ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే, భారత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చందన్ కుమార్ జాజ్వారే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య తాజా ఉద్రిక్తతలు ముడి చమురు మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయంగా పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన తర్వాత ఈ భయం మరింత పెరిగింది. ఇరాన్ చమురు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోగలదని బైడెన్ అన్నారు.
ఈ దాడికి అమెరికా మద్దతు ఇస్తుందా? అని బైడెన్‌ను అడిగితే.. "చర్చిస్తున్నాం" అని బదులిచ్చారు. బైడెన్ వ్యాఖ్యల తర్వాత, ముడి చమురు ధరలు ఐదు శాతం పెరిగాయి.


ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య తాజా పరిస్థితి
మంగళవారం (అక్టోబర్ 1) అర్ధరాత్రి ఇరాన్ 180కి పైగా క్షిపణులను ఇజ్రాయెల్ మీదికి ప్రయోగించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ 181 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, ఈ దాడిలో ఒక పాలస్తీనియన్ చనిపోయారని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది.
అంతకుముందు 2024 ఏప్రిల్‌లో ఇరాన్ సుమారు 110 బాలిస్టిక్ క్షిపణులు, 30 క్రూయిజ్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది.
అక్టోబర్ 1న ఇరాన్ క్షిపణి దాడి అనంతరం, ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ సమావేశం బంకర్‌లో జరిగింది. "ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది, అందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియే 2024 జులై నెలలో ఇరాన్‌లోని తెహ్రాన్‌లో హత్యకు గురయ్యారు. దీనికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది. అయితే, ఈ హత్య తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ వెంటనే ఎటువంటి దూకుడు చర్యలకు దిగలేదు. గతవారం, సెప్టెంబర్ 27న లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా మరణించారు.
ఈ ఇద్దరు నాయకులను ఇరాన్‌కు మద్దతుదారులుగా చెబుతుంటారు. ఈ రెండు హత్యలకు ప్రతీకారం తీర్చుకునేందుకే ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించామని ఇరాన్ చెప్పింది.
ఇజ్రాయెల్ మీడియాలో బుధవారం ప్రచురితమైన కథనాల ప్రకారం, ఇరాన్‌లోని కొన్ని ముఖ్యమైన స్థావరాలను ఇజ్రాయెల్ కొద్ది రోజుల్లోనే లక్ష్యంగా చేసుకోనుంది. ఈ దాడుల్లో ఇరాన్‌కు ప్రధానమైన చమురు కేంద్రాలు కూడా ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఖర్చులు పెరుగుతాయి: ప్రొఫెసర్ రేష్మీ కాజీ
"పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, ఇరాన్ చమురు బావులు, నిల్వలపై దాడి జరిగితే, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది" అని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోని నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్స్ రిజల్యూషన్ ఫ్యాకల్టీ మెంబర్, ప్రొఫెసర్ రేష్మీ కాజీ అన్నారు.
‘‘ఇది చమురు సరఫరాను ప్రభావితం చేయడమే కాదు, పలు ముఖ్యమైన మార్గాలను మూసివేయడానికి దారితీయవచ్చు. దీని కారణంగా, వస్తువులు రవాణా చేయడానికి దూర మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది’’ అని రేష్మీ కాజీ చెప్పారు.
మొత్తం మీద భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌లో ఎంత చమురు ఉంది?
ఇరాన్ ప్రపంచంలో ఏడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఆ దేశం ఉత్పత్తి చేసే చమురులో దాదాపు సగం ఎగుమతి చేస్తుంది. దీని ప్రధాన మార్కెట్లలో చైనా కూడా ఉంది. అయితే, చైనాలో చమురుకు డిమాండ్ తక్కువగా ఉండటం, మరోవైపు సౌదీ అరేబియా నుంచి తగినంత చమురు సరఫరా అవుతుండటంతో ఈ ఏడాది చమురు ధరలు ఎక్కువగా పెరగలేదు.
ఒపెక్(ఓపీఈసీ) దేశాలలో ఇరాన్ మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. ఇరాన్ రోజుకు దాదాపు 30 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది, అంటే మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో మూడు శాతం.
ఇరాన్ చమురు బావులపై ఇజ్రాయెల్ దాడి చేస్తే, అది ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని డిఫెన్స్ అనలిస్ట్ రాహుల్ బేడీ చెప్పారు.
‘‘ప్రస్తుతం ఇరాన్ నుంచి చమురును చైనా ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. అదే సమయంలో రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తోంది’’ అని రాహుల్ బేడీ చెప్పారు.
ఒకవేళ ఇరాన్ చమురును సరఫరా చేయలేకపోతే చైనాలో డిమాండ్ పెరుగుతుందని, అది చమురు ధరలను ప్రభావితం చేస్తుందని రాహుల్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌పై ఎంత ప్రభావం పడుతుంది?
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి తర్వాత, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతాయనే భయం తీవ్రమైంది. ఇది చమురు ధరలను నేరుగా ప్రభావితం చేస్తోంది.
హసన్ నస్రల్లా హత్య తర్వాత, ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణి దాడి చేయవచ్చని చాలామంది భావించారు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు సుమారు మూడు శాతం పెరిగాయి. దీని ద్వారా మార్కెట్‌పై పడే ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఇపుడు ఇరాన్ చమురు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే, అది అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ప్రభావాన్ని చూపుతుంది.
ఇరాన్ చమురు కేంద్రాల గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటన తర్వాత, ముడి చమురు ధర 5 శాతం వరకు పెరిగింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత, ముడి చమురు ధర 10 శాతం పెరిగి, బ్యారెల్ ధర 77 డాలర్లకు చేరుకుంది. అయితే, ఇది ఈ ఏడాది గరిష్ఠ ధర కంటే తక్కువే.
‘’ఈ విషయంలో భారత్‌కు సానుకూల అంశం ఏమిటంటే.. ఇరాన్ నుంచి సరఫరా తగ్గితే రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురును భారత్ ఇతర దేశాలకు ఎక్కువ ధరకు విక్రయించవచ్చు. ఇది భారత్‌పై భౌగోళికంగా, రాజకీయంగా ఎలాంటి ఒత్తిడిని కలిగిస్తుందో ఇప్పుడే చెప్పలేం" అని రాహుల్ బేడీ అన్నారు.
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టింది. అమెరికా సహా పశ్చిమ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్ కంటే తక్కువ ధరకు భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలకు విక్రయించడానికి ముందుకొచ్చింది.
గత ఏడాది మేలో యూరోపియన్ యూనియన్ ఫారెన్ పాలసీ చీఫ్ జోసెప్ బొరెల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తోందని, దానిని ప్రాసెస్ చేసి యూరప్‌కు ఎగుమతి చేస్తోందని తెలిసిందని చెప్పారు. ఇది ఆంక్షలను ఉల్లంఘించడమేనని, దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా, భారత వాణిజ్య శాఖ డేటా ప్రకారం, యూరప్‌కు భారత్ చమురు ఉత్పత్తుల ఎగుమతి 2022 సంవత్సరంలో 70 శాతం పెరిగిందని రాయిటర్స్ గతంలో ఒక కథనంలో తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














