ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు, అసలేం జరిగిందంటే..

ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణుల దాడి

ఫొటో సోర్స్, Reuters

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ కూడా ఈ దాడులను ధ్రువీకరించింది.

ఇరాన్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు సైన్యం తెలిపింది.

ఇజ్రాయెల్‌లోని ఏఏ ప్రాంతాలలో గగనతల దాడులు జరగొచ్చో సూచిస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఒక మ్యాప్ విడుదల చేసింది.

సైరన్ వినిపించగానే ప్రజలు బాంబ్ షెల్టర్లలోకి వెళ్లాలని సూచించింది.

ఈ ఏడాది ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసిన రెండో దాడి ఇది. ఏప్రిల్‌లో వందకు పైగా క్షిపణులను ఇజ్రాయెల్ మీదికి ఇరాన్ ప్రయోగించింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్షిపణులను ఇరాన్ ప్రయోగించినట్లు తెలుస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు దాడి

ఫొటో సోర్స్, Getty Images

స్థానిక కాలమానం ప్రకారం, రాత్రి 7.45 గంటలప్పుడు టెల్ అవీవ్ గగనతలంలో క్షిపణులు దూసుకెళ్లడం ఇజ్రాయెలీ టీవీలో కనిపించింది.

ఉత్తర ఇజ్రాయెల్‌లో ఆకాశం నారింజ రంగులో కనిపించిందని.. తల పైకెత్తి చూస్తే మిసైల్స్ దూసుకెళ్తుండడం కనిపించిందని బీబీసీ యూరప్ కరస్పాండెంట్ నిక్ బీక్ చెప్పారు.

ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ పౌరులు బాంబ్ షెల్టర్లలోకి వెళ్తున్నారని.. ఇజ్రాయెల్ అంతటా అదే పరిస్థితి ఉందని చెప్పారు.

జెరూసలెంలోని బీబీసీ బ్యూరో కూడా సురక్షితమైన షెల్టర్‌లోకి తరలిపోయినట్లు అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తున్న బీబీసీ ప్రతినిధి అలైస్ కడ్డీ చెప్పారు.

తాము ఉన్న షెల్టర్ బయట సైరన్లు వినిపిస్తున్నాయని.. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఇరాన్ మిసైళ్లను అడ్డుకున్నప్పుడంతా ఆ చప్పుడు వినిపిస్తోందని చెప్పారు.

తాజా దాడులతో ఇజ్రాయెల్‌లో ఎంత నష్టం జరిగిందన్న వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.

The IDF shared a graphic showing the locations of the air raid alerts issued across Israel in the past few minutes

ఫొటో సోర్స్, Israel Defense Forces

ఫొటో క్యాప్షన్, గగనతల దాడులు జరుగుతాయంటూ ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల మ్యాప్
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు, ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకుంటున్న దృశ్యాలు

మొత్తం ఇరాన్ ఎన్ని క్షిపణులు ప్రయోగించింది?

ఇరాన్ సుమారు 180 క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. ఇది ఏప్రిల్‌లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య కంటే ఎక్కువ. అప్పుడు దాదాపు 110 బాలిస్టిక్ క్షిపణులు, 30 క్రూయిజ్ మిసైల్స్‌ను ఇరాన్ ప్రయోగించింది.

ఇజ్రాయెల్‌‌కు చెందిన మూడు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) వర్గాలు తెలిపాయని స్థానిక మీడియా పేర్కొంది. తమ బలగాలు మొదటిసారి హైపర్‌సోనిక్ క్షిపణులను వాడాయని, తాము ప్రయోగించినవాటిలో 90 శాతం క్షిపణులు లక్ష్యాలను చేరుకున్నాయని ఐఆర్‌జీసీ తెలిపింది.

అయితే, అందులో చాలా క్షిపణులను అమెరికా ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ కమాండ్ సహాయంతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ సమర్థంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ భద్రతాదళాలకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.

ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్

ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ ఎలా అడ్డుకోగలిగింది?

గగనతల దాడులను అడ్డుకునే వ్యవస్థ ఇజ్రాయెల్ వద్ద ఉందని బీబీసీ డిప్లమేటిక్ కరస్పాండెంట్ పాల్ ఆడమ్స్ చెప్పారు.

హమాస్, హిజ్బుల్లా వంటి గ్రూపులు ప్రయోగించే షార్ట్ రేంజ్ రాకెట్లను సమర్థంగా నిలువరించే ఐరనో డోమ్ వ్యవస్థ ఇజ్రాయెల్‌కు ఉంది.

అయితే, అంతకంటే ప్రమాదకరమైన, బలమైన దాడులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ వద్ద డేవిడ్స్ స్లింగ్ వ్యవస్థ ఉంది. ఇది లాంగ్ రేంజ్ రాకెట్లతో పాటు బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైళ్లను కూడా నిలువరించగలుగుతుంది.

ఇక భూవాతావరణాన్ని దాటి ప్రయాణిస్తూ దాడి చేయగలిగే లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగిస్తే, అలాంటివాటినీ అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ వద్ద ఏరో 2, ఏరో 3 ఇంటర్‌సెప్టర్స్ ఉన్నాయి.

యెమెన్‌లోని హూతీ రెబల్స్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లను ఎదుర్కోవడానికి ఏరో 2, ఏరో 3లను వాడారు.

ఏప్రిల్ నెల మధ్యలో ఇరాన్ జరిపిన గగనతల దాడుల సమయంలో ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న ఈ అన్నిరకాల నిరోధక వ్యవస్థలను ఉపయోగించింది.

ఇరాన్ క్షిపణి దాడులు

ఫొటో సోర్స్, Reuters

బదులు తీర్చుకుంటాం: ఇజ్రాయెల్

మంగళవారం రాత్రి మొదలైన ఈ దాడులు ప్రస్తుతానికి ఆగినట్లే ఉన్నాయని.. ప్రజలు బాంబ్ షెల్టర్ల నుంచి బయటకు రావొచ్చని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారని బీబీసీ డిప్లమేటిక్ కరస్పాండెంట్ పాల్ ఆడమ్స్ చెప్పారు.

దేశ గగనతలాన్ని కూడా తిరిగి ఓపెన్ చేసినట్లు ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ చెప్పిందన్నారు.

క్షిపణులు పడిన ప్రాంతాలకు అత్యవసర సేవల విభాగాల సిబ్బంది చేరుకున్నారు. అయితే, ఇంతవరకు ఎవరూ గాయపడినట్లు కానీ, చనిపోయినట్లు కానీ తెలియలేదు.

మరోవైపు ఇరాన్ దాడులకు ప్రతిచర్య తప్పదని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హాగరీ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)