కర్ణాటక: ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్యను కాంగ్రెస్ తొలగిస్తుందా

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

ఫొటో సోర్స్, IDREES MOHAMMED/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, సిద్ధరామయ్య
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించడానికి గవర్నర్ థావర్‌ చంద్ గహ్లోత్ అనుమతించారు. ఇది ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత పదేళ్లలో సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా కేసులేవీ పెట్టకపోవడంపైనా పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు గత పదేళ్లలో కొందరు బీజేపీయేతర నేతలు, ముఖ్యమంత్రులు కేసులు ఎదుర్కొన్నారు.

కాగా సిద్ధరామయ్యపై వస్తున్న తాజా ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని కాంగ్రెస్ అంటోంది. సిద్ధరామయ్య కూడా తాను రాజీనామా చేసేది లేదని స్పష్టంగా చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

అసలు విషయమేంటి?

సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఇప్పుడు ఫిర్యాదు రావడానికి ముందు ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదు.

సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఇప్పుడు మూడు ఫిర్యాదులు వచ్చాయి.

సిద్ధరామయ్య భార్య పార్వతి పేరిట ఉన్న 3.16 ఎకరాల భూమిని గతంలో మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) అభివృద్ధి పనుల కోసం సేకరించింది.

అందుకు పరిహారంగా విజయనగర లేఅవుట్‌లో ఆమెకు స్థలాలు కేటాయించారు.

అయితే, సిద్ధరామయ్య ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు విలువైన స్థలాలు కేటాయించారని గవర్నరుకు ఫిర్యాదులు అందాయి.

దీనిలో తనకెలాంటి ప్రమేయం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్తున్నారు.

‘‘నేను ఏ నేరం చేశానని రాజీనామా చేయాలి?’ అని ఆయన అన్నారు.

సిద్ధరామయ్య

ఫొటో సోర్స్, ANI

పార్టీకి, సిద్ధరామయ్యకు ఇది ఎదురుదెబ్బేనా?

‘‘ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయనలో ఉండే ఉత్సాహం, చురుకుదనం కనిపించడం లేదు. ఆయన బాడీ లాంగ్వేజ్‌లో ఇది స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఇది ఎదురు దెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని ఎన్ఐటీటీఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు చెందిన డైరెక్టర్-అకడమిక్స్, పొలిటికల్ కామెంటేటర్ ప్రొఫెసర్ సందీప్ శాస్త్రి బీబీసీతో అన్నారు.

మిగిలిన రాజకీయ పరిశీలకులు మాత్రం ప్రొఫెసర్ శాస్త్రితో ఏకీభవించడం లేదు. ‘ఆయనకు అవినీతిలో ప్రమేయం ఉందా? అన్నదే ప్రశ్న. అవినీతిలో ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదని ఈ కేసు ఉదంతం తెలియజేస్తుంది. అందుకే, అవినీతిపరుడనే ఆరోపణను ఆయన స్వీకరించడం లేదు’’ అని మైసూర్ యూనివర్సిటీలో ఆర్ట్స్‌ విభాగ డీన్‌గా పనిచేసిన ప్రొఫెసర్ ముజఫర్ అసాదీ బీబీసీతో అన్నారు.

‘‘ఇది అవినీతి ఆరోపణలకు సంబంధించినది కాదు. ఇది నిబంధనలకు సంబంధించిన ప్రశ్న. ఇది ఆయన్ను పూర్తిగా దెబ్బతీసే అంశం కాదు. ఇది ఆయన ప్రాబల్యంపై కొంతవరకు ప్రభావం చూపొచ్చు. ఇది పార్టీ పోరాటం చేయలేని విషయమైతే కాదు. దీన్ని కాంగ్రెస్ ఎలా వాడుకుంటుందనే దానిపై ఆధారపడి ఉంది’’ అని అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ గవర్నెన్స్, పాలసీ ప్రొఫెసర్ నారాయణ చెప్పారు.

‘‘సిద్ధరామయ్య చాలా సమర్థ నేత. క్లీన్ ఇమేజ్‌తో ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ, ఇప్పుడు రెండు రకాల ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ఇది ఆయనకు, పార్టీకి రెండింటికీ ఎదురుదెబ్బే’’ అని మైసూర్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ మాజీ ప్రొఫెసర్ చంబి పురానిక్ తెలిపారు.

రాహుల్ గాంధీతో డీకే శివకుమార్, సిద్ధరామయ్య

ఫొటో సోర్స్, Getty Images

సిద్ధరామయ్య వెనుకబడిన వర్గాలకు చెందిన నేత.

జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) నుంచి ఆయన బయటపడిన తరువాత తమ పార్టీలో చేరమని కాంగ్రెస్ ఆయన్ను ఆహ్వానించింది.

రాష్ట్ర రాజకీయాల్లో, జాతీయ స్థాయిలో సిద్ధరామయ్యకు ప్రాముఖ్యం ఉందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఆయనెందుకు లక్ష్యంగా మారారో కూడా వారు చెబుతున్నారు.

‘‘రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండటంతో సిద్ధరామయ్యను బీజేపీ టార్గెట్ చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీని కూడా రాహుల్ గాంధీ నిరంతరం టార్గెట్ చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు’’ అని ప్రొఫెసర్ ముజఫర్ అసాదీ అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఆయన ముఖ్యమైన నాయకుడని ప్రొఫెసర్ శాస్త్రి చెప్పారు.

తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలు సైతం చేజారిపోతుండటంతో, నాయకత్వం వహించడానికి ఆయన స్థాయి నాయకుడు అవసరం కాబట్టే సిద్ధరామయ్యను కర్ణాటక ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ తెలివిగా నిర్ణయం తీసుకుందన్నారు.

మోదీతో కర్ణాటక గవర్నర్ థావర్‌ చంద్ గెహ్లాట్‌

ఫొటో సోర్స్, ANI

సిద్ధరామయ్య రాజీనామా చేయాలా?

2023 అసెంబ్లీ ఎన్నికల, 2024 లోక్‌సభ ఎన్నికల డేటాను ప్రొఫెసర్ శాస్త్రి గుర్తుచేశారు.

కర్ణాటకలో బీజేపీ క్రమంగా వెనుకబడిన వర్గాల ఓటును కోల్పోతుందని ఆయన చెప్పారు.

సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నమోదైన ఈ కేసును ఓబీసీలు తమ వెనుకబడిన వర్గాల నేతకు జరిగిన అవమానించడంగా చూస్తారని, ఈ పరిణామం ఓబీసీలను ఏకం చేయొచ్చని ప్రొఫెసర్ అసాదీ భావించారు.

ఈ కేసు సిద్ధరామయ్యపై సానుభూతిని కలగజేస్తుందని.. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయనకు మద్దతుగా నిలవడం తప్ప వేరే మార్గం లేదని ప్రొఫెసర్ నారాయణ్ నమ్ముతున్నారు.

అయితే ప్రొఫెసర్ పురానిక్ మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వినిపించారు.

‘‘కాంగ్రెస్ పేరు దెబ్బతింది. ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సిద్ధరామయ్య రాజీనామా చేయాలి’’ అని పురానిక్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంటుందని తాను అనుకోవడం లేదని ప్రొఫెసర్ శాస్త్రి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)