పాకిస్తాన్‌కు జైశంకర్: ఇరుదేశాల సంబంధాలలో మార్పులు వస్తాయా?

ఫొటో సోర్స్, Getty Images
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్తాన్ పర్యటనకు వెళుతున్నారు. అక్టోబర్ 15,16 తేదీలలో పాకిస్తాన్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
దాదాపు దశాబ్దం కాలంలో ఓ భారత మంత్రి పాకిస్తాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
గత ఏడాది ఎస్‌సీఓ సదస్సు భారత్‌లో జరిగినప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇక్కడకు వచ్చారు.
2011 నుంచి భారత్‌కు వచ్చిన తొలి సీనియర్ పాకిస్తానీ రాజకీయ నాయకుడు ఆయనే.
అణ్వాయుధాలు కలిగిన ఈ ఇరుదేశాల మధ్యన కొన్నేళ్లుగా అంత సానుకూల సంబంధాలు లేవు. 1947లో రెండు దేశాలు స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి మూడుసార్లు యుద్ధానికి దిగాయి. వాటిల్లో రెండు కశ్మీర్‌లోని హిమాలయ ప్రాంతంపైనే జరిగాయి.
మధ్య ఆసియాలో ఆర్థిక భద్రతా, అంశాలను చర్చించేందుకు ఏర్పడినదే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్.
నాటో లాంటి పశ్చిమదేశాల కూటముల ప్రభావాన్ని పరిమితం చేసేందుకు 2001లో చైనా, రష్యా, నాలుగు మధ్య ఆసియా దేశాలు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశాయి. భారత్, పాకిస్తాన్‌లు ఈ గ్రూప్‌లో 2017లో చేరాయి.
2023లో ఎస్‌సీఓ సదస్సుకు భారత్ నేతృత్వం వహించగా.. ఈ ఏడాది పాకిస్తాన్ అక్టోబర్ 15, 16 తేదీల్లో ఈ సదస్సును నిర్వహించనుంది.
ఈ సదస్సు కోసం పాకిస్తాన్ వెళుతున్న భారత ప్రతినిధులకు జైశంకర్ నేతృత్వం వహించనున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.


ఫొటో సోర్స్, PTI
2015లో సుష్మా స్వరాజ్..
2015లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్తాన్‌ను సందర్శించారు. ఆ సమయంలో ఇస్లామాబాద్‌లో జరిగిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు ఆమె హాజరయ్యారు. పాకిస్తాన్ అధికారులతో చర్చలు జరిపారు.
ఆ తర్వాత కొన్నిరోజులకే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అకస్మాత్తుగా లాహోర్‌లో పర్యటించారు. ఆ సమయంలో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు.
భారత్, పాకిస్తాన్ మధ్యలో సంబంధాలు చాలాసార్లు దెబ్బతింటున్నాయి. 2019లో ఈ సంబంధాలు మరింతగా సన్నగిల్లాయి. కశ్మీర్‌లోని భారత బలగాలపై మిలిటెంట్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ భూభాగంపై భారత్ దాడులు జరిపింది.
కశ్మీర్‌లో నెలకొన్న వేర్పాటువాద తిరుగుబాటుతో గత మూడు దశాబ్దాలలో వేలాది మరణాలు చోటు చేసుకున్నాయి. వేర్పాటువాదులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని భారత్ ఆరోపిస్తుండగా.. ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఖండిస్తోంది.
గత ఏడాది గోవాలో జరిగిన ఎస్‌సీఓ సదస్సు కోసం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు వచ్చినప్పుడు, తన దృష్టి అంతా ఎస్‌సీఓ సదస్సుపైనే అని చెప్పారు.
ఆ పర్యటనలో ఆయన జైశంకర్‌తో నేరుగా ఎలాంటి చర్చలు జరపలేదు. ఆ సమయంలోబిలావల్ భుట్టో బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు
ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని బిలావల్ భుట్టో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జైశంకర్ ఏమన్నారు?
పాకిస్తాన్ పర్యటనపై జైశంకర్ స్పందించారు. ‘‘ఈ నెల మధ్యలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం కోసం పాకిస్తాన్ వెళుతున్నా’’ అని చెప్పారు. ‘‘ భారత్-పాకిస్తాన్ సంబంధాలపై చర్చించేందుకు నేను అక్కడకు వెళ్లడం లేదు. ఎస్‌సీఓ సభ్యునిగా అక్కడకు వెళ్తున్నాను’’ అని చెప్పారు.
‘‘మీకు తెలుసు, నేను చాలా మర్యాదపూర్వకంగా నడుచుకునే వ్యక్తినని, అలాగే నడుచుకుంటాను’’ అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














