ఎన్ఐసీయూ: నవజాత శిశు సంరక్షణా కేంద్రం అంటే ఏంటి? అవి ఎందుకంత ముఖ్యం?

ఫొటో సోర్స్, PHOTODISC
- రచయిత, ఆలమూరు సౌమ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నా భార్యకు ఏడు నెలలు నిండిన తరువాత కొన్ని ఆరోగ్య సమస్యలొచ్చి వెంటనే సిజేరియన్ చేయాల్సి వచ్చింది. పుట్టిన తరువాత మా పాప బరువు 1.2 కేజీలు మాత్రమే ఉంది. చాలా సున్నితంగా, బలహీనంగా ఉన్న పాపను నియోనాటల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) లో చేర్పించాం.
"అక్కడ కేవలం ఒక్క కేజీ బరువున్న పిల్లలు కూడా ఉన్నారు. అంత చిన్న చిన్న పిల్లల్ని చూస్తే ఎవరికైనా మనసు చలించిపోతుంది. మా పాపతో సహా ఆ పిల్లలందరికీ ఎన్ఐసీయూ అనేది ఒక వరం" అంటున్నారు ఒంగోలుకు చెందిన శ్రీనివాస్.
నవజాత శిశు సంరక్షణా కేంద్రం (ఎన్ఐసీయూ) అంటే ఏంటి?
2000 సంవత్సరంలో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన 8 లక్ష్యాల్లో 'నవజాత శిశు మరణాల రేటును తగ్గించడం' కూడా ఒకటి.
ఈ నేపథ్యంలో శిశు మరణాల రేటు తగ్గించడం, నవజాత శిశు సంరక్షణను జాతీయ ప్రాధాన్యతగా పరిగణిస్తూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నవజాత శిశువుల సంక్షేమంకోసం భారత ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకాన్ని (ఎన్ఆర్‌హెచ్ఎం) ప్రారంభించింది.
అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పథకంలో భాగంగా జిల్లా స్థాయి నవజాత శిశు సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసారు.
ఈ కేంద్రాలలో నెలలు నిండకముందే పుట్టిన పిల్లల బరువు, తల్లి కడుపులో ఉన్న వారాల సంఖ్య ఆధారంగా మూడు స్థాయిల్లో సంరక్షణ ఉంటుంది.
మొదటి స్థాయి (లెవెల్-1 కేర్)లో 34 వారాలు లేదా అంతకన్నా ఎక్కువ వారాలు తల్లి కడుపులో పెరిగి, 1800 గ్రాముల కన్నా ఎక్కువ బరువున్న పిల్లలకు వైద్య సహాయం అందిస్తారు.
రెండవ స్థాయి (లెవెల్-2 కేర్)లో 30-34 వారాలలో పుట్టిన 1200-1800 గ్రాముల బరువున్న పిల్లలను ఉంచుతారు.
మూడవ స్థాయి (లెవెల్-3 కేర్)లో 30 వారాల కన్నా తక్కువ సమయం తల్లి కడుపులో పెరిగిన, 1200 గ్రాముల కన్నా తక్కువ బరువున్న పిల్లలకు అత్యంత అధునాతనమైన వైద్య సహాయం అందిస్తారు.

ఎన్ఆర్‌హెచ్ఎం ప్రారంభించిన తరువాత దేశంలో నవజాత శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో పీడియాట్రీషన్‌గా పనిచేస్తున్న డా. శిరీష పాటిబండ్ల తెలిపారు.
"అంతేకాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాలమధ్య ఆరోగ్యపరమైన, వైద్యపరమైన అసమానతలు తగ్గించడానికి కూడా ఎన్ఆర్‌హెచ్ఎం ఎంతగానో ఉపయోగపడింది. జిల్లా స్థాయిలో ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా ప్రారంభించిన నవజాత శిశు రక్షణా కేంద్రాల (న్యూ బోర్న్ కేర్ కార్నర్) వలన నియో నాటల్ పీరియడ్ అంటే బిడ్డ పుట్టిన మొదటి 28 రోజుల్లో శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. న్యూ బోర్న్ కేర్ కార్నర్ (పెరినాటల్)… పుట్టగానే మొదటి వారం రోజుల వయసులో తలెత్తే ఆరోగ్య సమస్యలకు, బిడ్డలకు తల్లి పాలు మాత్రమే ఇచ్చేట్టు ప్రోత్సహించడానికి అత్యుత్తమ పరిష్కారం. అలాగే కాన్పు మొదటి వారంలో ఆశా కార్యకర్తల గృహసందర్శనలు కూడా ఇందుకు దోహదపడతాయి" అని డా. శిరీష తెలిపారు.
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) ప్రచురించిన 'లెవెల్స్ & ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మోర్టాలిటీ' రిపోర్ట్ 2020 ప్రకారం... భారతదేశంలో నవజాత శిశు మరణాల రేటు 2006 నుంచీ 2019 కి సగటున 37 నుంచీ 22కు తగ్గింది. 1990 నుంచీ చూస్తే 2019 కి 57 నుంచీ 22 కు తగ్గింది. ఇదే పీరియడ్‌లో నవజాత శిశు మరణాల సంఖ్య 15 లక్షలనుంచీ 5 లక్షలకు తగ్గింది.
శాతాలలో చూస్తే, నవజాత శిశు మరణాల రేటు 1990 నుంచీ 2005 కు 39% తగ్గగా, 2005 నుంచీ 2019కి 41% తగ్గింది. 1990 నుంచీ 2019కి 60% తగ్గింది. అంటే నవజాత శిశు కేంద్రాలను ఏర్పటు చేసాక నవజాత శిశుమరణాల రేటు ఎక్కువగా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
"గ్రామీణ ప్రాంతాల్లో నెలలు తక్కువగా పుట్టిన పిల్లలమీద, బరువు తక్కువగా ఉన్న లేదా పురిటి సమయంలో ఇంఫెక్షన్లు సోకిన వారిపై ఆశ వదిలేసుకోవలసి వచ్చేది. సరైన వైద్య సదుపాయాలు లేక, ఇలా పుట్టిన పిల్లలు చనిపోవడం అనేది ప్రకృతి సహజం అనే స్థాయికి గ్రామీణ ప్రజలు చేరిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహాయంతో జాతీయ ఆరోగ్య పథకం (ఎన్‌హెచ్ఎం) కింద పల్లె ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణా కేంద్రాలవలన చాలా ప్రయోజనం చేకూరింది" అని డా. శిరీష అభిప్రాయపడ్డారు.
"అంతే కాకుండా బిడ్డ పుట్టిన మొదటి వెయ్యి రోజులకు అవసరమయ్యే పోషకవిలువల గురించి ప్రభుత్వం చేపట్టిన అవగాహనా కార్యక్రమాలు, సహాయ సహకారాలు పుట్టిన ప్రతిబిడ్డ సమిష్టి ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో తలెత్తే ఎన్నో ఆరోగ్య సమస్యలకు బాల్యంలోనే చెక్ పెట్టవచ్చు. రాష్ట్రీయ బాల్ స్వస్థ్య కార్యక్రమ్ (ఆర్‌బీఎస్‌కే) పథకం కింద బడికి వెళ్లే పిల్లల్లో (5 ఏళ్లు నిండినవారు) తలెత్తే రకరకాల ఆరోగ్య సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి, చికిత్స దిశగా నడిపించే బాధ్యత కూడా ఎన్ఆర్‌హెచ్ఎం తీసుకుంది. తద్వారా నాలుగు నాలుగు డీ లు (4 Ds)..... డిఫెక్ట్స్ అట్ బర్త్ (పుట్టుకతో వచ్చిన లోపాలు), డెఫిషియన్సీస్ (కొరతలు), డిసీజెస్ (రోగాలు), డెవెలప్మెంట్ డిలేస్ (ఆలస్యంగా పెరుగుదల)....వీటన్నిటినీ పరిష్కరించడం ద్వారా పుట్టిన పిల్లలు కేవలం బతకడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి పునాదులు ఏర్పడ్డాయి" అని డా. శిరీష తెలిపారు.
అయితే, ప్రపంచ వ్యాప్తంగా సంభవించే నవజాత శిశు మరణాలలో ప్రతి మూడిట్లో ఒకటి మన దేశంలో సంభవిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, DR RAVI KHANNA
సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్ ఏర్పాటు
పుట్టిన ప్రతీ శిశువుకూ జీవించే హక్కు ఉంటుందన్న నినాదంతో 2015లో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపి) నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మూడవది శిశు సంక్షేమం, నవజాత శిశు మరణాల రేటు తగ్గించడం. 2030కల్లా ప్రపంచ దేశాలన్నీ నవజాత శిశు మరణాల రేటును 12 (పుట్టే ప్రతీ 1000 మంది పిల్లలకు) కు తగ్గించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా, నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా ఇండియాలో గ్రామీణ ప్రాంతల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు అనుబంధంగా మినీ నవజాత శిశు సంక్షేమ కేంద్రాలను, సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్ (ఎస్ఎన్‌సీయూ) ఏర్పరిచారు. "దీని ద్వారా వందలాది శిశువుల ప్రాణాలు కాపాడగలుగుతున్నారని" డా. శిరీష అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో....
'నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-4' గణాంకాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లో శిశు మరణాల రేటు పట్టణ ప్రాంతాల్లో 20 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 40 ఉంది. తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో 17, గ్రామీణ ప్రాంతాల్లో 38 ఉంది.
అయితే, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని 2030 కల్లా నవజాతశిశు మరణాల రేటుని గణనీయంగా తగ్గించేందుకు జిల్లా స్థాయి ప్రభుత్వ ఆస్పత్రులకు అనుబంధంగా ఎస్ఎన్‌సీయూలను ఏర్పాటు చేసారు.
ఇందులో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులతో పాటూ, పీడియాట్రీషన్ల బృందం 24 గంటలూ పనిచేస్తుంటారు. మొదట్లో చాలా జిల్లాలో లెవెల్-1 కేర్ మాత్రమే ఉండేది. తరువాత లెవెల్-2 కేర్ అంటే ఆక్సిజన్ సరఫరా మాత్రమే కాకుండా వార్మర్‌లు, సీ పాప్, ఫొటో థెరపీ యూనిట్లతోపాటూ ఇతర సదుపయాలు కూడా ఉండేలా ఎస్ఎన్‌సీయూలను ఏర్పాటు చేసారు.
ఇండియాలో మొట్టమొదటి ఎస్ఎన్‌సీయూ తెలంగాణాకు చెందిన నల్గొండ జిల్లాలో ప్రారంభమయ్యింది. అంతేకాకుండా నేషనల్ నియోనాటాలజీ ఫారం (ఎన్ఎన్ఎఫ్) గుర్తింపు పొందిన మొట్టమొదటి లెవెల్-2 కేర్ యూనిట్ కూడా నల్గొండ ప్రభుత్వాస్పత్రికి అనుబంధంగా ఉన్న ఎస్ఎన్‌సీయూలోనే ప్రారంభమయ్యింది.
"నల్గొండ ఎస్ఎన్‌సీయూలో డాక్టర్లు అద్భుతాలు సృష్టిస్తునారని చెప్పొచ్చు. ఇక్కడ వైద్య ప్రమాణాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గర్లో ఉన్నాయని చెప్పొచ్చు" అని డా. శిరీష తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎస్ఎన్‌సీయూలలో కంగారూ మదర్ కేర్ (కేఎంసీ) పద్ధతిలో బిడ్డలకు రక్షణ అందిస్తున్నారు. అంటే పుట్టిన బిడ్డలకు కంగారూ తరహాలో రక్షణ ఇస్తారు. కంగారూలు నెలలు నిండకముందే పిల్లల్ని కంటాయి. వాటిని తమ పొట్ట దగ్గర ఉన్న సంచీలో దాచుకుని రక్షణ కల్పిస్తాయి. అదే తరహాలో నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలకు, తల్లులకూ కలిపి వైద్య సదుపాయలు అందించేలా ఏర్పాటు చేసారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎన్ఐసీయూల్లో అధిక ఖర్చు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నవజాత శిశు సంరక్షణా కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తుంటే, ప్రైవేటు ఆస్పత్రుల్లో బిడ్డలను ఎన్ఐసీయూల్లో చేర్చడం మధ్య తరగతి తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ప్రభుత్వ ఆస్పత్రులలో ఇన్ని అధునాతన సదుపాయాలున్నప్పటికీ ప్రైవేటు ఆస్పతులకు ఎందుకు వెళ్లవలసి వస్తోందంటే...చాలామందికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ఎన్ఐసీయూ సదుపాయల గురించి అవహాగన లేకపోవడం ఒక కారణమైతే, ప్రభుత్వాస్పత్రులలో ఎన్ఐసీయూలు కిక్కిరిసి ఉండడం మరో కారణమని కొందరు అంటున్నారు.
"మా పాప పుట్టిన వెంటనే 1.2 కేజీలు మాత్రమే ఉండడంతో విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఎన్ఐసీయూలో జాయిన్ చేయాల్సి వచ్చింది. అక్కడకు వెళ్లగానే రోజుకి 25,000 రూపాయలు ఖర్చు అవుతుందని ముందే చెప్పేసారు. అర్థరాత్రిపూట చేతిలో పురిటికందుతో అక్కడికి వెళ్లిన నాకు. ఇంత ఖర్చు అవుతుందని వినగానే కంగారు పుట్టింది. చేతిలో ఉన్న డబ్బుతో పాపని ముందు జాయిన్ చేసేసాను. అక్కడ పాపను ఉంచిన నియోనాటల్ కేర్‌లో చాలా ప్రొఫెషనల్‌గా వైద్యం అందించారు. బాగా కేర్ తీసుకున్నారు కానీ రోజుకు అంత డబ్బు భరించడం మధ్య తరగతి తల్లిదండ్రులకు చాలా కష్టమవుతుంది" అంటున్నారు శ్రీనివాస్.
"కొంతమంది పిల్లలకు రోజుకు 50,000 రూపాయలు కట్టిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కొంతమంది పుట్టిన బిడ్డలను తీసుకొచ్చి జాయిన్ చేసిన తరువాత, వాళ్లని డిశ్చార్జ్ చేసే టైముకి ఆస్తులు అమ్ముకున్న తల్లిదండ్రులను కూడా నేను అక్కడ చూసాను. మాకు కూడా చాలా ఖర్చయ్యింది. కానీ మా పాప పూర్తి ఆరోగ్యంతో ఇంటికొచ్చింది. అదే పదివేలుగా భావించాం. కానీ ఖర్చు తక్కువ ఉంటే మాత్రం ఈ ఎన్ఐసీయూలనేవి పసిబిడ్డల పాలిట వరం" అని శ్రీనివాస్ తెలిపారు.
"ప్రైవేటు ఆస్పత్రులకు, ప్రభుత్వ ఆస్పత్రులకు మధ్య ఖర్చుల అంతరం చాలా ఎక్కువే. పేదవాళ్లకు ఈ ఖర్చులు భరించడం మరీ కష్టం. నేను గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసినప్పుడు నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలను లేదా లోపాలతో పుట్టిన పిల్లలను హైదరాబాదు తీసుకెళ్లమని చెప్తే చాలా భయపడిపోయేవారు. పిల్ల బతుకుతుందంటేనే తీసుకెళతాం, బతుకుందో లేదో కచ్చితంగా చెప్పమనేవారు. వాళ్లకు హైదరాబాదులాంటి పట్టణాలకు వెళ్లడమే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది అక్కడికెళ్లి బిడ్డల్ని ఆస్పత్రుల్లో పెట్టడం అసాధ్యం" అని డా. శిరీష అన్నారు.
"ప్రభుత్వాస్పత్రుల్లో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలను ఇంకా విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉంది. దానితోపాటుగా అమ్మపాల బ్యాకులు ఏర్పాటు చెయ్యాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. నెలలు నిండకముందే పుట్టిన బిడ్డలకు తల్లిపాలు అందించగలిగితే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది" అని డా. శిరీష అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఎన్ఐసీయూ నాకు నిశ్చింతనిచ్చింది'
సెప్టెంబర్ నెల ఎన్ఐసీయూ అవగాహన కోసం కేటాయించిన మాసం (అవేర్‌నెస్ మంత్) అని చెబుతూ "ఎన్ఐసీయూలో రక్షణ పొందిన పాపకు తల్లినవ్వడం గర్వకారణం" అంటున్నారు వీబీ సౌమ్య. తెలుగువారైన సౌమ్య ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు. వారి పాప నెలలు నిండకముందే పుట్టడంతో రెండు నెలలు ఎన్ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది.
వీబీ సౌమ్య తన అనుభవాలను ఇలా వివరించారు.
"కెనడాలో ఎన్ఐసీయూల్లో లెవెల్-2,3 అని రెండు రకాలు. 32వారాల కంటే ముందు పుట్టిన పిల్లలని లెవెల్-3 లో పెడతారు. మా పాప రెండు లెవెల్లలోనూ చెరో నెల ఉండాల్సి వచ్చింది. లెవెల్-3లో ఉన్న మొదటి నెలలో కొన్ని ఆరోగ్య సమస్యల రావడంతో అందరం చాలా కంగారు పడ్డాం. అయితే రోజూ నర్సులు అన్నీ వివరంగా చెప్పడం, డాక్టర్లు రౌండ్లకి వచ్చినపుడు మేము అక్కడే ఉంటే వాళ్ళూ అన్నీ వివరంగా చెప్పడం వల్ల క్రమంగా నాకు వాళ్ళ మీద నమ్మకం పెరిగి కంగారు తగ్గింది. ఈ లెవెల్-3 లో అత్యధునిక వైద్య సదుపాయాలు ఉంటాయి. ప్రతీ శిశువుకూ ప్రత్యేకమైన గది, అందులో ఆధునిక వైద్య పరికరాలు, ఇవి కాక డైపర్లవంటివి కూడా వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఇదంతా కూడా ప్రభుత్వం వారి సార్వత్రిక ఆరోగ్య భీమా ద్వారా అందినదే. ఆదాయం పన్ను, హాస్పిటల్ పార్కింగ్ ఫీజు మినహా మేము అదనంగా చెల్లించిందేం లేదు."
"లెవెల్-2కు మారాక కూడా ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందించింది. ఈ సమయంలో నేను రెండు గోఫండ్‌మీ ప్రకటనలని చూశాను. ఒకటి అమెరికాలో, ఒకటి మన హైదరాబాదులో. అవి ఎన్ఐసీయూలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు వైద్య ఖర్చులని తమ వనరులతో భరించలేక సహాయం అడుగుతున్నవి. అవి చూసాక ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందడం ఒక వరం అనిపించింది. రెండు నెలలు గడిచిన తరువాత మా పాప క్షేమంగా ఇంటికి వచ్చింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే అప్పటి పరిస్థితులలో ఈ ఎన్ఐసీయూలు రెండూ నాకు ఎంతో నిశ్చింతనిచ్చాయి. వీళ్ళ చేతిలో ఉంది కనుక పాపకేంకాదు అన్న ధైర్యాన్ని ఇచ్చాయి" అని సౌమ్య తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- 'నా భర్త నన్ను తోటలోకి బరబరా ఈడ్చుకెళ్లి కత్తితో నా ముక్కు కోశాడు'
- తల్లి పాలు పట్టేటప్పుడు పిల్లలు చనిపోతారా
- హిందువుల అబ్బాయి ముస్లింల ఇంట్లో.. ముస్లింల పిల్లాడు హిందువుల ఇంట్లో
- ఒక్క ఏడాదిలో 12 లక్షల మంది పిల్లలు చనిపోయారు
- పిల్లల్ని కనడానికి సరైన వయసు ఏది?
- “పిల్లల్ని కనడం తప్పనిసరి కాదు.. అది నా ఇష్టం”
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








