ఇద్దరు మహిళలను చంపి పందులకు ఆహారంగా వేశారంటూ రైతుపై ఆరోపణలు.. జాతి వివక్షే కారణమా?

ఫొటో సోర్స్, Makgato family
- రచయిత, నొమ్సా మసెకొ
- హోదా, బీబీసీ న్యూస్, పొలొక్‌వేన్
దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయుడైన ఒక రైతు ఇద్దరు నల్ల జాతి మహిళలను కాల్చి చంపి, వారి మృతదేహాలను పందులకు ఆహారంగా వేసినట్టు ఆరోపణలొచ్చాయి.
ఈ కేసు దక్షిణాఫ్రికాలో తీవ్రఅలజడి సృష్టిస్తోంది. రైతు పొలంలో పనిచేసే మరో ఇద్దరు కూడా ఈ కేసులో అనుమానితులుగా ఉన్నారు.
దక్షిణాఫ్రికాలోని ఉత్తర లింపోపో ప్రావిన్స్‌లోని పొలొక్‌వేన్ దగ్గర ఉన్న ఒక పొలంలో ఈ ఘటన జరిగినట్లు ఆరోపణలున్నాయి.
ఆగస్ట్ నెలలో ఆహారం కోసం వెతుక్కుంటూ ఇద్దరు మహిళలు పొలంలోకి రాగా వారిని రైతు కాల్చిచంపారని ఆరోపణలొచ్చాయి.
చనిపోయిన ఇద్దరు మహిళలను 45 ఏళ్ల మరియా మక్‌గాటో, 34 ఏళ్ల లుసియా ఎండ్లోవుగా గుర్తించారు.
మహిళలను కాల్చిచంపిన తర్వాత అనుమానితులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు వారి మృతదేహాలను పందులకు ఆహారంగా వేసినట్లు కేసు నమోదైంది.
ఈ కేసులో ముగ్గురిపై హత్యా నేరం కింద విచారణ జరపాల్సిఉంది.
పొలం యజమాని 60 ఏళ్ల జఖారియాహ్ జొహన్స్ ఒలివీర్, ఆయన దగ్గర పనిచేసే 19 ఏళ్ల అడ్రెయిన్ డీ వెట్, 50 ఏళ్ల విలియమ్ ముసోరాను హత్యానేరం కింద విచారించడానికి ముందు... ఆ ముగ్గురికి బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నదానిపై కోర్టు విచారణ ప్రారంభించింది.


బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
అనుమానితులకు బెయిల్ మంజూరు చేయొద్దని కోరుతూ కోర్టు బయట ఆందోళనలు జరిగాయి.
బాధితుల, నిందితుల కుటుంబసభ్యులతో కోర్టు రూమ్ నిండిపోయింది.
ఈ కేసులో ఉన్న తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విచారణను చిత్రీకరించేందుకు మీడియాకు న్యాయమూర్తి ఎన్టిలేన్ ఫెల్లెంగ్ అనుమతిచ్చారు.
బెయిల్ పిటిషన్‌పై అనేక గంటల విచారణ తర్వాత తదుపరి విచారణను న్యాయమూర్తి నవంబరు 6కి వాయిదా వేశారు. అప్పటివరకు అనుమానితులు కస్టడీలోనే ఉండనున్నారు.
ఈ హత్యలతో దక్షిణాఫ్రికాలో శ్వేత, నల్లజాతీయుల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయని మక్‌గాటో సోదరుడు వాల్టర్ మథోలె బీబీసీతో చెప్పారు.
30 ఏళ్ల క్రితమే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష అంతమైందని చెప్తున్నా గ్రామీణప్రాంతాల్లో ఇప్పటికీ వివక్ష కనిపిస్తుంటుంది.
మక్‌గాటో, లుసియా ఎండ్లోవుతో పాటు ఉన్న ఎండ్లోవు భర్తపైనా ఆ ముగ్గురు అనుమానితులు కాల్పులు జరిపినట్టు ఆరోపణలొస్తున్నాయి.
వారి దగ్గర లైసెన్సులేని ఆయుధం ఉందన్న అభియోగాలూ ఎదుర్కొంటున్నారు.
ఎండ్లోవు భర్త మబుతో ఎన్‌క్యూబ్ ఆగస్టు 17 శనివారం సాయంత్రం జరిగిన ఆ కాల్పుల నుంచి తప్పించుకున్నారు. సంఘటనాస్థలం నుంచి పాక్కుంటూ వెళ్లి డాక్టరుకు ఫోన్ చేశారు.
తర్వాత ఆయన ఇద్దరు మహిళల హత్య విషయాన్ని పోలీసులకు చెప్పారు.
చాలా రోజుల తర్వాత తన భార్య ఎండ్లోవు, మక్‌గాటో మృతదేహాలను పోలీసులు కుళ్లిపోయినస్థితిలో గుర్తించారని మబుతో చెప్పారు.

అనాథలుగా మారిన నలుగురు పిల్లలు
పందుల ఎన్‌క్లోజర్ లోపల అధికారులతో కలిసి భయంకరమైన దృశ్యాన్ని తాను చూశానని మథోలె చెప్పారు.
తన సోదరి మృతదేహాన్ని పందులు పాక్షికంగా తిన్నాయని చెప్పారు.
పాడైపోయిన, పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న పంటలో తినదగినది ఏమన్నా ఉందేమో వెతుక్కునేందుకు మక్‌గాటో, లుసియా ఎండ్లోవు, మబుతో ఎన్‌క్యూబ్ ఆ రోజు పొలంకి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ పంటను కొన్నిసార్లు పొలంలో వదిలేసి పందులకు ఆహారంగా వేస్తారు.
మక్‌గాటో హత్యతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ఆమెకు అయిదు నుంచి 22 ఏళ్ల వయసున్న నలుగురు కొడుకులు ఉన్నారు.
‘మా అమ్మ నరకయాతనతో మరణించారు. ఆమె మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మా కోసం అన్నీ చేశారు. మమ్మల్ని ఏ లోటూ లేకుండా ఆమె చూసుకున్నారు’ అని మక్‌గాటో పెద్దకొడుకు కన్నీళ్లతో బీబీసీకి చెప్పారు.
‘మా అమ్మను హత్యచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లకు బెయిల్ నిరాకరిస్తే నేను రాత్రుళ్లు ప్రశాతంగా నిద్రపోతాను’ అని ఆయన చెప్పారు.
ఆ పొలం ఇక ఉపయోగించకూడదని ప్రతిపక్ష ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్(ఈఎఫ్ఎఫ్)పార్టీ డిమాండ్ చేసింది.
ఆ పొలంలో పండే ఉత్పత్తులను అమ్మకూడదని, అవి వినియోగదారులకు ప్రమాదకరమని ఈఎఫ్ఎఫ్ వ్యాఖ్యానించింది.
ఈ హత్యలను దక్షిణాఫ్రికా మానవ హక్కుల కమిషన్ ఖండించింది. వివక్షకు వ్యతిరేకంగా బాధితులు మాట్లాడాలని పిలుపునిచ్చింది.

వరుసగా జాతి వివక్ష ఘటనలు
దేశంలో వ్యవసాయ సమూహాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని, వారిపై జరిగే నేరాలు ఎక్కువని రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు చెబుతున్నాయి.
ఈ రైతుల్లో ఎక్కువమంది శ్వేతజాతీయులే ఉంటారు.
ఇటీవల జరిగిన రెండు ఘటనలు ఉద్రిక్తతలను పెంచాయి.
ఎంపుమలంగా తూర్పు ప్రావిన్సులోని మిడిల్‌బర్గ్ దగ్గర ఉన్న లేర్స్‌డ్రిఫ్ట్‌లో... ఆగస్టులో ఒక రైతును, ఆయన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు.
వారు తమ పొలంలో గొర్రెలు దొంగతనం చేశారంటూ ఇద్దరు వ్యక్తులను హత్య చేశారని పోలీసులు కేసు పెట్టారు.
నిందితులిద్దరూ కస్టడీలో ఉన్నారు. మృతదేహాలకు సంబంధించిన బూడిదను డీఎన్‌ఏ విశ్లేషణకు పంపించారు.
ఇటీవల మరో ఘటన బయటకు వచ్చింది.
70 ఏళ్ల శ్వేతజాతీయుడైన ఓ రైతు.. తన పొలంలో నారింజ పండును దొంగిలించాడని ఆగ్రహిస్తూ ఆరేళ్ల బాలుడిపైకి వాహనంతో దూసుకొచ్చి, రెండుకాళ్లు విరగ్గొట్టినట్టు ఆరోపణలొచ్చాయి.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తూర్పు కేప్ ప్రావిన్స్‌లోని లట్జ్‌విల్లేకు చెందిన క్రిస్టోఫ్‌ఫెల్ స్టొమాన్ బెయిల్ పిటిషన్ విచారణ కొనసాగుతోంది.
పట్టణంలో సరకులు కొనుక్కునేందుకు పొలం మీదుగా తల్లితో కలిసి వెళ్తున్న ఆ అబ్బాయి నేల మీద పడిన నారింజను తీసుకునేందుకు ఆగగా.. రైతు ఆ బాలుడి మీదకు వాహనంతో దూసుకురావడాన్ని తల్లి భయంతో చూస్తుండిపోయారని కేసులో పేర్కొన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








