స్వాగ్ రివ్యూ: శ్రీవిష్ణు అయిదు పాత్రల్లో నటించిన సినిమా ఎలా ఉంది?

ఫొటో సోర్స్, facebook/People Media Factory
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో సాగిపోతున్న నటుడు శ్రీవిష్ణు. 'రాజరాజచోర' సినిమాతో ప్రేక్షకులని మెప్పించిన శ్రీవిష్ణు, హసిత్ గోలీల కాంబినేషన్‌లో వచ్చిన మరో సినిమా 'స్వాగ్'.
ఈ కాంబినేషన్ రెండోసారి రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
శ్ విష్ణు అయిదు పాత్రల్లో ప్రయోగత్మకంగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
మహిళలే యజమానులు, ఇంటి నుంచి అన్ని విషయాలపై అధికారం వారికే ఉండాలని చెప్పే మాతృస్వామ్య వ్యవస్థ గల వింజామర వంశం ఉన్న రోజుల్లో కథ మొదలవుతుంది.
ఆ వంశపు రాణి రుక్మిణి. ఆమె భర్త భవభూతి. భవభూతి రాజు వంశం స్వాగణిక వంశం. ఆ మాతృస్వామిక వంశాన్ని భవభూతి రాజు ఎలా అంతం చేసి, స్వాగణిక వంశాన్ని నిలబెట్టాడు? భవభూతి రాజు వింజామర వంశానికి ఇచ్చిన శాపం ఏమిటి? దానికి ఉన్న ప్రతిశాపం ఏమిటి? స్వాగణిక వంశంలో వారసులకు నిధి లభించాలంటే ఉన్న షరతులేమిటి?
ఆ నిధి కోసం ఆ వంశ వారసులు ఏం చేశారు? చివరకు ఆ నిధి వారికి దక్కిందా? లేదా? అన్నదే కథ.


ఫొటో సోర్స్, facebook/People Media Factory
నటన ఎలా ఉంది?
శ్రీవిష్ణు ఈ సినిమాలో అయిదు పాత్రల్లో నటించారు.
భవభూతి మహారాజుగా, భవభూతి జూనియర్ (ఎస్‌ఐ)గా, యయాతిగా, యువకుడు సింగరేణిగా, ట్రాన్స్ జెండర్ అనుభూతిగా నటించారు.
శ్రీవిష్ణు ట్రాన్స్‌జెండర్ పాత్రకు ప్రాణం పోసినట్టు అనిపిస్తుంది.
ఈ ఐదు పాత్రల్లో ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుండి పోయే పాత్ర 'అనుభూతి'.
కొంత క్రూరమైన పాత్రలో భవభూతిగా, ప్రొస్తటిక్ మేకప్‌లో విష్ణు కనిపించారు.
కొంత వైవిధ్యమైన మేనరిజంతో కమల్ హాసన్ అనుకరణతో కొత్తగా అనిపించారు ఈ పాత్రలో.
ఇక యువకుడిగా సింగరేణిగా, మహారాజుగా కూడా శ్రీవిష్ణు నటన బాగుంది.
రీతూ వర్మ మాతృస్వామ్యాన్ని బలంగా నమ్మే పాత్రలో బాగా నటించారు. మీరా జాస్మిన్ నటన హుందాగా ఉంది.
సునీల్, రఘుబాబు, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, గెటప్ సీను, రఘు బాబు తమ పరిధిలో బాగానే నటించారు.
ఉపకథలు :
చాలా సీరియస్ టోన్ ఉన్న, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా ఇది. ఈ కథను కొంత కామిక్ ఎలిమెంట్స్‌తో చేయడంతో స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల తేలిపోయింది. అనేక సబ్ ప్లాట్స్ ఉండటంతో గందరగోళంగా అనిపిస్తుంది.
ఓకే వంశంలో తాత, కొడుకు, మనవడు అన్ని పాత్రల్లో విష్ణు ఉండటం కొంత ఓవర్ డ్రమటిక్‌గా అనిపిస్తుంది.
కథ అర్థమైనట్టు అనిపించినా, ఎక్కువ పాత్రలు ఉండటం వల్ల గందరగోళంగా ఉంటుంది. కొంత కామెడీ వల్ల పర్లేదనిపిస్తుంది.
కామిక్ ఎలిమెంట్స్ తగ్గించి, ఫస్ట్ హాఫ్‌లో ఈ సబ్ ప్లాట్స్‌కు స్కోప్ ఇచ్చి, ఇంకా బాగా డెవలప్ చేసి ఉంటే బావుండేది.

ఫొటో సోర్స్, facebook/People Media Factory
ఎమోషన్స్ ఎలా పండాయి?
ఈ సినిమాలో ప్రేక్షకులతో ఎమోషనల్‌గా కనెక్ట్ కావాల్సిన రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది ఫ్యామిలీ ఎమోషన్. భవభూతి భార్య రేవతి ప్రసవ సమయంలో భర్తను విడిచి వెళ్లిపోతుంది.
ఆమె భర్త పడే బాధ ఒకవైపు, ఆమె కొడుకు సింగరేణి తండ్రి లేక పడ్డ అవమానాలు ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే బలమైన సన్నివేశాలు సినిమాలో లేవు.
ఈ సినిమాలో మాతృస్వామ్య వ్యవస్థను నమ్మే వ్యక్తి అనుభూతి. పితృస్వామ్య వ్యవస్థను నమ్ముతాడు భవభూతి.
ఈ విరుద్ద భావజాలాల వల్ల తలెత్తే సంఘర్షణ పెద్దగా సినిమాలో లేదు.
ఈ సినిమాకు బలమైన ఫ్యామిలీ ఎమోషన్, అలాగే సిద్ధాంత ఘర్షణ రెండు కూడా బలంగా లేకపోవడం వల్ల కొంత ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిన కథ ఇది.
ఫస్ట్ హాఫ్ వరకు ఈ రెండు ఎమోషన్స్ ఫెయిల్ అయినా.. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ స్క్రీన్ ప్లే ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్.
స్వాగణిక ఇప్పటి వంశ వారసుల మూల కథ బలంగా ఉంది.
ఫస్ట్ హాఫ్ లాగింగ్‌గా, బలమైన స్క్రీన్ ప్లేతో లేకపోయినా సెకండ్ హాఫ్ ఆ లోటును భర్తీ చేస్తుంది.
ఎమోషనల్‌గా ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

ఫొటో సోర్స్, facebook/People Media Factory
టెక్నికల్‌గా ఎలా ఉంది?
మ్యూజిక్ ఫరవాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బావుంది. పాటలు గొప్పగా లేకపోయినా, ఫరవాలేదనిపించాయి.
జెండర్ సెన్సిటివిటీ :
తమకు మగపిల్లలు మాత్రమే కావాలనో, లేక ఆడపిల్లలు మాత్రమే కావాలనుకుంటూ దాన్నే వారసత్వంగా భావించుకునే వారిని సున్నితంగా హెచ్చరించే సినిమా ఇది.
అటు స్త్రీ, లేదా ఇటు పురుషుడు ఆధిపత్యం వహించే సమాజం కన్నా ఇద్దరూ సమానులే అని చెప్పే సమాజం కావాలని చెప్పే సినిమా ఇది.
అలాగే ట్రాన్స్ జెండర్స్‌ను సమాజం మనుషులుగా గుర్తించాలనే సందేశం ఇస్తుంది.
జెండర్ సెన్సిటివిటీ గురించి స్ట్రాంగ్‌గా చెప్పే సినిమా కూడా.
శ్రీవిష్ణు 'విభూతి 'పాత్రలో చివర్లో కన్నీళ్లు కూడా పెట్టిస్తాడు.
మగతనం అనే అహంకారం వల్ల కుటుంబాన్ని, మానవత్వాన్ని కోల్పోయిన భవభూతిగా ప్రేక్షకుల మనస్సులో ఉండిపోతాడు.
కొంత లాగింగ్ ఉన్న ఈ వైవిధ్య సినిమా కథ సెకండ్ హాఫ్ నుంచి బలంగా కనెక్ట్ అవుతూ మంచి ఫీల్ కలిగిస్తుంది.

ఫొటో సోర్స్, facebook/People Media Factory
ప్లస్, మైనస్ పాయింట్స్
1) 'విభూతి' పాత్రలో శ్రీవిష్ణు నటన
2) స్టోరీ
3) సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్
1) కొన్ని పాత్రల చిత్రీకరణ బలహీనంగా ఉండటం
2) ఫస్ట్ హాఫ్ లాగింగ్
3) జంటల మధ్య కెమిస్ట్రీ బలంగా లేకపోవడం
(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














