ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్: ఈ పాకిస్తానీ బ్లాక్ బస్టర్ మూవీ భారత్‌లో ఎందుకు రిలీజ్ కాలేదు?

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Bilal Lashari

    • రచయిత, నియాజ్ ఫారూఖీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఒక సినిమాను అధికారులు ఒప్పుకోకపోవడంతో భారత్‌లో విడుదలను నిలిపేశారు.

1979 నాటి పంజాబీ (పాకిస్తానీ పంజాబ్) చిత్రానికి రీమేక్ అయిన ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ పాకిస్తాన్‌లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

ఈ చిత్రం బుధవారం పంజాబ్‌లో విడుదల కావాల్సి ఉండగా అది జరగలేదు. దాదాపు ఒక దశాబ్దం తర్వాత భారతదేశంలో విడుదల అవుతున్న మొదటి పాకిస్తానీ చిత్రంగా ప్రచారం సాగింది.

అయితే, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించడంతో దాని విడుదల నిరవధికంగా నిలిచిపోయిందని భారత్‌లో ఈ సినిమా పంపిణీదారు జీ స్టూడియోస్‌కు చెందిన కొందరు బీబీసీకి తెలిపారు.

ఈ సినిమాను ఎందుకు వాయిదా వేశారనే విషయంపై స్పష్టత లేదు. దీనిపై సమాధానం కోసం కోసం బీబీసీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను సంప్రదించింది.

పాకిస్తాన్‌లోని బిగ్‌ స్టార్స్‌గా పేరున్న ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్‌లు నటించిన ఈ చిత్రం 2022లో విడుదలైంది. ఈ చిత్ర కథ స్థానిక జానపద కథానాయకుడు, ఆయన ప్రత్యర్థి వర్గానికి చెందిన నాయకుడికి మధ్య పోరాటానికి సంబంధించినది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ చిత్రం మొదట 2022లోనే భారతదేశంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ, అప్పట్లో కూడా నిరవధికంగా వాయిదా వేశారు.

నిర్మాత బిలాల్ లషారి, ఈ చిత్రాన్ని త్వరలో భారతీయ థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించారు.

“రెండేళ్లు గడిచినా, ఈ చిత్రం ఇప్పటికీ పాకిస్తాన్‌లో హౌస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇప్పుడు, భారతదేశంలోని మా పంజాబీ ప్రేక్షకులు ఈ ప్రేమ మాయాజాలాన్ని అనుభవించనున్నారు’’ అని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

అయితే, మహారాష్ట్రలో ఈ వార్త నిరసనలకు దారితీసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమా విడుదలను అనుమతించేది లేదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పేర్కొంది.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జీ స్టూడియోస్ దీని విడుదలను పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌తో సరిహద్దును పంచుకునే పంజాబ్ రాష్ట్రానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. చివరకు అది కూడా జరగలేదు.

భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త సంబంధాలు ఉన్నప్పటికీ, కళ, సంస్కృతి విషయంలో రెండు దేశాల మధ్య ఒక గాఢమైన అనుబంధం మొదటి నుంచీ ఉంది.

భారత, పాకిస్తాన్‌లలో రూపొందించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు రెండు దేశాలలోనూ అభిమానులున్నారు. బాలీవుడ్, పంజాబీ సినిమాలు పాకిస్తాన్‌లో జనాదరణ పొందితే, పాకిస్తానీ సిరీస్‌లను భారతదేశంలో చాలామంది వీక్షిస్తారు.

రెండు దేశాల్లోని ఆర్టిస్టులు వివిధ ప్రాజెక్ట్‌లలో కలిసి పని చేస్తారు.

అయితే, పాకిస్తానీ నటులను తీసుకోవద్దని 2016లో బాలీవుడ్, భారతీయ సినిమాలను నిషేధించాలని 2019లో పాకిస్తాన్‌ నిర్ణయాలు తీసుకోవడంతో రెండు దేశాల మధ్య సినిమా పరమైన అనుబంధానికి విఘాతం ఏర్పడింది.

ఇటీవలి కాలంలో భారతదేశానికి చెందిన కొన్ని పంజాబీ సినిమాలను పాకిస్తాన్‌లో ప్రదర్శించారు.

పాకిస్తాన్‌ ఆర్టిస్టులను, కళాకారులను భారత్‌లో పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను 2023లో సుప్రీంకోర్ట్ కొట్టివేసింది.

‘అంత సంకుచిత మనస్తత్వం’తో ఉండవద్దని పిటిషనర్లను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

రెండు దేశాల మధ్య టెన్షన్‌లు కాస్త తగ్గుముఖం పట్టడంతో ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ సినిమాను భారత్‌లో విడుదల చేయాలని దాని నిర్మాతలు భావించారు. కానీ, ప్రభుత్వం అందుకు అంగీకరించ లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)