అతుల్: ఐఐటీలో సీట్లు అయిపోతే అదనపు సీటు సృష్టించమని సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ కేసు ఏంటి ?

ఫొటో సోర్స్, AMIT SAINI
- రచయిత, అమిత్ సైనీ
- హోదా, బీబీసీ కోసం
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా టిటోడా గ్రామంలో దళిత కూలీ రాజేంద్రకుమార్ ఇంట్లో వాతావరణం సందడిగా ఉంది.
గ్రామస్థులు డప్పులు వాయిస్తూ, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత రాజేంద్ర 18 ఏళ్ల కొడుకు అతుల్ కుమార్‌కు ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు ఖాయం కావడమే ఈ ఆనందానికి కారణం.
"సుప్రీంకోర్టుకు నా కృతజ్ఞతలు. ఈ రోజు సుప్రీంకోర్టు నేను కోల్పోయిన సీటును తిరిగి ఇచ్చింది" అన్నారు అతుల్.
ఇది న్యాయానికి లభించిన విజయమని, సుప్రీంకోర్టు నిర్ణయం చరిత్రాత్మకమని అతుల్ తండ్రి రాజేంద్ర అన్నారు.
కేవలం రూ.17,500 ఫీజును సకాలంలో చెల్లించకపోవడంతో అతుల్ కుమార్ ఐఐటీ ధన్‌బాద్ సీటు రద్దయింది.
సెప్టెంబరు 30న, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్, ఈ కేసులో తీర్పును వెలువరించింది.
ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు ఖాళీ లేకపోతే అదనపు సీటు సృష్టించాలని ఆదేశించింది.


ఫొటో సోర్స్, AMIT SAINI
ప్రధాన న్యాయమూర్తే 'ఆల్ ది బెస్ట్' అని చెప్పిన వేళ...
సుప్రీంకోర్టు ఆదేశాలతో దళిత విద్యార్థి అతుల్‌కు ఐఐటీ ధన్‌బాద్‌లో చదువుకునే అవకాశం దక్కింది.
అతుల్ తరపున ఈ కేసును వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది అమోల్ చితాలే మాట్లాడుతూ, “చదువుకు డబ్బు అడ్డంకి కాకూడదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తీర్పులో చెప్పారు. అతుల్ సరైన సమయంలో ఫీజు కట్టలేకపోవడంతో అడ్మిషన్ ఆగిపోయింది’’ అన్నారు.
‘‘సీట్లు అన్నీ అప్పటికే భర్తీ కావడంతో, అతుల్ అడ్మిషన్ కోసం ఇతర విద్యార్థులకు సమస్యలు రాకూడదని, అతుల్ కోసం ప్రత్యేక సీటును సృష్టించాలని మేము కోర్టును ఆశ్రయించాం" అని ఆయన వెల్లడించారు.
‘‘తీర్పు సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ స్వయంగా నాకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు’’ అని అతుల్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, AMIT SAINI
పేద విద్యార్థులకు అతుల్ ఓ పాఠం
“ప్రైవేట్ కాలేజీల మాదిరిగా, ఐఐటీ మద్రాస్ కూడా నేను ఫీజు చెల్లించలేకపోవడానికి కారణం ఏంటో ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్‌ల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించి ఉంటే, నా సీటు రద్దయ్యేది కాదు. నేను సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చేది కాదు’’ అని అతుల్ అన్నారు.
"నాకు అన్యాయం జరిగింది. నాకు ఇంతకుముందే అవకాశం ఇచ్చి ఉండాల్సింది. కానీ నా కేసును ఎవరూ పట్టించుకోలేదు. దీనికోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది" అని అతుల్ అన్నారు.
అతుల్ తండ్రి రాజేంద్ర ‘‘ఈ మూడు నెలలూ ఏం జరుగుతుందో అనే టెన్షన్‌తో గడిచిపోయాయి. పిల్లవాడి భవిష్యత్తు అంధకారం అయిపోతుందా అని ఒక్కోసారి అనిపించేది’’ అన్నారు.
రాజేంద్రకు నలుగురు కుమారులు. అతుల్ కుమార్ అందరిలోకి చిన్నవాడు. పెద్దవాడు మోహిత్ కుమార్ హమీర్‌పూర్ ఎన్‌ఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేస్తున్నారు. రెండో కొడుకు రోహిత్ కుమార్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేస్తున్నారు. మూడో కొడుకు ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీలో బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.
‘‘నా పిల్లలందరూ ప్రతిభావంతులు. వాళ్లు బాగా చదువుకుని, విజయం సాధించాలనేదే నా ఏకైక కోరిక’’ అని రాజేంద్ర అన్నారు.
‘‘అతుల్ చదువు వివాదం విషయంలో నేను అతని వెన్నంటే ఉన్నా. అందుకోసం ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చినా వెనక్కి తగ్గేవాణ్ని కాదు’’ అన్నారాయన.

ఫొటో సోర్స్, AMIT SAINI
అతుల్ సీటు ఎందుకు మిస్ అయింది?
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించిన అతుల్‌కు ఐఐటీ ధన్‌బాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో సీటు కేటాయించారు.
రూ. 17,500 ఫీజు డిపాజిట్ చేయడానికి జూన్ 19 నుంచి జూన్ 24, 2024 వరకు గడువు ఇచ్చారు.
‘‘ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా లేదు. పిల్లల చదువుల కోసం అప్పటికే రూ.3 లక్షల అప్పు చేశాను. ఒక వడ్డీ వ్యాపారి అతుల్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. జూన్ 24వ తేదీ మధ్యాహ్నం వరకు అతను డబ్బు ఇవ్వకపోవడంతో నేను వేరే ఏర్పాట్లు చేసుకున్నాను. కానీ అప్పటికే సమయం 4.45 అయింది.’’ అన్నారు.
ఆన్‌లైన్‌లో ఫీజు పేమెంట్‌కు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంటుంది.
చివరి 15 నిమిషాల్లో ఆన్‌లైన్‌లో ఫీజును జమ చేయడంలో ఎదురైన సవాలు గురించి వివరించారు అతుల్.
“డబ్బు సమకూరిన తర్వాత, ఆన్‌లైన్ ప్రక్రియను ప్రారంభించగానే, యూనివర్సిటీ సైట్ మధ్యలో లాగవుట్ అయింది. అప్పటికి సాయంత్రం 4:57 అయింది. నేను మళ్లీ ప్రయత్నించినా, కేవలం 3-4 నిమిషాల్లో డాక్యుమెంట్లు మాత్రం అప్‌లోడ్ అయ్యాయి. ఆ తర్వాత 5 గంటలకు ఫీజు చెల్లింపు ప్రక్రియ మొత్తం ఆగిపోయింది’’ అన్నారు.

ఫొటో సోర్స్, AMIT SAINI
ప్రతిచోటా నిరాశ
సీటు దక్కలేదని నిరాశపడ్డా, ధైర్యాన్ని కోల్పోలేదు అతుల్. ‘‘దీని కోసం మేం ఐఐటీ ధన్‌బాద్, ఐఐటీ మద్రాస్‌లకు ఫోన్ చేశాం. ఈమెయిల్ ద్వారా సంప్రదించాం. కానీ ఎవరూ మాకు సహాయం చేయలేదు’’ అన్నారు అతుల్.
ఈసారి ఐఐటీ పరీక్షలను ఐఐటీ మద్రాస్ నిర్వహించింది.
“రెండుచోట్లా నిరాశ ఎదురైనప్పుడు, మేము ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాం. ఈ కేసు విచారణ సందర్భంగా, జూన్ 24 సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్య యూనివర్శిటీ సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తినమాట నిజమేనని కమిషన్ ఎదుట ఐఐటీ మద్రాస్ చైర్మన్ అంగీకరించారు. అయితే అన్నీ కంప్యూటరైజ్డ్ అయినందువల్ల తాను ఏమీ చేయలేనని అసహాయత వ్యక్తం చేశారు’’ అని అతుల్ చెప్పారు.
తన కొడుకు కలలు చెదిరిపోవడం చూసి రాజేంద్ర తట్టుకోలేకపోయారు. కొంత మంది సలహా తీసుకుని దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.
“మేం మొదట ఝార్ఖండ్ హైకోర్టుకు వెళ్ళాం. అక్కడ ఫలితం లేకపోవడంతో మద్రాసు హైకోర్టుకు వెళ్లాం. అయితే అక్కడి నుంచి కూడా ఎలాంటి సాయం అందుతుందన్న ఆశ లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని రాజేంద్ర తెలిపారు.
"మద్రాసు హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్న తర్వాత, సుప్రీంకోర్టును ఆశ్రయించాం. సెప్టెంబర్ 24న, సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ తొలి విచారణ చేపట్టింది.’’ అన్నారు రాజేంద్ర.
కేసు విచారణ జరిగిన తీరును అతుల్ వివరించారు.
‘‘తొలి విచారణలోనే ఐఐటీ మద్రాస్‌కు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. మూడు నెలలు మీరేం చేస్తున్నారు అని మమ్మల్ని కూడా అడిగింది. మా లాయర్ జరిగింది మొత్తం వివరించారు’’ అని చెప్పారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో అతుల్ ఇల్లు జనంతో కళకళలాడుతోంది. చుట్టుపక్కల వాళ్లందరూ అతుల్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకుకు న్యాయం జరిగింది’’ అని అతుల్ తల్లి రాజేష్ దేవి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














