ఆర్యన్‌ను హత్య చేసింది గోసంరక్షకులేనా? ఆ రోజు ఏం జరిగింది...బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫరీదాబాద్‌లోని ఎన్ఐటీ-5 ఏరియా. చీకట్లో మెట్లు ఎక్కి మూడో అంతస్తులోని ఫ్లాట్‌కి వెళ్లాం. అక్కడ ఉమా మిశ్రా మెట్ల దగ్గర అలసిపోయి కూర్చున్నారు. ఆమె కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.
ఆ ఇంటి గోడపై 19 ఏళ్ల ఆర్యన్ మిశ్రా ఫోటోకు దండ వేసి ఉంది. ఆర్యన్ తండ్రి సియానంద్ మిశ్రా బయట టెర్రస్ మీద నిలబడి, జర్నలిస్టులతో ఫోన్‌లో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు.
“ఇప్పుడు మాకు మీడియా అవసరం లేదు, మా బిడ్డకు న్యాయం జరగదు” అని ఆయన ఫోన్‌లో అంటున్నారు.
దేశ రాజధాని దిల్లీకి ఆనుకుని ఉన్న హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఆగస్టు 23-24 రాత్రి ఆర్యన్ మిశ్రా హత్యకు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.


నిందితుడిని కలిసిన మృతుడి తండ్రి
అయోధ్యకు చెందిన సియానంద్ మిశ్రా కుటుంబం ఫరీదాబాద్‌లో నివసిస్తోంది. అయితే తమ కుమారుడిని గోసంరక్షకులుగా చెప్పుకునే వారే హత్య చేశారంటే నమ్మడం వారికి కష్టంగా ఉంది.
ఆర్యన్ అస్థికలను నదిలో కలిపేందుకు ప్రయాగ్‌రాజ్ వెళ్లారు సియానంద్ మిశ్రా. అదే సమయంలో నిందితులు అరెస్టయినట్లు తెలుసుకున్నారు. ఆగస్టు 30న ఫరీదాబాద్ క్రైం బ్రాంచ్ కార్యాలయంలో ప్రధాన నిందితుడు అనిల్ కౌశిక్‌ను సియానంద్ కలిశారు.
సియానంద్ నిందితుడితో మాట్లాడిన విషయాలను గుర్తుచేసుకొంటూ “అనిల్ కౌశిక్‌ని నా ముందుకు తీసుకొచ్చారు. అతను క్షమాపణలు చెప్పాడు. ఆవుల స్మగ్లర్‌గా భావించి కాల్పులు జరిపా, బుల్లెట్ మీ కొడుకుకు తగిలిందన్నాడు’’ అని సియానంద్ చెప్పారు.
"అనిల్ నా కాళ్లు పట్టుకున్నాడు. తప్పు చేశానన్నాడు. ముస్లిం అనుకొని కాల్చానని చెప్పాడు. ఒక ముస్లింను చంపితే ఎటువంటి బాధా ఉండేది కాదని, బ్రాహ్మణుడిని చంపానని, తనను ఉరి తీసినా పర్లేదన్నాడు’’ అని సియానంద్ వెల్లడించారు.
ఆర్యన్ ఎవరు, ఏం చేస్తుంటారు?
సియానంద్ మిశ్రా బైక్ టాక్సీ సర్వీసులో పనిచేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్యన్ ఓపెన్ స్కూల్ 12వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
సియానంద్ మిశ్రా చెప్పినదాని ప్రకారం, ఆర్యన్ దైవభక్తి ఉన్న వ్యక్తి. ఇటీవల పలు హిందూ దేవాలయాలను సందర్శించారు. గత రెండేళ్లుగా కావడి కూడా మోసుకెళుతున్నారు.
‘‘ఆర్యన్ మొబైల్ ఫోన్‌లను రిపేర్ చేయడం కూడా నేర్చుకుంటున్నాడు. కొంత డబ్బు సంపాదించి ఇంటి ఖర్చులకు సహాయం చేయాలనుకున్నాడు’’ అని సియానంద్ చెప్పారు.
ఘటన జరిగిన రోజును సియానంద్ గుర్తుచేసుకుంటూ “రాత్రి 3:30-4:00 గంటల సమయంలో ఇంటి యజమాని నా పెద్ద కొడుకును తనతో పాటు పాల్వాల్‌కు రమ్మని చెప్పారు. అయితే, అతనికి బదులుగా నేనే ఎస్ఎస్‌బీ ఆసుపత్రికి వెళ్లాను. మేము వెళ్లిన కొద్దిసేపటికి అక్కడికి అంబులెన్స్ వచ్చింది. నా కొడుకు రక్తంతో తడిసిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రిలోనే మరణించాడు” అని అన్నారు.

సాక్షుల వాంగ్మూలంలో తేడా...
ఆ రోజు రాత్రి ఆర్యన్ ఎరుపు రంగు డస్టర్ కారులో నలుగురితో కలిసి ప్రయాణిస్తున్నారు. వారిలో పక్కింటి వ్యక్తి, ఇంటి యజమాని భార్య, యజమాని కొడుకుతో పాటు మరో మహిళ ఉన్నారు. ఇరువురు మహిళల వయసు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది.
కారులో ఉన్న యజమాని కుమారుడు షాంకీ గులాటీ హత్యాయత్నం కేసులో వాంటెడ్‌గా ఉన్నారు. షాంకీ గులాటీని హత్య చేయడానికే కారుపై కాల్పులు జరిపారని కారులో ఉన్న నలుగురు మొదట పోలీసులకు, మీడియాకు చెప్పారు.
దీనిపై ఫరీదాబాద్ క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. అయితే, పోలీసుల విచారణలో ఈ ఆరోపణలు నిజం కాదని తేలింది. ఫరీదాబాద్‌కు చెందిన అనిల్ కౌశిక్‌తో సహా ముగ్గురు నిందితులను ఆగస్టు 28న పోలీసులు అరెస్టు చేశారు. ఐదో నిందితుడిని ఆగస్టు 30న అరెస్టు చేశారు.
ఘటన జరిగిన రోజు రాత్రి ఫరీదాబాద్‌లోని సెక్టార్ 21 నుంచి పాల్వాల్ జిల్లాలోని భగోలా గ్రామం వరకు ఆర్యన్, ఇతరులు ప్రయాణిస్తున్న డస్టర్ కారును ఒక స్విఫ్ట్ కారు వెంబడించిందని పోలీసులు తెలిపారు.
‘‘హంతకులు పారిపోయారని తెలియగానే, టోల్ ప్లాజాలోని సీసీ ఫుటేజీ పరిశీలించాం. అందులో ఎర్రటి డస్టర్ కారు బ్యారియర్‌ను బద్దలు కొట్టడం కనిపించింది. తెల్లటి స్విఫ్ట్ కారు దానిని వెంబడిస్తోంది’’ అని క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ అమన్ యాదవ్ చెప్పారు.

పోలీసులు ఏమంటున్నారు?
సీసీ ఫుటేజీ లభించిన తర్వాత మరిన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు అనిల్ కౌశిక్, వరుణ్, ఆదేశ్, కృష్ణ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. సౌరభ్ శర్మ అనే మరో నిందితుడిని తర్వాత అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆవుల స్మగ్లర్లు ఉన్నారన్న అనుమానంతో డస్టర్ కారుపై కాల్పులు జరిపినట్లు విచారణలో అనిల్ కౌశిక్ అంగీకరించారు. మొత్తం మూడు బుల్లెట్లు పేల్చారు. ఒక బుల్లెట్ గాలిలోకి వెళ్లగా, రెండు ఆర్యన్‌ను తాకాయి. ఒకటి వెనుక నుంచి మెడలో, మరొకటి ఛాతీపై తగిలింది. ఆర్యన్ పోస్టుమార్టం రిపోర్టులో కూడా రెండు బుల్లెట్లు తగిలినట్లు వెల్లడైంది.
అయితే అరెస్టయిన నిందితులు గోసంరక్షకులా, కాదా? అనే విషయాన్ని పోలీసులు స్పష్టం చెయ్యలేదు.
మీడియా రిపోర్టులు నిందితులను గోసంరక్షకులుగా పేర్కొంటున్నాయని, అయితే వారికి ఏ సంస్థతోనూ సంబంధం లేదని ఏసీపీ అమన్ యాదవ్ అంటున్నారు. హత్యకు గల కారణాలపై లోతైన విచారణ జరుపుతున్నామని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Anilkaushik/Facebook
నిందితులు గో సంరక్షకులేనా?
అనిల్ కౌశిక్‌కు ఫరీదాబాద్‌లో గోసంరక్షకుడిగా పేరుంది. ఆయన 'లివ్ ఫర్ నేషన్' అనే సంస్థను కూడా నడుపుతున్నారు. ఫరీదాబాద్‌లోని పార్వతీ కాలనీలో అనిల్ ఇల్లు ఉంది. ఆయన కుటుంబ సభ్యులు కొందరు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
అయితే తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని అనిల్ కౌశిక్ తల్లి అంటున్నారు.
"అతను గోవులకు చాలా సేవ చేశాడు. పోలీసులు పిలిచినప్పుడు చాలాసార్లు వెళ్లాడు, గోవులను రక్షించాడు’’ అని ఆమె చెప్పారు.
అనిల్ కౌశిక్ ఇరుగుపొరుగు వారు కూడా ఈ సంఘటన గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు.
గోవులను రవాణా చేస్తున్న వారిపై అనిల్ కౌశిక్ పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఘటనకు ముందు రోజు ఆగస్టు 22న కూడా గోవులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని ఫరీదాబాద్‌లోని సరన్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా అనిల్ కౌశిక్ ఫిర్యాదు చేశారు.
ఈ హత్య కేసులో అరెస్టయిన ఐదుగురిలో ఒకరైన కృష్ణ, ఫరీదాబాద్ సమీపంలోని ఖేడీ గుజ్రాన్ గ్రామస్థుడు. ఈ ఊరివాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ నిరుద్యోగి. అనిల్ కౌశిక్‌తో కలిసి రెండేళ్ల కిందట గోసంరక్షకుడిగా మారాడు. కృష్ణ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
“కృష్ణ గోసంరక్షకుడనేది నిజమే, కానీ ఈ ఘటనలో అతన్ని ఇరికించినట్లు భావిస్తున్నాం” అని కృష్ణ కుటుంబంతో దగ్గరి సంబంధమున్న వ్యక్తి ఒకరు తెలిపారు.
ఫరీదాబాద్‌లో గోవులను అక్రమంగా తరలిస్తే గో సంరక్షకులు పోలీసులకు విషయం తెలియజేస్తారని, కానీ, ఆ రోజు మాత్రం పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని అక్కడి క్రైం రిపోర్టర్ కైలాష్ గత్వాల్ చెప్పారు.
ఆ రోజు ఏం జరిగింది?
ఫరీదాబాద్‌లోని సెక్టార్ 21లో ఆగస్టు 23న రాత్రి 2 గంటల సమయంలో ఘటన జరిగింది.
పోలీసులు చెప్పినదాని ప్రకారం..గో స్మగ్లర్లు డస్టర్ కారులో వెళ్తున్నారని నిందితుడు అనిల్ కౌశిక్, ఆయన బృందానికి సమాచారం అందింది. అనిల్ బృందం ఆర్యన్ ప్రయాణిస్తున్న డస్టర్ కారును ఆపడానికి ప్రయత్నించగా, వాళ్లు ఆపకుండా వెళ్లిపోయారు.
అలా ఆర్యన్ కారు సుమారు 30 కిలోమీటర్లు వెళ్లింది. స్విఫ్ట్ కారు దానిని ఫాలో అయ్యింది. ఫరీదాబాద్ నుంచి పాల్వాల్ వెళ్లే హైవేపై ఇదంతా జరిగింది. హైవే కావడంతో తనిఖీలు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.
‘‘ఈ సంఘటన అరగంటకు పైగా కొనసాగింది. అయితే నిందితులుగానీ, డస్టర్ కారులో ఉన్న వ్యక్తులుగానీ పోలీసులకు కాల్ చేయలేదు’’ అని ఏసీపీ అమన్ యాదవ్ చెప్పారు.
కారులో డ్రైవర్ పక్కన ఆర్యన్ కూర్చున్నారు. ఆ కారులో షాంకీ గులాటీ ఉన్నారని, ఆయన హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉండటంతో పోలీసులు వెంబడిస్తున్నారని భావించి, కారును ఆపకపోయి ఉండొచ్చని అమన్ యాదవ్ అన్నారు. పైగా డస్టర్ కారును వెంబడిస్తున్న స్విఫ్ట్ కారుపై బుగ్గ(లైట్) కూడా ఉందని ఆయన తెలిపారు.
నిందితుడి నుంచి లైసెన్సు లేని పిస్టల్‌ను, లైట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుండగులు ఉపయోగించిన స్విఫ్ట్ కారుకు నంబర్ ప్లేట్ లేదని, నిందితుడి నుంచి కాల్పుల శబ్దం చేసే బొమ్మ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఒకరి ప్రాణాలు ఎలా తీస్తారు?
కొడుకు మృతితో ఆర్యన్ తల్లి ఉమా మిశ్రా అస్వస్థతకు గురయ్యారు. పెద్ద కొడుకు సాయంతో ఆమె మెట్లు దిగారు.
‘‘గోసంరక్షకులమని చెప్పుకునే వీరు ఒకరి ప్రాణాలను ఎలా తీస్తారు? కాల్పులు జరిపే హక్కు వారికి ఎవరిచ్చారు? ” అని ఆమె ప్రశ్నించారు.
‘‘ఎవరైనా ఆవును తీసుకెళ్తుంటే ఎలా కాల్చుతారు? ఇదంతా జరగడానికి ఎందుకు అనుమతిస్తున్నారు?” అని ఉమా మిశ్రా అడుగుతున్నారు.
“హిందువులు, ముస్లింలు సోదరులు కాదా? ముస్లింల రక్తం నల్లగా ఉంటుందా? వారి రక్తం కూడా ఎరుపులోనే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ లోకంలో వివక్ష ఎందుకు?” అని ఆర్యన్ తండ్రి సియానంద్ ప్రశ్నిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














