హరియాణా, జమ్ముకశ్మీర్‌లో గెలిచేదెవరు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

వినేష్ ఫొగాట్

ఫొటో సోర్స్, vineshphogat/X

హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 61 శాతం పోలింగ్ నమోదైనట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. మరోపక్క జమ్మూ కశ్మీర్‌లో మూడు దశలలో 90 స్థానాలకు అక్టోబర్ 1తో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో 63.88 శాతం ఓటింగ్ నమోదైంది.

10 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.

హరియాణాలో పోలింగ్ ముగిసిన తరువాత పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను వెల్లడించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పీపుల్స్ పల్స్ అంచనా

ఫొటో సోర్స్, Peoples Pulse

హరియాణా ఎవరిది?

హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి.

హరియాణాలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.

పీపుల్స్ పల్స్, దైనిక్ భాస్కర్, రిపబ్లిక్ టీవీ-పీ-మార్క్, ధ్రువ్ రీసెర్చ్ వంటి సంస్థలు హరియాణాలో కాంగ్రెస్ అత్యధిక సీట్లను గెలుచుకుంటుందని అంచనావేశాయి.

పీపుల్స్ పల్స్ సంస్థ అంచనాల ప్రకారం, కాంగ్రెస్‌ 55 స్థానాలను, బీజేపీ 26, ఐఎన్‌ఎల్డీ+బీఎస్‌పీ 2 నుంచి 3 స్థానాలను, జేజేపీ 0 నుంచి 1 స్థానాన్ని, స్వతంత్రులు 3 నుంచి 5 స్థానాలను గెలుపొందుతారని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనావేసింది.

దైనిక్ భాస్కర్ తన అంచనాల్లో కాంగ్రెస్ 44 నుంచి 54 స్థానాలను గెలుపొందుతుందని తెలిపింది. బీజేపీ 19 నుంచి 29 స్థానాలను, జేజేపీ 0 నుంచి 1 స్థానాన్ని, ఐఎన్‌ఎల్డీ 1 నుంచి 5 స్థానాలను పొందుతాయని అంచనావేసింది.

ధ్రువ్ రీసెర్చ్ కూడా కాంగ్రెస్ 50 నుంచి 64 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీకి 22 నుంచి 32 స్థానాలు రావొచ్చని పేర్కొంది.

రిపబ్లిక్ టీవీ-పీ-మార్క్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం, కాంగ్రెస్‌కు 51 నుంచి 61 స్థానాలు, బీజేపీకి 27 నుంచి 35 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

హరియాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీసం 46 సీట్లు సాధించాలి. చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ఈ మ్యాజిక్ ఫిగర్‌ను దాటుతుందని అంచనావేస్తున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో పోలింగ్

ఫొటో సోర్స్, Getty Images

జమ్మూకశ్మీర్ పీఠం ఎవరికి?

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం ఉందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్‌ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ తెలిపింది. అయితే, ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (46 స్థానాలు) సాధించే అవకాశం కనిపించడం లేదని పేర్కొంది.

జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి.

పీపుల్స్ పల్స్ సంస్థ అంచనాల్లో, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమికి 46 నుంచి 50 స్థానాలు, బీజేపీకి 23 నుంచి 27 స్థానాలు, పీడీపీకి 7 నుంచి 11 స్థానాలు, ఏఐపీకి 0-1 స్థానం, ఇతరులు 4 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే, దైనిక్ భాస్కర్ సంస్థ అంచనాల ప్రకారం కూడా నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమికి 35 నుంచి 40 స్థానాలు, బీజేపీకి 20 నుంచి 25 స్థానాలు, పీడీపీకి 4 నుంచి 7 స్థానాలు, ఇతరులకు 12 నుంచి 16 స్థానాలు వస్తాయని తెలిసింది.

ఇండియా టుడే-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ కూడా నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్‌ కూటమికే మొగ్గు చూపుతోంది. ఈ సంస్థ అంచనాల్లో ఈ కూటమికి 40 నుంచి 48 సీట్లు రాబోతున్నాయని తెలిసింది. బీజేపీకి 27 నుంచి 32 స్థానాలు, పీడీపీకి 6 నుంచి 12 స్థానాలు, ఇతరులకు 6 నుంచి 11 స్థానాలు వస్తాయని ఇండియా టుడే-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)