ఆంధ్రప్రదేశ్‌లో పత్తి సాగు అమాంతం తగ్గిపోతోంది ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా పత్తి సాగు తగ్గుతూ వస్తోంది. పదేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షలపైగా ఎకరాల్లో పత్తి సాగు చేయగా, అది ఇప్పుడు భారీగా తగ్గిపోయింది.
2014–15లో రాష్ట్రంలో (విభజన తర్వాత) 8.21 లక్షల హెక్టార్లలో (20.28 లక్షల ఎకరాల్లో) పత్తి సాగు చేశారు. ఆ తర్వాత అంతకంతకూ తగ్గుతోంది. 2022–23లో 7.04* లక్షల హెక్టార్ల(17.39 లక్షల ఎకరాల)కు తగ్గింది. 2023–24లో ఆ విస్తీర్ణం 4.27* లక్షల హెక్టార్ల (10.55 లక్షల ఎకరాల)కు పడిపోయింది. (* ఈ గణాంకాలలో కొద్దిపాటి తేడాలుండొచ్చు)
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోనే రైతులు ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు.
ఈ జిల్లాలన్నింటిలోనూ రెండొంతుల విస్తీర్ణంలో పత్తిని వర్షాధారంగానూ, ఒక వంతు విస్తీర్ణంలో నీటి వసతితోనూ సాగు చేస్తున్నారు.


బీటీ వచ్చిన తర్వాత కుదుట పడినా...
తెలుగు రాష్ట్రాల్లో పత్తి సాగులో వచ్చిన మార్పుల గురించి ఇక్రిశాట్‌లో పని చేసి రిటైర్ అయిన వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు వివరించారు. పత్తి సాగు తీరుపై సుదీర్ఘకాలం అధ్యయనం చేశానని ఆయన చెప్పారు.
ఆయన పరిశీలన ప్రకారం, నలభై ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పత్తిని లాభసాటి పంటగా చూసేవారు. సొంత భూమితో పాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసేవారు. లాభాలు బాగున్నాయని బాగా ప్రచారం జరగడంతో నల్ల రేగడి నేలల నుంచి ఎర్ర నేలలకు, ఇసుక నేలలకు కూడా పత్తి సాగు విస్తరించింది.
అయితే, 20 ఏళ్ల కిందట తెల్లదోమ, కాయ తొలిచే పురుగు వల్ల పత్తి సాగు చేసిన రైతుల్లో చాలామంది భారీగా నష్టపోయారు.
ఆ తరువాత పత్తిలో సంకర రకాలు (బీటీ) వచ్చాయి. రైతులు బాగా ఆదరించడంతో మళ్లీ పత్తి సాగు పెరుగుతూ వచ్చింది.
2013–14 నాటికి పత్తి విస్తీర్ణంలో 97 శాతం వరకు బీటీ రకాలున్నాయి. ఈ సంకర జాతి రకాలకు అధిక దిగుబడినిచ్చే శక్తి ఉండటంతో పాటు కాయతొలిచే పురుగులను చాలావరకు నియంత్రించే సామర్థ్యం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
గులాబీ పురుగుతో తలకిందులు
కొన్నేళ్లుగా గులాబీ రంగు కాయతొలిచే పురుగులతో మళ్లీ సమస్య తలెత్తింది. బీటీ జన్యువు ప్రభావం 90 రోజుల వరకే ఉంటోందని పూర్ణచంద్రరావు చెప్పారు.
గులాబీ రంగు కాయతొలిచే పురుగులపై బీటీ జన్యువు ప్రభావం తక్కువగా ఉంటోంది. వాటి నివారణకు పురుగు మందుల వాడకం తప్పటం లేదు. అయినా కూడా రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండట్లేదని ఆయన వివరించారు.
ఏపీలో గులాబీ రంగు కాయతొలిచే పురుగు బెడద తీవ్రంగా ఉంది.
రాష్ట్రంలో సగటున పత్తి సాగుకు ఎకరానికి 45 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల దాకా పెట్టుబడి అవుతోంది.
కౌలు రైతు అయితే మరో 20 వేల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాలి వస్తోంది.
పురుగు పట్టకుండా ప్రకృతితో సహా అన్నీ అనుకూలిస్తే ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ, కొన్నేళ్లుగా ఆరేడు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు.
గడిచిన కొన్నేళ్లలో పురుగు మందుల ధరలు కూడా భారీగా పెరిగాయని రైతులు చెబుతున్నారు.

గొర్రెలు మేపుకునేందుకు వదిలేశారు
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ) నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉన్నప్పటికీ క్వింటాల్ పత్తికి 7,500 రూపాయలు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ ధర తమకు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు.
‘‘ప్రైవేటు వ్యాపారులైన బయ్యర్ల వద్దనైతే ఇంకా తక్కువ రేటుకే అమ్ముకోవాల్సి వస్తోంది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పత్తి సాగు చేస్తే చివరికు కన్నీళ్లే మిగులుతున్నాయి’’ అని గుంటూరు జిల్లా కొండేపాడుకు చెందిన రైతు సంపంగి రావు బీబీసీతో చెప్పారు.
ఈ ఏడాదైతే పత్తి ధరలు క్వింటాకు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఉంటుందనే ఆశతో సాగు చేసిన పత్తి రైతులకు సెప్టెంబర్‌లో కురిసిన అధిక వర్షాలు నష్టం కలిగించాయి.
ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పూత, పిందె కాయలు రాలిపోయాయి.
‘‘10 ఏళ్లుగా పత్తి సాగు చేస్తున్నా. గతంతో పోలిస్తే ఇప్పుడు పత్తి సాగు లాభదాయకంగా లేదు. గులాబి రంగు పురుగు బెడద కూడా ఉంది. దాంతో సాగు తగ్గిస్తూ వస్తున్నాను. నిరుడు ఐదు ఎకరాల్లో వేయగా ఈ ఏడాది మూడు ఎకరాల్లోనే వేశా. అది కూడా భారీ వానలకు అంతా పాడైంది’’ అని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన రైతు ఎక్కంటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
తనతో పాటు చాలామంది రైతులు పత్తి చేలల్లో గొర్రెలు మేపుకునేందుకు వదిలేశారని ఆయన తెలిపారు.
సెప్టెంబర్‌లో వరదల వల్ల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిందని రైతు సంఘం నేతలు చెప్పారు.
గులాబీ రంగు పురుగుకి మందును ప్రపంచంలోనే ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారని ఆచార్య ఎన్జీరంగా రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి మాజీ సభ్యుడు, ఏపీ కాటన్ అసోసియేషన్ బోర్డు సభ్యుడు మేకల లక్ష్మీనారాయణ చెప్పారు.
‘‘ఇప్పటికైనా పాలకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ పురుగు నివారణపై దృష్టి సారించాలి. సహజంగా పత్తి ఆరు నెలల కాల పరిమితితో పండిస్తుంటారు. ఇప్పుడు తక్కువ కాల పరిమితితో పంట పండించే వంగడాలు కూడా వచ్చాయి. వాటిపై రైతులు దృష్టి సారించాలి. నాలుగు నెలల కాల పరిమితితో పంట పండే వంగడాలను రైతులు వినియోగిస్తే పురుగుల ప్రభావం పడకుండా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. సహజంగా పత్తి పంటపై 120 రోజుల తర్వాతే గులాబీ రంగు పురుగు బెడద ఉంటుంది. ఈలోగా పంట పూర్తిగా చేతికొచ్చే విధంగా చూసుకోవాలి’’ అని ఆయన సూచించారు.
సమస్యను పరిష్కరించకుంటే రైతులు పూర్తిగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లే అవకాశముందని గతంలో సీసీఐలో సీనియర్ కాటన్ పర్చేజ్ ఆఫీసర్‌గా పని చేసిన బ్రాహ్మణయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే చాలామంది పత్తి రైతులు మిర్చి, మినుము వంటి పంటల వైపు మళ్లారని తెలిపారు.

దిగుబడి తగ్గుతున్నా ధరలు పెరగడం లేదు
రాష్ట్రంలో పత్తి దిగుబడి తగ్గుతున్నా ధరలు మాత్రం పెరగడం లేదని రైతులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా పత్తికి డిమాండు తక్కువగా ఉండటమే కారణమని డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు అన్నారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా పత్తి వినియోగంలో తగ్గుదల కనిపిస్తోంది. 2021–22లో పత్తి వినియోగం 25.18 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదు కాగా, 2022–23లో 23.79 మిలియన్ మెట్రిక్ టన్నులకు తగ్గింది. పత్తి వినియోగం తగ్గటానికి వివిధ దేశాల్లో కృత్రిమ దారాల వాడకం పెరగటం కారణంగా కనిపిస్తోంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధరలు మందగించాయి’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
దళారుల చేతుల్లోకి..
90వ దశకంలో నాన్ బీటీ విత్తనాలతో సాగు చేసినప్పుడు ఉన్న నిబంధనలనే ఇప్పుడు కూడా సీసీఐ అమలు చేస్తోందని, అందువల్ల రైతులకు నష్టం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కంచుమాటి అజయ్ కుమార్ అన్నారు.
‘‘కేంద్రం ప్రకటించే ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర) రైతులకు అసలు గిట్టుబాటు కాదు. దాని కోసమైనా రైతు సీసీఐ వద్దకు పంట తీసుకువెళ్తే నిబంధనల పేరిట వేధిస్తారు. దాంతో చాలామంది రైతులు మధ్యవర్తులకు, దళారులకు తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారు. ఆ దళారులు అదే పత్తిని తిరిగి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఎంఎస్‌పీకి అమ్ముకుంటున్నారు’’ అని అజయ్ కుమార్ చెప్పారు.

అయితే, రైతులను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉండదని సీసీఐ జనరల్ మేనేజర్ అమర్నాథ్ రెడ్డి అన్నారు.
"పత్తి రైతులకు మేలు చేసేందుకే సీసీఐ ఉంది. మార్కెట్లో పత్తికి కనీస ధరలు లేనప్పుడు గిట్టుబాటు ధర ప్రకటించి రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. సీసీఐ కొనుగోలు చేసే నాణ్యతా ప్రమాణాల వివరాలను బహిరంగంగా ప్రకటిస్తాం. రైతులకు వివరించి చెబుతాం. అంతేకానీ సీసీఐ ఇబ్బంది పెట్టడం లేదా మోసం చేయడం అనేది ఉండదు’’ అని ఆయన తెలిపారు.
ఒకవేళ ఎవరైనా బయ్యర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై తాము చర్యలు కూడా తీసుకుంటామన్నారు.
‘‘పత్తి క్వాలిటీ లేకుంటే సీసీఐ కొనలేదు. ఈ సీజన్‌లో నాణ్యమైన పత్తి గిట్టుబాటు ధర 7,521 రూపాయలుగా నిర్ణయించారు. స్టేబుల్ లెంత్ (ఒడికితే వచ్చే దారం) 29.5 మిల్లీ మీటర్ల నుంచి 30.5 మిల్లీ మీటర్ల ఉండాలి. మైక్రోనియర్ వాల్యూ 3.5 మిల్లీ మీటర్ల నుంచి 4.3 మిల్లీ మీటర్లు ఉండాలి. తేమ శాతం 8 ఉంటేనే గిట్టుబాటు ధర 7,521 రూపాయలు వస్తుంది. తేమ శాతం 8 నుంచి 12శాతం ఉంటే ధరలో మార్పు వస్తుంది. 12 శాతం పైన ఉంటే సీసీఐ కొనుగోలు చేయదు’’ అని అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు.
‘‘ఈనెల ఒకటో తేదీనే కొనుగోళ్లు మొదలు కావాలి. కానీ, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల మూడో వారం నుంచి కొనుగోళ్లు మొదలవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 కొనుగోలు కేంద్రాలు తెరుస్తాం’’ అని అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














