వార్ టెన్షన్: ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుంది, ఇరాన్ బలమేంటి, బలహీనతలేంటి?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఫ్రాంక్ గార్డ్‌నర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారీ నష్టాన్ని సృష్టించగల యుద్ధం అంచున నిలబడింది పశ్చిమాసియా. 45 ఏళ్లుగా ఒకరితో ఒకరు తలపడుతున్న ఈ ఇద్దరు కథనాయకులు మళ్లీ ఎదురెదురుగా తలపడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాంతం మొత్తానికి అత్యంత భయంకరమైన క్షణాల్లో ఇది ఒకటి.
1979లో షాను తొలగించి ఇస్లామిక్ రిపబ్లిక్‌గా అవతరించింది ఇరాన్. ‘యూదు రాజ్యం’గా పిలిచే ఇజ్రాయెల్‌ను ధ్వంసం చేయాలని చాలాకాలం నుంచి ఎదురు చూస్తోంది.
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తన మిత్రపక్షాలు, సన్నిహిత గ్రూపులతో మిడిల్ ఈస్ట్ అంతటా హింసను వ్యాపింపజేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. కొన్ని అరబ్ ప్రభుత్వాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి.
మంగళవారంనాటి దాడికి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో కొన్ని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలలోకి చొచ్చుకుపోయాయి.
హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా, హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియేలను ఇజ్రాయెల్ చంపేసినందుకే తాము ఆ దేశంపైకి బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించినట్లు ఇరాన్ చెబుతోంది.


ఫొటో సోర్స్, EPA
ఇప్పుడేం జరగనుంది?
మిస్సైళ్లు ప్రయోగించినందుకు ఇరాన్‌ను శిక్షిస్తామని ఇజ్రాయెల్, దాని మిత్రదేశం అమెరికా ప్రతిన బూనాయి.
“ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదు” అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
2024 ఏప్రిల్‌లో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇజ్రాయెల్‌పై దాని మిత్రదేశాలు ఒత్తిడి తెచ్చి సంయమనం పాటించేలా చేశాయి. అయితే ఈసారి అలాంటి పరిస్థితి లేదు.
లెబనాన్, గాజా, యెమెన్, సిరియాలో తన ప్రత్యర్థులందరినీ ఒకేసారి ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ గట్టిగా నిర్ణయించుకుంది.
ఈ విషయంలో నెతన్యాహు ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
దాడి ఎప్పుడు చేయాలి అనేది కాకుండా ఆ దాడి తీవ్రత ఏ స్థాయిలో ఉండాలనేదే బహుశా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్లానర్లు చర్చించుకుంటూ ఉండొచ్చు.
అమెరికన్ నిఘా శాటిలైట్లు, ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్, ఇరాన్‌లో మోహరించిన ఏజెంట్లు అందించిన సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ సైన్యానికి ఇరాన్‌లో స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. వీటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించవచ్చు.
సంప్రదాయ సైన్యం – ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన స్థావరాలు ఇజ్రాయెల్ తొలి ప్రాథమిక లక్ష్యం కావచ్చు.
అంటే క్షిపణి ప్రయోగ కేంద్రాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, ఇంధనం నింపే ట్యాంకులు, స్టోరేజ్ బంకర్‌లపై ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చు.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ అండ్ కార్ప్స్‌కు చెందిన స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు , మిస్సైల్ బ్యాటరీలపైనా దాడులు జరగవచ్చు.
ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీ కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తుల్ని చంపే ప్రయత్నం కూడా జరగవచ్చు.
ఆర్థిక వ్యవస్థ - ఇందులో భాగంగా ఇరాన్‌ను తీవ్రంగా నష్టపరిచే ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరగవచ్చు. పెట్రో కెమికల్ ప్లాంట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, నౌకలు ఇందులో ఉండవచ్చు.
అయితే ఈ వ్యవస్థల మీద దాడి చేస్తే ఇరాన్ ప్రజల్లోనూ ఆగ్రహం చెలరేగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయడం వల్ల ప్రజల జీవితాలపై ప్రభావం పడుతుంది.
అణ్వస్త్రాలు - ఇజ్రాయెల్‌కు సంబంధించి ఇది చాలా పెద్దది. అణు విద్యుదుత్పత్తి కోసం అవసరమైన 20 శాతం కంటే ఎక్కువ యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ స్పష్టం చేసింది.
ఇరాన్ అణుబాంబు తయారు చేసే స్థాయికి చేరుకునే దశలో బ్రేక్ అవుట్ పాయింట్‌కు చేరుకుందని ఇజ్రాయెల్ సహా దాని మిత్ర దేశాలు అనుమానిస్తున్నాయి.
ఇరాన్ లోపల ఇజ్రాయెల్ లక్ష్యాలలో ఇరాన్ అణు కార్యక్రమానికి కేంద్ర స్థావరమైన పర్చిన్, రీసర్చ్ రియాక్టర్లు ఉన్న తెహ్రాన్, బొనాబ్, రమ్సర్, ఇతర అణు స్థావరాలైన బుషెహర్, నటాంజ్, ఇష్ఫాహాన్, ఫెర్దో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్‌పై ఇరాన్ గెలవగలదా?
మంగళవారం క్షిపణులు ప్రయోగించిన తర్వాత ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం చెప్పినట్లు ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో ఇజ్రాయెల్ దాడి చేస్తే తాము ఎదురు దాడి చేస్తామనే హెచ్చరిక కూడా ఉంది.
“మా శక్తి సామర్థ్యాలకు ఇదొక మచ్చుతునక మాత్రమే” అని ఇరాన్ అధ్యక్షుడు పెజష్కియాన్ అన్నారు.
“ఇరాన్ కార్యకలాపాలపై యూదు రాజ్యం స్పందిస్తే, అణచివేత దాడులు తీవ్రంగా ఉంటాయి” అని ఐఆర్‌జీసీ ప్రకటించింది.
ఇజ్రాయెల్‌ను ఇరాన్ సైనికంగా ఓడించలేదు. ఇరాన్ వైమానిక దళం చాలా పాతది, పైగా బలహీనంగా ఉంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా బలంగా లేదు.
పైగా ఇరాన్ ఏళ్ల తరబడి పశ్చిమ దేశాల ఆంక్షలతో పోరాడుతోంది.
అయినప్పటికీ ఇరాన్ దగ్గర ఇప్పటికీ భారీ సంఖ్యలో బాలిస్టిక్, ఇతర మిస్సైళ్లు ఉన్నాయి. అలాగే పేలుడు పదార్థాలు తీసుకెళ్లే డ్రోన్లు, మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ అండదండలున్న మిలీషియాలు ఉన్నాయి.
ఈసారి ఇరాన్ వరుసగా మిస్సైళ్లు ప్రయోగిస్తే అవి ఇజ్రాయెల్ సైనిక స్థావరాలకు బదులు పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. 2019లో సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై ఇరాన్ మద్దతు గల మిలీషియా చేసిన దాడి, ఆ మిలీషియాల బలాన్ని చూపిస్తుంది.
గల్ఫ్‌లో మోహరించిన ఐఆర్‌జీసీ నేవీ వద్ద వేగంగా ప్రయాణించే చిన్న నౌకలు ఉన్నాయి. ఇవన్నీ సమూహంగా దాడి చేస్తే అమెరికన్ ఐదో ఫ్లీట్ యుద్ధ నౌకలను కూడా దెబ్బతీయగలవు.
కచ్చితమైన ఆదేశాలు వస్తే అవి హర్ముజ్ జలసంధిలో మందుపాతరలు పెట్టి చమురు ఎగుమతుల్ని అడ్డుకోగలవు. ప్రపంచానికి అవసరమైన చమురు రవాణాలో 20శాతం ఈ మార్గం గుండానే జరుగుతోంది. ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ ప్రాంతంలో కువైట్ నుంచి ఒమన్ వరకు గల్ఫ్‌లో అరేబియా వైపు అక్కడక్కడా అమెరికా సైనిక స్థావరాలున్నాయి.
తాము దాడి చేస్తే ఆ దాడులు కేవలం ఇజ్రాయెల్‌కు మాత్రమే పరిమితం కావని, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














