‘40 రోజుల్లో ఏడుగురు నేతల హత్య, ముగ్గురు ఎంపీలకు బెదిరింపులు’- ఆ రాష్ట్ర ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలేంటి?

బిహార్‌, రాజకీయ నాయకులు, హత్యలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బిహార్‌లో ఆగస్ట్ 1- సెప్టెంబర్ 9 మధ్య కనీసం ఏడుగురు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారు.
    • రచయిత, సీటూ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సోమవారం ఉదయం బిహార్ రాజధాని పట్నాలో బీజేపీ నేత శ్యామ్ సుందర్ అలియాస్ మున్నాశర్మపై కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు.

మున్నా శర్మ పట్నా సిటీ చౌక్‌ మండల బీజేపీ అధ్యక్షుడు. ఆయన తండ్రి రామేశ్వర్ శర్మ జన్‌సంఘ్ కార్యకర్త.

బైకు మీద వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఫుట్‌పాత్‌పై కూర్చున్న మున్నాశర్మపై కాల్పులు జరపడం సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది.

దోపిడీ చేసే ప్రయత్నంలో ఈ హత్య జరిగిందంటూ స్థానిక మీడియాలో వచ్చిన కథనాన్ని బిహార్ పోలీసులు తోసిపుచ్చారు. ఆయనను కొందరు టార్గెట్ చేసి హత్య చేసినట్లు వారు ట్విట్టర్‌లో ప్రకటించారు.

గత నెలరోజుల్లో పట్నా నగరం చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఇద్దరు బీజేపీ నేతలు హత్యకు గురయ్యారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మున్నా శర్మ, బీజేపీ ,పాట్నా, సిటీ చౌక్ డివిజన్, అధ్యక్షుడు
ఫొటో క్యాప్షన్, పట్నా సిటీ చౌక్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా మున్నా శర్మ పని చేస్తున్నారు.

40 రోజుల్లో ఏడుగురు నేతలు హత్య

బిహార్‌లో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 9 మధ్యకాలంలో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల హత్యల గణాంకాలను పరిశీలిస్తే, ఆ రాష్ట్రంలో కనీసం ఏడుగురు నాయకులు హత్యకు గురయ్యారు.

బీజేపీకి చెందిన మున్నాశర్మ, అజయ్‌ సాహ్‌‌లతోపాటు పశ్చిమ చంపారన్‌లో జేడీయూ నేత విభవ్‌ రాయ్‌, సహర్సాలో జేడీయూ నేత జవహర్‌ యాదవ్‌, హాజీపూర్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్‌ రాయ్‌, ముంగేర్‌లో బీజేపీ నేత బంటీ సింగ్‌‌లు ఇలా హత్యకు గురైన వారిలో ఉన్నారు.

సోమవారం సాయంత్రం, బిహార్‌లోని అర్వాల్‌లో స్థానిక సీపీఐ-ఎంఎల్ నాయకుడు సునీల్ చంద్రవంశీని దుండగులు కాల్చిచంపారు.

బీజేపీ నేత అజయ్ సాహ్‌‌ ఆగస్టు 13న హత్యకు గురయ్యారు. 50 ఏళ్ల అజయ్‌ను, ఆయన ఇంటికి సమీపంలోని ఆయన దుకాణంలోనే కాల్చి చంపారు. ఈ కేసులో పోలీసుల వ్యవహార శైలిపై అజయ్ సాహ్‌‌ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది.

“ఇప్పటి వరకు పోలీసులు ఆసుపత్రి నుంచి పోస్ట్‌మార్టం రిపోర్టును కూడా తీసుకోలేక పోయారు. మేం అడగడానికి వెళితే అరెస్ట్ చేస్తామంటున్నారు. పోలీసుల నుంచి మాకు ఎలాంటి సహకారమూ లేదు’’ అని ఆయన మేనల్లుడు రోహన్ గుప్తా అన్నారు.

అజయ్ సాహ్
ఫొటో క్యాప్షన్, అజయ్ సాహ్ (పసుపు చొక్కా)

రాజకీయ హత్యల్లో రెండో స్థానంలో బిహార్

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ క్రమం తప్పకుండా రాష్ట్రానికి చెందిన 'క్రైమ్ బులెటిన్'ను విడుదల చేస్తున్నారు.

పట్నాలో హత్య జరిగిన తర్వాత, తేజస్వీ యాదవ్ ‘ఎక్స్‌’లో స్పందిస్తూ “ పెరుగుతున్న నేరాల గురించి ఎన్‌డీఏ నాయకులకు తెలీదు. అక్కడా ఇక్కడా తిరిగి అలసిపోతున్న సీఎం రాష్ట్ర పాలనను గాలికొదిలేశారు’’ అన్నారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం, 2022లో మొత్తం దేశంలో జరిగిన రాజకీయ హత్యలలో బిహార్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న ఝార్ఖండ్‌లో 17 రాజకీయ హత్యలు జరగ్గా, బిహార్, ఒడిశా రెండు రాష్ట్రాలలో ఎనిమిది చొప్పున హత్యలు జరిగాయి.

ముగ్గురు ఎంపీలకు బెదిరింపులు

రాష్ట్రంలో రాజకీయ నాయకుల హత్యలేకాక, ఇటీవలి కాలంలో తమకు బెదిరింపులు వచ్చినట్లు ముగ్గురు ఎంపీలు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. బీజేపీ నేత ప్రదీప్ సింగ్, ఎల్జేపీ-ఆర్ నేత రాజేశ్ వర్మ, ఆర్జేడీ నాయకుడు సుధాకర్ సింగ్‌లు ఇలా ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎంపీలు.

సుధాకర్‌ సింగ్ బీబీసీతో మాట్లాడుతూ “ ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీస్‌ స్టేషన్ ఇంచార్జ్ కూడా ఎంపీని బెదిరిస్తున్నారు. బిహార్‌లో ప్రభుత్వ వ్యవస్థ మొత్తం విఫలమైంది. ఇక్కడ పోలీసులే వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారు’’ అని ఆరోపించారు.

బిహార్ పట్నా క్రైమ్
ఫొటో క్యాప్షన్, తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ బక్సర్ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘నేర నియంత్రణ బాధ్యత ఒక్క పోలీసులదే కాదు’

నేరాలపరంగా బిహార్ పరిస్థితి ఏమిటి? ఇక్కడ నేరాలు పెరిగిపోయాయా లేక అదుపులో ఉన్నాయా? 2005లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నితీశ్ కుమార్ మూడు ‘సి’ల విషయంలో (క్రైమ్, కరప్షన్, కమ్యూనలిజం) రాజీపడబోనని పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్న మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

దీనిపై బిహార్ మాజీ డీజీపీ అభయానంద్ మాట్లాడుతూ, “నేరాలు పెరిగాయా లేదా అనేది డేటాను విశ్లేషిస్తేనే తెలుస్తుంది. అయితే డేటాకన్నా సామాన్యులు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం. 2005లో నితీశ్‌ కుమార్‌ సీఎంగా ఉన్నప్పుడు నేను ఏడీజీగా ఉన్నా. ఏది జరిగినా చట్టప్రకారం జరగాలని నేను అప్పట్లో డిమాండ్‌ చేశాను’’ అని ఆయన తెలిపారు.

క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ అనేది రిలే రేస్‌గా అభివర్ణించిన అభయానంద, దానిలో నాలుగు కీలక అంశాలుంటాయని చెప్పారు.

“శాసనసభ, పోలీసులు, న్యాయ వ్యవస్థ, సంస్కరణలు-ఈ నాలుగు అంశాల మధ్య సమన్వయం అవసరం. ప్రతి ఒక్కరికీ ఒక పరిమితి ఉంటుంది. వాళ్లు దానిలోనే పరుగెత్తాలి. కానీ సమస్య ఏమిటంటే నేర నియంత్రణ అనేది పోలీసుల బాధ్యతగా మాత్రమే భావిస్తున్నారు’’అని అన్నారాయన.

‘బిహార్ సమాజానికి హింస పునాది’

బిహార్‌లో నేరాల గురించి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మాజీ డైరెక్టర్ పుష్పేంద్ర మాట్లాడుతూ, “ఎన్‌సీఆర్‌బీ డేటాను చూస్తే నేరాలు సరిగా అర్థం కావు. ఎందుకంటే అవి తక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. రెండోది, సామాజిక పరిశోధనలో రెండు పదాలు ఉన్నాయి – హింస, అరాచకం. బిహార్‌ ప్రభుత్వం కొంతమేరకు అరాచకాలను కంట్రోల్ చేసింది. కానీ, హింస అనేది ఇక్కడి సమాజానికి పునాది" అని ఆయన అన్నారు.

“బిహార్‌లో స్వేచ్ఛ, సమానత్వాల కోసం కొంత కృషి జరిగింది. కానీ, సోదరభావాన్ని పెంపొందించడంపై ఎటువంటి ప్రయత్నాలు లేవు. మీరు సోదరభావాన్ని కేవలం కులం పరిధిలోనే చూస్తారు. వేర్వేరు కులాలు అయినప్పుడు ఈ సోదరభావం కనిపించదు. దానివల్ల ఈ సమాజం చీలిపోయి, హింస పెరిగిపోయింది. నిజానికి, మునుపటితో పోలిస్తే ప్రతిరోజూ నేరాలు పెరుగుతున్నాయి’’ అన్నారు పుష్పేంద్ర.

బిహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పాలనను ఎన్డీయే కూటమి పార్టీలు 'జంగిల్ రాజ్'గా అభివర్ణిస్తాయి. తన తండ్రి, లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో శాంతిభద్రతల వైఫల్యాలకు తేజస్వి యాదవ్ ఇప్పుడు కౌంటర్ స్టోరీలు ఇవ్వాలనుకుంటున్నారా?

దీనిపై సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ “కౌంటర్ స్టోరీలు సృష్టించే ప్రయత్నంతోపాటు, లాలూ పాలనలో జరిగిన శాంతిభద్రత వైఫల్యాలను తేజస్వి యాదవ్ పరోక్షంగా సమర్థించే ప్రయత్నమూ చేస్తున్నారు. చరిత్రను పరిశీలిస్తే 1912లో బిహార్ రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి ఇక్కడ ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ పోరాటం 1964-65 తర్వాత సమాజంలోని అట్టడుగు వర్గాలకు పాకిన తర్వాత మరింత తీవ్రమైంది. అందుకే ఇక్కడ హింస అనేది సమాజపు మూలాలలోనే ఉంది." అని పుష్పేంద్ర అన్నారు.

వచ్చే ఏడాది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నేరాల సమస్యపై దూకుడు వ్యూహాన్ని అనుసరించడం ద్వారా తేజస్వి యాదవ్ శాంతిభద్రతలను కీలకమైన అంశంగా మార్చారు. ఈ సమస్యను జేడీయూ, బీజేపీలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)