యురేనియం శుద్ధి కేంద్రంలో కిమ్, అరుదైన ఫొటోలను విడుదల చేసిన ఉత్తర కొరియా..

ఫొటో సోర్స్, KCNA
- రచయిత, జీన్ మెకెంజీ
- హోదా, బీబీసీ ప్రతినిధి, సోల్ నుంచి
- రచయిత, కెల్లీ ఎన్‌జీ
- హోదా, సింగపూర్ నుంచి
ఉత్తర కొరియా తొలిసారిగా తన అణ్వాయుధాల తయారీలో కీలక భాగమైన యురేనియం శుద్ధి కేంద్రం ఫొటోలను విడుదల చేసింది. ఈ చిత్రాలలో ఆ దేశ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా ఉన్నారు.
దేశ అణుసంపత్తిని భారీస్థాయిలో పెంచుతామని కిమ్ జోంగ్ ఉన్ గతంలో ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ ఫొటోలు తెలియజేస్తున్నాయి.
అదేవిధంగా, యురేనియం ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని అధికారులకు కిమ్ ఆదేశాలిచ్చినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) శుక్రవారం ఒక కథనంలో తెలిపింది.
అణ్వాయుధాల తయారీలో నాణ్యమైన యురేనియం ప్రధానం.
సెంట్రిఫ్యూజ్ వరుసల మధ్య అధికారులతో కిమ్ మాట్లాడుతున్నట్లు ఒక ఫొటోలో కనిపిస్తోంది.
కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ ఫొటోలను విడుదల చేశారు.
"యురేనియం ఉత్పత్తి ఎలా జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్లాంట్‌లోని కంట్రోల్ రూం అంతా కిమ్ తిరిగి చూశారు. అదంతా పరిశీలించిన తర్వాత ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేశారు" అని కేసీఎన్ఏ పేర్కొంది.
ఉత్తర కొరియా అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది.


ఫొటో సోర్స్, RODONG SINMUN
యురేనియం శుద్ధి కేంద్రాన్ని కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు సందర్శించారు? ఏ ప్లాంట్‌ను సందర్శించారు? వంటి విషయాలు ఉత్తర కొరియా బయటపెట్టలేదు. యోంగ్‌బ్యోన్ న్యూక్లియర్ కాంప్లెక్స్‌లో ఇది భాగమా? లేక వేరే ప్రాంతమా? అన్నది తెలియదు. అంతర్జాతీయ నిపుణులు మాత్రం, ఉత్తర కొరియాలో యోంగ్‌బ్యోన్ న్యూక్లియర్ కాంప్లెక్స్‌తో పాటు ఇంకొక యురేనియం ప్లాంట్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
"తన అణు సామర్థ్యం గురించి ప్రపంచానికి తెలియజేయడంతో పాటు అణ్వాయుధాల ఉత్పత్తి విషయంలో వెనక్కి తగ్గబోం అన్న సందేశాన్ని ఉత్తర కొరియా పంపుతోంది. ఉత్తర కొరియా ఓ వైపు ఇలా అణ్వాయుధాలను పెంచుకుంటోంది. మరోవైపు రష్యా, చైనాల నుంచి దౌత్య, వాణిజ్య అంశాల్లో సహాయం పొందుతోంది" అని సోల్ నగరానికి చెందిన ప్రొఫెసర్ లీఫ్ ఎరిక్ ఈస్లీ చెప్పారు.
"త్వరలోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఈ సమయంలో ఉత్తర కొరియా విడుదల చేసిన ఫొటోలు చూస్తుంటే, ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే అణ్వాయుధ రహిత దేశంగా ఉత్తర కొరియాను మార్చడం ఎవరికీ సాధ్యం కాదనే సందేశాన్ని పంపినట్లుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే, అణ్వాయుధ సంపత్తి గల దేశంగా తనను గుర్తించాలని ప్రపంచానికి ఉత్తర కొరియా సంకేతాలు పంపించింది" అని కొరియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ యూనిఫికేషన్‌కు చెందిన సీనియర్ విశ్లేషకుడు హాంగ్ మిన్ వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో చెప్పారు.
"యురేనియం శుద్ధి ప్లాంట్ ఫొటోలు ఉత్తర కొరియా బయటపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉత్తర కొరియా అక్రమంగా అణ్వాయుధాలు మోహరించడం యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఉత్తర కొరియా అణ్వాయుధాలతో ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినప్పటికీ, అమెరికా సహకారంతో వాటిని సమర్థవంతంగా తిప్పికొడతాం" అని దక్షిణ కొరియా మినిస్ట్రీ ఆఫ్ యూనిఫికేషన్ ప్రకటించింది.
ఉత్తర కొరియా వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయో అధికారికంగా తెలియనప్పటికీ, ఇటీవలి అంచనాల ప్రకారం వాటి సంఖ్య దాదాపు 50 దాకా ఉంటుంది. మరో 40 అణ్వాయుధాలను ఉత్పత్తి చేయడానికి సరిపడా మెటీరియల్ ఉత్తర కొరియా దగ్గర ఉందని అంచనా.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














