యతి నరసింహానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు, ఎఫ్ఐఆర్ నమోదు

- రచయిత, నితేష్ రౌత్
- హోదా, బీబీసీ కోసం
యూపీకి చెందిన యతి నరసింహానంద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
మహమ్మద్ ప్రవక్తపై యతి నరసింహానంద్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, బులంద్ షహర్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. బులంద్ షహర్ లోని సికింద్రాబాద్‌లో ప్రజలు పోలీసులపై రాళ్లు రువ్వారు.
మరోపక్క మహారాష్ట్రలోని అమరావతిలో కూడా నరసింహానంద్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ప్రజలు పోలీసులపై రాళ్లు రువ్వారు.
రాత్రి వేళ వందల మంది గుంపుగా వచ్చి పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడంతో అమరావతిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది. పోలీస్ వ్యాన్, టూవీలర్స్ దెబ్బతిన్నాయి. కొందరు పోలీసులకు, అధికారులకు గాయాలు అయ్యాయని పోలీసులు చెప్పారు.


ఫొటో సోర్స్, @bulandshahrpol
యతి నరసింహానందపై ఎఫ్ఐఆర్
ఈ కేసులో యతి నరసింహానంద్ పై యూపీలోని ఘజియాబాద్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మత సామరస్యానికి విఘాతం కలిగించేలా నరసింహానంద్ వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఆయన విద్వేష ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోందని, దీనివల్ల శాంతి భ ద్రతలకు, మతసామరస్యానికి విఘాతం కలుగుతుందని ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.
ఈ వీడియో కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, సికింద్రాబాద్‌లలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.
యతి నరసింహానంద్ వ్యాఖ్యలపై జమియాత్ ఉలేమా ఎ హింద్ దిల్లీలోని ఇందర్‌పురి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
యతి నరసింహానంద్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని జమియాత్ ఉలేమా ఎ హింద్ అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ మదానీ కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌షాకు ఓ లేఖ రాశారు.
గతంలో కూడా యతి నరసింహానంద్ ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల కారణంగా ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. హరిద్వార్‌లో 2022లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముస్లింలను బహిరంగంగానే బెదిరించారు.
యతి నరసింహానంద్ వ్యాఖ్యల తరువాత బులంద్‌షహార్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.ఆందోళలన సందర్భంగా రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్‌కు దిగారు.
ఎనిమిదిమంది ఆందోళనాకారులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మరోపక్క నరసింహానంద్ దిష్టిబొమ్మను దహనం చేసినందుకు ఘజియాబాద్‌లో 200మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదైంది.

మహారాష్ట్రలో ఏం జరిగింది?
మహారాష్ట్రలోని అమరావతిలోనూ యతి నరసింహానంద్ సరస్వతి వ్యాఖ్యల ప్రభావం కనిపించింది. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ గుంపు నాగ్‌పురి పోలీసుస్టేషన్ వద్ద గుమికూడింది. ఈ సందర్భంగా ఆందోళనాకారులు పోలీసుస్టేషన్‌పై రాళ్లు రువ్వారు.
నాగ్‌పురి గేటు వైపు సుమారు 400 మంది నుంచి 500 మంది వరకు వచ్చారు. ఈ గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
వందలాదిమంది ఆందోళనాకారులు పోలీసుస్టేషన్‌ను ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నాగ్‌పురి గేట్ పోలీసు స్టేషన్ వద్ద సెక్షన్ 144 కింద కర్ఫ్యూ విధించారు. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అక్టోబర్ 4వతేదీ రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
పుకార్లను నమ్మొద్దని పోలీసులు పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కర్ఫ్యూ విధిస్తూ పోలీసు కమీషనర్ నవీన్ చంద్రా రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

1200 మందిపై కేసు నమోదు
నాగ్‌పురి గేట్ పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్విన గుంపులోని మొత్తం 1200 మందిపై కేసు నమోదు చేశారు.
రాళ్లు విసరడం, పోలీసులపై దాడి, పోలీస్ స్టేషన్ పోలీస్ వ్యాన్‌లను ధ్వంసం చేయడం వంటి తీవ్ర నేరాల కింద కేసు నమోదు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటోన్న వారిలో 26 మందిని పోలీసులు గుర్తించారు.
పోలీస్ స్టేషన్‌పై రాళ్లు వేయడంతో 21 మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. 10 పోలీస్ వ్యాన్‌లు దెబ్బతిన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














