వేలూర్: ‘ఆడపిల్ల పుట్టిందని చంపేసి, ఇంటి ముందే పాతిపెట్టిన దంపతులు’ ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ఏం చెప్పారు...

ఫొటో సోర్స్, HANDOUT
- రచయిత, విజయానంద్ ఆరుముగం
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని విషయాలు మీకు అసౌకర్యం కలిగించవచ్చు.
"పాప బాగానే ఉంది. పెద్దమ్మాయి తెలియక పాపపై దుప్పటి కప్పేయడంతో ఊపిరి ఆడలేదు. అందుకే చనిపోయింది"
"పాప శబ్దం చేయడం కూడా మీకు వినిపించలేదా?"
"నా భార్య నిద్రపోతోంది. పాపకు పాలు తాగించాలనుకున్నా. నేను వెళ్లేసరికి పాప శరీరం చల్లగా అయి ఉంది"
బుధవారం (సెప్టెంబర్ 4) వేలూరు జిల్లా సెర్బాడి ప్రాంతానికి చెందిన విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (వీఏవో) శక్తివేల్‌కు, బొమ్మన్‌కొట్టై గ్రామానికి చెందిన జీవా-డయానా దంపతుల మధ్య జరిగిన సంభాషణ ఇది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కూతురు ఉంది.
ఆగస్టు 27న ప్రసవ వేదనతో బాధపడుతున్న డయానాను ఒడుగత్తూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అక్కడ ఆమె కూతురికి జన్మనిచ్చారు.
అయితే, ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో డయానాను ఓ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.
"ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నవజాత శిశువు చనిపోయిందని అసిస్టెంట్ వీఏవో సెల్వరాసా సమాచారం అందించారు. నేను అక్కడికి వెళ్లి వాళ్లతో మాట్లాడినప్పుడు శిశువు మృతిపై తల్లిదండ్రులు ఏమాత్రం విచారంగా కనిపించలేదు. బిడ్డను ఎక్కడ పాతిపెట్టారని అడిగితే...ఇంటి ముందే నాలుగడుగుల గొయ్యి తవ్వి పూడ్చిపెట్టామని శిశువు తండ్రి జీవా చెప్పారు. సమాధిపై మొక్క కూడా నాటామని అన్నారు’’ అని శక్తివేల్ తెలిపారు.
పాప మరణంపై రెవెన్యూ, పోలీసు అధికారులు దర్యాప్తు చేసినప్పుడు కూడా జీవా, డయానాలు ఇదే కథ చెప్పారు.


ఫొటో సోర్స్, HANDOUT
తల్లిదండ్రులపై అనుమానం ఎలా వచ్చింది?
వేలూర్‌కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో బొమ్మన్‌కొట్టై ప్రాంతం ఉంది. తహశీల్దార్‌తో పాటు ఇతర అధికారులు ఆ ప్రదేశానికి చేరుకొని విచారణ చేపట్టారు.
అయితే, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జీవా, డయానాలు పశువులను వదిలిపెట్టి వస్తామని వెళ్లి తిరిగి రాలేదు.
దీంతో తల్లిదండ్రులే శిశువును హత్య చేసి ఉంటారని అధికారులలో అనుమానం మొదలైంది.
మరుసటి రోజు సెప్టెంబర్ 5వ తేదీన రెవెన్యూ అధికారి సమక్షంలో పాపను పూడ్చిన ప్రాంతాన్ని తవ్వి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. జీవా, డయానాలను పోలీసులు వెతికి పట్టుకున్నారు.
ఓవైపు వీఏవో విచారణ కొనసాగుతుండగానే వేప్పన్‌కుళం పోలీస్ స్టేషన్‌లో డయానా తండ్రి శరవణన్ ఒక ఫిర్యాదు చేశారు. పాప మృతి అనుమానాస్పదంగా ఉందని అందులో పేర్కొన్నారు. బంధువులకు సమాచారం ఇవ్వకుండా తన కూతురు, అల్లుడు శిశువును హడావుడిగా పూడ్చిపెట్టారని తెలిపారు.

ఫొటో సోర్స్, HANDOUT
'పెళ్లి చేయాలి, బంగారం పెట్టాలి'
శరవణన్ ఫిర్యాదు మేరకు పాప మృతిని 'అసహజ మరణం' అని పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసు గురించి వేప్పంకుళం పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ తమిళరసితో బీబీసీ మాట్లాడింది.
'‘పాప తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నాం. 'ఆడపిల్లను పెంచాలి, పెద్ద చేయాలి, పెళ్లి చేసి 10 సవర్ల బంగారం పెట్టాలి. అందుకే చంపేశాం' అని విచారణలో శిశువు తండ్రి జీవా చెప్పినట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. పోస్ట్‌మార్టం నివేదిక, తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ అప్‌డేట్ చేస్తాం” అని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
‘‘బిడ్డను పెంచడం కష్టంగా భావించి చంపేశామని వాళ్లు అంటున్నారు. అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్లు వెనకబడిన వర్గాలకు చెందినవారే అయినా, వారి ఆర్థిక పరిస్థితి మరీ అంత దారుణంగా ఏమీ లేదు. కొత్త ఇల్లు కూడా కట్టుకున్నారు. కుటుంబానికి మగబిడ్డ మాత్రమే వారసుడిగా భావించే పాతకాలపు మనస్తత్వంలో వాళ్లు ఉన్నారు’’ అని వేలూర్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌కు చెందిన వలంటీర్ ఒకరు అన్నారు.
‘దత్తతకు ఎందుకు ఇవ్వలేదంటే...’
"బిడ్డను చంపితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే భయం కూడా తల్లిదండ్రులకు లేదు. వారికి అమ్మాయి వద్దనుకుంటే ప్రభుత్వానికి అప్పగించవచ్చు లేదా బంధువులకు దత్తత ఇవ్వొచ్చు. కానీ అలా ఇస్తే పరువు పోతుందని దంపతులు భావించారు" అని వేలూర్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సంజిత్ బీబీసీతో చెప్పారు.
వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడగలమని అన్నారు.
ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్థానికంగా పలుచోట్ల సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పడిపోతున్న బాలికల నిష్పత్తి..
"శిశువు పుడితే తమిళనాడులోని పీఐసీఎంఈ (ప్రెగ్నెన్సీ అండ్ ఇన్‌ఫాంట్ కోహోర్ట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్) సిస్టమ్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. అప్పుడే ప్రభుత్వ పరంగా వైద్య సహాయాన్ని పొందవచ్చు. శిశువు వివరాలు నమోదు చేసే సమయంలో నర్సులు తల్లిదండ్రుల మానసిక స్థితిని అంచనా వేయాల్సింది. ముందే పసిగట్టినట్లయితే శిశువును రక్షించే అవకాశం ఉండేది" అని చైల్డ్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ దేవనేయన్ అరసు బీబీసీతో అన్నారు.
"ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ‘కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్’ ప్రకారం, శిశువు పుట్టినప్పటి నుంచి వారికి బాలల హక్కులు ప్రారంభమవుతాయి.18 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతాయి" అని దేవనేయన్ చెప్పారు.
"2011 తర్వాత జన గణన చేయలేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2020-21) ప్రకారం, తమిళనాడులో ప్రతి 1,000 మంది అబ్బాయిలకు సగటున 878 మంది బాలికలు ఉన్నారు. పెరంబలూర్, అరియలూర్ వంటి జిల్లాల్లో ఇది 850 కన్నా దిగువన ఉంది" అని దేవనేయన్ తెలిపారు.
"ఆడ శిశు హత్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా లింగ నిష్పత్తి దిగజారుతోంది. భారత్ వంటి దేశాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఆడపిల్ల పుడితే వారికి రక్షణ, వివాహం, కట్నం వంటి విషయాలను తాము ఎదుర్కోబోయే సమస్యలుగా కొందరు తల్లిదండ్రులు భావిస్తున్నారు" అని దేవనేయన్ అన్నారు.
"భ్రూణ హత్యలు, శిశు హత్యలు, యుక్తవయసు వచ్చాకే గర్భం దాల్చాలి వంటివి చట్టాలు, పథకాల ద్వారా మాత్రమే జరగవు. సాంస్కృతిక మార్పుగా రావాలి. లింగ సమానత్వాన్ని బోధించే పాఠ్యాంశాలు, మార్గదర్శకాలు ఉండాలి" అని దేవనేయన్ తెలిపారు.

ఫొటో సోర్స్, HANDOUT
అమ్మాయి వద్దనుకుంటే ప్రభుత్వానికి ఇచ్చేయండి: మంత్రి గీతాజీవన్
దేశవ్యాప్తంగా ఆడశిశువుల హత్యలు జరుగుతున్నాయని, మరోవైపు సంతానం లేనివారు కూడా ఉన్నారని దేవనేయన అరసు చెబుతున్నారు.
"ఇటీవల సంతాన సాఫల్య కేంద్రాలు పెరుగుతున్నాయి. ఎక్కువమంది పిల్లలు అవసరమైన దేశంగా భారత్ మారుతోంది" అని అన్నారు.
శిశు హత్యలను అరికట్టాలంటే ఆరోగ్య శాఖ పర్యవేక్షణ చాలా అవసరమని, ఒక్కసారి గర్భం దాల్చితే ఆ బిడ్డను దేశం కాపాడుతుందనే సందేశంతో తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేయాలని దేవనేయన సూచించారు.
ఆడపిల్లల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, వేలూర్‌లో ఆడశిశువు మృతి చెందడం పట్ల తమిళనాడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతాజీవన్ విచారం వ్యక్తం చేశారు.
"ఆడపిల్లను పెంచలేమని కుటుంబాలు భావిస్తే, ప్రభుత్వానికి అప్పగించవచ్చు. పిల్లల విద్య, భద్రత, భవిష్యత్తును ప్రభుత్వం చూసుకుంటుంది" అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














