కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా ఏమన్నారంటే..

కాంగ్రెస్

ఫొటో సోర్స్, Facebook/INC

రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా శుక్రవారం (సెప్టెంబర్ 6) కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ, ఇవి తాను గర్వించే క్షణాలని అన్నారు. క్రీడాకారులందరికీ అండగా ఉంటానని, వారి తరఫున గొంతెత్తేందుకు వెనుకాడబోనని వినేశ్ చెప్పారు.

‘‘క్రీడల్లో ఓటమికి తలవంచనట్లుగానే, ఈ కొత్త వేదికపై కూడా మనస్ఫూర్తిగా పని చేస్తాను. ప్రజలకు మంచి చేసేందుకు కృషి చేస్తాను. మన సోదరీమణులకు అండగా ఉంటాను’’ అని వినేశ్ అన్నారు.

‘‘మన ఆడబిడ్డలు వేధింపులను ఎదుర్కొన్నప్పుడు బీజేపీ మాత్రమే ఆ దురాగతానికి అండగా నిలిచింది. మిగతా పార్టీలన్నీ రెజ్లర్లకు మద్దతు తెలిపాయి’’ అని బజ్‌రంగ్ పునియా వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
కాంగ్రెస్

ఫొటో సోర్స్, Facebook/INC

రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత వినేశ్ ఫొగాట్‌కు భారతీయ రైల్వే, వాట్సాప్ ద్వారా నోటీస్ పంపిందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.

రాహుల్ గాంధీతో వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా ఉన్న ఫోటోకు సంబంధించి ఆ నోటీసు జారీ అయిందని ఆయన చెప్పారు.

ప్రతిపక్ష నేతను కలవడాన్ని ఎప్పటి నుంచి నేరంగా పరిగణిస్తున్నారని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు.

ఇటీవలే వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియాలను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కలిశారు.

ఈ భేటీ తర్వాతే వినేశ్, బజ్‌రంగ్‌ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది.

వినేశ్ లేదా బజ్‌రంగ్‌ పునియాకు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాంగ్రెస్‌లో చేరే ముందు వీరిద్దరూ ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశయ్యారు. తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వీరిద్దరితో భేటీ అయిన ఫోటోను సోషల్ మీడియా ‘ఎక్స్’లో పంచుకున్నారు.

‘‘చక్ దే ఇండియా, చక్ దే హరియాణా. ప్రపంచ వేదికపై భారత కీర్తిని చాటిన మన ప్రతిభాశాలి, చాంపియన్ వినేశ్ ఫొగాట్‌, బజ్‌రంగ్ పునియాలను 10 రాజాజీ మార్గ్‌లో కలిశాం. మీ ఇద్దరూ మాకు గర్వకారణం’’ అని ‘ఎక్స్‌’లో ఖర్గే రాశారు.

వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, screengrab

వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా ఏమన్నారు?

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ, అందరి అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

‘‘కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. కష్టకాలంలోనే మనవాళ్లు ఎవరన్నది అర్థం అవుతుంది. వీధుల్లో మమ్మల్ని లాగేస్తున్నప్పుడు బీజేపీ తప్ప మిగతా అన్ని పార్టీలు మాకు అండగా నిలిచాయి. మహిళలను గౌరవించే పార్టీలో చేరినందుకు గర్విస్తున్నా. నిస్సహాయురాలిగా భావించే ప్రతి మహిళకు అండగా నిలుస్తాం. కావాలంటే నేను జంతర్ మంతర్‌లోనే రెజ్లింగ్‌ను వదిలేసేదాన్ని. నాకు నేషనల్ చాంపియన్‌షిప్ ఆడాలని లేదు. కానీ, నేను ఆడాను. ట్రయల్స్‌లో పాల్గొని ఒలింపిక్స్‌కు కూడా వెళ్లాను.

కానీ, భగవంతుడు మరోలా చేశాడు. దేశ ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నాకు దీనికంటే ముఖ్యమైనది ఏదీ లేదు.

మేం భయపడం, ఎక్కడా వెనక్కి తగ్గం. మా పోరు కొనసాగుతుంది. కోర్టులో మా పోరాటం సాగుతోంది.

దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నాం. మీకు అండగా ఎవరూ లేనప్పుడు మీతో పాటు నేను, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిలబడతామని నా సోదరీమణులకు తెలియజేస్తున్నా’’ అని వినేశ్ ఫొగాట్ అన్నారు.

హింసకు గురైన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీలో చేరిక సమయంలో బజ్‌రంగ్ పునియా అన్నారు.

‘‘కష్టపడదాం. దేశాన్ని బలోపేతం చేద్దాం. వినేశ్ ఒలింపిక్స్ ఫైనల్స్‌కు వెళ్లిన రోజు దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. కానీ, బీజేపీ ఐటీ సెల్ మాత్రం మరో విషయానికి సంబరాలు చేసుకుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. హింసకు గురైనవారికి అండగా ఉంటాం’’ అని బజ్‌రంగ్ పునియా వ్యాఖ్యానించారు.

వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Reuters

హరియాణా అసెంబ్లీ ఎన్నికలు

హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 5న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 8న ఓట్లు లెక్కిస్తారు.

రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు, కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకున్నాయి.

దుష్యంత్ చౌటాలా మద్దతుతో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించింది.

రైతుల ఉద్యమం, దిల్లీలో రెజ్లర్ల ఆందోళన తర్వాత హరియాణాలో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.

రైతు ఉద్యమంలో హరియాణా రైతులు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారు.

మహిళా రెజ్లర్ల నిరసనల సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పలువురు ప్రశ్నలు సంధించారు.

బీజేపీ మాజీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా, సాక్షి మలిక్ నిరసన ప్రదర్శనలు చేశారు.

బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను వేధించారని ఆరోపించారు. బ్రిజ్ భూషణ్ ఈ ఆరోపణలను ఖండించారు. ఇవి రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని కొట్టిపారేశారు.

రెజ్లర్ల ఆందోళన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకుల తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా 2023 ఏప్రిల్‌లో ఈ రెజ్లర్లను కలిశారు.

ఇటీవల పారిస్ ఒలింపిక్స్ నుంచి వినేశ్ ఫొగాట్ తిరిగి వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన వారిలో హరియాణా కాంగ్రెస్ నాయకుడు దీపేంద్ర హుడా కూడా ఉన్నారు.

తాజాగా వినేశ్, బజ్‌రంగ్ కాంగ్రెస్‌లో చేరారు.

బ్రిజ్ భూషణ్‌కు చెందిన గత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

‘‘ఇది కాంగ్రెస్, దీపేంద్ర హుడాల కుట్ర అని ముందే నేను చెప్పాను’’ అని ఆ వీడియోలో బ్రిజ్ భూషణ్ మాట్లాడటం కనిపిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)