విజయవాడ కనకదుర్గ ప్రసాదం: లడ్డూ తయారీలో ఏమేం వినియోగిస్తారు? నాణ్యత పరీక్షలు ఎవరు చేస్తారు

లడ్డూ ప్రసాదం
ఫొటో క్యాప్షన్, దుర్గ గుడిలో లడ్డూ ప్రసాదం 60 ఏళ్ల కిందటే మొదలైందని శివప్రసాద్‌ శర్మ ‘బీబీసీ’తో చెప్పారు.
    • రచయిత, గరికపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

తిరుపతి లడ్డు చుట్టూ నెలకొన్న వివాదంతో ఇతర ఆలయాల్లోనూ ప్రసాదాల నాణ్యతపై చర్చ జరుగుతోంది.

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రసాదాల నాణ్యతపైనా చర్చ మొదలైంది.

ఈ నెల 3 నుంచి దసరా ఉత్సవాలు మొదలవుతున్న తరుణంలో ఇక్కడి ప్రసాదం లడ్డూ ఎప్పుడు మొదలైంది? ఎలా తయారు చేస్తారు?

ఏఏ పదార్థాలు ఎంత మోతాదులో ఉపయోగిస్తారు? నాణ్యతకు భరోసా ఏమిటి?

వివరాలన్నీ ఈ కథనంలో..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దేవస్థానం స్థానాచార్య విష్ణుభొట్ల శివప్రసాద్‌ శర్మ

లడ్డూ ప్రసాదం ఎప్పుడు మొదలైందంటే...

దుర్గ గుడిపై లడ్డూ ప్రసాదం 60 ఏళ్ల కిందటే మొదలైందని డిప్యూటీ కమిషనర్‌ హోదా గల దేవస్థానం స్థానాచార్య విష్ణుభొట్ల శివప్రసాద్‌ శర్మ ‘బీబీసీ’కి తెలిపారు.

‘34 ఏళ్లుగా అమ్మ వారి గుడిలో పని చేస్తున్నా. మా నాన్న ఇదే ఇంద్రకీలాద్రిపై ప్రభుత్వోద్యోగిగా పని చేశారు. 14 సంవత్సరాలుగా దేవస్థావంలో ఆగమపరమైన అర్చకాది కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నా. గత యాభై ఏళ్ల నుంచి దేవస్థానం విషయాలు స్వయంగా చూస్తున్నా. 1960 నాటి చట్టంతో దేవాదాయశాఖ పరిధిలోకి ఇంద్రకీలాద్రి గుడి వచ్చిన తర్వాత నుంచి లడ్డూ, పులిహోర ప్రసాదాల వినియోగం మొదలైంది.

లడ్డూ ధర పావలా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇప్పుడు లడ్డూ 15 రూపాయలైంది. మా దేవస్థానం ప్రసాదాలైన లడ్డూ, పులిహోరలపై ఎక్కడా విమర్శలు లేవు. నాణ్యంగా ఉంటున్నాయి. తయారీలో నాణ్యమైన ఆవు నెయ్యినే వినియోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు అధికారులు చెక్‌ చేస్తుంటారు’ అని శివప్రసాద్‌ శర్మ వివరించారు.

ఈవో రామారావు
ఫొటో క్యాప్షన్, ఈవో రామారావు

‘‘దేవస్థానంలో లడ్డూ ప్రసాదాల నాణ్యత, రుచి, శుచిపై ఎక్కడా రాజీ పడేది లేదు. అన్ని నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తుంటాం'' అని దేవస్థానం ఈవో రామారావు బీబీసీతో చెప్పారు.

‘లడ్డూ ప్రసాదాల క్వాలిటీ తరచూ చెక్ చేయిస్తుంటాం. ప్రభుత్వ గుర్తింపు పొందిన విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలోని యాక్యురేట్‌ ల్యాబ్‌కి శాంపిల్స్‌ పంపిస్తుంటాం. ఏదైనా తేడా ఉంటే వాళ్లు రిపోర్ట్‌ చేస్తారు. ఇదంతా రొటీన్‌ ప్రాసెస్‌, ఇటీవల కాలంలో ఫిర్యాదులేవీ రాలేదు'' అని రామారావు వెల్లడించారు.

కాగా, సాధారణ రోజుల్లో రోజుకి సుమారు 20 వేల నుంచి 30 వేల లడ్డూలు భక్తులు తీసుకుంటారని.. ఇప్పుడు దసరా ఉత్సవాలకు పాతిక లక్షల లడ్డూల వరకు డిమాండ్‌ ఉందని ఈవో తెలిపారు.

యాక్యురేట్‌ ల్యాబ్‌ జనరల్‌ మేనేజర్‌ మనోహర్‌
ఫొటో క్యాప్షన్, యాక్యురేట్‌ ల్యాబ్‌ జనరల్‌ మేనేజర్‌ మనోహర్‌

యాక్యురేట్‌ ల్యాబ్ జీఎం ఏమంటున్నారంటే...

ఇదే విషయమై యాక్యురేట్‌ ల్యాబ్‌ జనరల్‌ మేనేజర్‌ మనోహర్‌ మాట్లాడుతూ.. నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ లాబొరేటరీస్‌ (ఎన్‌ఏబీఎల్‌) గుర్తింపు పొందిన తమ ల్యాబ్‌లో దుర్గ గుడి లడ్డూ ప్రసాదం నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటామని తెలిపారు.

తొలుత ముడి సరకులను మొత్తం పరీక్షిస్తామని, ప్రసాదాల తయారీ తర్వాత శాంపిల్స్‌ను చెక్‌ చేస్తామని ఆయన తెలిపారు.

రసాయనాలు, బ్యాక్టీరియా కాలుష్యాలపై పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు చేస్తామని మనోహర్‌ వివరించారు.

ప్రసాదాల తయారీ
ఫొటో క్యాప్షన్, ప్రసాదాల తయారీ దేవస్థానం ఆధ్వర్యంలోనే జరుగుతుందని పూర్ణ చంద్రరావు చెప్పారు.

‘మేం చెక్‌ చేసిన తరువాతే వాడాలని చెప్పాం..’

దుర్గ గుడిలో లడ్డూతో పాటు పులిహోర, అన్నప్రసాదాల నాణ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంటామని విజయవాడ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ పూర్ణ చంద్రరావు తెలిపారు.

‘వారం కిందటే లేబుల్‌ లేకుండా వచ్చిన 1,100 కేజీల జీడి పప్పు.. 700 కేజీల ఎండు ద్రాక్షను సీజ్‌ చేశాం. ప్రెష్‌ స్టాక్‌ వచ్చాక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ చెక్‌ చేసిన తర్వాతే వినియోగించాలని ఆదేశించాం. ఇటీవల నెయ్యి, శెనగ పప్పు, బెల్లం శాంపిల్స్‌ను పరీక్షలకు పంపాం. ప్రసాదాల నాణ్యతపై రాజీ పడేది లేదు’’ అని పూర్ణ చంద్రరావు బీబీసీతో చెప్పారు.

కాగా, అమ్మ వారి లడ్డూ ప్రసాదం నాణ్యంగా ఉంటోందని ఆయన స్పష్టం చేశారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

ఫొటో సోర్స్, anam ramanarayana reddy/facebook

ఫొటో క్యాప్షన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

‘ఆ నెయ్యి మాత్రమే వాడుతారు’

లడ్డూ సహా అమ్మవారి గుడి ప్రసాదాలకు సంబంధించి సరకులను టెండర్లలో ఎవరు తక్కువ ధరకు కోట్ చేస్తే వారి నుంచి సేకరిస్తారని పూర్ణ చంద్రరావు బీబీసీతో చెప్పారు.

‘‘ప్రసాదాల తయారీ దేవస్థానం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. లడ్డూ తయారీకి సంబంధించి కేవలం విజయ డెయిరీ నెయ్యిని మాత్రమే వినియోగిస్తారు. ధర కేజీ 550 రూపాయలకు పైబడే ఉంటుంది’’ అని చెప్పారు.

"లడ్డూ ప్రసాదం ఒక్కటే కాదు, అన్న ప్రసాదాలు, పులిహోర ప్రసాదాల విషయమై ఎక్కడా నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశాలిచ్చాం’ అని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బీబీసీతో తెలిపారు.

రుచి, శుచిపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పరీక్షించాలని ఆదేశించామని ఆయన చెప్పారు.

లడ్డూ తయారీలో వాడే పదార్థాలు

లడ్డూ తయారీలో ఏఏ పదార్థాలు ఎంతెంత?

అమ్మ వారి ప్రసాదం లడ్డూ తయారీ కేంద్రం ’పోటు’2016 పుష్కరాల వరకు కొండపైనే ఉండేది.

కానీ పుష్కరాల నుంచి ప్రసాదాల తయారీ కేంద్రం కొండ కింద బ్రాహ్మణవీధిలోకి మారిందని దేవస్థానం వర్గాలు తెలిపాయి.

దుర్గ గుడి ప్రసాదం లడ్డూ తయారీ లెక్కలిలా..

ఒక కళాయిలో 564 లడ్డూలు తయారు చేస్తారు. అందులో ఎనిమిది పదార్థాలను వినియోగిస్తారు.

1) పది కేజీల శెనగపిండి

2) 20 కేజీల పంచదార

3) ఒకటిన్నర కేజీల జీడిపప్పు

4) ఒక కేజీ ఎండు ద్రాక్ష

5) 8 కేజీల ఆవు నెయ్యి

6) ఒక కేజీ పటిక బెల్లం

7) 150 గ్రాముల యాలకులు

8) 15 గ్రాముల పచ్చ కర్పూరం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)