జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు: శ్రీనగర్‌లో పరిస్థితి ఎలా ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జమ్మూకశ్మీర్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది
    • రచయిత, రాఘవేంద్ర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది ఏప్రిల్- మే నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లో 58 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది రికార్డు.

ఈ ఎన్నికలను ఏ రాజకీయ పార్టీ కూడా బాయ్‌కాట్ చేయకపోవడం ఈసారి అక్కడ కనిపించిన పెద్ద మార్పు.

10 ఏళ్ల తర్వాత, ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ‘‘ఈ పదేళ్లు (2014-2024) జమ్మూకశ్మీర్‌లో శాంతిని, అభివృద్ధిని తెచ్చాయి. గతంలో ఇక్కడ తీవ్రవాద సమస్య తీవ్రంగా ఉండేది. ఈ పదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంతం పర్యటకులకు గమ్యస్థానంగా మారుతోంది. ఈ పదేళ్లలో అక్కడ సుఖసంతోషాలకు బాట పడింది’’ అని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డాక్టర్ షేక్ షౌకత్ హసన్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ షేక్ షౌకత్ హసన్

కశ్మీర్‌లో పరిస్థితి మెరుగైందా?

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2020 నుంచి 2024 జూన్ మధ్య 6 కోట్ల మందికి పైగా పర్యటకులు జమ్మూకశ్మీర్‌ను సందర్శించారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత, గత మూడేళ్లలో పర్యటక రంగంలో సగటున 15 శాతం వృద్ధి కనిపించిందని ప్రభుత్వం చెబుతోంది.

శ్రీనగర్‌లో ఉండే డాక్టర్ షేక్ షౌకత్ ప్రముఖ రాజకీయ నిపుణులు.

ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయా? లేదా? అనేది కొన్ని విషయాలను బట్టి తెలుస్తుందని షేక్ షౌకత్ అభిప్రాయపడ్డారు.

‘‘సాధారణ పరిస్థితులు ఏర్పడితే కశ్మీరీ పండిట్లు తిరిగివస్తారు. ఎంతమంది తిరిగి వచ్చారో మీకు కూడా తెలుసు. ఒక్కరు కూడా తిరిగి రాలేదు’’ అని ఆయన అన్నారు.

‘‘మూకదాడులు తగ్గాయనడం నిజమే. కానీ ఉదంపూర్, కఠువా, డోడా వంటి తీవ్రవాదుల ప్రభావంలేని ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు పెరిగాయి. పరిస్థితులు చక్కబడ్డాయని చెబుతున్న వారందరికీ తమ మాటపై నమ్మకమే ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో వారు ఇక్కడి నుంచి పోటీ చేసేవారు. కానీ, ఎవరూ చేయలేదు కదా’’ అని షౌకత్ వ్యాఖ్యానించారు.

కశ్మీర్ లోయ
ఫొటో క్యాప్షన్,

కశ్మీర్ లోయలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

కశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాలను మేం సందర్శించాం.

శ్రీనగర్‌లోని పర్యటక ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు మినహా అంతా సాధారణంగానే కనిపిస్తోంది. టూరిస్టుల రాకతో అక్కడి హోటళ్లు, రెస్టరెంట్ల నిర్వాహకులు, హౌస్‌బోట్లు నడిపేవారు సంతోషంగా ఉన్నట్లుగా కనిపించారు. కానీ, ఓల్డ్ శ్రీనగర్‌ ఏరియాలోని ప్రజలతో మాట్లాడినప్పుడు భిన్నమైన వాదనలు వినిపించాయి.

‘‘ఎవరైనా నిజాలు మాట్లాడితే, సాయంత్రానికల్లా వారిని అరెస్ట్ చేస్తారు. మా గోడు వినేవారు ఎవరూ లేరు’’ అని ఒక వృద్ధుడు అన్నారు.

‘‘సమాధిలో ఎలా ఉంటుందో చచ్చినవాడికి మాత్రమే తెలుస్తుంది. ప్రజలు భయపడిపోయారు. పాపం అందరూ భయపడుతున్నారు. శాంతి గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ, ఇక్కడ శాంతి లేదు’’ అని స్థానికుడు సాహిల్ అరాఫత్ చెప్పారు.

అనంత్‌నాగ్‌కు చెందిన సామాజిక కార్యకర్త అబ్దుల్ బారీ నాయిక్ కూడా తన అభిప్రాయాన్ని బీబీసీతో పంచుకున్నారు.

‘‘హృదయాల్లో ప్రేమతోనే శాంతి లభిస్తుందని నేను నమ్ముతాను. అలాంటి శాంతియుత వాతావరణాన్ని ఇక్కడ సృష్టించాలి. ఇంత భారీగా బలగాలు ఇక్కడ ఉండకూడదు. బలగాలు లేకుంటే ఇక్కడ శాంతి ఉందని చెప్పవచ్చు’’ అని ఆయన అన్నారు.

జమ్మూకశ్మీర్‌కు ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయకుండా ఉంటే బాగుండేదని చాలామంది స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

‘‘అది మా ప్రాథమిక హక్కు. దాన్ని మా నుంచి లాగేసుకున్నారు. బలవంతంగా మా హక్కును కాలరాశారు’’ అని శ్రీనగర్‌లో నివసించే హాజీ గులామ్ నబీ అన్నారు.

ఇంకా చాలామంది ప్రజలు కెమెరా ముందు మాట్లాడటానికి వెనకడుగు వేశారు.

కశ్మీర్‌లో జవాన్

మీడియా పరిస్థితి ఏంటి?

కశ్మీర్‌లో మీడియా కూడా స్వేచ్ఛగా పనిచేయలేకపోతోందని చాలామంది చెప్పారు.

ఫహాద్ షా అనే కశ్మీరీ జర్నలిస్టును తీవ్రవాదానికి సంబంధించిన అభియోగాలపై 2022లో అరెస్ట్ చేశారు. 2023లో ఆయన బెయిల్‌ మీద బయటకు వచ్చారు.

‘‘ఇక్కడ మీడియాకు సమస్యలు ఉన్నాయి. దాదాపు రెండేళ్లు నన్ను జైలులో పెట్టారు. ఇలా చేయడం ద్వారా, మీలో ఎవర్నైనా రెండేళ్లు జైలుకు పంపొచ్చని పరోక్షంగా మీడియాకు సూచనలు పంపారు. మా విధులను మేం నిర్వర్తించినందుకు మమ్మల్ని జైలుకు పంపారు. ఇక్కడి మీడియా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది’’ అని ఫహాద్ షా వివరించారు.

జమ్మూకశ్మీర్
ఫొటో క్యాప్షన్, లాల్‌చౌక్ ప్రాంతాన్ని చిత్రీకరిస్తున్న బీబీసీ ప్రతినిధి రాఘవేంద్ర రావును అడ్డుకుంటున్న పోలీసులు

శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో గత కొన్నేళ్ల వరకు తీవ్రవాదులు తరచుగా దాడులు చేస్తుండేవారు. ఇక్కడ భయానక వాతావరణం ఉండేది.

ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్న జనాలను చూపిస్తూ, ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాతే ఇక్కడ శాంతి నెలకొందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

కానీ, మేం కెమెరాను బయటకు తీయగానే జమ్మూకశ్మీర్ పోలీస్ అధికారి ఒకరు మమ్మల్ని అడ్డుకున్నారు.

లాల్‌చౌక్ ప్రాంతాన్ని కెమెరాతో చిత్రీకరించడానికి అనుమతి లేదని ఆయన మొదట అన్నారు.

బహిరంగ ప్రాంతాల్లో అనుమతి తీసుకోవడం ఎందుకు? అని మేం అడగడంతో ఆయన మరో సీనియర్ అధికారిని పిలిచారు.

కాసేపటి తర్వాత, లాల్‌చౌక్‌ చిత్రీకరణ సమయంలో ఇక్కడి ప్రజలతో మాట్లాడొద్దని మాకు చెప్పారు.

ప్రజలతో ఎందుకు మాట్లాడొద్దని మేం ప్రశ్నించగా, అలా చేస్తే శాంతికి భంగం కలగొచ్చని వారు చెప్పారు.

ఇల్తిజా ముఫ్తీ
ఫొటో క్యాప్షన్, ఇల్తిజా ముఫ్తీ

రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ముమ్మురంగా ప్రచారం చేస్తున్నాయి.

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ తొలిసారి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. కశ్మీర్‌లో పరిస్థితి ఎలా ఉందని మేం ఆమెను అడిగాం.

‘‘ప్రజలు తమ హక్కులు, భూమి, ఉద్యోగాలు, వనరులు ప్రమాదంలో ఉన్నాయని అర్థం చేసుకున్నారు. 2019 తర్వాత ఈ భావన మరింత పెరిగింది. మీరు ఇక్కడి ప్రజలతో మాట్లాడితే, వారు ఎంత భయపడుతున్నారో మీకు తెలుస్తుంది’’ అని ఆమె అన్నారు.

‘‘ఇక్కడి చాలామంది మహిళల భర్తలు జైళ్లలో ఉన్నారు. ఆగ్రా లేదా లఖ్‌నవూలలోని జైళ్లలో వారు ఏడాది, ఏడాదిన్నరగా మగ్గిపోతున్నారు. ఎలాంటి అభియోగాలు లేకుండానే ప్రజలపై యూఏపీఏ (ఉపా చట్టం) కింద కేసులు పెడుతున్నారు. జమ్మూకశ్మీర్‌ను ఒక జైలులా మార్చారు. దూరం నుంచి చూసి ఇక్కడ పరిస్థితులన్నీ సాధారణంగా ఉన్నాయని మీరు భావిస్తే, మేమేం చెప్పగలం?’’ అని ఆమె అన్నారు.

ఉల్తాఫ్ ఠాకూర్
ఫొటో క్యాప్షన్, ఉల్తాఫ్ ఠాకూర్

బీజేపీ నేతలు ఏమంటున్నారు?

ఇల్తిజా ముఫ్తీ అభిప్రాయంతో అందరూ ఏకీభవించడం లేదు.

లాల్‌‌చౌక్ ప్రాంతం ఒకప్పుడు అంత్యక్రియల స్థలంగా ఉండేదని, అక్కడ తీవ్రవాదుల అంత్యక్రియలు భారీగా జరిగేవని శ్రీనగర్‌ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ అన్నారు.

‘‘లాల్‌చౌక్‌పై ఒకప్పుడు తీవ్రవాదుల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు చూడండి, అక్కడ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఒకప్పుడు అంత్యక్రియల స్థలంగా ఉన్న లాల్‌చౌక్ ఇప్పుడు సెల్ఫీ పాయింట్‌గా మారింది’’ అని అల్తాఫ్ వివరించారు.

కశ్మీర్‌లో ఇప్పుడు ఎవరైనా ఒత్తిడిని అనుభవిస్తున్నారంటే వారు వేర్పాటువాద భావజాలంతో ముడిపడిన వ్యక్తులై ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘జమ్మూకశ్మీర్‌లో నేడు తుపాకులు, గ్రెనేడ్లు, దాడులు, నిరసనలకు చోటు లేదు. భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎవరికీ అనుమతి లేదు’’ అని ఆయన అన్నారు.

కశ్మీర్

వేర్పాటువాదం, ఎన్నికలు

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి అబ్దుల్ రషీద్ షేక్ భారీ విజయాన్ని సాధించారు. ఈయన ఇంజినీర్ రషీద్‌గా ప్రసిద్ధి.

ఆయన సాధించిన ఈ విజయం వార్తల ముఖ్యాంశాల్లో నిలిచింది. ఎందుకంటే, తీవ్రవాదులకు ఆర్థిక సహకారం అందిస్తున్నారనే అభియోగాలపై ఆయన గత అయిదేళ్లు దిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. అయినప్పటికీ, ఆయన భారీ మెజార్టీతో ఎన్నికల్లో విజయం సాధించారు.

అప్పుడు ఇంజినీర్ రషీద్ లేకపోవడంతో ఆయన కుమారుడు అబ్రార్ రషీద్, తన తండ్రి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇంజినీర్ రషీద్‌కు చెందిన అవామీ ఇత్తెహాద్ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో కూడా నిలిచింది.

‘‘ఇక్కడ భావప్రకటనా స్వేచ్ఛ లేదు. ప్రజలు మాట్లాడేందుకు భయపడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే, తర్వాత ఏం సమస్య వస్తుందో తెలియదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులేం మారలేదు. కొంతవరకు మెరుగుపడింది. కానీ, భయం మాత్రం ఇంకా అలాగే ఉంది’’ అని బీబీసీతో అబ్రార్ అన్నారు.

ఇంజినీర్ రషీద్ విజయం తర్వాత, వేర్పాటువాదులుగా పేరున్న చాలామంది ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేసేందుకు ముందుకు రావడం ఇక్కడ ఆసక్తికర అంశం.

అబ్రార్ రషీద్
ఫొటో క్యాప్షన్, అబ్రార్ రషీద్

డాక్టర్ తలత్ మజీద్, పుల్వామా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కానీ మజీద్‌కు నిషేధిత జమాత్ ఎ ఇస్లామీ పార్టీ మద్దతు ఉంది.

‘‘ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాజకీయ అస్థిరత ఏర్పడింది. ప్రజలు భయంతో బతుకుతున్నారు. వారి సమస్యల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఇక్కడ కాస్త అంచనాలను పెంచాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమని నిరూపించాయి’’ అని తలత్ మజీద్ అన్నారు.

వేర్పాటువాద ఆరోపణలపై జైల్లో ఉన్న సర్జన్ బర్కతీ కూడా గందర్‌బల్, బీర్వా స్థానాల నుంచి నామినేషన్ దాఖలు చేశారు.

ఈ ఎన్నికల్లో తన తండ్రి ఎందుకు పోటీ చేయాలని అనుకున్నారో ఆయన కూతురు సుగ్రా బర్కతీ చెప్పారు.

‘‘ఒకవేళ మనం ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలిస్తే ఏదైనా మంచి చేయొచ్చని మా నాన్నకు నేను చెప్పాను. జైల్లో మా నాన్నకు కలవడానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న జమ్మూకశ్మీర్‌కు చెందిన యువకుల్ని చూశాను. ఒకవేళ ఎన్నికల్లో గెలిచి మీరు బయటకు వస్తే మీతో పాటు జైల్లో ఉన్న చాలామందికి విముక్తి కలుగుతుంది అని చెప్పాను’’ అని ఆమె వివరించారు.

కశ్మీర్
జమ్మూకశ్మీర్

కొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూపులు

2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, జమ్మూకశ్మీర్‌ను లద్దాఖ్, జమ్మూకశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.

జమ్మూకశ్మీర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాలిస్తున్నారు. కానీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న కశ్మీరీలు ఈ అయిదేళ్లలో ప్రజలచే ఎన్నికైన తమ సొంత ప్రభుత్వం లేకపోవడాన్ని తీవ్రంగా అనుభవించారు.

శ్రీనగర్ నివాసి మంజూర్ రెహమాన్ మాట్లాడుతూ, ‘‘ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే ప్రజల్లో ఆశలు చిగురిస్తాయి. మాకు ఉన్న సమస్యల్ని చెప్పి వారిని పరిష్కారం అడిగే వీలుంటుంది’’ అని అన్నారు.

ప్రజలు తదుపరి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందా.. అని ఉత్కంఠగా ఎదురుచూడటానికి ఇదే కారణం.

శ్రీనగర్‌లో కిరాణా దుకాణం నడిపే మహబూబ్ జాన్ మాట్లాడుతూ, ‘‘ఈ ఎన్నికలపై మాకు చాలా అంచనాలు ఉన్నాయి. మా ప్రభుత్వం ఏర్పడితే, మాకు సమస్యల నుంచి కాస్త ఉపశమనం దక్కుతుంది’’ అని అన్నారు.

‘‘ఎన్నికల్లో పాల్గొనడం మా బాధ్యత. లోక్‌సభ ఎన్నికల్లో కూడా మేం ఓటు వేశాం. ఇప్పుడు కూడా వేస్తాం’’ అని అనంత్‌నాగ్‌కు చెందిన మొహమ్మద్ అబ్దుల్లా షా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)