క్వాడ్ సదస్సు: ‘ఆస్ట్రేలియాలో భారత్ గూఢచర్యం’ వివాదమేంటి? మోదీతో ఆ దేశ ప్రధాని ఏం చెప్పబోతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాలో గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న భారత గూఢచారుల బహిష్కరణ అంశంపై ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఒక వ్యాఖ్య చేశారు.
ఇలాంటి అంశాలను ప్రైవేటుగా చర్చిస్తామని ఆయన శనివారం అన్నారు.
క్వాడ్ సభ్య దేశాల సదస్సుకు హాజరయ్యేముందు విలేఖరులతో ఆంథోనీ ఆల్బనీస్ మాట్లాడారు. భారత ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా భారత పౌరుల గూఢచర్యం అంశాన్ని లేవనెత్తుతారా అని ఆల్బనీస్‌ను విలేఖరులు ప్రశ్నించారు.
భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ దేశాల మధ్య జరిగే క్వాడ్ సదస్సు కోసం మోదీ, అమెరికాలో పర్యటిస్తున్నారు.
క్వాడ్ సదస్సులో పాల్గొనడమే కాకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌లతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.


ఫొటో సోర్స్, Asio
ఆస్ట్రేలియా ప్రధాని ఏమన్నారు?
విలేఖరులు ఆల్బనీస్‌ను అడిగిన భారత పౌరుల గూఢచర్యం వ్యవహారం 2020 నాటిది. కానీ, ఈ ఏడాది ఏప్రిల్‌లో దీని గురించి అందరికీ తెలిసింది.
‘‘ఆస్ట్రేలియా గడ్డపై ఇలాంటి గూఢచర్యం పనుల్ని మానుకోండి. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి’’ అని మోదీకి మీరు చెబుతారా అని గత గురువారం ఫిలడెల్ఫియాలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆల్బనీస్‌ను ఒక జర్నలిస్టు అడిగారు.
ఆంథోనీ ఆల్బనీస్ ఈ ప్రశ్నకు బదులిచ్చారు.
‘‘దౌత్యపరంగా ముందుకెళ్లడం, ఈ అంశంపై చర్చించడం వంటి పనుల్ని నేను చేయగలను. దీనిపై చర్చ జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్, ఆస్ట్రేలియా దేశాలది చాలా పటిష్టమైన బంధం. సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంపై పరస్పర ఏకాభిప్రాయం ఉండాలని మేం కోరుకుంటున్నాం. మోదీతో దీని గురించి నేను చర్చిస్తా. రెండు దేశాల మధ్య మరింత బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి’’ అని ఆల్బనీస్ చెప్పారు.
‘‘గూఢచర్యానికి సంబంధించిన అంశాలను వ్యక్తిగతంగా మాట్లాడతా. అలాంటి అంశాలను దౌత్యమార్గాల ద్వారా చర్చించాలి. నేను ఈ విధానాన్నే కొనసాగిస్తా’’ అని ఆల్బనీస్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Alex Ellinghausen / Sydney Morning Herald via Getty Images
భారత్‌పై గూఢచర్యం ఆరోపణలు ఏంటి?
ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం, 2020లో గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరు భారతీయులను ఆస్ట్రేలియా బహిష్కరించింది.
రక్షణ ప్రాజెక్టులు, విమానాశ్రయ భద్రతకు సంబంధించిన సున్నితమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించారని ఆ ఇద్దరు భారతీయులపై ఆరోపణలు వచ్చాయి.
ఇద్దరు భారతీయ గూఢచారులను దేశం నుంచి బహిష్కరించారని ‘ద ఆస్ట్రేలియన్’, ‘ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ వార్తా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. బహిష్కరణకు గురైన వ్యక్తుల సంఖ్యను ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఏబీసీ) ప్రస్తావించలేదు.
2020లో ఆస్ట్రేలియాలో స్థానికుల్లా పనిచేస్తోన్న విదేశీ ఏజెంట్లను గుర్తించినట్లు 2021 ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ మైక్ బర్గెస్ చెప్పారు.
ఈ విదేశీ ఏజెంట్లు ఏ దేశానికి చెందినవారో ఆయన వెల్లడించలేదు.
అయితే, అదే వారంలో పలు వార్తాపత్రికలు ఈ వార్తల్ని ప్రచురించాయి. బర్గెస్ ప్రస్తావించిన విదేశీ ఏజెంట్లకు భారత్‌తో సంబంధాలు ఉన్నాయని తమ కథనాల్లో ఆ వార్తాసంస్థలు పేర్కొన్నాయి.
ఈ వార్తల్ని ఆస్ట్రేలియా ధ్రువీకరించలేదు. అలాగే కొట్టిపారేయలేదు. విదేశీ జోక్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ సమయంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ జిమ్ చాల్మర్స్, ఏబీసీ వార్తాసంస్థతో మాట్లాడారు.
‘‘ఇలాంటి వాటిలో మేం జోక్యం చేసుకోవాల్సిన పని లేదు. భారత్‌తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవి కీలకమైన ఆర్థిక సంబంధాలు’’ అని ఆయన అన్నారు.
ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ఏఎస్‌ఐఓ) చీఫ్ మైక్ బర్గెస్ మాట్లాడుతూ, ‘‘గూఢచారి బృందాలు 2020 సమయంలో మాజీ, ప్రస్తుత రాజకీయ నాయకులతో, ఒక విదేశీ ఎంబసీ, ఒక ప్రభుత్వ పోలీస్ సర్వీస్ విభాగంతో సంబంధాలు (టార్గెటెడ్ రిలేషన్‌షిప్) ఏర్పరచుకున్నాయి’’ అని వెల్లడించారు.
‘‘వారు దేశంలోని ప్రవాస సముదాయంపై నిఘా పెట్టారు. ఒక కీలక విమానాశ్రయంలోని భద్రత ప్రమాణాల గురించి ఒక ప్రభుత్వ ఉద్యోగిని అడిగి తెలుసుకున్నారు. ఆస్ట్రేలియా వాణిజ్య సంబంధాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు’’ అని ఆయన వివరించారు.
ఆస్ట్రేలియా రక్షణకు సంబంధించిన సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన ఒక ఆస్ట్రేలియా పౌరుడిని కూడా సదరు గూఢచారులు నియమించుకున్నారని బర్గెస్ చెప్పారు.
‘‘గూఢచారుల గ్రూప్‌ను భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీయే నడిపించింది. తర్వాత స్కాట్ మోరిసన్ నేతృత్వంలోని సర్కారు కొంతమంది భారతీయ అధికారులను బహిష్కరించింది’’ అని తమ కథనంలో ఏబీసీ పేర్కొంది.
‘‘ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేపట్టిన ఒక ఆపరేషన్‌లో భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)కు చెందిన ఇద్దరు సభ్యులు బహిష్కరణకు గురయ్యారు’’ అని అదే వారంలో ‘వాషింగ్టన్ పోస్ట్’ ఒక కథనంలో రాసింది.
కానీ, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలను ఊహాజనిత నివేదికలుగా పేర్కొంటూ కొట్టిపారేసింది.
ఆస్ట్రేలియాలో ఇద్దరు భారత గూఢచారుల బహిష్కరణ అంశంపై ప్రశ్నించినప్పుడు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ‘‘ఇవి ఊహాజనిత వార్తలు. ఇలాంటి వాటిపై మేం చెప్పాల్సింది ఏమీ లేదు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
గూఢచర్యం విషయంలో భారత్‌పై కెనడా ఆరోపణలు
సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చని నిరుడు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించారు.
‘‘నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం హస్తం ఉండొచ్చని కెనడా ఏజెన్సీలు నిర్ధరించాయి. మా దేశ గడ్డ మీద ఒక కెనడా పౌరుడి హత్య వెనుక విదేశీ ప్రభుత్వం ఉండటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లే’’ అని ట్రూడో వ్యాఖ్యానించారు.
కెనడాలో జరిగిన ఎలాంటి హింసలోనూ భారత్ ప్రమేయం లేదు అని ట్రూడో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది.
ట్రూడో ఆరోపణల తర్వాత భారత్, కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
2023 జూన్ 18న కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఉన్న ఒక గురుద్వారా దగ్గర ఆయనను కాల్చి చంపారు.
నిజ్జర్, కెనడాలో ఒక ప్రముఖ సిక్కు నాయకుడు. ఆయన బహిరంగంగానే ఖలిస్థాన్ ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు. 2020 జులైలో నిజ్జర్‌ను భారత్ ఒక తీవ్రవాదిగా ప్రకటించింది.
కెనడాలో ఎప్పటినుంచో ఖలిస్థాన్ మద్దతుదారులు నిరసనలు చేస్తున్నారు. ఈ అంశంపై భారత్ ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














