శైలజా పైక్: మురికివాడల నుంచి 7కోట్ల ‘జీనియస్ గ్రాంట్’ ఫెలోషిప్‌దాకా ఈ దళిత మహిళా చరిత్రకారిణి పయనం ఎలా సాగింది?

ఫొటో సోర్స్, MacArthur Foundation & Shailaja Paik
- రచయిత, వినాయక్ హొగడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
“మాకు సరైన నీటి సదుపాయం లేదు. మరుగుదొడ్లు లేవు. నేను అపరిశుభ్రమైన, చెత్త, మురికి, పందులు తిరిగే వాతావరణంలో పెరిగాననేది నిజం. పబ్లిక్ టాయిలెట్ల జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి” ఇవీ ప్రతిష్ఠాత్మకైన ‘మెక్ అర్థర్’ ఫెలోషిప్‌కు ఎంపికైన చరిత్రకారిణి శైలజా పైక్ చిన్ననాటి అనుభవాలు.
పందులు తిరిగే మురికి వాడల నుంచి అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ వరకు శైలజా పైక్‌ది అపూర్వమైన ప్రయాణం.
ప్రతిష్ఠాత్మక ‘మెక్ అర్థర్’ ఫెలోషిప్‌కు ఎంపికైన తొలి దళిత మహిళగా ఆమె గుర్తింపు పొందారు.
ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి ఐదేళ్ల పాటు దశలవారీగా 8 లక్షల డాలర్ల (రూ. 6.71కోట్లు) నగదు లభిస్తుంది.
శైలజా పైక్ తన పరిశోధనలో భాగంగా దళిత స్త్రీల జీవితాల్ని చాలా లోతుగా అధ్యయనం చేశారు.
మెక్ అర్థర్ ఫెలో ప్రోగ్రామ్ కింద ఏటా “జీనియస్ గ్రాంట్” ఫెలో షిప్ కోసం అమెరికాలోని వివిధ రంగాలకు చెందిన సృజనాత్మక విద్యావేత్తలను 20 నుంచి 30మంది దాకా ఎంపిక చేస్తారు.
జాన్.డి., కేథరీన్. టి నాయకత్వంలోని మెక్ అర్థర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ ఏడాది ఎంపికైనవారిలో రచయితలు, కళాకారులు, సామాజికవేత్తలు, ఉపాధ్యాయులు, మీడియా ఉద్యోగులు, ఐటీ, పరిశ్రమలు, పరిశోధనలు తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. వీరిలో హిస్టరీ స్కాలర్ శైలజా పైక్ కూడా ఒకరు.
"ఈ ఫెలోషిప్‌కు ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. మేఘాలలో తేలిపోతున్నట్లుగా ఉంది” అని ఆమె బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, Sarita Paik
మురికి వాడల నుంచి అమెరికాకు
శైలజా పైక్ స్వస్థలం పుణెలోని యరవాడ. ఆమె తన ముగ్గురు తోబుట్టువులతో కలిసి యరవాడలోని ఓ ఇరుకు ఇంట్లో పెరిగారు.
"మాకు నీటి సౌకర్యం లేదు. ఇంట్లో మరుగుదొడ్డి లేదు. చెత్త, మురికి నిండి, పందులు తిరిగే వీధుల్లో నేను పెరిగాను. పబ్లిక్ టాయిలెట్ల జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి” అని ఆమె బీబీసీతో తన చిన్ననాటి రోజులను పంచుకున్నారు.
వంట, బట్టలు ఉతుక్కోవడం లాంటి రోజూవారీ పనులకు బస్తీలోని ప్రభుత్వ కుళాయి నుంచి వచ్చే నీరే ఆధారం. ఈ నీటిని తెచ్చుకోవడానికి కూడా చాలా సేపు పొడవాటి క్యూలలో ఉండాల్సి వచ్చేదని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా తన తల్లిదండ్రులు సరిత, దేవరామ్ తమకు చదువుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించారని,ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదువుకునే అవకాశం కల్పించారని శైలజ చెప్పారు.
"యరవాడ లాంటి ప్రాంతంలో ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు లేని చోట, కష్టాల మధ్య సాగుతున్న జీవితం నుంచి బయట పడాలంటే చదువు ఎంతో ముఖ్యమని నా తల్లిదండ్రులు గుర్తించి నన్ను ప్రోత్సహించారు. వారి వల్లే నేను నా సమయాన్నంతా చదువుకు అంకితం చెయ్యగలిగాను” అని ఆమె చెప్పారు.
“సాయంత్రం చీకటి పడే సమయంలో నేనో మూలకు కూర్చుని చదువుకునేందుకు వీలుగా ఇంట్లో వాళ్లను చిన్నగా మాట్లాడుకోవాలని చెప్పేదానిని. వాస్తవానికి అలాంటి వాతావరణంలో చదువుకోవడం చాలా కష్టం. అందుకే నేను రాత్రి ఏడున్నరకు నిద్రపోయి అర్ధరాత్రి రెండు, మూడు గంటల సమయంలో నిద్రలేచేదాన్ని. అప్పటి నుంచి ఉదయం ఆరు, ఏడు గంటల వరకు చదువుకుని తర్వాత స్కూలుకు వెళ్లేదాన్ని” అంటూ ఆమె తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.
“దళితులం కావడంతో వివక్షకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కూడా దాన్ని అనుభవించాను” అని శైలజా పైక్ చెప్పారు.
ఉదాహరణకు, నేను 'ఫోర్డ్ ఫౌండేషన్ ఫెలోషిప్' అందుకున్నప్పుడు నా చుట్టూ ఉన్న కొంతమంది నమ్మలేకపోయారు. అది మీకు ఎలా వచ్చిందని వారు నన్ను తరచుగా అడిగేవారు. అది నేను చేసిన పనికి లభించిన గుర్తింపు. కానీ ఒక దళిత మహిళకు ఫెలోషిప్ రావడం ఏంటని వారు ఆశ్చర్యపోయారు.

ఫొటో సోర్స్, MacArthur Foundation
ఏమిటీ ఫెలోషిప్?
'జీనియస్ గ్రాంట్' అని పిలిచే ఈ ఫెలోషిప్‌ను ఈ ఏడాది 22 మందికి అందించారు.
దీన్ని అందుకోవడానికి 'సృజనాత్మకత' ప్రాథమిక ప్రమాణం అని మెక్ అర్థర్ ఫౌండేషన్ చెబుతోంది. కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, ఆవిష్కరణలలో పెట్టుబడి పెట్టడం ఈ ఫెలోషిప్ ముఖ్య ఉద్దేశం.
సమాజం నుంచి ఎదురయ్యే సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనేవాళ్లు, రిస్క్ తీసుకునే వాళ్లు, కొత్తగా ఆలోచించేవాళ్లు, స్ఫూర్తిదాయక వ్యక్తులను ప్రోత్సహించడానికి ఈ ఫెలోషిప్ అందిస్తున్నారు.
మెక్ అర్థర్ ఫెలోషిప్ కింద ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్లపాటు 8 లక్షల డాలర్లు (రూ.6.71 కోట్లు) అందుకుంటారు.
"దక్షిణాసియా లోపల, బయట ఉన్న దళితులు, దళితేతరులు కులతత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని ఈ ఫెలోషిప్ మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నాను" అని శైలజ చెప్పారు.
సావిత్రీబాయి పూలే పుణె యూనివర్శిటీ హిస్టరీ డిపార్ట్‌మెంట్ హెడ్, శ్రద్ధా కుంబోజ్కర్ ఈ ఫెలోషిప్ గొప్పతనాన్ని చెబుతూ "ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా చేసిన సేవకు లభించిన గుర్తింపు ఈ ఫెలోషిప్. ఇది చాలా ప్రత్యేకమైనది” అని అన్నారు.
"ఫెలోషిప్ కింద ఇస్తున్న మొత్తం భారతీయ కరెన్సీలో చాల పెద్దది. ప్రతిభావంతులైన వ్యక్తుల కోసం పెట్టుబడి పెట్టాలనే లక్ష్యంతో మెక్‌ఆర్థర్ ఫౌండేషన్ ఈ ఫెలోషిప్‌ను అందిస్తోంది” అని ఆమె చెప్పారు.
ఈ ఫెలోషిప్‌ను పొందడానికి అప్లికేషన్ పెట్టుకోవడం లేదా ఇంటర్వూకి హాజరు కావడం లాంటివేమీ ఉండవు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నామినేట్ చేసిన వారికే ఇది లభిస్తుంది.

ఫొటో సోర్స్, Shailaja Paik
దళితుల్లోనూ మహిళలపై వివక్ష
ఆధునిక భారత దేశంలోని దళిత స్త్రీల జీవితాల్లో క్యాస్ట్, జెండర్, సెక్సువాలిటీ గురించి శైలజా పైక్ అధ్యయనం చేశారు.
"భారతదేశ జనాభాలో దళితులు 17 శాతం ఉన్నారు. దళిత మహిళల విద్యపై పెద్దగా కృషి జరగలేదని నేను గమనించాను. దీని గురించి లెక్కలు ఉన్నాయి కానీ వాస్తవం ఏంటో తెలుసుకునేందుకు అవసరమైన పరిశోధన జరగలేదు. దళిత మహిళల చరిత్ర గురించి ఎవరూ సరిగ్గా రాయలేదు. అందుకే నేను దీనిపై పని చేయాలనుకున్నాను” అని శైలజ చెప్పారు.
"చాలా కాలంగా ఇంత పెద్ద జనాభాను విద్య, మౌలిక సదుపాయాలు, బహిరంగ నీటి సదుపాయాలు, బావులు లాంటి వాటి దగ్గరకు అనుమతించలేదు. చెప్పులు వేసుకునే వాళ్లు, కొత్త బట్టలు కట్టుకునేవారి సంఖ్య చాలా తక్కువ. పైగా వారు చాలా వెనుకబడినవారు, అణచివేతను ఎదుర్కొంటున్నవారు. ‘దళిత మహిళలు దళితుల్లో దళితులు.’ జెండర్, రాజకీయ కోణాల్లో చూస్తే వారికి ఆదరణ లభించలేదు” అని ఆమె అన్నారు.
"నేను ఇదే సమాజం నుంచి వచ్చాను. అందుకే నా పరిశోధన, అధ్యయనం, రచనలకు ఈ సబ్జెక్టునే ఎంచుకున్నాను" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, MacArthur Foundation
దళిత మహిళల జీవితాలపై లోతైన అధ్యయనం
శైలజా పైక్ తన అధ్యయనం ద్వారా కుల ఆధిపత్య చరిత్రపై కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. దీంతో పాటు జెండర్, సెక్సువాలిటీ దళిత మహిళల ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవితాలను ఎలా ప్రభావితం చేశాయో కూడా చర్చించారు.
ఆమె రచనల్లో దళితులు, దళిత మహిళలు ప్రధానంగా ఉంటారు.
ఇంగ్లీషు, మరాఠీ, హిందీ భాషల్లోని సాహిత్యంతో పాటు సమకాలీన దళిత మహిళలతో ఇంటర్వ్యూలు చేశారు. ఇందులో వారి అనుభవాల గురించి ప్రస్తావించి ఆధునిక సమాజానికి కొత్త కోణాన్ని చూపించారు.
ఆమె 'ఆధునిక భారతదేశంలో దళిత మహిళల విద్య: డబుల్ డిస్క్రిమినేషన్' (2014), 'ది వల్గారిటీ ఆఫ్ కాస్ట్: దళిత్స్, సెక్సువాలిటీ అండ్ హ్యుమానిటీ ఇన్ మాడ్రన్ ఇండియా' పేరుతో రెండు పుస్తకాలు రాశారు. మొదటి పుస్తకంలో మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాలలో విద్య కోసం దళిత మహిళలు చేస్తున్న పోరాటాన్ని బ్రిటిష్ కాలం నాటి పరిస్ఖితులతో పోల్చారు శైలజా పైక్.

ఫొటో సోర్స్, MacArthur Foundation
ఆమె చదువు ఎలా సాగింది?
శైలజా పైక్ 2010 నుంచి 'సిన్సినాటి యూనివర్శిటీ’లో పని చేస్తున్నారు. అక్కడ ఆమె 'విమెన్, జెండర్, సెక్సువాలిటీ స్టడీస్ అండ్ ఏషియన్ స్టడీస్’కు రీసర్చ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన శైలజ 1994-96లో సావిత్రీబాయి ఫూలే పుణే యూనివర్సిటీ చరిత్ర విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
2000లో ఎంఫిల్ కోసం విదేశాలకు వెళ్లడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ నుంచి ఫెలోషిప్ అందుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇంగ్లండ్ వెళ్లారు.
తదుపరి ఆమెకు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు ఆమె రీసర్చ్ రచనలకు అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ లెర్న్‌డ్ సొసైటీస్, స్టాన్‌ఫోర్డ్ హ్యుమానిటీస్ సెంటర్, నేషనల్ ఎండోమెంట్ ఫర్ హ్యుమానిటీస్, అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్, యేల్ యూనివర్శిటీ, ఎమోరీ యూనివర్శిటీ, ఫోర్డ్ ఫౌండేషన్, చార్లెస్ ఫెల్ప్స్ టాఫ్ట్ రీసెర్చ్ సెంటర్ నుండి నిధులు అందాయి.
2007లో ఆమె ఇంగ్లాండ్‌లోని వార్విక్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ అందుకున్నారు. 2008-2010 మధ్య యూనియన్ కాలేజ్ విజిటింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీగా పని చేశారు.
2012-2013 మధ్య యేల్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టోరల్ అసోసియేట్ ,సౌత్ ఏషియన్ హిస్టరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














