లెబనాన్: ఇజ్రాయెల్ భీకర బాంబు దాడులు.. అగ్నిగోళాన్ని తలపించిన బేరూత్

లెబనాన్, ఇజ్రాయెల్, హిజ్బొల్లా, హమాస్, గాజా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దక్షిణ బేరూత్‌పై రాత్రంతా కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు

దక్షిణ బేరూత్‌ శివారు ప్రాంతాలలో గత రాత్రంతా ఇజ్రాయెల్ అనేక దాడులు చేసింది. ఇది బేరూత్ చరిత్రలో అత్యంత దారుణమైన రాత్రి అని లెబనాన్ బీబీసీ ప్రతినిధి నఫిసెహ్ కొహ్నవర్డ్ అభివర్ణించారు.

ఇజ్రాయెల్ దాడితో లెబనాన్ రాజధాని మీద అగ్నిగోళాలు బద్దలవుతున్నట్టు కనిపించాయి. పేలుళ్లవల్ల ఎగజిమ్మిన మంటలకు ఆకాశం ఎర్రబడినట్లుగా కనిపించింది.

దాడులు చెయ్యడానికి ముందు ఇజ్రాయెల్ దక్షిణ బేరూత్ వాసులంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. ఇజ్రాయిల్ రాత్రంతా చేసిన బాంబుల దాడికి తెల్లవారిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో దట్టంగా అలుముకున్న పొగమేఘాలు కనిపించాయి.

బాంబు దాడిలో పెద్ద అగ్నిగోళం బద్దలైనట్లు వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. బాంబులు పెట్రోల్ బంక్ లేదా ఆయుధాగారం మీద పడటం వల్ల ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని కథనాలు వస్తున్నాయి.

ఈ పేలుళ్లు తెల్లవారే వరకు కొనసాగాయి. పేలుళ్ల తాకిడికి భారీ శబ్ధాలు వినిపించాయి. బేరూత్ మీద ఇజ్రాయెల్ దాడి మొదలైన తర్వాత శనివారం రాత్రి జరిగినన్ని పేలుళ్లు గతంలో ఎన్నడూ జరగలేదు.

తాము హిజ్బొల్లా స్థావరాలపైనే దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దక్షిణ లెబనాన్‌లో తాము 2వేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపింది.

ఇరాన్ నాయకత్వంలోని ‘అనాగరిక శక్తులపై’ పోరాటం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు టీవీ ప్రసంగంలో చెప్పారు.

బీబీసీ
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లెబనాన్, ఇజ్రాయెల్, హిజ్బొల్లా, హమాస్, గాజా
ఫొటో క్యాప్షన్, దక్షిణ బేరూత్‌లో జరిగిన బాంబుదాడి ఏదైనా పెట్రోల్ బంక్, లేదా ఆయుధాగారాన్ని తాకి ఉండొచ్చని భావిస్తున్నారు

ఈ దాడులు కొనసాగుతూ ఉండగానే ఇజ్రాయెల్ మీదకు హిజ్బొల్లా రాకెట్లు ప్రయోగించింది. అయితే వీటిని మధ్యలోనే కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

ముందు జాగ్రత్త చర్యగా ఇజ్రాయెల్- లెబనాన్‌ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

లెబనాన్, ఇజ్రాయెల్, హిజ్బొల్లా, హమాస్, గాజా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దాడుల తర్వాత దక్షిణ బేరూత్ శివార్లలో కనిపిస్తున్న పొగ

గాజాపై దాడులు

గాజాలో ఓ మసీదు మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 21 మంది చనిపోయినట్లు హమాస్ నాయకత్వంలోని పౌర భద్రత సంస్థ ప్రకటించింది.

ఈ మసీదును పౌరుల సంరక్షణ కేంద్రంగా ఉపయోగిస్తున్నట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

ఈ మసీదు సెంట్రల్ గాజాలోని దెయిర్ అల్ బలాహ్ ప్రాంతంలో ఉంది.

ఇందులో హమాస్ మిలిటెంట్లు తలదాచుకున్నట్లు ఇజ్రాయెల్ సేనలు తెలిపాయి.

ఇదే ప్రాంతంలో ఒకప్పుడు స్కూలు నిర్వహించిన భవనంపైనా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.

ఈ రెండు ప్రాంతాలను హమాస్ “ కమాండ్ కంట్రోల్ సెంటర్లు”గా ఉపయోగిస్తోందని, ఇక్కడ దాడి చేసినప్పుడు సాధారణ పౌరులకు గాయాలు కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది.

ఇజ్రాయెల్ మీద హమాస్ దాడికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా, ఇజ్రాయెల్ మీద మరి కొన్ని దాడులు జరగవచ్చని, ఆ దేశం అప్రమత్తంగా ఉండాలని అమెరికన్ నిఘా సంస్థలు హెచ్చరించాయి.

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో 42వేల మంది మరణించారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)