మధ్యప్రదేశ్‌: ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి, దోపిడీ, వారి స్నేహితురాలిపై అత్యాచారం.. ఈ కేసులో ఏం జరిగింది?

మధ్యప్రదేశ్ పోలీసులు

ఫొటో సోర్స్, Shuraih Niyazi

    • రచయిత, షురైహ్ నియాజీ
    • హోదా, బీబీసీ కోసం, భోపాల్ నుంచి

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ జిల్లా మహూ పట్టణంలో ఇద్దరు యువ ఆర్మీ ఆఫీసర్లపై దాడి చేసి, దోచుకోవడంతో పాటు వారి స్నేహితురాలిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో తొలుత ముగ్గురిని అరెస్ట్ చేశారు. తర్వాత ఆ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై శాఖాపరమైన విచారణ కూడా మొదలైందని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

దుండగులు ఆ అధికారులపై దాడి చేసి, దోచుకుని, వారి స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు చెబుతున్న ఈ ఘటన సెప్టెంబర్ 11 రాత్రి జరిగింది. బాధితురాలు మాట్లాడేందుకు ఇంకా సిద్ధంగా లేనందున, ఆమె వాంగ్మూలాన్ని ఇంకా తీసుకోలేకపోయామని పోలీసులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలు ఏమైంది?

బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మహూలోని బడ్గోందా పోలీస్ స్టేషన్ పరిధిలో జామ్‌గేట్‌కు సమీపంలో ఉన్న షూటింగ్ రేంజ్‌కు ఇద్దరు ఆర్మీ అధికారులు తమ స్నేహితురాళ్లతో కలిసి వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.

‘‘ఈ అధికారులు జామ్‌గేట్‌ దగ్గర కారులో బిగ్గరగా మ్యూజిక్ పెట్టారు. ఆ శబ్దం విని నిందితులు అక్కడికి వెళ్లారు. రాత్రి 2:30-3:00 గంటల మధ్య నిందితులు వెనుక నుంచి వచ్చి అధికారులపై దాడి చేశారు. కొట్టారు. ఒక అధికారిని, ఒక యువతిని బందీలుగా చేసుకున్నారు. వారిని విడిచిపెట్టాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 10 లక్షలు తీసుకురావాలని ఒక అధికారిని, యువతిని అక్కడి నుంచి పంపించారు. ఉదయం 4:30 గంటల సమయంలో వీరిద్దరూ తమ కమాండింగ్ ఆఫీసర్‌కు ఈ ఘటన గురించి చెప్పారు’’ అని పోలీసులు వివరించారు.

పోలీసులకు సమాచారం అందిన తర్వాత గస్తీ నిర్వహిస్తోన్న పోలీస్ బృందం అక్కడికి వెళ్లింది.

ఇందౌర్ రూరల్ పోలీస్ సూపరింటెండెండ్ హితికా వాసల్

ఫొటో సోర్స్, Shuraih Niyazi

ఫొటో క్యాప్షన్, ఇందౌర్ రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హితికా వాసల్

ఇందౌర్ రూరల్ ఎస్పీ హితికా వాసల్ ఈ ఘటన గురించి వివరించారు.

‘‘అక్కడ బందీగా ఉన్న తమ స్నేహితురాలిని నిందితులు వేరే వైపుకు తీసుకెళ్లారని ఫిర్యాదుదారు చెప్పారు. తర్వాత, ఆమె అరుపులు వినిపించాయని, ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు’’ అని హితికా వెల్లడించారు.

‘‘ఆమె ఇంకా మాట్లాడలేకపోతున్నారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే స్థితికి ఆమె వచ్చేవరకు మేం ఆగుతాం. మేం ఆమెను ఏ రకంగానూ ఒత్తిడి చేయలేం’’ అని ఎస్పీ చెప్పారు.

‘‘నిందితులను కాల్చేయండి లేదా తననైనా కాల్చేయండి’’ అని బాధితురాలు అన్నట్లు మరో పోలీస్ అధికారి తెలిపారు.

బాధిత ఆర్మీ అధికారుల వాంగ్మూలం ఆధారంగా నిందితులపై దాడి, దోపిడీ, సామూహిక అత్యాచారం వంటి కేసులు నమోదు చేశారు.

మహిళలపై లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

నిందితుల గురించి పోలీసులు ఏం చెప్పారు?

ఈ ఘటన జరిగిన తర్వాత ఆరుగురు నిందితుల వివరాలను తెలుసుకుని, 50 గంటల్లోనే వారందరినీ పట్టుకున్నామని ఇందౌర్ పోలీసులు తెలిపారు.

నిందితుల అరెస్ట్ కోసం పోలీసులు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఆరుగురు నిందితుల్లో మొదట అనిల్ బారోర్, పవన్ బన్సూనియా, రితేశ్ భాభర్‌లను పట్టుకున్నామని ఎస్పీ చెప్పారు.

శుక్రవారం (సెప్టెంబర్ 13) రోహిత్ గిర్వాల్, సందీప్ వారియా, సచిన్ మక్వానాలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

‘‘మొదట అనిల్ బారోర్, కారు నుంచి వస్తోన్న శబ్దాన్ని విని దోపిడీ చేయడం కోసం మిగతా స్నేహితులను పిలిచారు. అనిల్ ఒక మద్యం దుకాణంలో పని చేసేవారు. తర్వాత రితేశ్ భాభర్, ఆర్మీ అధికారులను ఆయుధాలతో బెదిరించి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు’’ అని పోలీసులు వెల్లడించారు.

నిందితులందరికీ నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.

మధ్యప్రదేశ్‌లో ఆర్మీ అధికారులపై దాడి, దోపిడీ

ఫొటో సోర్స్, Shuraih Niyazi

శిక్షణ కోసం మహూకు వచ్చిన అధికారులు

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఆర్మీ అధికారులు మహూలోని ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో శిక్షణ కోసం వచ్చారు.

తమ స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లేందుకు వారు కారును కిరాయికి తీసుకున్నారు. ఆ కారులోనే వారు జామ్‌గేట్‌ దగ్గరలో ఉన్న ఫైరింగ్ రేంజ్‌కు చేరుకున్నారు. అక్కడే ఈ ఘటన జరిగింది.

గాయపడిన ఇద్దరు ఆర్మీ అధికారులను మహూ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారి శరీరాలపై కొన్ని గాయాలు కనిపించాయని, తీవ్రమైన గాయాలేమీ కాలేదని పోలీసులు తెలిపారు.

శాంతిభద్రతలపై ప్రశ్నలు

చాలామంది నాయకులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, బీజేపీని టార్గెట్ చేయగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా తమ వాదనను వినిపించారు.

‘‘మధ్యప్రదేశ్‌లో దుండగులు ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి చేసి, వారి స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సమాజం మొత్తాన్ని సిగ్గుపడేలా చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ దాదాపు శూన్యంగా ఉంది. మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న నేరాలపై బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి చాలా బాధాకరం’’ అని సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

దీనికి బదులిస్తూ, ఈ ఘటనపై తక్షణమే చర్య తీసుకొని నిందితులను పట్టుకున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చెప్పారు.

‘‘ఇలాంటి కేసులను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే వారిని విడిచిపెట్టం’’ అని మోహన్ యాదవ్ అన్నారు.

బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా ఈ కేసులో ప్రభుత్వ వైఖరిని ఖండించారు.

‘‘పర్యాటక ప్రదేశమైన జామ్‌గేట్‌ను సందర్శించడానికి వెళ్లిన ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి చేయడం, దోపిడీకి పాల్పడటం, వారి స్నేహితురాలిని బాధ పెట్టడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి హేయమైన ఘటనలను ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించకపోవడం వల్ల పరిస్థితులు చేజారుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె సోషల్ మీడియాలో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)