ఇజ్రాయెల్‌ వెళ్లిన భారతీయ కార్మికులు ఎలా ఉన్నారు? వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు

దినేష్ సింగ్ భార్య అనిత
ఫొటో క్యాప్షన్, ఉపాధి కోసం ఇజ్రాయెల్ వెళ్లిన దినేష్ సింగ్ భార్య అనిత
    • రచయిత, సయ్యద్ మోజెజ్ ఇమామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు పెరగడంతో భారతీయులూ ప్రభావితమవుతున్నారు.

ఇరాన్ మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడినప్పుడు, ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న భారతీయుల కుటుంబాలలో ఆందోళన పెరిగింది.

ఈ దాడుల తరువాత పలుసార్లు వీడియో కాల్స్ చేసి తమ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో ఇక్కడ వారు తెలుసుకుంటున్నారు.

అంతా బాగుందంటూ ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న వారు ఇక్కడి తమ కుటుంబ సభ్యులకు చెప్తున్నారు.

ఇజ్రాయెల్‌లోని పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరి కుటుంబ సభ్యులతో బీబీసీ మాట్లాడింది.

ఇజ్రాయెల్‌లో వేల మంది భారతీయులు ఉన్నారు.

వీరిలో సగం మందికి పైగా కార్మికులు గత ఏడాది కాలంలో అక్కడి వెళ్లినవారే.

హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడడంతో అక్కడ పనిచేసే కార్మికుల సంఖ్య తగ్గిపోయింది.

దీంతో కార్మికుల కొరత ఏర్పడి ఇజ్రాయెల్ ప్రభుత్వం భారతీయ కార్మికులను నియమించుకునే ప్రక్రియ ప్రారంభించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గురువారం నుంచి నవరాత్రులు కావడంతో, ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సలేహ్‌నగర్‌లోని కొత్త కాలనీలో ఒక దేవాలయంలో పెయింటింగ్ వర్క్ జరుగుతోంది.

ఈ ఆలయానికి కొంత దూరంలో ఉన్న దినేష్ సింగ్ ఇంటి ముందు ప్రజలు గుమిగూడారు.

దినేష్ ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల గురించి ఆయన సమాచారం అందిస్తున్నారు.

‘‘ఉదయమే మేం వీడియో కాల్‌లో మాట్లాడాం. దాడి తర్వాత రాత్రి పూట కూడా దినేష్ కాల్ చేశారు. మళ్లీ మేం ప్రయత్నించినప్పుడు, నెట్‌వర్క్ సమస్య వల్ల కాల్ కనెక్ట్ కాలేదు. కొంతసమయం పాటు ప్రయత్నించిన తర్వాత, మేం ఆయనతో మాట్లాడగలిగాం. మా భయాన్ని దినేష్‌కు తెలియజేశాం’’ అని ఆయన భార్య అనిత చెప్పారు.

ఒకవేళ ఎక్కువ ఇబ్బందిగా ఉంటే, వెనక్కి వచ్చేయమని తాము చెప్పామని అనిత తెలిపారు.

‘ఒకవేళ సమస్య పెరిగితే, అక్కడున్న వారిని ప్రభుత్వం వెనక్కి తీసుకురావాలి’’ అని దినేష్ సింగ్ సోదరుడు కేసర్ సింగ్ అన్నారు.

ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో లఖ్‌నవేలో చాలామంది ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం అయిదు వేల మందికి పైగా భారత కార్మికులు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు.

ప్రభుత్వ డేటా ప్రకారం, ఈ ఏడాది ప్రారంభంలో 4,800 మంది ఇజ్రాయెల్ వెళ్లగా, గత నెలలో సుమారు 1,500 మంది వెళ్లారు.

ఇజ్రాయెల్ వెళ్లిన వారి కుటుంబాలు
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ వెళ్లిన వారి కుటుంబాలు

వారిలో భంవర్ సింగ్ సోదరుడు రాకేష్ సింగ్ కూడా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌ సమీపంలో నివసిస్తున్నారు. తన సోదరుడి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు ఆయనకు వీడియో కాల్స్ చేస్తున్నారు.

‘‘చాలా బాంబులు పడుతున్నాయని నా సోదరుడు చెబుతున్నాడు. సైరన్ వినిపించినప్పుడు, బంకర్లోకి వెళ్లాలని చెప్పాడు’’ అని భంవర్ సింగ్ చెప్పారు.

ఆ గ్రామం, దాని పరిసర ప్రాంతాల నుంచి 24 మంది వరకు అక్కడికి వెళ్లారు. మరికొందరు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఆ గ్రామంలో కిరాణా దుకాణాన్ని నడిపే రాజు సింగ్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘మా ఊరిలో 20 నుంచి 25 మంది ఇజ్రాయెల్‌ వెళ్లారు. వారిలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో వెనక్కి వచ్చారు. గ్రామంలో మరికొందరు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రజలు అక్కడికి వెళ్లాలనుకుంటున్నారు. యుద్ధం వల్ల కొందరు ప్రస్తుతం అక్కడికి వెళ్లలేకపోవచ్చు’’ అని రాజు సింగ్ చెప్పారు.

రాకేష్ సింగ్ తండ్రి వినోద్ సింగ్
ఫొటో క్యాప్షన్, రాకేష్ సింగ్ తండ్రి వినోద్ సింగ్

నిరుద్యోగం పెరుగుతోంది

‘‘మూడు నిమిషాల ముందు సైరెన్ సౌండ్లు విన్నట్లు నా సోదరుడు చెప్పాడు. వాళ్లందరూ బంకర్‌లోకి వెళ్లినట్లు తెలిపాడు. నా సోదరుడికి లక్షా 85 వేల జీతం వస్తుంది’’ అని మహేంద్ర సింగ్ తెలిపారు.

మీడియా కథనాల ప్రకారం, ఇజ్రాయెల్‌కు ప్రస్తుతం 10 వేల మందికి పైగా కార్మికులు అవసరం.

దీనికోసం ప్రస్తుతం భారతీయ యువతకు శిక్షణ కూడా ఇస్తున్నారు.

శిక్షణ ఇచ్చేందుకు సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్ అధికారుల బృందం భారత్‌కు వచ్చింది.

లఖ్‌నవూలోని అలీగంజ్ ఐటీఐలో ఇజ్రాయెల్‌ వెళ్లాలనుకునే వారికి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందే యువత త్వరలోనే ఇజ్రాయెల్ వెళ్తారు.

నిరుద్యోగంతో తాను అక్కడకు వెళ్లాల్సి వస్తుందని శిక్షణ పొందుతున్న యువకుల్లో ఒకరైన చంద్రశేఖర్ సింగ్ చెప్పారు.

‘‘అక్టోబర్ 2న సెలవు. కానీ, ఐటీఐలో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ పని దొరకడం చాలా కష్టంగా మారింది. ప్రజలకు ఎలాంటి ఆప్షన్ లేదు. మా శిక్షణ కొనసాగుతోంది. కానీ, మేమెప్పుడు వెళ్లాల్సి ఉంటుందో ప్రభుత్వం మాకు ఇంకా చెప్పలేదు’’ అని చంద్రశేఖర్ సింగ్ అన్నారు.

ఇజ్రాయెల్‌లో పనిచేస్తోన్న భారతీయుల కుటుంబాలు
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌లో పనిచేస్తోన్న భారతీయుల కుటుంబాలు

సెంటర్ ఫర్ మోనటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) రిపోర్టు ప్రకారం.. భారత్‌లో నిరుద్యోగ రేటు 2024 జూన్‌లో 9.2 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 9.3 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 8.9 శాతంగా ఉంది.

ఇజ్రాయెల్ వెళ్లడంతో తమకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయని బీబీసీ కలిసిన చాలా కుటుంబాలు చెప్పాయి.

అక్కడికి వెళ్లడంతో నెలకు రూ.లక్ష నుంచి రెండు లక్షల మధ్య సంపాదిస్తున్నట్లు తెలిపాయి.

తామెలాంటి ప్రమాదంలో లేమని ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు తమ కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. కానీ, ప్రతి రోజూ తాము నివసించే ప్రాంతంలో సైరెన్ సౌండ్లను వింటున్నట్లు చెప్పారు.

బంకర్‌లోకి వెళ్లాలని మొబైల్‌కు అలర్ట్ వస్తుందని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)