిలబడిన వ్యక్తుల వెనుక ఉన్నాను. మేమంతా ఒక వింత పుష్పాన్ని చూడటానికి ఇక్కడ ఉన్నాం. దాని పేరు, టైటాన్ ఆరమ్.

అత్యంత దుర్వాసన వెదజల్లే ఈ భారీ పుష్పం శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూ, ఆసక్తి రేకెత్తిస్తోంది. 1990ల నుంచి పరిశోధకులు దీని వింత నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించడం ప్రారంభించారు.

నేను ఇంతకు ముందెన్నడూ ఈ పువ్వును చూడలేదు. కాస్త దూరం నుంచే నాకు గులాబీ-ఊదారంగు కలగలిసిన రెక్కల మధ్య నుంచి కొన్ని మీటర్ల ఎత్తులో పొడుచుకు వచ్చిన కంకి లాంటిది కనిపించింది.

ఈ మొక్కకు చాలా పేర్లున్నాయి, కానీ ఇది వెదజల్లే వాసనను బట్టి ఇది ఒక పేరుతో బాగా ప్రసిద్ధి చెందింది. ఆ పేరు 'కార్ప్స్‌ ప్లాంట్'.

బ్రిటన్‌లోని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఎడిన్‌బర్గ్‌ (ఆర్బీజీఈ)లో దీనిని చూశాను. అక్కడ కొన్ని రోజులుగా, ఈ టైటాన్ ఆరమ్ స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ 22 ఏళ్ల మొక్క రెండు రోజులుగా పుష్పిస్తోంది. ఈ పువ్వు ఎక్కువ కాలం ఉండదు. అందువల్ల ఈ అసాధారణ పుష్పాన్ని చూసేందుకు వచ్చిన దాదాపు 2,000 మంది సందర్శకులలో నేనూ ఉన్నాను.

బీబీసీ న్యూస్, బీబీసీ న్యూస్ తెలుగు, వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టైటాన్ ఆరమ్ మొక్క

ఫొటో సోర్స్, RGBE

మనుషులను మింగేస్తుందనే ప్రచారం

టైటాన్ ఆరమ్ 2003లో నెదర్లాండ్స్‌ నుంచి భూమిలోని కందం రూపంలో ఎడిన్‌బర్గ్‌కు వచ్చింది. చివరిసారిగా 2010లో దానిని తూకం వేసినప్పుడు ఈ మొక్క 153.9 కిలోల బరువుంది.

ఆర్బీజీఈలో హార్టికల్చరిస్ట్ అయిన పౌలినా మాకీజెవ్స్కా-దారుక్ 13 సంవత్సరాలుగా ఈ మొక్కను జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. ఇది పెరగడం చాలా సులభం అని ఆమె చెప్పారు. "దీనికి కావలసిందల్లా అధిక ఉష్ణోగ్రత, అధిక మొత్తంలో నీరు, ఎరువులు. అంతే.." అని ఆమె వివరించారు.

ఇది సాధారణంగా పెరిగే ఇండోనేషియాలోని సుమత్రా ప్రాంతంలో కొన్ని పురాతన నమ్మకాల కారణంగా కొంతమంది ఈ మొక్కను చూసి భయపడతారని ఇండోనేషియాకు చెందిన వృక్షశాస్త్ర నిపుణులు యుజమ్మి తెలిపారు.

"ఈ మొక్కలోని పామును పోలిన ఆకు తొడిమ కారణంగా ఇది మనుషులను మింగేస్తుందనే ఒక తప్పుడు ప్రచారం ఉంది" అని ఆమె అన్నారు.

టైటాన్ ఆరమ్‌ను మొట్టమొదట 1878లో సుమత్రాలో ప్రయాణించిన ఇటాలియన్ వృక్ష శాస్త్రజ్ఞుడు ఒడోర్డో బెకారిచే ప్రపంచానికి పరిచయం చేశారు.

ఆకులు వేసే దశలో టైటాన్ ఆరమ్

ఫొటో సోర్స్, Jocelyn Timperley

ఫొటో క్యాప్షన్, ఆకులు వేసే దశలో టైటాన్ ఆరమ్

1889 తర్వాత యూకేలోని క్యూ గార్డెన్స్‌లో ఈ మొక్క మొదటిసారిగా పుష్పించింది. ఇది 1926లో రెండోసారి వికసించినప్పుడు, చాలామందిని ఆకర్షించింది. అప్పటి నుంచి, టైటాన్ ఆరమ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక బొటానికల్ గార్డెన్‌లకు వ్యాపించి, అవి పుష్పించినప్పుడు పతాక శీర్షికలలో కనిపిస్తున్నాయి.

యుజమ్మి చెప్పిన వివరాల ప్రకారం, ఈ మొక్కకు మొదటి పుష్పం రావడానికి దాదాపు 11 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది.

"నిజానికి ప్రజలను విస్తృతంగా ఆకర్షించే ఈ పుష్పం, నిజానికి పుష్పమే కాదు" అని యుజమ్మి చెప్పారు. "రంగురంగులుగా కనిపిస్తున్నవి ఆ పువ్వు రేకులు కాదు. అవి పరాగసంపర్కానికి దోహదపడే కీటకాలను ఆకర్షించే, ఫలదీకరణ ప్రక్రియలో ఉపయోగపడే రక్షిత నిర్మాణం మాత్రమే" అని వివరించారు.

ఈ భారీ పుష్పంలాంటి రక్షిత నిర్మాణాన్ని మొవ్వ అని పిలుస్తారు, అయితే నిజమైన పూలు చాలా చిన్నగా ఉంటాయి. ఇవి పెద్ద సంఖ్యలో ఉంటూ, పొడవైన, పసుపు రంగు స్పాడెక్స్ కింద కనిపిస్తాయి. వీటిలో కిందవి ఆడ పువ్వులు, పైవి మగ పువ్వులు. దీనర్థం టైటాన్ ఆరమ్ ప్రపంచంలో అతిపెద్ద పుష్పం కాదు, అతిపెద్ద పుష్ప నిర్మాణం.

టైటాన్ ఆరమ్ పుష్పం

ఫొటో సోర్స్, RGBE

ఫొటో క్యాప్షన్, టైటాన్ ఆరమ్ మొదటి పుష్పానికి ఒక దశాబ్ద కాలం పట్టింది

భరించలేని దుర్వాసన

టైటాన్ ఆరమ్ 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 2015లో మొదటిసారిగా వికసించింది. అప్పటి నుంచి ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి పుష్పిస్తోంది (నేను ఐదోసారి పుష్పించే సమయంలో సందర్శించాను).

దీని మరో ప్రత్యేకత – ఈ పువ్వు నుంచి వెలువడే దుర్గంధం. పుష్పించే సమయంలో, టైటాన్ ఆరమ్ పొడవైన పసుపు రంగు స్పాడిక్స్ చాలా ఘాటైన దుర్వాసనను వెదజల్లుతుంది.

దురదృష్టవశాత్తూ నేను వెళ్లేసరికి ఆ దుర్వాసన లేదు.

"ఆ వాసన భరించలేం" అని దారుక్ చెప్పారు.

"చాలామంది చాలా రకాలుగా ఆ దుర్వాసనను వర్ణిస్తారు. ఒకరు కుళ్ళిన చేపల వాసన అంటే, మరి కొందరు అది సాక్స్‌ను ఎక్కువ రోజులు వాడితే వచ్చే వాసన అంటారు. నాకైతే చెత్తకుండీ నిండినప్పుడు వచ్చే దుర్వాసనలాగా ఉంటుంది" అని దారుక్ వివరించారు.

కెనడాలోని బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన జేన్ హిల్, ఆ వాసన జంతు కళేబరాల వాసనలా ఉంటుందని అన్నారు. 2023లో నిర్వహించిన అధ్యయనంలో హిల్, ఆమె సహచరులు ఆడ, మగ పుష్పాల వాసన వెనుక ఉన్న కారణాన్ని విశ్లేషించడానికి ప్రయత్నించారు. ఆ మొక్క కొన్ని సెకన్ల పాటు ఈ దుర్గంధాన్ని వెదజల్లే అణువులను విడుదల చేస్తుందని ఆ సమయంలో ఆమె గమనించారు.

ఈ వాసనలు అనేక కీటకాలను ఆకర్షిస్తాయని ఆమె గుర్తించారు. పాలినేటర్లు (పుప్పొడిని తరలించడానికి ఉపయోగపడే కీటకాదులు) ఈ వాసనను కుళ్లిన మాంసంగా భావించి వాటి మీద వాలినప్పుడు, వివిధ మొక్కలలోని మగ, ఆడ పువ్వుల మధ్య పుప్పొడి మార్పిడికి కారణం అవుతాయి. (అన్ని టైటాన్ ఆరమ్స్‌లో మగ, ఆడ పుష్పాలు రెండూ ఉంటాయి. మగ పూలు, రేకులు లేని ఆడ పూల పైన ఉంటాయి).

స్పాడెక్స్ థర్మల్ ఇమేజ్

ఫొటో సోర్స్, SRUC

ఫొటో క్యాప్షన్, వేడిని ప్రసరిస్తున్న స్పాడెక్స్ థర్మల్ ఇమేజ్

దాని పువ్వులు పరిపక్వం చెందినప్పుడు ఈ వాసన మరింత ఘాటుగా ఉంటుందని యుజమ్మి చెప్పారు. ఈ దుర్వాసన పేడపురుగులు, బొద్దింకలు, ఈగలు వంటి ఇతర కీటకాలను ఆకర్షిస్తుందని వెల్లడైంది.

వాస్తవానికి, కొన్ని కీటకాలు ఈ మొక్కను జతకట్టడానికి ఒక ప్రదేశంగా ఉపయోగించినట్లు నివేదించారు.

కీటకాలను ఆకర్షించడంలో సహాయపడటానికి ఈ మొక్క వేడిని కూడా ప్రసరిస్తుంది.

"ఈ వేడి పాలినేటర్స్‌ను ఆకర్షించడంలో సహాయపడుతుంది’’ అని సుమత్రాలో 30 సంవత్సరాలకు పైగా పనిచేసిన ఆర్బీజీఈలో వృక్షశాస్త్రజ్ఞుడు పీటర్ విల్కీ, అన్నారు. ఈ వేడి 36 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుకోవచ్చని పరిశోధనలో తేలింది. ఇది మానవ శరీర ఉష్ణోగ్రతతో సమానం.

టైటాన్ ఆరమ్‌ పుష్పం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, టైటాన్ ఆరమ్‌లో నిజమైన పువ్వులు చాలా చిన్నగా ఉంటాయి, ఇవి పొడవైన, పసుపు రంగు స్పాడిక్స్ కింద కనిపిస్తాయి; పైన కనిపించేవి మగపువ్వులు, కిందివి ఆడపువ్వులు

ఆకర్షిస్తుంది కానీ భక్షించదు

అయితే, చాలా మంది అపోహ పడేటట్లు టైటాన్ ఆరమ్ మాంసాహారి కాదు. ఇది పరాగసంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తుంది, అంతే కానీ వాటిని భక్షించదు.

ఇంత పేరు పొందిన ఈ మొక్కపై ఇప్పటివరకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ అసెస్‌మెంట్ జరగలేదని తెలిసి 2015లో, విల్కీ ఆశ్చర్యపోయారు.

"ఐయూసీఎన్ రెడ్ లిస్టింగ్ అనేది ఒక అంతరించే పోయే జాతిని అంచనా వేయడానికి చాలా ప్రామాణికమైనది" అని ఆయన అన్నారు. ఇందుకోసం ఆయన యూజమ్మి, ఆర్బీజీఈకి చెందిన హార్టికల్చరిస్ట్ సాడీ బార్బర్‌తో కలిసి, 2018లో ఆ అసెస్‌మెంట్‌ను ప్రచురించారు. దాని ప్రకారం టైటాన్ ఆరన్ అంతరించిపోయే స్థితిలో ఉంది.

సుమత్రాలో, గత 90-150 సంవత్సరాలలో వీటి సంఖ్య 50% తగ్గిందని, ఇప్పుడు అడవులలో 1,000 కంటే తక్కువ మొక్కలు ఉన్నాయని దీనిలో వెల్లడైంది.

అక్రమంగా చెట్లను నరికివేయడం, అడవులను వ్యవసాయ భూమిగా మార్చడం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇవి తగ్గిపోవడం సంభవిస్తోందని యూజమ్మి చెప్పారు. అలాగే ఇది మనుషులనే మింగేస్తుందనే స్థానిక కథనాలూ, వైద్యంలో ఉపయోగపడుతుందనే నమ్మకాలూ దీనికి ముప్పుగా పరిణమించాయి.

అయితే సుమత్రాలో ఇది ఇప్పటికీ విస్తృతంగా ఉందని, అదొక్కటే సంతోషించాల్సిన విషయం అని విల్కీ అన్నారు. ఈ మొక్క పరిరక్షణకు ఇండోనేషియా ప్రభుత్వం చట్టం కూడా చేసింది.

పుష్పించిన మూడు వారాల తర్వాత టైటార్ ఆరమ్‌తో మాకీజెవ్స్కా-దారుక్

ఫొటో సోర్స్, Jocelyn Timperley

ఫొటో క్యాప్షన్, పుష్పించిన మూడు వారాల తర్వాత టైటార్ ఆరమ్‌తో దారుక్

టైటాన్ ఆరమ్‌కు చెందిన గులకరాయి పరిమాణంలోని ఎరుపు పళ్లు ఫలదీకరణం జరిగిన తొమ్మిది నెలల తర్వాత కనిపిస్తాయి. వీటిలో ప్రతి దానిలో రెండు విత్తనాలు ఉంటాయి. అడవుల్లో ఖడ్గమృగం, హార్న్‌బిల్‌లాంటి పక్షులు వాటిని తిని, వాటి వ్యాప్తికి కారణమవుతాయి. అయితే ఇలా పండ్లను ఉత్పత్తి చేయడం ఈ మొక్కకు చాలా ‘అలసట’తో కూడుకున్నదని దారుక్ చెప్పారు. అందువల్ల పళ్లను ఉత్పత్తి చేశాక ఈ మొక్క చనిపోయే ప్రమాదం ఉంది.

నేను మరోసారి ఆర్బీజీఈని సందర్శించినప్పుడు ఆ మొక్క ఒక వైపుకు పడిపోయింది. మూడు వారాల తర్వాత అక్కడ మిగిలింది పసుపు-గోధుమ రంగులోని ఒక కుప్ప మాత్రమే. మాకీజెవ్స్కా-దారుక్ కుండలోని మట్టిని త్రవ్వినప్పుడు, మిగిలింది కేవలం నేలలో ఉన్న దాని కందం మాత్రమే. అప్పుడు ఆ మొక్క మరోసారి నిద్రాణ దశలోకి వెళుతోంది. అది పుష్పించడానికి మరి కొన్నేళ్లు పడుతుంది.

ఆ దృశ్యాన్ని మళ్లీ చూసే అవకాశం రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. "మేము దాన్ని చూసిన ప్రతిసారీ, దాని నుంచి కొన్ని వివరాలను సేకరిస్తాము, దాని పనితీరును తెలుసుకుంటాము" అని విల్కీ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)